Home కవితలు వందేభారతం!

వందేభారతం!

by Ramesh

రెండే రెండు నదులు
కులం,మతం
దేశమంతటా ప్రవహిస్తున్నాయ్

మతం అహంకార దౌర్జన్యాలు
కులం వెర్రితలల దాష్టీకాలు
కులమతాల
అర్థంలేని పంతాలుపట్టింపులకు
మనుగడ అద్దం నిరసన తెలుపుతుంది
చిట్లిన పగుళ్లు అద్దం ముక్కల్లో చూడగలమా రేపటి భవిష్యత్తు
కోపతాపాల మనిషి
పగలు ప్రతీకారాలు
మృతదేహాం ముక్కలుముక్కలు
రక్తపాతం సృష్టిస్తు కనిపించని యుద్ధాలవుతున్నవి
ఆధునిక కులమత ఘర్షణల హత్యాభారతం ఇది!
ఏమిటో ఈ ఘోరం?
ఈ మృగత్వం?
ఎవ్వరి వారసత్వం ఈ రాక్షసత్వం?
చట్టాలు,న్యాయాలు కోర్టులు
కళ్లులేని న్యాయదేవత ముందు
బెయిల్లు మంజూరులు మతలబులు
శిక్షలు శతాబ్దాల పడిగాపులు
చర్చలు నింపాది తతంగాలు
వాతావరణం మారి బతుకు ఆవరణ అవుతున్నది
అంతలోనే నల్లని మబ్బులు కమ్ముతాయ్
పెనుతుఫానులు చెలరేగుతాయ్
రక్తపాతము ఉప్పొంగి పారుతుంది
కులమతాల కుమ్ములాటలో
దుఃఖం ఇక్కడ ఒడవని ముచ్చట
కన్నీరు ఉపనదిగా ఉద్భవిస్తుంది
మతం గతం కాదు
అసలు అర్థం కాబోదు
కులమెప్పుడూ ముసలమే
సుజలాం సుఫలాం
పాటలకే పరిమితం

ప్రవహించే కాలంతో పాటు
ఈ సంఘర్షణలు
కలకాలం వెంటాడే వేటాడే

పవిత్రమతగ్రంధాల సారం అరణ్య రోదన
ఐక్యత ఇక్కడ కాంతిసంవత్సరాలదూరం

ఈ అంతర్యుద్ధం ఆరని కాష్టం
దేశీయుల గుండెల్లో
అసంతృప్తజ్వాలలే నిరంతరం!

ఈ స్వేచ్ఛాలోకంలో
మంచీచెడ్డలు మరచి
ప్రేమ,సహనం విడిచి
చెలరేగుతున్న దుర్మార్గులు
ఈ దమనకాండల రక్తపుటేరులు
అతిపెద్ద నదిగా అవతరించే దిశగా
నా భారతదేశం అడుగులు వేస్తుంటే
సిగ్గువేస్తుంది నాకు
వందేభారతం
ఇప్పుడు రక్తంచిందే భారతం!
ఈ నెత్తుటి భారతం
ఇంకా ఎన్నాళ్లు?
ఈ రక్తపాత ఉపద్రవం ఉప్పెనై ముంచకముందే
దేశ మనుగడకోసం
కలసినడవాలి మనం

మంచిది కాదు ప్రజామౌనం
దేశప్రజలారా !
ఆలోచించండి పోయేదేముంది
మేల్కొనండి అంతా వచ్చేదేమరి
చైతన్యం అడుగుల సవ్వడి
ఆదర్శ ఆలోచనల ఝరి

You may also like

Leave a Comment