తొలకరి వాన పడిన మరునాడే
తీవ్రమైన ఆందోళనతో
తిరిగి వచ్చేవాణ్ని మా యింటికి
ఏళ్ల తరబడి అదే జరిగింది
విరగబూసిన ఎర్ర చంపకవృక్షాలు మూడు
మైలు దూరం నుంచే కనిపించేవి
వాటి స్వర్ణవర్ణ రేణువుల పుప్పొడిమేఘం
దారిపొడుగునా దట్టంగా పేరుకుని
అమ్మకు పార్శ్వపు నొప్పినీ
తాత్కాలిక అంధత్వాన్నీ తెప్పించేది
దాని వాసనను ఏ గాలీ వడగట్టలేకపోయింది
నల్లని స్తంభాలతో కట్టిన మా యింటిగోడలకు
చెవులూ కళ్లే కాదు, పెచ్చులూ వాసనలూ
ఎముకల కటుక్కు శబ్దాలూ
రాత్రుళ్లలో వినిపించే గొంతుకలూ ఉండేవి,
అన్నీ ప్రవేశించగలిగే దేహాల్లాగ.
ఏ తలుపూ ఆ పుప్పొడిని ఆపలేకపోయింది
అమ్మ అవస్థ బాల్కనీ లోని
లోహపు తీగ లాంటిది
అది తళతళ మెరుస్తుండేది
దానిమీద మనుమల, మనుమరాళ్ల చెడ్డీలు…
అవి తలనొప్పిని తగ్గించేందుకు
తలమీద పెట్టుకునే తడిబట్టల లాంటివి
అవస్థకు కారణమైనా
ఆ చెట్టును కొట్టనివ్వలేదు అమ్మ!
ఆంగ్ల మూలం: ఎ.కె. రామానుజన్
అనువాదం: ఎలనాగ
***