ఎండకు వేగీ వానకు తడిసీ చలికి వణికీ
ఎడతెగని శ్రమ గీతాలమై సాగుతుంటాం
పహారా కాస్తున్నప్పుడు కాళ్ళు నేలలో పాతిన స్తంభాలై
గస్తీ తిరుగుతున్నప్పుడు కళ్ళు సెర్చి లైట్లయి
కవాతు చేస్తున్నప్పుడు క్రమశిక్షణే దేహభాషయి
కఠిన శ్రమకోర్చే కార్మికులం
సమాజం లోని కలుపు మొక్కల్ని ఏరి పారేసే కర్షకులం
దొరల్లో దొంగల్ని గుర్తించే మనస్తత్వ వేత్తలం
చల్లని నీడ పట్టునో చలువ యంత్రాల క్రిందనో
సేద తీరే అవకాశమే లేని వాళ్ళం
విధి నిర్వహణలో విలువైన క్షణాలెన్నో కోల్పోయినా
వీసమెత్తు సానుభూతి పొందని ఉద్యోగాల వాళ్ళం
ఉత్సవాల్ని క్యూ లైన్ల లోనూ
పండుగల్ని పదిమందిని అదమాయించడం లోనూ గడిపే వాళ్ళం
వేనవేల చెమట చుక్కల్ని కార్చి
వందల జనసభల్ని విజయవంతం చేసే వాళ్ళం
కోరుకున్నదో ఎన్నుకున్నదో
విధి లేకనో విధి నిర్ణయమో
వృత్తి ధర్మమో బతుకు తెరువో గానీ
లోలోపలి మనసుని కప్పి పెట్టి
కర్తవ్య నిర్వహణ చేసే వాళ్ళం
కఠినత్వాన్ని ఖాకీ యూనిఫామ్ గానూ
ఆత్మ విశ్వాసాన్ని తల టోపీ గానూ ధరించిన వాళ్ళం
సౌందర్య శిల్పాలుగా కాక ఇనుప చువ్వలుగా
శరీరాల్ని మార్చుకున్నవాళ్ళం
ఉషోదయాల ఊసే లేకుండా
సాయం సంధ్యల సాయం పొందకుండా
కాలాన్ని కర్తవ్యానికి కుదువ బెట్టిన వాళ్ళం
నేర చరితుల మధ్య నిరంతరం గడుపుతున్నా బురద అంటకుండా
ఉండాల్సిన పద్మాలం
ప్రమాదంలో మీకోసం పరిగెత్తుకొచ్చే
తక్షణ సహాయకులం
అసహాయులకు అండగా నిలిచే
రక్షణ కవచాలం
భయం తోనో అపార్ధం తోనో
దూరం చేయకండి
మేము మీలాంటి పౌరులం
ఫ్రెండ్లీ మహిళా పోలీసులం