రష్యన్ మూలం: అంతోన్ చెహోవ్
ఆంగ్లంనుండి అనువాదం: ఎలనాగ
మధ్యాహ్నం. ఉక్కగా ఉంది. ఆకాశంలో ఒక్క మబ్బు సైతం లేదు. ఎండ ధాటికి గడ్డి వడలిపోయి దీనత్వాన్ని, నిరాశను ప్రతిఫలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ వాన పడినా పచ్చదనం నెలకొనదు అన్నట్టుగా చెట్ల పైచివరలతో దేన్నో చూస్తూ ఉపశమనాన్ని ఆశిస్తున్నదా అన్నట్టు అడవి నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉంది.
చెట్లు లేని ఒక ఖాళీ ప్రదేశంలో ఎత్తైన నలబయ్యేళ్ల పురుషుడొకడు కాళ్లీడ్చుకుంటూ, తడబడుతూ, మందకొడిగా, వంగివంగి నడుస్తున్నాడు. అతడు వెడల్పు లేని భుజాలతో, ఎర్ర చొక్కా మచ్చల ప్యాంటూ పొడవైన బూట్లూ ధరించి ఉన్నాడు. రోడ్డు వెంట రికామీగా నడుస్తున్నాడు. కుడివైపున పచ్చని చెట్లు, ఎడమ వైపున లేత బంగారు వర్ణంతో కనుచూపు మేర వ్యాపించిన సముద్రం ఉన్నాయి. అతడు ఒగరుస్తూ చెమటలు కారుస్తున్నాడు. తలమీద తెల్లని టోపీ ఉంది. దాన్ని ఉదారుడైన ధనిక మిత్రుడెవరో బహూకరించాడు అనిపిస్తోంది. చనిపోయిన అడవికోడి ఒకటి అతని బుజానికి వేలాడుతున్న బట్టసంచిలోంచి కనిపిస్తోంది. అతడు రెండు గొట్టాల తుపాకీనొకదాన్ని పట్టుకున్నాడు. దాని ట్రిగ్గర్ వెనక్కి లాగివుంది. పొదలను వాసన చూస్తూ పరుగులాంటి నడకతో ముందు పోతున్న కుక్కమీదనే దృష్టిని కేంద్రీకరించాడతడు. పక్షులు, జంతువులు వేడిమిని తప్పించుకోవడం కోసం చల్లని ప్రదేశాల్లో దాక్కొనడం చేత చుట్టూ నిశ్శబ్దం, స్తబ్ధత ఆవరించి ఉన్నాయి.
“యెగోర్ వ్లాసిచ్,” అకస్మాత్తుగా మంద్రస్వరంలో ఒక పిలుపు వినిపించింది.
ఉలిక్కిపడి చుట్టూ చూస్తూ ముఖం చిట్లించాడతడు. భూమిలోంచి ఉబికివచ్చిందా అన్నట్టు సుమారు ముప్పయ్యేళ్ల వయసున్న ఒక స్త్రీ పాలిపోయిన ముఖంతో, చేతిలో కొడవలితో అతని పక్కనే ఉంది. క్షీణించిన ఆత్మవిశ్వాసంతో నవ్వుతూ అతని ముఖంలోకి చూస్తోంది ఆమె.
“ఓ నువ్వా పెలాజియా. ఇక్కడికి ఎలా వచ్చావు?” అన్నాడు ఆ వేటగాడు, తుపాకీ ట్రిగ్గర్ ను మూస్తూ.
“మా ఊరి మహిళలు కొందరు ఇక్కడ కూలీలుగా పని చేస్తున్నారు. వాళ్లతో కలిసి వచ్చాను.”
“ఓ అలాగా,” అని మెల్లగా నడవసాగాడు యెగోర్ వ్లాసిచ్.
పెలాజియా అతని వెంట నడుస్తోంది. వాళ్లు మౌనంగా ఇరవై అడుగుల దూరం నడిచారు.
“నిన్ను చూడక చాలా కాలమైంది యెగోర్ వ్లాసిచ్,” అన్నది పెలాజియా అతని మృదువైన భుజాలను ఆర్తితో చూస్తూ. “ఈస్టర్ నాడు దాహం తీర్చుకునేందుకు ఒక నిమిషం కోసం నా గుడిసెకు వచ్చి నువ్వు నన్ను తిట్టి కొట్టి వెళ్లిపోవడం ఆ దేవునికే ఎరుక. అప్పట్నుంచి నీకోసం ఎదురుచూసి చూసి నా కళ్లు కాయలు కాచాయి. ఓ యెగోర్ వ్లాసిచ్, ఒకసారి రావచ్చు కదా.”
“వచ్చి అక్కడ నేను చేసేదేముంది?”
“అవుననుకో. అక్కడ నువ్వు చేసేదేమీ లేదు కానీ, అక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తూ నువ్వు సంరక్షించాల్సిన చోటు అది. నువ్వే యజమానివి కదా. నువ్వొక అడవికోడిని తుపాకీతో కొట్టావు. ఇప్పుడు నువ్వు కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి యెగోర్ వ్లాసిచ్.”
ఈ మాటలను అంటున్నప్పుడు పెలాజియా చిలిపి అమ్మాయిలాగా నవ్వుతూ యెగోర్ ముఖాన్ని చూసింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.
“నీకిష్టమైతే ఇక్కడ కూర్చో. ఎందుకు నిల్చున్నావు? నువ్వూ నాతో పాటు కూర్చోవచ్చు,” అన్నాడు యెగోర్ నిర్లక్ష్యం నిండిన గొంతుకతో. రెండు దేవదారు వృక్షాల మధ్య కూర్చున్నాడతడు.
పెలాజియా కొంచెం దూరంలో నీడలో కూర్చుంది. తన ఆనందం తనకే సిగ్గును తెప్పిస్తుంటే నోరుమీద చెయ్యి పెట్టుకుంది. రెండు నిమిషాలు మౌనంలో గడిచాయి.
“ఒకసారి వస్తే బాగుంటుంది,” అన్నది పెలాజియా.
యెగోర్ తలమీది టోపీని తీసి నుదురును చేయితో తుడుచుకుంటూ, “దేనికోసం రావాలి నేను? వచ్చేందుకు కారణమేదీ లేదు. ఒక గంట లేక రెండు గంటల కోసం వస్తే అది సమయాన్ని వృథా చేయటమే అవుతుంది. వచ్చి నీకు బాధ కలిగిస్తూ ఆ ఊళ్లో ఎప్పటికీ నివసించడాన్ని నా హృదయం భరించలేదు. నేను ఎక్కువగా సుఖాలకు అలవాటు పడినవాడినని తెలుసు నీకు. నాకు పడుకునేందుకు ఒక పరుపు, తాగేందుకు టీ, వీటికి అదనంగా మంచి సౌకర్యాలు, నాగరిక సంభాషణ కావాలి. నువ్వేమో దుమ్ము నిండిన ఊళ్లో దారిద్ర్యంలో బతుకుతున్నావు. అక్కడ నేను ఒక్కరోజు కూడా ఉండలేను. నీతో కలిసి జీవించేందుకు ఒకవేళ అక్కడ ఒక భవనం ఉన్నా నేను నీ గుడిసెను కాల్చెయ్యాలి, లేదా నన్ను నేను బాధించుకోవాలి. చిన్నప్పట్నుంచీ సుఖజీవనం అలవాటైపోయింది నాకు. ఏమీ చేయలేము,” అన్నాడు వ్లాసిచ్.
“ఇప్పుడెక్కడ ఉంటున్నావు నువ్వు?”
“డిమిత్రి ఇవనోచ్ ఆనే ఆసామి దగ్గర వేటకానిగా ఉంటున్నాను. అతని తిండికోసం అడవి జంతువులను, పక్షులను వేటాడుతాను. కానీ నాకు తన యింట్లోనే ఆశ్రయమిచ్చాడతడు. అది అతని ఆనందం కోసమే తప్ప వేరే కారణం ఏదీ లేదు.”
“నువ్వు చేస్తున్న పని సరైనది కాదు యెగోర్ వ్లాసిచ్. వేరేవాళ్లకైతే అది వినోదపు వ్యాపకం లాగా బాగుంటుంది. నీకు మాత్రం అది వ్యాపారం లాంటిదవుతుంది.”
ఆకాశం వైపు విచారంగా చూస్తూ, “నువ్వు అవివేకురాలివి పెలాజియా,” అని తర్వాత ఇలా కొనసాగించాడు యెగోర్: “నీకెప్పటికీ అర్థం కాదు. నేను ఏ రకం మనిషినో నీ మొత్తం జీవితంలో తెలుసుకోలేవు నువ్వు. నేను చెడిపోయిన మూర్ఖుడినని అనుకుంటున్నావు నువ్వు. కానీ వివేకం ఉన్న ఎవరైనా ఈ మొత్తం జిల్లాలో నేను అత్యుత్తముడిని అంటారు. పెద్దమనుషులు ఈ సత్యాన్ని గుర్తించడమే కాకుండా నేను చాలా మంచి వేటగాడినని ఒక పత్రికలో ప్రచురించారు. నాతో పోల్చతగిన స్ఫూర్తిమంతుడైన వేటగాడు లేడు. దానికి కారణం నేను నీ ఊరిజీవితాన్ని నిరసించడం గానీ సుఖమయ జీవితాన్ని అనుభవించడం గానీ కాదు. చిన్నప్పట్నుంచీ నాకు తుపాకులతో, జాగిలాలతో గడపటం తప్ప ఎప్పుడూ వేరే వ్యాపకం లేదు. నా తుపాకీని లాక్కున్నప్పుడు నేను గాలం తీసుకుని బయటికి పోయేవాణ్ని. గాలాన్ని లాక్కున్నప్పుడు పిట్టలను, జంతువులను చేయితో పట్టుకునేవాణ్ని. గుర్రాల కొనుగోలు, అమ్మకం కూడా చేశాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నేను సంతలకు పోయేవాడిని. ఒక రైతు క్రీడాకారునిగా మారినా లేదా గుర్రాల వ్యాపారం చేసినా వాడు వ్యవసాయానికి వీడ్కోలు చెప్పినట్టే. ఎవడినైనా ఒక్కసారి స్వతంత్రేచ్ఛ ఆవహించిందంటే దాన్ని నిర్మూలించడం జరగని పని. అదేవిధంగా ఎవడైనా అభినయం మొదలైన కళను ఆశ్రయించాడంటే వాడెప్పుడూ అధికారిగా కానీ భూస్వామిగా కానీ మారడు. నువ్వొక ఆడదానివి. కాబట్టి దీన్ని నువ్వర్థం చేసుకోలేవు. కానీ అర్థం చేసుకోవాలి.”
“నాకు అర్థమైంది యెగోర్ వ్లాసిచ్.”
“ఏడిస్తే నీకు అర్థం కాదు.”
అటువైపు తిరుగుతూ, “నేను ఏడ్వటం లేదు. నేను పాపిష్ఠిదాన్ని యెగోర్. అయినా అదృష్టహీనురాలైన నాతో నువ్వు ఒకరోజు గడపవచ్చు. మన పెళ్లి జరిగి పన్నెడేళ్లవుతోంది. కానీ ఒక్కసారి సైతం మన మధ్య ప్రేమ చిగురించలేదు. నేను ఏడ్వటం లేదు,” అన్నది పెలాజియా.
“ప్రేమ …” అని గొణిగాడు యెగోర్, తల గోక్కుంటూ. తర్వాత, “మన మధ్య ప్రేమ చోటు చేసుకోవడం జరగదు. పేరుకు మాత్రమే మనం ఆలుమగలం. నీ దృష్టిలో నేను ఆటవికుడిని. నా అభిప్రాయం ప్రకారం నువ్వు జ్ఞానం లేని మామూలు రైతు స్త్రీవి. మనం ఒకరికొకరం బాగా సరిపోయామా? నేను సుఖాలు పొందగోరే స్వేచ్ఛా జీవిని. నువ్వేమో తాటాకులతో చేసిన చెప్పులు తొడుక్కుని నడుము వంచకుండా పని చేసే శ్రామికురాలివి. నేను ప్రతి సాహసకార్యంలో ముందుండే మగవాణ్ని. నువ్వేమో నన్ను సానుభూతితో చూస్తావు. ఇప్పుడు చెప్పు మన జత బాగా కుదిరిందా?” అన్నాడు వ్లాసిచ్.
“కానీ మనం ఆలుమగలం. కామా యెగోర్?” అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
“ఆ పెళ్లి స్వేచ్ఛా సంకల్పంతో జరగలేదని మరచిపోయావా? నువ్వు సెర్గేయ్ పేలోవిచ్ దొరనూ, నిన్ను నువ్వూ అభినందించుకోవాలి. నేను అత్యుత్తమ వేటగాడిననే ఈర్ష్యతో ఆ దొర నాకు ఒక నెలరోజుల పాటు వరుసగా మద్యం తాగించాడు. బాగా తాగి ఉన్నప్పుడు ఎవరికైనా పెళ్లి చేయడమే కాదు అతడి చేత మతాన్ని కూడా మార్పించవచ్చు. నా మీద ప్రతీకారం తీర్చుకునేందుకు, నేను బాగా తాగివున్నప్పుడు మన పెళ్లి జరిపాడు ఆయన. ఒక వేటగాడికి ఆటవిక అమ్మాయితో పెళ్లి! నేనప్పుడు విపరీతమైన నిషాలో ఉన్నానని తెలిసి కూడా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు కౌలుదారువు కాదు కనుక ప్రతిఘటించగలిగేదానివి. ఒక ఆటవిక స్త్రీ ఒక వేటగాడిని పెళ్లాడటం అదృష్టమే అనుకో. కానీ అప్పుడు నువ్వు ఆలోచించి ఉండవలసింది. ఇప్పుడు ఏడుస్తూ కూచో. ఈ వ్యవహారం ఆ దొరకు ఒక జోక్ అయింది. నీకు మాత్రం ఏడుపు తెప్పించే విషయం. గోడకేసి తల కొట్టుకో.”
కొంత సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. మూడు అడవిబాతులు పైనుంచి ఎగురుతూ వెళ్లాయి. అవి చిన్న చుక్కలుగా మారి కింద వాలేంత వరకు యెగోర్ వాటిని నిశితంగా చూస్తూ నడిచాడు.
“బతుకుతెరువు కోసం ఏం చేస్తున్నావు నువ్వు?” అని పెలాజియాను అడిగాడతడు, చూపును మరల్చుతూ.
“ప్రస్తుతం బయటికి పోయి కూలిపని చేస్తున్నాను. చలికాలంలో ఫౌండ్లింగ్ హాస్పిటల్ లో ఒక పాపకు సీసాతో పాలు తాగిస్తాను. అందుకు నాకు నెలకు ఒకటిన్నర రూబుల్స్ ఇస్తారు.”
“ఓ, అలానా?”
మళ్లీ నిశ్శబ్దం చోటు చేసుకుంది. కోసిన పైరు తాలూకు మొదళ్ల మీంచి మృదువైన పాట వినపడింది. వేడిమి ఎక్కువగా ఉంది.
“అకులినా కోసం గుడిసెను నిర్మించావని చెప్పుకుంటున్నారు,” అన్నది పెలాజియా.
యెగోర్ మాట్లాడలేదు.
“అయితే ఆమె నీకు ప్రియురాలు అన్నమాట.”
“అది నీ దురదృష్టం, నీ కర్మ. పాపం, దాన్ని నువ్వు భరించాలి. ఓకే, బై. నీతో చాలా సేపటినుండి మాట్లాడుతున్నాను. సాయంత్రానికి నేను బోల్టోవో దగ్గర ఉండాలి,” అన్నాడు వ్లాసిచ్ ఒళ్లు విరుచుకుంటూ.
అతడు లేచి నిలబడి, తుపాకిని బుజానికి తగిలించుకున్నాడు. పెలాజియా కూడా లేచి నిలబడింది.
“నా ఊరికి ఎప్పుడొస్తున్నావు?” అని అడిగింది మృదువుగా.
“రావాల్సిన పని నాకు లేదు. ఎప్పుడూ మత్తులో లేకుండా రాను నేను. తాగివున్న నాతో నీకు ప్రయోజనం ఉండదు. మద్యపు మత్తులో మునిగినప్పుడు నేను ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటాను. బైబై.”
“బై, యెగోర్ వ్లాసిచ్.”
యెగోర్ టోపీని తల వెనుకభాగం మీద పెట్టుకొని, ధ్యాసను మళ్లీ జాగిలం మీదికి మరల్చి, వెళ్లిపోయాడు. పెలాజియా అతణ్నే చూస్తూ నిశ్చలంగా నిలబడింది. అతని బుజాలను, సొగసైన టోపీని, నిర్లక్ష్యపు నడకను చూస్తున్న ఆమె కళ్లు విషాదంతో, కరుణ పూరితమైన ప్రేమతో నిండిపోయాయి. ఆమె చూపు తన భర్త శరీరం మీదికి పోయి మృదువుగా స్పృశించింది. ఆ చూపుస్పర్శ అనుభూతమైందా అన్నట్టు అతడు ఆగి వెనక్కి తిరిగి చూశాడు. అతడేం మాట్లాడలేదు. ఏదో చెప్పాలనుకుంటున్నాడని తెలిసింది ఆమెకు అతని ముఖం ద్వారా, బుజాల ద్వారా. ఆమె భయంగా అతని దగ్గరికి పోయి, వేడుకుంటున్న కళ్లతో అతడిని చూసింది.
యెగోర్ వెనుకకు తిరిగి, “దీన్ని తీసుకో” అని, నలిగిన ఒక రూబుల్ నోటును ఇచ్చి వెళ్లిపోయాడు.
దాన్ని తీసుకుంటూ “గుడ్ బై యెగోర్ వ్లాసిచ్,” అన్నది పెలాజియా యాంత్రికంగా.
నిటారుగా నడుస్తూ రోడ్డుమీద నడిచాడతడు. ఆమె పాలిపోయి రాతిబొమ్మ లాగా అతని ప్రతి అడుగును అపేక్షగా చూసింది. కొద్దిసేపటి తర్వాత అతని ఎర్రచొక్కా, నల్లని పంట్లాము, బూట్లు అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఏమీ కనపడలేదు. పచ్చదనం నిండిన చెట్లలోకి యెగోర్ ఎకాయెకిన మలుపు తిరగడంతో టోపీ కూడా అదృశ్యమైంది.
“గుడ్ బై యెగోర్ వ్లాసిచ్” అని గుసగుసగా అనుకొని, అతని తెల్లని టోపీని మరొకసారి చూసేందుకు కాళ్ల మునివేళ్ల మీద నిలబడింది పెలాజియా.
ఎలనాగ, సురేంద్ర నాగరాజు
ఎలనాగ, సురేంద్ర నాగరాజు
ఎలనాగ, సురేంద్ర నాగరాజు
విశ్రాంత ప్రభుత్వ వైద్యులు (Retired government doctor)
+91-9866945424
లావైన చేతిగడియారం లాగా
ప్రేమ నీ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది
నర్సు నీ అరిపాదాల మీద దెబ్బ వేయగానే
నీ బోసికేక పంచభూతాల్లో చేరింది
నీ రాకను పొగడుతూ
మా గొంతుకలు ప్రతిధ్వనిస్తాయి
అదొక కొత్త ప్రతిమ.
గాలితెమ్మెరలు నిండిన మ్యూజియంలో
నీ నగ్నత్వం మా క్షేమం వెన్నంటి నడుస్తుంది
గోడల లాగా చుట్టూ ఖాళీగా నిలబడతాం మేము
గాలివాటుకు స్వీయ ప్రతిబింబం
తుడుచుకుపోయేలా చేసే
మేఘపు అద్దంకన్న గొప్ప తల్లిని కాను నేను
రాత్రంతా పెద్ద పెద్ద గులాబీల మధ్య ఉండే
కీటకపు రెక్కల లాగా
నీ శ్వాస రెపరెపలాడుతుంది
దాన్ని వినేందుకు నేను నిద్రలోంచి లేస్తాను
దూరంలోని సముద్రమొకటి
నా చెవి దగ్గరికి చేరుతుంది
స్థూలకాయంతో నైట్ గౌనులో ఉన్న నేను
నీ ఒక్క కేకకు మంచం మీంచి కింద పడతాను
నీ నోరు నిర్మలమైన పిల్లినోరులాగా తెరుచుకుంటుంది
కిటికీ చట్రం కాంతితో వెలిగి,
మసకబారిన నక్షత్రాలను మింగేస్తుంది
ఇక నువ్వు కొన్ని మాటలను
మాట్లాడేందుకు ప్రయత్నిస్తావు
స్పష్టమైన అచ్చు స్వరాలు
బెలూన్ల లాగా పైకి లేస్తాయి
ఆంగ్లమూలం: సిల్వియా ప్లాత్
There is a pleasure in the pathless woods,
There is a rapture on the lonely shore,
There is society, where none intrudes,
By the deep Sea, and music in its roar:
I love not Man the less, but Nature more.
– Lord Byron
దట్టమైన అడవిలో సంతోషముంది
నిర్జనతీరం మీద తన్మయత్వముంది
అగాధమైన అంబుధి దగ్గరికి ఎవరూ రాకపోయినా
అక్కడ సాంగత్యం తాలూకు శాంతి ఉంది
సముద్రపు హోరులో సంగీతం కూడా ఉంది
మనుషుల పట్ల నాకున్న ప్రేమ స్వల్పమైంది కాదు
కానీ, ప్రకృతిమీద మరింతగా మరులుగొన్నాను నేను
ఛందోబద్ధమైన పద్యాలు (తేటగీతులు) గా…
సాంద్ర విపినములోనుండు సంతసమ్ము
పారవశ్యము గలదొంటి తీరమునను
జనులు లేనట్టి లోతైన జలధి చెంత
సాహచర్యము యొసగెడి శాంతి గలదు
అంతియే కాదు ఆమూలమరసి చూడ
దాని హోరులో నున్నది గానలహరి
నరులపై నాదు ప్రేమలో కొరత లేదు
కాని ప్రకృతిపై నున్నది గాఢరక్తి
(Lord Byron రాసిన Childe Harold’s Pilgrimage అనే కవితలోని ఒక స్టాంజాకు అనువాదం)
ఓ నిష్పక్షపాతమా!
ఎర్రని కాకిలాగా అరుదైనదానివి నువ్వు
ఎవ్వరికీ కనిపించకుండా
దుర్గమారణ్యం మధ్య దాక్కున్న
దుమ్ములగొండి రువ్వే చిత్రమైన నవ్వువు నువ్వు
నిన్ను కౌగిలించుకోవాలని కల గంటాను
కానీ కలవడమే గగనమైనప్పుడు
కల ఎలా తీరుతుంది?!
నీలోని సాధుత్వం నిప్పుల పాలైందా?
ఎంతకూ కనపడని నీ మూలంగా
ఏకాంతం లోకి పోయాను
స్వీయ బహిష్కరణ వైపు అడుగులు వేస్తూ
బాధల పదునైన కోరల్లో చిక్కుకుని
గాయపడుతున్నాను ప్రతిదినం
విశుద్ధ విచక్షణ నీ అనుంగు చెల్లెలు
వెలి వేశారు నీతో పాటు ఆమెనూ!
ముఖం చాటేసిన నీ సోదరికీ కరుణ తక్కువేనా?
బుజ్జగించు ఆమెను, బయటికి రమ్మని.
ఆమెమీది అభిమానాన్ని ఆమెముందే
చాటుకోవాలనుంది నాకు
మీరిద్దరు కలిసి నడయాడితే
ఇక్కడ సజావు నెలకొంటుంది
అస్తవ్యస్తమైన ఈ అవని
ఎదురు చూస్తోంది మీ ఆగమనం కోసం
తొలకరి వాన పడిన మరునాడే
తీవ్రమైన ఆందోళనతో
తిరిగి వచ్చేవాణ్ని మా యింటికి
ఏళ్ల తరబడి అదే జరిగింది
విరగబూసిన ఎర్ర చంపకవృక్షాలు మూడు
మైలు దూరం నుంచే కనిపించేవి
వాటి స్వర్ణవర్ణ రేణువుల పుప్పొడిమేఘం
దారిపొడుగునా దట్టంగా పేరుకుని
అమ్మకు పార్శ్వపు నొప్పినీ
తాత్కాలిక అంధత్వాన్నీ తెప్పించేది
దాని వాసనను ఏ గాలీ వడగట్టలేకపోయింది
నల్లని స్తంభాలతో కట్టిన మా యింటిగోడలకు
చెవులూ కళ్లే కాదు, పెచ్చులూ వాసనలూ
ఎముకల కటుక్కు శబ్దాలూ
రాత్రుళ్లలో వినిపించే గొంతుకలూ ఉండేవి,
అన్నీ ప్రవేశించగలిగే దేహాల్లాగ.
ఏ తలుపూ ఆ పుప్పొడిని ఆపలేకపోయింది
అమ్మ అవస్థ బాల్కనీ లోని
లోహపు తీగ లాంటిది
అది తళతళ మెరుస్తుండేది
దానిమీద మనుమల, మనుమరాళ్ల చెడ్డీలు…
అవి తలనొప్పిని తగ్గించేందుకు
తలమీద పెట్టుకునే తడిబట్టల లాంటివి
అవస్థకు కారణమైనా
ఆ చెట్టును కొట్టనివ్వలేదు అమ్మ!
ఆంగ్ల మూలం: ఎ.కె. రామానుజన్
అనువాదం: ఎలనాగ
***
మాటలు
మాటల గురించి మాట్లాడకపోవడమే మంచిది
అనాథ పిల్లల్లాగా అవి శవాల వెనుక
శ్మశానం వైపు పరుగెత్తుతాయి
చుట్టూ పడిపోయిన చిల్లర నాణేలను ఏరుకుంటాయి
వాటిని ఆపేవాళ్లెవరూ లేరు
చీకటి నిండిన రాత్రిలో
నక్షత్రాల మసక వెలుతురులో
దుమ్ము నిండిన ఊరితోవ మీద
కలల ముక్కల్ని వెతుకుతూ సాగుతాయి అవి
ఎవరు చెప్పగలరు వాటికి, అది నిరర్థకం అని?
వేకువ వేళ కొండకొమ్ము మీద
కొన్ని పచ్చని ఆకులు సూర్యకాంతితో మెరుస్తాయి
అక్కడ చారెడు కాంతిని చేజిక్కించుకునేందుకు
సాహసిస్తాయి
వద్దనేందుకు నేనెవర్ని?
ఇక్కడ నా భార్య
నన్ను వాటికి దూరంగా ఉండమంటోంది
ఆంగ్లమూలం: ప్రదీప్ బిస్వాల్
తెలుగు సేత: ఎలనాగ
***
ఎక్కడున్నావిప్పుడు?
భరత్! నువ్వెక్కడున్నావు?
దినపత్రికల్లో గానీ
వార, మాస పత్రికల్లో గానీ
ఎన్నో రోజులనుండి నువ్వు కనిపించలేదు
రాజధానిలో నల్లజెండాలతో
ప్రదర్శనలు జరిపినవారిలో నువ్వు లేవు
పాత బస్ స్టాండ్ లో ఎవరో
నీ ప్రసక్తిని తీసుకొచ్చారు
నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ ను మార్చినట్టు
నీ ఫోన్ నంబరును మారుస్తుంటావు
అంతేనా భరత్?
ఇప్పుడెక్కడున్నావు నువ్వు?
బొలంగీర్ లోనా, భువనేశ్వర్ లోనా?
కలహండికి వెళ్లావా నువ్వు?
అక్కడ ఒక ముసలి తండ్రి
పొలాల్లో కాయకష్టం చేస్తుంటాడు
ఇప్పుడు పిఛనుదార్ల వెంట
ఎందుకు పడుతున్నావు నువ్వు?
రైతులు ప్రభుత్వోద్యోగులు కారు
మాలో చాలా మంది లాగే
నువ్వు కూడా ఉన్నదాంతో తృప్తిగా ఉండు
భరత్!
రా ఒకసారి
మనం ఎన్నో చర్చించుకోవాల్సి ఉంది
ఆంగ్లమూలం: ప్రదీప్ బిస్వాల్
తెలుగు సేత: ఎలనాగ
***
ప్రదీప్ బిస్వాల్ పరిచయం:

ప్రదీప్ బిస్వాల్ రెండు భాషలలో రచనా నైపుణ్యం ఉన్న ప్రసిద్ధ కవి. సుమారు నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారు. ఒడియా భాషలో ఆరు కవితా సంపుటులను, ఆంగ్లంలో రెండింటిని వెలువరించారు. వీరి రెండు కవితా సంపుటులు హిందీలోకి అనువదింపబడినాయి.కొన్ని కవితలు హిందీ, ఇంగ్లిష్, తమిళం తదితర ప్రధాన భారతీయ భాషలలోకి తర్జుమా చేయబడినాయి. వీరు ఒడిశా రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, నేషనల్ బుక్ ట్రస్ట్ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.సరళమైన భాషలో హృద్యమైన కవిత్వం రాస్తారు.ఈయన పేరెన్నిక గన్న సంపాదకులు, అనువాదకులు. ఇప్పుడు kabitalive(kabitalive.com)అనే వెబ్ మాసపత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.IAS క్యాడర్ కు చెందిన ఈయన ఒడిశా రాష్ట్రప్రభుత్వంలో పని చేసి పదవీ విరమణ పొందిన తర్వాత,ప్రభుత్వం చేత మళ్లీ ఒడిశా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA)మెంబర్ గా నియమితులైనారు. ప్రస్తుతం వీరు భువనేశ్వర్ లో నివసిస్తున్నారు.
***
నీలాకాశం…. చుక్కల కలలు
ఎగిసిపడే సెలయేటి తరగలు
అద్దంలో చందమామ
జోలపాటలతో విరుస్తున్న
మొలకనవ్వుల నిదుర
జీవితం ఎంత సుందరం?
ఎదలో ఏవో తెలియని తుమ్మెదలు
ఆకుపచ్చని పాటల విందులు
స్వప్నాలు… పరిష్వంగాలు
ఒక్కసారి మోగుతున్న కోటి వీణలు
జీవితం ఎంత సుందరం?
వెలుగును చీకటిగా చీకటిని
వెలుగుగా చిత్రించే పెదాలు
అధరాలకు వేలాడే ప్రభాతాలు
నగరీకరించబడే పసిపల్లెలు
జీవితం ఎంత వంచన?
రెండు గాళ్లకు మరొకటి…
వదలివేసిన స్టేయిరిక్ దీపాలు
చుట్టుముడుతున్న అజ్ఞాత బీభత్సం
అశాంతి అవమానాలతో
నిస్సహాయ సహగమనం
జీవితం ఎంత విషాదం?
చివరికి ఏమయింది?….
విప్లవ శంఖం మూగవోయింది.
అక్షర తపస్సు కొట్టుకొనిపోయింది
అధికారపు అహంకారం పెనవేసుకున్న బతుకు
కందెన లేని గీరె అయింది
ఇక జీవితమే ఒక నిట్టూర్పు
- డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు, 9676096614
Life Is a Sigh!
Blue sky, stars dreams Soaring ripples of rill Moon in the mirror Slumber of sprouting smiles being blown by lullabies. How charming is life! Some unknown bumblebees in heart Feasts of verdant songs Dreams, embraces Lakhs of lutes ringing simultaneously. How beautiful is life! Lips depicting light as darkness; darkness drawing the picture of light. Dawns dangling from lips; small villages turning into towns. How deceitful is life! Walking stick joined two legs; steric lights are abandoned. Unknown terror all around! Walking helplessly along with disquiet, disrespect. How tragic is life! What is the end result? The conch of revolution has fallen silent. The penance of syllables got swept away. The life entwined with hauteur of authority became a cartwheel sans grease. Now, life is but a sigh!
Origin (Telugu): Dr. Kanchanapalli Govardhan Raju
Translation: Elenaaga
a
ఇతడు డాంటే కాడు
ఇది డాంటే ఫోటో
ఇది డాంటేగా నటించే నటుడున్న సినిమా
ఇది డాంటే డాంటే పాత్రలో నటించిన సినిమా
ఇతను డాంటేను కల గనే మనిషి
ఇతడు డాంటే కాకున్నా
డాంటే అని పిలువబడే మనిషి
ఇతను డాంటేను అనుకరించే మనిషి
ఇతడు తనను తాను డాంటేగా
చెల్లుబాటు చేసుకునే మనిషి
ఇతడు తాను డాంటే అనే కలను కనే మనిషి
ఇతడు డాంటే నోట్లోంచి ఊడిపడ్డట్టుగా
ఉన్న రూపం గల మనిషి
ఇది డాంటే మైనపు బొమ్మ
ఇది మార్పిడి చేయబడిన శిశువు,
రెండో రూపం, ఒక కవల పాప
ఇతడు తను డాంటే అని విశ్వసించే మనిషి
ఇతడు డాంటే తప్ప
అందరూ డాంటే అని నమ్మే మనిషి
ఇతడు అందరూ డాంటేలే అని నమ్మే మనిషే కాని
ఆ విషయాన్ని తనే మోసపోయి నమ్మడు
ఇతడు డాంటే తప్ప మరెవరూ
డాంటే అని నమ్మని మనిషి
ఇతను డాంటే
ఆంగ్లమూలం: హాన్స్ మాగ్నుస్ ఎన్సిస్టాగా
అనువాదం: ఎలనాగ
తుఫాను గాలికి కొట్టుకుపోతున్న కారు మేఘాలు,
వడిగాలుల్లో సుడులు తిరుగుతున్న మంచుతునకలు…
విను, తోడేళ్ల భీషణమైన ఊళ వినిపిస్తోంది
విను, ఇప్పుడది పిల్లవాడి ఏడ్పులా ఉంది
గుడిసె కప్పు మీద గలగలమనే
ఎండుగడ్డి లోంచి దూసూకుపోతూ
కాంక్రీటు గోడల మీద దడదడ శబ్దం చేస్తూ
అలసిన దేశద్రిమ్మరి తలుపు మీద బాదినట్టు ఆ శబ్దం
వంటగదిలో భయంకరమైన చీకటి,
ఎలమి లేక ఏకాంతంగా మన వెనకడుగు…
ప్రియమైన, మనోజ్ఞమైన అమ్మా!
మాట నుడివి మౌనాన్ని ఛేదించు
తుఫాను రోదన నీ కనురెప్పల్ని
భారంగా మూసేసిందా?
రాట్నపు మృవైన రొద
నీకోసం జోలపాట పాడిందా?
నా యౌవన వసంతపు ప్రియురాలా!
నా ప్రియమైన, అచ్చమైన ఆత్మసహచరీ!
మన దుఃఖం పోయేలా మధువును సేవిద్దాం
మద్యం మనలో మోదాన్ని నింపుతుంది
దవ్వులలోని గువ్వలలాగా స్వేచ్ఛగా
అన్నీ మరచి గానం చెయ్
వేకువన వెలదులు తేటనీటి నదీతీరంలో
ఆలపించే పాటను పాడవా?
తుఫాను గాలికి కొట్టుకుపోతున్న నల్లని మేఘాలు,
వడిగాలుల్లో సుళ్ళు తిరుగుతున్న మంచుతునకలు…
విను, తోడేళ్ల భీకరమైన ఊళ వినిపిస్తోంది
విను, ఇప్పుడది పసివాడి ఏడుపులా ఉంది
నా యౌవన వసంతపు ప్రియురాలా!
నా ప్రియమైన, అచ్చమైన ఆత్మసహచరీ!
మన దుఃఖం పోయేలా మధువును సేవిద్దాం
మద్యం మనలో మోదాన్ని నింపుతుంది
రష్యన్ మూలం: అలెగ్జాండర్ పుష్కిన్
ఆంగ్లం: మార్తా డికిన్సన్ బియాంచి
తెలుగు సేత: ఎలనాగ
***
ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!
నీ భుజంమీద నువ్వు పెట్టుకున్న తుపాకీకి
కళ్లు లేవు, కాళ్లూ లేవు
నా అడుగుల్ని గమనించేందుకు
అది నీ కళ్లను దొంగిలిస్తుంది
నా అడుగుల జాడల కోసం,
నా ఛాతీని ఛిద్రం చేయడం కోసం
నా చావుకేకను నీ వీనులతో వినడం కోసం
అది నీ పాదాలను తస్కరిస్తుంది
ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!
నీ భుజం మీద నువ్వు మోసే ఆ తుపాకీ
అవిటిదా చెవిటిదా గుడ్డిదా?
నీ కళ్లను చెవులను పాదాలను తగిలించుకునేందుకు
అది తన కళ్లను చెవులను పాదాలను రాల్చుకుందా?
నీకేమీ తెలియకపోవచ్చు ఆ తుపాకీ గురించి
కానీ మనం మన అన్నదమ్ములను అంతమొందించేలా
మన దవడలను ఒకరినొకరం దారుణంగా విరగ్గొట్టేలా
తను మాత్రం దొరకకుండా క్షేమంగా ఉండేలా
మనిద్దరి శత్రువు ఒక దూరప్రాంతంలో
పథకాన్ని రచిస్తున్నాడు
తన రక్తం చిందకుండా
మన రక్తం మాత్రం మట్టిలో కలవాలని అతని కోరిక
తన శరీరాన్ని షర్టులాగా ఇంటిదగ్గర వదిలి
తుపాకీ రూపంలో రావాలన్నది అతని పన్నాగం
ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!
కాళ్లుచేతులు లేని మన దుష్టశత్రువు
ఒంటరిగా రాడు, మనకన్న పెద్దసంఖ్యలో
గుంపులుగుంపులుగా వస్తాడు
ప్రతి తుపాకి విచ్చలవిడిగా తిరుగుతూ
ఎడతెగకుండా పేలుతుంటుంది
తన ఎముకలు విరగకుండా, తన చర్మం కాలకుండా
తన రక్తనాళాలు నెత్తురోడకుండా
తుపాకీ అంగాలన్నీ ఇంటిదగ్గర క్షేమంగా ఉంటై
అది మన అవయవాల్ని ఉపయోగిస్తుందిక్కడ
ఒక తుపాకీ నీ పాదాలతో నన్ను వెంటాడుతుంటే
మరొకటి నా కన్నుతో నిన్ను గురి చూస్తుంది
మూడోది నీ భుజం మీద ఉన్నట్టుగానే
ఇంకొకరి భుజం మీద ఉంటుంది
దాని అంగాలన్నిటినీ ఇంటిదగ్గర వదిలేసి
అది కేవలం నోరుతోనే వచ్చిందిక్కడికి
భుజం నీది కానీ నోరు మాత్రం దానిదే
దంతాలు లేని ఆ నోరు తూటాలను
పదాలుగా మార్చి మాట్లాడుతుంది
కానీ ఒక తూటా మనవాడిని చీల్చినప్పుడు
అతడు దంతాలు లేని తుపాకీ నోరును చూడడు,
నీ భుజాన్ని, నీ చేయిని చూస్తాడు
నిన్ను శత్రువుగా భావిస్తాడు, గన్నును కాదు!
నీ నుండి ప్రతీకారాన్ని కోరుతాడు
ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!
నీ భుజం మీది తుపాకీ మన నేలమీద
ఎంత రక్తాన్ని చిందించింది?
అయినా సంజాయిషీ ఇవ్వలేదెందుకు?
ఈ రక్తపాతానికి నువ్వే నిందింపబడుతావు
నీనుండే ప్రతీకారం ఆశింపబడుతుంది
వాళ్లేమో మరో తుపాకీని భుజం మీద పెట్టి
దాని నోట్లోంచి వచ్చే తూటాను నీ గుండెకు గురి చూస్తారు
రాజ్యాధికారం కోసం అర్రులు చాస్తున్నవాడా!
ఏదో ఒకరోజు తూటా నీ గుండెను చీలుస్తుంది
నువ్వు సింహాసనం కంటె శవపేటికకు
ఎక్కువగా దగ్గరవుతున్నావు జాగ్రత్త
నీ శత్రువు నిన్ను సమాధిలోకి విసరకముందే
నువ్వు యోచించి జాగ్రత్త పడు
ఈ విషాదకర విధిరాత నుండి రక్షించుకునేందుకు
నీ చావుకోసం పథకం వేసేవాణ్ని గుర్తించాలి నువ్వు
నేను నీ సోదరుణ్ని. మనిద్దరి శత్రువైన తుపాకి
అవిటిదానిగా, చెవిటిదానిగా,
గుడ్డిదానిగా ఉంది నీ భుజం మీద
అది నా అడుగులను నీ కళ్లతో గమనిస్తోంది
నా గుండెలోంచి దూసుకుపోయేందుకు,
నా చావుకేకల్ని నీ చెవుల్తో వినేందుకు
నన్ను వెంటాడుతోంది నీ పాదాలతో
పష్తో మూలం: దర్వేష్ దురాని
ఆంగ్లం: దావూద్ ఆజమి
తెలుగు సేత: ఎలనాగ
***
