Home బాల‌సాహిత్యం మహాభారతంలో అశ్వత్థామ పాత్ర

మహాభారతంలో అశ్వత్థామ పాత్ర

by Avantika

అందరికీ నమస్కారం. నా పేరు అవంతిక. నేను టైనీ స్కాలర్స్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను మహా భారతంలో అశ్వత్థామ గురించి చెప్పబోతున్నాను.

అశ్వత్థామ కురుపాండవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతని మేనమామనే కృపాచార్యుడు. అశ్వత్థామ పుట్టుకతోటే నుదుట మీద మణితో జన్మిస్తాడు. యితడు సప్త చిరంజీవులలో ఒకడు. చిరంజీవులంటే మరణం లేని వారు అని అర్థం. చిరంజీవులు ఏడుగురు. వారు బలి చక్రవర్తి, పరశు రాముడు, హనుమంతుడు, విభీషణుడు, వ్యాస మహర్షి, కృపాచార్యుడు మరియు అశ్వత్థామ. ద్రోణాచార్యుడికి కడు ప్రియమైనవాడు. తన తండ్రి ద్రోణాచార్యుడికి అర్జునుడు ప్రియ శిష్యుడు కావడం వల్ల తనకే నేర్పని విద్యను అర్జునిడికి నేర్పడంతో పాండవుల మీద ద్వేషంతో కౌరవులతో స్నేహం చేసి వారి పక్షాన ఉండేవాడు.
కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో అశ్వత్థామ ఒకడు. మహాభారత కాలంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలిచి పాండవులతో యుద్ధం చేస్తాడు. ద్రోణాచార్యుడు యుద్ధంలో ఉంటె పాండవులు గెలవలేరని భావించిన శ్రీ కృష్ణుడు అశ్వత్థామ మరణించాడన్న పుకారును వ్యాపింపచేస్తారు. ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకునేందుకు ద్రోణాచార్యుడు ధర్మరాజు దగ్గరకు వెళతాడు. ద్రోణాచార్యుని ప్రశ్నకు ధర్మరాజు బదులిస్తూ అశ్వత్థామ హతః అని ఆ తరువాత ద్రోణునికి వినపడకుండా కుంజరః అని అంటాడు. చివరి పదాన్ని గమనించని ద్రోణుడు పుత్రుడు మరణించాడన్న విషయాన్నీ విన్న వెంటనే ఆయన అస్త్ర సన్యాసం చేసి ధృష్టద్యమ్నుని చేతిలో మరణిస్తాడు. నిజానికి అశ్వత్థామ మాత్రం మరణించలేదు. అశ్వత్థామ అన్న పేరుగల ఏనుగు సంగ్రామంలో మరణిస్తుంది. కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ యుద్దానంతరం ధృష్టద్యమ్నుడిని చంపాలని అనుకుంటాడు.
మహాభారత యుద్ధానంతరం తానూ ఎలాగైనా పాండవులని చంపుతానని అశ్వత్థామ దుర్యోధనునికి మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యునితో కలిసి రాత్రి వేళ దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళతారు. ద్రౌపది పుత్రులైన ఉపపాండవులను పాండవులనుకొని  ఇంకా ధృష్టద్యమ్నుడిని నిద్రిస్తుండగా చంపివేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్దానికి తలపడతాడు. ఇద్దరు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తారు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోలేక పాండవుల వంశం అక్కడితో ఆగిపోవాలని అభిమన్యుడి భార్య అయిన ఉత్తర కడుపులోకి మళ్లిస్తాడు. ఆ అస్త్రప్రభావం వలన శిశువు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు తన శక్తులని ఉపయోగించి శిశువుని తిరిగి బ్రతికించి అతనికి పరీక్షిత్తు అని నామకరణం చేస్తాడు.
అలాగే అశ్వత్థామ నుదుటి మీద ఉన్న మణిని తీసుకొని అశ్వత్థామని మూడు వేల సంవత్సరాల పాటు కుష్ఠు వ్యాధిగ్రస్తుడు కమ్మని శ్రీకృష్ణుడు శపిస్తాడు. శ్రీకృష్ణుని శాపం వాళ్ళ అశ్వత్థామ నుదుటి మీదనుంచి చీము రక్తం కారుతూ ఇప్పటికీ హిమాలయాలలో బ్రతికే ఉన్నాడని అంటారు.

ధన్యవాదములు.

You may also like

Leave a Comment