అష్టభాషా ప్రావీణ్యులు కవి – రచయిత మన దేశ పూర్వ ప్రధాని పి.వి.నరసింహారావుగారి శతజయంతి సందర్భంగా వారిని తలచుకుందాం.
మాతృభాష తెలుగు, రాష్ట్ర భాష హిందీ ప్రపంచ భాష ఇంగ్లీష్ లతోబాటు కన్నడం, మరాఠీ, ఉర్దూ, అరబ్బీ, పార్సీ, సంస్కృతం భాషలలో ప్రావీణ్యం సాధించారు. ఫ్రెంచ్, స్పానిష్ భాషలూ నేర్చారు.
గొప్ప వక్త. 14 భాషల్లో మాట్లడగలరు. మితభాషి అని పేరు వచ్చినా సభను రంజింప చేసేటప్పుడు తమ సహజగుణాన్ని అధిగమిస్తారు. ఇది ఒక కళ! కళాత్మక హృదయులకే సాధ్యమయ్యే అద్భతకళ పి.వి.గారి సొంతం!
1921 జూన్ నెలలో జన్మించారు. జూన్ 28న ఇప్పటికి సరిగ్గా వందేళ్ళు! మనం శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. 2004 డిసెంబర్ 9న పరమపదించారు. మనకు ఎన్నో ఆదర్శాలను నేర్పి వెళ్ళారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ గణనీయమైన మార్పులను తీసుకువచ్చిన మేధావి! అపర చాణుక్యుడని పేరుగాంచిన రాజకీయ దురంధరుడు. బుద్ధికి బృహస్పతి! కులబలం, ధనబలం లేకున్నా పల్లె నుండి ఢిల్లీవరకు ప్రతిభావంతమైన వ్యక్తిగా కీర్తి సంపాదించారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, దేశప్రధానిగా అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ వారి తొలి, తుది పార్టీ! భారతదేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో మంచి మార్పులను తీసుకువచ్చి, ఒకానొక సందర్భంలో దేశం ఆర్థిక వ్యవస్థ దివాళా తీసే స్థాయికి చేరుకున్నప్పుడు గొప్ప సంస్కరణలకు బీజం వేసి పునరుజ్జీవం కల్పించారు.
సహస్రఫణ్ అనే పేరుతో విశ్వనాథసత్యనారాయణగారి వేయి పడగలను హిందీలోకి అనువదించారు. ఈ గ్రంథానికి కేంద్రసాహిత్య అకాడమి బహుమతి వచ్చింది. అబలా జీవితం – అనే పేరుతో పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకాన్ని హరినారాయణ్ ఆప్టే రచనను అనువదించారు. ఇన్ సైడర్ – రచించారు. వీరి ఆత్మకథా రచన . ఇది ‘లోపలి మనిషి’ పెరుతో తెలుగులోకి అనువదించారు. మాగ్నమ్ ఓపస్ Magnam Opus అనదగిన autobiographical novel స్వీయ చరిత్రాత్మక కాల్పనిక కథన పద్ధతిలో ఉన్నట్లు అర్థం అవుతుంది. Strait Forword narrative తో మొదలైన అద్భుత నవల. పీ.వీ.గారు రాజకీయాల్లో రాకుంటే గొప్ప కవి, రచయిత అయ్యేవారు. జ్ఞానపీఠమూ, ఓ నోబుల్ బహుమతి వచ్చి ఉండేవి.
పి.వీ.గారు ప్రఖ్యాత రచయిత్రి జయప్రభగారి కవిత్వాన్ని తెలుగులోంచి ఇంగ్లీషులోకి అనువదించారు.
ఆనాడు పాములపర్తి సదాశివరావుగారితో కలిసి ‘కాకతీయ’ ప్రతికకు సంపాదకత్వం వహించినా వృద్ధాప్యంలో కంప్యూటర్ నేర్చుకుని ఉపయోగించినా పి.వీ.గారి పట్టుదలకు, నిబద్ధతకు నిదర్శనం.
కాళోజీగారు దగ్గరి మిత్రులు. ఈ మిత్రుల ఆత్మీయత సాహితీలోకానికెరుక.
కవివరేణ్యులు వానమామలై వరదాచార్యులకు గండపిండేరం తొడిగిన పీవీ స్వయంగా కవి పండితుడు.
1940 పి.వి.రచించిన గొల్ల రామవ్వ కథ తెలంగాణ జీవన చిత్రాన్ని చిత్రికపట్టి ఆనాటి స్వాతంత్ర్య పోరాటాలకు వెలుగుదివ్వె అయ్యింది.
నీలిరంగు పట్టుచీర, మానావమానాలు వంటి కథలు పి.వీ.గారి ఆదర్శ భావజాలాన్ని పట్టిస్తాయి.
మంగయ్య అదృష్టం, నవలిక వంటిది ద మినిస్టర్ Secret of the ballot, forgotten suitcase the guest, The reshuffle వంటి కథానికలు రచించారు.
దేశభక్తి పివిగారి ఒడనెల్లా ప్రవహించేది కాబట్టే ఓ గొల్లరామప్పలో దేశమాతను దర్శించుకున్నారు. “అవ్వా నీవు సామాన్యురాలవు కావు సాక్షాత్ భారతమాతవే” అనగలిగారు. స్త్రీ పురుషులెవరికైనా శీలం గొప్ప సంపద అని చెప్పిన ‘నీలిరంగు పట్టుచీర’ కథనూ వ్రాయగలిగారు. ఇది మన దేశ సంస్కృతి! ఒక సందర్భం పి.వి.వంటి కవిని రాజకీయవేత్తను చేసుకుని రాజ్యానికి ఇటువంటి వ్యక్తి కావాలి అనుకున్నది. కాలం ఇందుకు తన శక్తిని ధారబోసింది. ఎట్లయితే పి.వి.గారు తమ శక్తి దేశం కోసం ధారబోసారో అట్లే! అవును. మనసుపెట్టి, మంచి మనసుపెట్టి దీక్షగా పి.వి.గారిని పరిశీలిస్తే ఇవన్నీ బోధపడ్తాయి. ఆయన ప్రత్యక్ష ప్రయత్నాలు లేకున్నా కొన్ని విషయాలలో అవినీతి ఆరోపణలు అంటగట్టి, ఎక్కడ మహాశక్తిగా ఇంకా ఎత్తుకెదుగుతాడోనని కుట్రలు పన్ని అంతటి గొప్ప వ్యక్తి నిస్వార్థ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడానికి కారణం ఎవరు అని నిజాయితీగా చర్చించుకోవాలి ఈ సభ్య సమాజం.
భారతీయ ఫిలాసఫీ అంటే, భారతీయ ఫిలాసఫర్స్ అంటే పీవీగారికి ఇష్టం. ప్రపంచంలోనే ఇంత గొప్ప తత్త్వవేత్తలు లేరు. ప్రపంచంలోనే ఇంత గొప్పసంస్కృతి లేదు.
అది 1972 ఆగష్టు 15. స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భం. అర్ధరాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శాసనసభ భవనంలో కవితాత్మక సందేశాన్ని అందించారు పి.వీ.
“నవరసా ర్థ జీవితాల, నవోన్మేష మానసాల
నవ పల్లవ తరుశాఖల రవళించెడు జనాల
నవవిధ భక్తుల, రక్తుల, నవశక్తుల మేళవించి,
నవ నిర్మిత జాతి సంతరించినాడ విప్లవ తపస్వి’ అంటారు.
విప్లవమంటే ఏమిటి? విప్లవమంటే మార్పు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అధినేతగా తాముచేయదలుచుకున్న సంస్కరణలకు రూపశిల్పి తానే అయిన వారు కవిరాజు పి.వి. కాని కొందరు కుటిలులు ఉంటారు గదా!
“భువి దానవగ్రహమై పోవ రోదసిని మధించి
మానవతా వాహనకై పూనుకున్న రాజ్యేందిర
జయదుందుభి విని ఉత్తేజనము పొందునా పౌరుడు!
మోదమలరని చెర అరలో మూల్గిన భావకిశోరికి
విహారయ స్వేచ్ఛాంతరిక్ష వీధిని లభ్యమవునా?’’ ఎంతటి నిశ్చలత?
ఎంతటి నిర్భీతత్వం. తమ ఆలోచనలకు రూపమిస్తే ఎందరు వ్యతిరేకిస్తారో తెలుసు పి.విగారికి. అయినా ఎంతటి ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలు. అందుకే అంటారు –
“విహంగమున లాకసంపు కొలతలేల?
చిన్న అలకు ఒడ్డు దూరమున్నదన్న చింత ఏల?
దీపము పెనుగాలికి బీతిల్లనేల?
జీవితాత్మకు ఎన్నడు బ్రహ్మము చేరుదునన్న సందియ మ్మదేల?”
అంటారు. ఎంత గొప్ప పోలికలు? తమ నిర్ణయాలకు ఎందరి వ్యతిరేకత ఉన్నా ప్రజాశ్రేయస్సు దృష్ట్యా దేనికీ భయపడవద్దనుకున్నారు.
నేనొక చైతన్మోర్మిని
నిస్తుల ప్రగతి శకలమును
ఇది నా సంతత కర్మ
మరే హక్కులు లేవు నాకు
ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగ
వెలుగుటయే నా తపస్సు.
వెలిగించుట నా ప్రతిజ్ఞ”.
ఇంతటి ప్రసంగం గతంలో ఎవరూ చేయలేదు! Creating is the act of turning new and imaginative idias into reality. ప్రపంచమే ఒక సృజన. పి.వి.గారి సృజన ఇది!
కొత్త ఆలోచనలను, ఊహలను ఆచరణలోకి అమలు చేయడం. ప్రధానంగా చెప్పాల్సిందేంటంటే ఒక రాజకీయ వేత్తగా ఇంత గొప్ప కవితను రాసారు పి.వి.గారు. అందుకే అంత గొప్ప ప్రతిజ్ఞను చేసినందుకే, ఆచరించినందుకే ముఖ్యమంత్రి పదవికి ఎంతటి నష్టం వాటిల్లిందో ప్రపంచానికి తెలుసు! అయినా చెదరలేదు, బెదరలేదు. దేశమే పి.వీగారిని ప్రధానిగా ఎంచుకున్నది. సాహిత్యకాశానికి ధృవతార! రాజకీయ జ్ఞానాకాశానికీ ధృవతార!
మా నాన్నగారు పెండ్యాల రాఘవరావు గారు ఆనాటి సాయుధ పోరాట వీరుడు. స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రథమ సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్ట్ నాయకునిగ రెండు MLA , ఒక MP మొత్తం మూడు స్థానాలలో అత్యధిక మెజారిటీ తో గెలిచిన వారు . MP గా ఢిల్లీ లో వరంగల్ ప్రాంతానికి చెందిన తెలంగాణ కేతనాన్ని ఎగురవేసి,ప్రజాసేవ చేసినవారు . పి వీ గారికి గురుతుల్యులు . ఇక మా మామగారు తెలంగాణ కు చెందిన సుప్రసిద్ధ చిత్రకారులు డా౹౹ కొండపల్లి శేషగిరి రావుగారికి కూడా పివి గారు అత్యంత సన్నిహితులు. పివి గారు ప్రత్యేక శ్రద్ధతో పాల్గొన్న పోతన పంచశతి ఉత్సవాలలో పోతన చిత్రాన్ని చిత్రించినందుకు గాను మరియు తెలంగాణ సారస్వత పరిషత్ స్వర్ణోత్సవాలో దేవులపల్లి రామానుజారారావు గారి పోట్రయిట్ చిత్రించినందుకు గానూ పివిగారు శేషగిరిరావు గారిని ఘనంగా సన్మానించారు. ఇవి మహనీయులు పివి గారికి సంబంధించిన మా జ్ఞాపకాల పూబుట్ట లోని కొన్ని పరిమళాలు .
సముద్రమంత గొప్ప వ్యక్తి పి.వి.గారు. అందులో నుండి దోసెడు నీళ్లను హత్తకున్నట్టు ఈ నాలుగు మాటలు. భావితరాలకు స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడించిన స్వచ్ఛమైన భారతీయుడైన పి.విగారు ప్రపంచానికే మార్గదర్శులు. మయూఖ పత్రిక వినమ్రంగా అక్షర నివాళులు అర్పిస్తున్నది.
— మయూఖ సంపాదకురాలు