Home బాల‌సాహిత్యం మూడు చీమలు

మూడు చీమలు

by chittiprolu Subbarao

మూడు చీమలు

భద్రాచలం క్షేత్రంలో మంచిమిత్రులైన మూడు చీమలుండేవి.  అవన్నీ ఒకసారి పాపికొండలు చూడాలనుకున్నాయి.  ఒక్కొక్కటి ఎవరి దారిలో వారు వెళ్ళి పాపికొండల్లో కలుసుకోవాలనే షరతు విధించుకున్నాయి.

గోదావరి ఒడ్డుకు చేరిన మొదటి చీమకు అక్కడ ఒక పడవ కనిపించింది.  మనుషుల మాటలు విని ఆ పడవ పాపికొండలకు వెళ్తుందని అర్థం చేసుకుని పడవ మీద అపాయం లేని ఒక మూలన కూర్చుని ప్రయాణమైంది.

రెండవ చీమ గోదావరి ఒడ్డునే నడచుకుంటూ పాపికొండల వైపు సాగిపోయింది.

మూడవ చీమ కళ్ళుమూసుకుని దేవుడికి ప్రార్థించి గోదావరి నదిలోకి దూకేసింది.

ముందుగా మొదటి చీమ పాపికొండలు చేరింది.  ఇద్దరు మిత్రుల కోసం ఎదురుచూసింది.  ఎట్టకేలకు రెండవ చీమ చాలా ఆలస్యంగా వచ్చి మొదటి చీమను కలిసింది.  ఇక ఆ రెండు చీమలూ మూడవ చీమ కోసం నిరీక్షించాయి.  రోజులు గడిచాయి.  వారాలు గడిచాయి.  కానీ మూడవ చీమ జాడే లేదు.  చేసేది లేక రెండు చీమలూ కలిసి తిరుగుప్రయాణానికి భద్రాచలం వెళ్ళే పడవెక్కాయి.

భద్రాచలం చేరగానే రెండు చీమలూ సరాసరి మూడవ చీమ ఇంటికి వెళ్ళి తలుపుకొట్టాయి.  బయటకు వచ్చిన చీమ దిగులుగా జరిగిన విషయం చెప్పింది.

భద్రాచలం వద్ద గోదావరిలో దూకిన మూడవ చీమ నీటిలో మునిగిపోతూ ప్రాణభయంతో ఈదటం మొదలుపెట్టిందట.  కొంతసేపటికి అలసిపోయిందట.  కళ్ళు తేలేసి నదిలో కొట్టుకుపోతున్న ఆ చీమను ఎదురుగా వస్తున్న ఒక తాబేలు చూసి తన వీపు మీదకు ఎక్కించుకుందట.

చీమ పాపికొండలు పోవాలని తాబేలుకీ, తాబేలు భద్రాచలం పోవాలని చీమకూ అర్థమైంది.  తాబేలు వెనక్కు వెళ్ళదు .  చీమ తనంతట తాను ఈదుకుంటూ పాపికొండలు వెళ్ళలేదు. బతికుంటే పాపికొండలు మళ్ళీ ఎప్పుడైనా చూడొచ్చని తాబేలుతోపాటు భద్రాచలానికే తిరిగివచ్చింది మూడవ చీమ.

విషయం మళ్ళీమళ్ళీ చెప్పీ చెప్పించుకునీ మూడు చీమలూ పెద్దగా నవ్వుకున్నాయి.  కానీ మూడవ చీమకు లోలోపల ఎక్కడో తీరని దుఃఖం మిగిలిపోయింది. ఆ రాత్రంతా నిద్రపట్టక అల్లాడిపోయింది.

మరుసటి రోజు తాను చేసిన పనికీ ఇద్దరు మిత్రుల పనులకూ గల తేడా ఏమిటోనని ఆలోచించుకుంటే విషయం అర్థమై మనసు కుదుటపడి హాయిగా నిద్రపోయింది.

“ఏదైనా గమ్యం చేరాలంటే దేవుడిచ్చిన తెలివితేటల్ని వాడుకోవాలి. దేవుడిచ్చిన దేహంతో కష్టపడాలి. అంతేగానీ దేవుడి మీద భారం వేశామనుకుని గుడ్డిగా ప్రవర్తించకూడదు, తన ప్రయత్నం మానకూడదు.”

 

You may also like

2 comments

GUNDAMEEDI KRISHNA MOHAN August 28, 2021 - 10:53 am

Nice
Edulo ela rayaali

Reply
satyanarayana ch November 3, 2022 - 5:04 am

Moral is good

Reply

Leave a Comment