Home కవితలు వేప చెట్టు కింద

వేప చెట్టు కింద

by Sridhar reddy Billa

పేరుకు ఇల్లే గానీ

పగిలిపోయిన పెంకులు పేర్చినట్టు

రెండు గదుల పెంకుటిల్లు.

దాని ముందరొక  వేప చెట్టు!

బుడి బుడి అడుగుల బుడ్డోడిగా,

వేప మండకు వేలాడిన ఉయ్యాలలో

ఊగుతూ  కేరింతలు కొట్టాడు.

వేప చెట్టు కింద!

పదేళ్ల పడుచు పిల్లోడిగా

పక్కింటి  పిల్లోళ్లతో

గుండాలు గీసి, గుంతలు జేసి

గోళీలు గురిచూసికొడుతూ గెంతులేసాడు.

వేప చెట్టు కింద!

ఇరవైయేళ్ళ పరువంలో

ఉదయాన్నే వేపపుల్ల వేసి నములుతూ

పక్కింటి ఆసామి పేపరు పట్టుకొచ్చి

అక్షరాలనన్ని అరిగించుకున్నాడు.

వేప చెట్టు కింద!

ఊరి యువకులను పిలిచి

నడిరేయి దాకా

సమసమాజ మంటూ

సామ్యవాదమంటూ

ఉపన్యాసాలతో ఉర్రూతలూపాడు.

వేప చెట్టు కింద!

ఇపుడు తనకొక ఇల్లాలు

బోసినవ్వుల ఓ బుడ్డోడు.

పనికి పోయి వచ్చి

మధ్యాహ్నమంతా మంచంపైనే  కునుకు.

వేప చెట్టు కింద!

కొడుకు పెండ్లికి

ఊరంతటిని పిలిచాడు

ఉడుకు ఉడుకు భోజనాలు పెట్టించాడు

ఊరంతా ఆరగించారు.

వేపచెట్టు కింద !

ముసలివాడై పోయాడు.

రోజూ భగవన్నామ స్మరణ

మనవడితో కాసేపు

ముసలోళ్లతో కాసేపు కాలక్షేపం.

వేప చెట్టు కింద!

ఓ రోజు పొద్దున

లేపబోతే లేవలేదు

ఊరంతా వచ్చి చేరారు.

చితి పేర్చటం కోసం

చెట్టు మండనొకటి నరకాలన్నారు.

వేప చెట్టు కింద !

దినాలు గడిచాయి .

మరొక మండపై

మనవడు ఉయ్యాలూగుతున్నాడు

మరో జీవితమారంభమైంది

వేప చెట్టు కింద !

You may also like

1 comment

కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి October 29, 2021 - 6:18 am

వేపచెట్టు తరతరాలకు చేసే సేవను చక్కగా చిత్రీకరించారు. శ్రీధర్ రెడ్డి గారికి అభినందనలు.

Reply

Leave a Comment