సూర్యచంద్రుల సాక్షిగా
నిత్యం రగులుతున్న భూగోళం
పొంతన కుదరని దాని ఉపరితలం.
అగాథ జల నిధితో
అవగాహనకు అందని సముద్ర గర్భం.
ఉరుములు మెరుపులతో
అగ్నిధారలు కురిపిస్తున్న
యుద్ధ మేఘాలతో
ఆవృతమైన ఆకాశం ఒక వైపు.
ఇవేమీ పట్టనట్టు
గుంపులు గుంపులుగా ఎగురుతున్న
శాంతి కపోతాలు మరో వైపు.
అయితేనేం..
సాగిపోవాల్సిందే జీవితం!
ఎప్పటికీ ఏదో ఓ సందోహం
ఓ రెండు దేశాల నడుమ.
కారణం కానరాకున్నా
విరమణ ఎరుగని మారణకాండ.
నాడే కాదు నేడూ
ప్రపంచ శాంతికి మనుగడ లేదు.
అయితేనేం..
ఆగిపోవాలా జీవితం?
నాటుకున్నది మొలకెత్తక మానదు
రాజుకుంటే విస్ఫోటనం తప్పదు.
వీచే గాలిలా ప్రవహించే నీటిలా
జనన మరణాలూ సహజం!
ప్రకృతి పొట్టలో జరిగే పరిణామాలు
పరిపాటే కదా సంభవించడం.
ఉత్పత్తులతో పాటు
విపత్తులూ సహజం.
ఒకప్పుడు వెలసిన కంచెలన్నీ
కాలక్రమేణా తొలగడం సహజం.
చిరునామా లేకుండా
మసకబారి పోవడమూ సహజం.
అయితేనేం..
సాగిపోవాల్సిందే కదా జీవితం!
నిప్పుకు కాల్చే గుణం
నీటికి ఆర్పే గుణం
రెండూ తలపడితే తప్పదు
గెలుపోటములకు దాగుడుమూతలు.
గాజుకు పగిలే గుణం
రాయికి తగిలే గుణం
దేని హద్దుల్లో అది ఉన్నంతకాలం
లోక కళ్యాణానికి ఉపయోగకరం.
కండబలం, బుద్ధిబలం
వేటికవే గెలుపు గుర్రాలు.
విడివిడిగానో, కలివిడిగానో
సమయోచిత ఉపయోగం నిర్మాణాత్మకం.
చలనమే జీవితం!
చల్నేకా కామ్ గాడీకా
చలానేకా కామ్ ఆద్మీకా!
కిసీభీ హాల్మే గాడీ చల్నా హై తో
చలానేకా ఆద్మీ రహ్నా
జరూరీ హై హమేషా!
– ఆచార్య కడారు వీరారెడ్డి; 9392447007