శాంతి కపోతాలు నాయింటి వరండాలో వాలినట్లు,
శీతల పవన మాలికలు నా బెడ్ రూమ్ కిటికీ నుండి దూరినట్లు,
పక్కింటి వంటింటి సువాసనలు నా ముక్కు పుటాలను తాకినట్లు
కొబ్బరాకుల నుండి పున్నమి నాటి వెన్నెల కిరణాలు,
నా మేడ గదిలోకి వచ్చినట్లు వచ్చిపోమిత్రమా !
మనసు విప్పి మాట్లాడుకుందాం!మాటలతో సేద దీరుదాం !
ఇంటి గేట్ లోకి బంతి పడినపుడు,
బయట ఆడుకునే పిల్లలు లోనికి వచ్చినట్లు,
ఆరు బయట చెట్టు పైని ఉడుత,పెరటిలోకి షికారుగా వచ్చినట్లు,
బాలభానుని సూర్య కిరణాలు,
వెంటిలేటర్ నుండి వచ్చి వెచ్చదనాన్ని కూర్చినట్లు
వచ్చిపో మిత్రమా !
మనసువిప్పి మాట్లాడుకుందాం! మాటలతో సేద దీరుదాం !
మిత్రమా! నీవు వచ్చినపుడు
ఫోన్ చేసి రావద్దు!నా సమయం తీసుకొని రావద్దు!
ఉన్న పళాన రావాలి ! నీ సమయం కూడా
నాకు కేటాయించి రావాలి!
కాలింగ్ బెల్ నొక్కి రావద్దు! నా పేరు పెట్టి పిలుస్తూ రావాలి !
ఊసుల, బాసల పేటికలు మోసుకు రావాలి !
గతకాలపు గాధల నిధులు త్రవ్వుకొని రావాలి !
నీవు వచ్చిన తరువాత కాలమనే ఉయ్యాలలో ఊగుతూ
మధురమైన గతాన్నితవ్వుకుందాం !
పాత విషయాలు తలుచుకొని నవ్వుకుందాం !
భద్రమైన భవితవ్యాన్ని నిర్మించుకుందాం !
అలాగే నీవు వెళుతూ..వెళుతూ..
అలిసిన మనసుకు ఉపశమనాన్ని ఇచ్చే
నిన్ను కొద్దిగా విడిచె వెళ్ళు!
నేస్తమంటే వీడేనని-గుర్తుకు తెచ్చే
నన్ను కొద్దిగా తెసుకొని వెళ్ళు!
వచ్చిపో మిత్రమా!
previous post