మహిమ గలది మహిళ ఈ జగతిలోన
ఆ మధుర చరిత వినిపించెద జనములోన
అంగన అంచయాన అంబుజనయన
అంబుజాక్షి అబ్జముఖి అంబుజవదన
ఏ పేరున పిలిచినా అందచందమే
ఏ తీరుగ చూసినా అనురాగబంధమే
“అమ్మ”అనే పిలుపుకై ఆరాటపడుతుంది
అందుకు ప్రాణాలే పణంగా పెడుతుంది
మగనితో జత కూడితే మగనాలి తానే
అతనిలో సగమైతే అర్థాంగియు తానే
పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే అత్తమ్మ తానే
ఆ పిల్లల పిల్లలకు అమ్మమ్మ నానమ్మ తానే
కూతురై పుట్టుతుంది ఒక ఇంట
కోడలై అడుగు పెట్టు ఒక ఇంట
ఇంటికి దీపం ఇల్లాలే నంట
ఇలనైన కలనైన నిజమే నంట
వింటికి నారి అనివార్యం
కంటికి నారి సౌందర్యం
మగనికి నారి మాధుర్యం
వెంటనడిస్తే ధైర్యం స్థైర్యం