Home కవితలు రోజుకోసారి కొత్తగా పుట్టడం 

రోజుకోసారి కొత్తగా పుట్టడం 

by Chandaluri Narayana Rao

రోజుకో నిజం

రాత్రికి నాకు తగాదా పెట్టి

పక్కరోజుకి వెళ్లి దాక్కుంటుంది.

ఒళ్ళు విరుచుకుని

కాలమెంత జాగానిచ్చినా

చీకటిలో  నానిన మాటలలో

ఒక అర్థం తెల్లగా మెరుస్తూ పారుతుంటే

మరోవైపు అదే అర్థం నల్లగా తునకలై…

కళ్లెదుటే పల్టీ కొట్టి

ప్రశ్నలుగా  పుట్ట పగిలి 

పాయలు పాయలుగా పాకే 

ప్రతి పన్నెండు గంటల ప్రయాణంలో

మనసుకు నిద్రనప్పజెప్పి

కన్నార్పని భయంతో 

కటిక చీకటిలో శరీరం ఎన్నో అనుభవాలకు చేసేది దాస్యమే .

ఇంతలో  వేకువ వెన్నును గుచ్చగానే

నిన్న నిజం  నేడెక్కడోనని వెతికే కళ్ళకు

పగటి నటనే ఓ వింతసమస్యగా

విస్మయించలేనిదే యుద్దానందం.

దారిపొడవునా ముళ్ల కాట్లకు

కళ్ళ వెంట మాటలు

చురుకు చురుకుమని జారి

తడిసే  జాము జాములో

బొట్లు బొట్లుగా కదిలిన భావప్రవాహానికి 

రాత్రికో నిజంలా

పగటికో అబద్దం కొత్త అవతారం.

క్షణం తీరికలేని మనసు ఆకలికి

ఆవిరయ్యే అందాలన్నీ 

రుచిగల ఇష్టాలుగా

రాత్రి వేదిక కావడం అనివార్యం.

మనసును చంపుకోలేని శరీరం

శరీరాన్ని తెంపుకోలేని మనసు

పెనవేసుకుని ముడులేసుకుని

రోజుకోసారి కొత్తగా పుట్టడం

రోజుకోసారి వింతగా గిట్టడమనే

వింతానుభవాల నేపధ్యమే సాంగత్యం.

పగటి ప్రతిధ్వనిగా రాత్రిని

రాత్రి ప్రతిరూపంగా పగటిని

మనిషిని శాశ్వతంగా లిఖించి

మనసును  నటింపచేయడమే సత్యం.

రోజుకో నిజం ఓ వైపు

పగటికో అబద్దం మరోవైపు

మద్య మనిషి పాదం

మనసు పథం వేరువేరుగా

మనిషి తనకు తానే భిన్నంగా

మనసును నగ్నంగా 

బయట నిలబెట్టటమే 

సత్యమైనది….స్వార్థమైనది  …

స్వర్గమైనది….సొంతమైనది….

….చందలూరి నారాయణరావు

            9704437247

You may also like

Leave a Comment