Home కవితలు వర్క్ ఫర్ హోమ్

వర్క్ ఫర్ హోమ్

ఎన్నో ఉదయాలు
ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్
బ్రేక్‌ఫాస్ట్ బ్రెడ్ స్లైసుల్లో చేరిపోతాయి.

ఎన్నో మధ్యాహ్నాలు
పనిభారంతో కళ్లు
లంచ్ బాక్స్‌ని మరిచిపోతాయి.

ఎన్నో సాయంత్రాలు
నిబద్ధత, విధేయత
కండెన్స్డ్ పాలలా  కాఫీ కప్పులో దూరిపోతాయి.

ఎన్నో రాత్రులు
స్క్రీన్ మీద ఎర్రర్స్
ఎర్రని కంటిజీరలా మారిపోతాయి.

మాటల ప్రవాహాన్ని,
చూపుల బేలతనాన్ని
వైఫై తరంగాలు
గిగాబైట్లలో మోసుకు పోతాయి.

అతను అక్కడ వేరే ప్రాజెక్ట్‌లో
ఆమె ఇక్కడ కోడ్ రివ్యూలో

నేరుగా ఇటుక ఇటుక పేర్చి కట్టుకోక పోయినా
వారు ఇన్‌స్టాల్‌మెంట్స్ కూర్చి కట్టుకున్న ఫ్లాట్
అందంగా, విశాలంగానే ఉంది
వర్క్ ఫ్రమ్ హోమ్‌కి వీలుగా
ఇద్దరికీ చెరో గది.

బాల్కనీ లోంచి రోజూ
వారిని గమనించే గువ్వల జంట
పుల్ల, పుడక తెచ్చి అల్లుకున్న
గుండె అంత గూటిలో
దగ్గరగా చేరుకుంటూ
ఇంటికి కొత్త అర్థాన్ని తెచ్చే పనిలో
లోకాన్ని మరచిపోతున్నాయి.

You may also like

1 comment

కుడికాల వంశీధర్ March 7, 2023 - 11:10 am

ధన్యవాదాలండి

Reply

Leave a Comment