రహదారుల మీద వడ్లు, మక్కలు
ఎండబోసినట్టు ,
సరిహద్దుల్లో నా దేశరైతులు
తమ దేహాలను ఆరబోస్తున్నారు
తమ పంచలోని వరికంకులను
అలా వదిలేసి
దున్నిన పొలాలన్నీ దాటుకొని
పొలికేకలై పెకలించుకు వచ్చారు
సకాలపు చినుకు కోసం
కైమోడ్చి ఆకాశాన్ని ప్రార్థించేవాళ్ళు
వానచుక్కని ఒడిసిపట్టి
భూమిని సుతిమెత్తన చేసి
పుడమి కడుపున పసిడి పంటకు
ప్రాణం పోసేవాళ్ళు
మట్టిముద్దల్లోంచి జీవశోభిత ధాన్యరాశిని కుప్పలుగా పోసేవాళ్ళు
ఉత్తర భారతపు చలికి
గడ్డకట్టుకుపోతూ
తమ కడగండ్లను గంపలకెత్తి
పాలకుల కండ్లకు చూపెడుతున్నారు
లాఠీలేమో అన్నం కుండలను పగలగొడుతున్నాయి
విస్తరిలో అన్నం మెతుకులైన పాపానికి
రైతుల మీద భాష్పవాయుగోళాలు పగుల్తున్నాయి
బయట తెచ్చిన పెట్టుబడిపై
పేరుకుపోతున్న మిత్తీలు
కల్తీ ఎరువులు
కష్టానికి సరిరాని ధరలు
చట్టబద్దత లేని కనీస మద్దతు ధరలు
కూడబలుక్కుంటే
అసలు ఏ ధరకూ
కొనని కఠిన కార్పోరేట్లు
……………………….
అన్నదాత అల్లాడుతున్న
జీవన సంక్షోభ సమయమిది
మట్టి ముందు ,
అన్నం పెట్టే చేతుల ముందు
ఎవ్వరైనా సరే
రెండుచేతులు కట్టుకు
నిలబడాల్సిందే
స్వేదంతో సేద్యం చేసే కర్షకులకు
భూగోళం మొత్తానికి ఇంత ముద్ద పెడుతున్న వాళ్ళకు
అన్నం తింటున్న ప్రతి ఒక్కరూ
మద్దతు పలకాల్సిందే …!!
1 comment
కవితలు చాలా బాగున్నాయి భూమి లోతుల్లో నుండి మొలకెత్తిన
విత్తనంలా గుండె లోతుల్లో నుండి వికసించిన కన్నీటి చుక్కలవి
ఇంత మంచి కవితలు అందించిన రచయితలకు, ప్రచురించిన
పత్రిక వారికి ధన్యవాదాలు