Home బాల‌సాహిత్యం “రెండు కళ్ళు ” – కథ

“రెండు కళ్ళు ” – కథ

అమ్మా ..
“అటుచూడు . రెండు పిచ్చుక పిల్లలు ఎలా పోట్లాడుకుంటున్నాయో .. ” అన్నాడు చింటూ
అమ్మ చింటూ చూపించిన వైపుకి ఒకసారి చూసింది .
మళ్ళీ తన చేతిలో ఉన్న పుస్తకం చదువుకుంటూ కూర్చున్నది.
చింటూ కి ఆ పిచ్చుక పిల్లలు చూడడం చాలా ఆసక్తిగా ఉంది.  వాటిని  పరిశీలనగా చూస్తున్నాడు.
అవి రెండూ పోట్లాడుకుంటూనే ఉన్నాయి.  ఒకదానిమీద ఒకటి పడి కొట్టుకుంటున్నాయి.  ఒకదాన్ని ఒకటి తిట్టుకుంటున్నాయి.
అంతలో ఎక్కడికో వెళ్లిన వాళ్ళ అమ్మ పిచ్చుక రివ్వున వచ్చి గూటి పై వాలింది.
పిల్ల పిచ్చుకలు పోట్లాట ఆపి అమ్మ వద్దకు చేరాయి.
ఒకదానిమీద ఒకటి అమ్మకు ఫిర్యాదు చేస్తున్నాయి.
“చూడమ్మా .. నువ్వు నా కోసం ఉంచిన అన్నమంతా తమ్ముడు తినేశాడు ” ఏడుస్తూ చెప్పింది బుజ్జి పిచ్చుక
“కాదమ్మా .. ” పక్క చూపులు చూస్తూ చెప్పింది బుల్లి పిచ్చుక .
” అమ్మా .. అటు చూడు, అది నా బట్టలు వేసుకుంది ” అరిచింది బుల్లి పిచ్చుక
“ఒరేయ్ .. ఆపండి మీ గోల . ” అమ్మ ఇద్దరినీ మందలించింది
ఇద్దరూ ఆపలేదు .  ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పాటు బుల్లి చెయ్యి లేపింది
అమ్మ అది గమనించింది . అక్క మీద చెయ్యెత్తిన బుల్లి చేతిని పట్టుకొని ఆపింది . మరో పక్కకు లాగింది .
బుజ్జి ని చూస్తూ .. “పెద్ద దానివి. నీకైనా బుద్ది ఉండక్కర్లా .” కోపంగా అన్నది అమ్మ పిచ్చుక .
Ilustration by Ahobhilam Prabhakar (9490868288)
“హూ .. అమ్మ ఎప్పుడూ ఇంతే..
బుల్లి అంటేనే తనకిష్టం.  ఊ .. ఊ .. నన్నే తిడుతుంది.
నేనంటే తనకసలు ఇష్టం లేదు.  అందరు నన్నే తిడతారు ” అంటూ బుజ్జి గట్టిగా అంటూ ఏడుస్తున్నది .
“హూ .. అమ్మ ఎప్పుడూ అక్కకే సపోర్ట్ చేస్తుంది .
తనని ఏమనదు .
నన్ను చూడు .. ఎలా లాగేసిందో .. ” అని ఎప్పటి సంగతులో తలచుకొని ఏడుస్తున్నది బుల్లి
బుజ్జి , బుల్లి ల కొట్లాట చూస్తే అమ్మకు చాలా కోపం వస్తున్నది.   కానీ వాళ్ళని కొడితే లాభం లేదు.  అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని ఆలోచించింది.
ఇద్దరినీ పిలిచింది . తనకి కుడి పక్క ఒకరిని, ఎడమ పక్క ఒకరిని కూర్చోమంది . ఇద్దరూ మౌనంగా వచ్చి కూర్చున్నారు.
కానీ వాళ్ళ కళ్ళు కోపంగానే  చూసుకుంటున్నాయి .
“మీ ఇద్దరికీ కళ్లున్నాయా ..” అడిగింది అమ్మ పిచ్చుక.
“ఇదేం ప్రశ్న .. “అమ్మకేసి వింతగా చూశాయి పిల్ల పిచ్చుకలు
ఆ తర్వాత ఉన్నాయన్నట్లు తలూపారు .
“ఎన్ని కళ్లున్నాయి ?”అడిగింది అమ్మ పిచుక .
“రెండు” అని టక్కున సమాధానం ఇచ్చారు ఇద్దరూ ..
అమ్మ ఇద్దరినీ చూసింది.
బుజ్జి , బుల్లి ఇద్దరూ పోట్లాట మరచిపోయారు . ఏడుపు పోయింది . కోపం పోయింది .
అమ్మ ఏమి చెప్పబోతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు .
అప్పుడు “ఏ కన్ను అంటే మీకిష్టం ” అని అడిగింది అమ్మ .
బుల్లి , బుజ్జి అమ్మ మొహంలోకి చూశాయి. అమ్మ కేమయింది ఇలా అడుగుతుంది అని మనసులో అనుకున్నాయి .
“రెండు కళ్ళూ .. ” అన్నాయి ఒకేసారి
అప్పుడు అమ్మ బుజ్జిని , బుల్లిని తన దగ్గరకు తీసుకుంది. గుండెకు హత్తుకుంది.
“మీరిద్దరూ నా కళ్ళు. మరి, నాకు ఎవరంటే ఇష్టం? ” అని అడిగింది .
“ఇద్దరం ” అని ఒకే సారి చెప్పారు బుజ్జి , బుల్లి
“కదా .. ” అమ్మ ఇద్దరికీ చెరొక ముద్దు ఇచ్చింది. హాయిగా నవ్వేసింది.
బుజ్జి , బుల్లి కూడా నవ్వేశాయి . అమ్మకు చెరో వైపు ముద్దులిచ్చాయి.
అప్పుడు అమ్మ ఇలా చెప్పింది .
మీరిద్దరూ అక్క తమ్ముళ్లు కదా .. పోట్లాడుకోకూడదు .  ఒకరినొకరు తిట్టుకో కూడదు . కొట్టుకో కూడదు .  తక్కువ చేసుకో కూడదు .  ఒకరికొకరు తోడుండాలి .
కోపం తగ్గించుకొని శాంతంగా ఆలోచించుకోవాలి .
ఒకరిపై ఒకరు నిందలు వేయడం, ఫిర్యాదు చేయడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం అలవాటయితే బుర్రంతా వాటితో నిండిపోతుంది. అదే ఆలోచిస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తారు .
మన అక్కే కదా .. మన తమ్ముడే కదా అనుకుంటే హాయిగా ఉంటారు .  గొడవలు ఉండవు.
అవునమ్మా.., ఇక మేం పోట్లాడుకోము బుజ్జి, బుల్లి పిచ్చుకలు అమ్మ మెడ చుట్టూ చేతులేసి చెప్పాయి.
చింటూకి ఆ దృశ్యం అపురూపంగా అనిపించింది.
అన్న , తనూ స్కెచ్చెస్ కోసం జుట్టు పట్టి కొట్టుకున్నారు.
ఎంత చెప్పినా వినకుండా కొట్టుకుంటున్నారు. మీతో మాట్లాడను అని అమ్మ చెప్పింది.  పిచ్చుక పిల్లల్ని చూస్తుంటే ఆ విషయం గుర్తొచ్చింది.
అమ్మ దగ్గరకు వెళ్లాడు. అమ్మ చేయి పట్టుకుని చేతిలో చేయి వేశాడు.
సారీ అమ్మా. నేను, అన్న అసలు ఎప్పుడు పొట్లాడుకోము అని చెప్పాడు.
చింటూ ఎందుకు అలా చెప్పాడో అమ్మకి అర్ధం కాలేదు.
తనకోపమే తన శత్రువు అనే పద్యం చదువుతున్నాడు చింటూ అన్న బంటీ.

You may also like

Leave a Comment