Home కవితలు లసుము…

లసుము…

by Ramesh

శిధిలమైన మట్టిగోడలు  ఇల్లు 

ఆశలు కోరికలు లుప్తమైన కళ్లు 

తుట్టెలుగట్టిన

పిట్టగూడోలే బిరుసెక్కిన కురుల మొగం

అపుడపుడవుతుంది ఆమె  ఆగం

నిరుత్సాహంతో కృంగి వంగిననడుము దేహం

నింగిని  ఆసాంతం చూట్టం ఒక సందేహం

వాలుగా చూస్తుంది

పుడమికి అభిముఖమై అడుగేస్తుంది  

విధి వింతగా రాశాక

భర్త కనుమూశాక 

సుఖం  ఎండమావి

దుఃఖమయగుండె ఒక ఆరని దుబాయ్ చమురుబావి 

మోసాలు మోహాలు

కలలు కలతలు ఎరుగని ఎద

అమాయకపు అఙ్ఞానం 

తెల్సీతెలియనితనం కధ ఆమె

రోడ్డువార మైలురాళ్లలాగా

కష్టాలు కన్నీళ్లు  స్వాగతం చెబుతుంటే

ఆకులు  రాల్చిన   చెట్టులాగా

గ్రీష్మం కాల్చిన కొండలాగా

నిల్చుంది మౌనంగా జీవితంలో

కాస్తంత మాతృత్వం 

కాస్తంత బంధుత్వం సివా  ఏమీ తెలియని వెర్రిమాలోకం ఆమె

ఏ ఆశాపాశాలకు

ఏ ఆరాటపోరాటాలకు  తావీయని ఆమె

చిల్లిగవ్వలేని 

చింతించ పనిలేని

ప్రపంచం గురించి  ఊసేలేని 

ఒక వింతమాలోకం ఆమె

మన హడావిడి అలజడికి ఆమడదూరం

మన ఆధునిక వలముడికి బహుదూరం ఆమె

వసంతం ముంగిట  శిశిరం 

శప్తమయజీవిత విపంచిక శోక స్వరం  ఆమె.

You may also like

Leave a Comment