బాలల కథ

by Shanthi Prabodha Valluripalli

సాయికి పన్నెండేళ్ళు.  

తన చక్రాల కుర్చీలో కూర్చుని కలలు కంటూ ఉంటాడు. తన కలలను నిజం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. 

ఎనిమిదేళ్ల వయసులో సాయికి జబ్బు చేసింది. ఆ జబ్బు వల్ల సాయి కాళ్లు రెండూ  చచ్చుబడిపోయాయి. లేచి నడవలేకపోతున్నాడు.  ఇక ఎప్పటికీ నడవలేడని వైద్యులు చెప్పారు. 

అమ్మా నాన్న చాలా దుఃఖించారు.  మొదట్లో సాయి కూడా బాధపడ్డాడు. 

సాయితో కలిసి బడికి వెళ్లిన, ఆడుకున్న మిత్రులు అవిటివాడని వెక్కిరించారు. దూరమయ్యారు.  సాయి ఒంటరి అయ్యాడు.  

మిత్రుల ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. 

తన మిత్రులతో  తిరగ లేనందుకు, ఆటలు ఆడలేక పోతున్నందుకు దిగులు పడ్డాడు.  

చక్రాల కుర్చీలో కూర్చుని కిటికీలోంచి బయటికి చూస్తూ సాయి కలలు కంటున్నాడు. రకరకాల కలలు కంటున్నాడు. 

సాయికి బొమ్మలు వేయడం చాలా ఇష్టం.  ఆ బొమ్మల ద్వారా తన కలలు, ఆశలు  వ్యక్తం చేస్తున్నాడు.   

సాయి గదిలో కిటికీ దగ్గర కూర్చుంటే పచ్చని మైదానం కనిపిస్తుంది. 

ఆ మైదానం సాయి బొమ్మల్లో రంగుల మైదానంగా మారింది.  ఆ మైదానంలో అతను పరుగులు తీస్తున్నాడు.  ఎగురుతున్నాడు. 

ఆకాశంలో ఎగిరే పక్షులు అతని బొమ్మల్లో అతని స్నేహితులుగా మారాయి. 

సాయి ఆ రోజు రాత్రి చాలా సంతోషంగా నిద్రపోయాడు. 

అతని కలల్లో అతను ఒక గొప్ప చిత్రకారుడు. అతని బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతున్నాయి. ప్రజలు అతని బొమ్మలను చూసి ఆనందిస్తున్నారు.

ప్రశంసిస్తున్నారు. 

సాయి ఉదయం లేస్తూనే ఆ విషయం అమ్మతో చెప్పాడు.  ఆ తర్వాత “అమ్మా, నేను పెద్దయ్యాక చిత్రకారుడు అవుతాను. నేను చాలా బొమ్మలు వేస్తాను. నా బొమ్మలు చూసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు” అని చెప్పాడు.

అమ్మ సాయిని దగ్గరకు తీసుకుని “నా చిట్టి తండ్రీ.., నీ కలలు నిజమవుతాయి. నీవు చాలా తెలివైనవాడివి. నీవు ఏమి అనుకుంటావో అది చేయగలవు” అని ముద్దిచ్చి  ప్రోత్సహించింది.

పెద్ద రంగుల పెట్టె, కుంచె, కాన్వాసు తెచ్చి “నీ కలలు నిజం చేసుకో ” అన్నాడు  నాన్న.  

“అన్నా నీకేది కావాలన్నా నన్నడుగు, నీకు నేనున్నా” చెప్పింది  చెల్లి. 

కిటికీలోంచి వచ్చే వెలుతురులో సాయి ముఖం ఆనందంతో మెరిసింది. 

సాయి చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్నాడు కానీ, అతని మనసు మాత్రం ఎల్లప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. కొత్త కొత్త కలలు కంటూనే ఉంది.  కొత్త లోకాల్లోకి తీసుకుపోతూనే ఉంది.  

తన కలల్లో చూసినవన్నీ సాయి బొమ్మలుగా గీస్తున్నాడు. వాటికి రంగులు అద్దుతున్నాడు.  అవి అతనికి గొప్ప గుర్తింపుని ఇచ్చాయి.  ఎన్నెన్నో బహుమతులు తెచ్చిపెట్టాయి. 

సాయి కన్న కలలు అతనికి కఠిన పరిస్థితుల నుంచి బయటపడే శక్తిని ఇచ్చాయి. 

చిత్రకారుడిగా లోకానికి పరిచయం చేశాయి. 

కలలు కనడానికి ఎవరికీ పరిమితులు లేవు. ఆ కలలు నిజం చేసుకోవడానికి మాత్రం కృషి చాలా అవసరం.  

మరి, సాయి ఆ కృషి చేస్తాడా? 

భవిష్యత్ లో గొప్ప చిత్రకారుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడా? . 

ప్రపంచం అతన్ని గుర్తిస్తుందా? 

మీరు చెప్పండి. 

వి. శాంతి ప్రబోధ 

You may also like

Leave a Comment