అలకలు పట్టివులు
కక్ష సాధింపు కయ్యాలూ
పిల్లల మొండితనం లాగా
రాద్ధాంతం గానే మొదలవుతది
అర్థం కాకుండానే
వాదన పెట్టుకుంటది
దిగువ ప్రవాహానికి నీళ్లు తాగుతున్న మేక
ఎగువగానున్న పులికి ఎంగిలి పడ్డ నెపం ఒకటి
యుద్ధానికి కారణమవుతది
అంత దానికి ఇంత బల ప్రయత్నమెందుకో!
భూనభోంతరాళాల
జలజలాంతర విన్యాసాలెందుకో !
కూటములు శాంతి దౌత్యాలెందుకో !
ఈ ఎల్లల విస్తరణా
చుట్టుముట్టు ఎత్తుగడా
ఏ సంక్షేమానికని !
అంతా మన బోటి ఆగం కానీ
పై పై కారణాలన్నీ ఉట్టుట్టి ప్రేలాపణలే !
వాడిన హరితం
వాంగ్మూలం చెబుతుంది
కప్పు సాసర్ కింద
కాలుతున్న పువ్వులను కనుగొనాలి
యుద్ధం రెండు దేశాల మధ్యనే జరగదు
ఎగుమతి దిగుమతుల మీద
ఉత్పత్తి వినియోగాల మీదా
ధరల మీద తడి లేని ప్రాణాల మీదా
వికసించే మొగ్గల మీద సీతాకోక చిలుకల మీదా
వయస్సు మీద పడ్డ మడతల మీదా
పిచ్చుక మీద బ్రహ్మాస్త్ర మవుతుంది
యుద్ధం రెండు దేశాల మధ్యనే జరగదు.
యుద్ధ మన్నాక ఒక్క రీతీ ఉండదు
యుద్ధం ఒక చార్ పత్తర్ ఆట
సైనికులు పహారా ఉన్న
అహంకారపు పూల విమానం
మృగయా వినోదం
దానికో బీజీయ సమీకరణముంటది
అంకెలూ అక్షరాలూ కలవని కూట సంబంధం
తడిసి మోపెడు పెను భారమవుతుంది
యుద్ధం ఒంటరిగా రాదు
కనిపించని వ్యూహంతో
కత్తులు నూరుతుంది
అనాగరిక దుష్ట సంప్రదాయం
ప్రజలు వద్దంటున్నా
ఎందుకింత పిపాస !
ఈ విశ్వ కుటుంబానికి
పాలకులు తండ్రి లాంటి వారు
పొరుగు బంధాలన్నీ లోకకళ్యాణార్ధం
ఏ పక్షం కానీ
ప్రజా పక్షం కావాలి
ఒక నాగరిక సమాజం కోసం
కొత్త సూత్రాలను
కొత్త విలువలను ఆవిష్కరించుదాంహాయ్!