తినడానికి తిండి లేని
ఈ దేశంలో…
గుప్పెడు నేల
కూడా విషమైపోయిన
ఈ రాజ్యంలో…
కాళ్లు చాపుకోడానికి
కనీస స్థలం లేని
ఈ కర్మభూమిలో..
రోడ్డు మీదకు వెళితే
సౌచాలయాలు కోసం
వెతుక్కునే ఆడాళ్లున్న
ఈ దేశంలో…
కనీసాదాయం లేక
ఉరికొయ్యలకు వేళ్లాడుతూ
చావునే ఉద్యమంగా
మార్చుకుంటున్న
ఈ చీకటి చెరసాలలో..
నెలసరొచ్చినా
శానిటరీ పాడ్స్ దొరకని
ఈ స్వచ్ఛభారతంలో…
నల్లధనాన్ని తెల్లగా
తెల్లధనాన్ని నల్లగా మార్చే
అబ్రకదబ్రక బాబాలున్న
ఈ పుణ్యభూమిలో…
బేటీ బచావో నినాదం
నీలగిరి కొండ మీంచి దూకి
ఆత్మహత్య చేసుకున్న
ఈ దేశంలో…
అన్ని రంగాల్ని
అగ్నిప్రవేశం చేయించి …
ఆకలి కేకల పందిళ్ల మీద
ఎండిన డొక్కల
శాలువాల సాక్షిగా…
నా మనసులో మాట.
చెప్తున్నా
ఏదో ఒక రోజు
మహిళా దినోత్సవం సాక్షిగా
నన్నూ అమ్మేసి బ్రోతల్ అని పేరు
పెట్టి నా శవం మీద
మీసం మెలేస్తాడేమో…