Home కవితలు ముసురు

ముసురు

by Giriprasad Chelamallu

ఎన్నాళ్ళైంది వాన

వానాకాలం పొడవునా కురిసి

నేల దాహం నీ దాహం తీరేదాకా కురువు 

మీ ప్రేమ పరిపూర్ణత సాధించే దిశగా 

పరుగు పరుగున వచ్చి

చెరువు కట్ట రాతి ని ముద్దాడాలని 

ప్రవాహ పరువం తహ తహ

సంద్రమెరుగని పల్లె పడుచు

రాతి ని తాకి కట్ట మీద పడే జల్లు లో తడిసి

పరవశించే

ఎప్పుడెప్పుడు దూకుదామని

ఆతృతలో వాగు

అలుగు రాళ్ళ లెక్కెట్టుకుంటూ

ఒంట్లు నేర్చుకుంటుంది

అలుగు పారితే నమ్మకం తో 

కోసే యాట కోసం మైసమ్మ 

కళ్ళల్లో వత్తులు వేసుకుని 

ఎదురు చూస్తుంది 

మోట బొక్కెన లో

నాన బోసిన వడ్లు మొలకెత్తి

ఎప్పుడు అలుకుతావని రైతుని

మడి దున్నమని అడుగుతున్నాయి

ముసురు లో

జారుతున్న కట్ట తోవ మీద

విన్యాసాలు చేస్తూ

కొక్కెరలు తల మీంచి కింది దాకా వేసుకుని

బడి బాట పడుతున్న పిల్లలు

ఎదురెక్కే చేపల కోసం

ఎర గాలాలతో వాగొడ్డున

సోపతి గాళ్ళు  ముచ్చట్ల  మురిపాల్లో

మంచు ముత్యమెరుగని మర్రి

ఆకాశాన్నంటిన తాటాకు కొసన 

రాలనా వద్దా అని ఆలోచిస్తున్న వాన బిందువును

ఒడిసిపట్టుకుందామని నిరీక్షణ లో మర్రి ఆకు

కలిసి పెరిగిన 

వేప రావి సహజీవనం లో

రాలే చినుకులు కొత్త దనాన్ని

సృష్టిస్తున్నాయి

మోదుగు పువ్వుపై

రాలిన చుక్క ఎరుపు రంగు పులుముకుని

తంగేడు పూల జత కలిసి

కొత్త సంధ్య కోసం దారి పరుస్తున్నాయి 

You may also like

Leave a Comment