మాఘమాసం
ముడివేసింది వాళ్ళిద్దరిని
శ్రీకారంచుట్టింది కలల కాపురానికి
మొట్టమొదలే
అవాంతరం జడలు విరబోసుకుని
ఆయన మనసులో ఒక ఆలోచన పురుడుపోసుకుని
ఆమె కలికివలపుల వాకిళ్ళలో
తిష్ట వేసింది అమాస నిశీధం
ఇరువురిమధ్యఏర్పడింది పెను అగాధం
ఆ అగాధం బంగాళాఖాతంగా మారి
ఇరువురి బ్రతుకుల్ని నిండా ముంచింది
ముసలవ్వ సేవలోఆయన ఇక్కడ
ముసలి నాయనకు ఊతకర్రగా ఆమె అక్కడ
ఏ ముద్దుముచ్టటకు ఆశలేదు
ఏ కోరికా తీర్చడానికి చెంత ఆమె లేదు
అంటార్కిటికా ఖండం దీర్ఘరాతిరిలాంటి విరహాలు వాళ్ళు
కలుసుకోలేని రైలుపట్టాల సమాంతర జీవితాలు వాళ్ళు
వృద్ధాశ్రమాల్నిగాని
తాడుతో వ్రేలాడదీసే లంచ్ బాక్సుల్ని గాని
ఫోనులోనుండి మందులను గుర్తుచేసే మోడ్రన్ మమతల్నిగాని
నాలుగు గోడల నడుమ నలిగే శుష్కవేదనల్నిగాని
కాదనుకున్న వాళ్ళు
కన్నవాళ్ళఒంటరి ఆఖరిమజిలీని కాస్తంత హరితమయం చేస్తున్న వాళ్ళు
కళ్ళ ముందుండి మనోధైర్యాన్ని నింపి ముదిమి జీవితాల్ని ఆనందమయంగా మలుస్తున్న వాళ్ళు
ఆయనకు ఒక పాప ఉంది
ఆమెకు ఒక బాబు ఉన్నాడు
ఇది శిశిరగీతంలో వసంత రాగం
దగ్దహృదయం మీది వెన్నెలజలపాతం
ఆ ముసలివాళ్ళు మంచానికే అంకితం
కాలు కదపలేకున్నాగాని వాళ్ళు
స్వర్గంలో తప్పక కలుసుకుంటారు
అపుడైనా వీళ్ళు కూడా కలుసుకుని జీవిస్తారేమో బహుశా జీవితాంతం
అపుడు కదా కధ సుఖాంతం.
రమేశ్ నల్లగొండ
8309452179