సుమిత్ర కాశీరాజ్యపు రాకుమారి. పుత్ర కామేష్టియాగం చేసిన తరువాత యజ్ఞఫలం మూలంగా ఈమెకు లక్ష్మణుడు, శతృఘ్నుడు జన్మించారు. ఈమె పుత్రుడైనందున లక్ష్మణున్ని సౌమిత్రి అంటారు.
సుమిత్ర అనగా మంచి మైత్రి కలిగినది. అనగా మంచి స్నేహభావం కలిగినది అని అర్థం. రామాయణంలో సుమిత్ర ప్రస్తావన చాలా కొంచెంగా వస్తుంది. ఆమె పాత్రలో చాలా ఉదాత్తత, వివేకం కన్పిస్తాయి. వనవానికి వెళ్ళేముందు సీతారామలక్ష్మణులు ఆమె వద్దకు సెలవు తీసుకోవడానికి వెళ్ళారు. అప్పుడామె దుఃఖిస్తూనే లక్ష్మణునితో,
“రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం,
అయోధ్యయ మటవీం విద్ధిగచ్ఛతాత్ యధాసుఖం”
అంటూ, “నాయినా! ఇకపై రాముడే నీకు తండ్రి. నీ వదిన సీతే నీకు తల్లి. నీకు అడవే అయోధ్య. అరణ్యాలలో ఏమరుపాటు లేకుండా రాముణ్ణి కాపాడుకో. క్షేమంగా వెళ్ళి రా తండ్రి” అంటూ లక్ష్మణుని శిరస్సును ముద్దాడింది. “ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. దానాలు చేయటం, యజ్ఞాలు చేయటం, యుద్ధంలో వీరోచిరంగా పోరాడటం , ఈ వంశంలో పూర్వం నుండి వస్తున్న ధర్మ పద్ధతే! అన్నగారిని అనుసరించి నడవటం అనుజునిగా నీ ధర్మం” నీతి బోధ చేసింది.
పుత్రవియోగంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కౌసల్యను సుమిత్ర ధర్మయుక్తమైన మాటలతో,
మాటలతో ,
“పునుః ప్రవిష్టం ధృష్ట్వాతమ భిషిక్తం మహాశ్రియం,
సముత్ర్యక్షసి నేత్రాభ్యాం క్షిప్రమానం ధ్వజం పయః”
అంటూ, “అక్కా! రాముని కంటే సన్మార్గాన నడిచే గొప్పవాడు లేడు. పదునాలుగు ఏళ్ళ వనవాసం పదునాలుగు రోజుల్లాగా గడిచిపోతాయి. నీ కుమారుడు త్వరలో వచ్చి నీ పాదాలకు నమస్కరిస్తాడు. అది చూచి నీవు ఆనందంతో పొంగిపోతావు” అని ధైర్యం చెప్పింది.
సుమిత్ర గొప్ప వీరమాత. ఇద్దరు బిడ్డలని కన్నప్పటికి ఒక కొడుకుని రామునికి, ఇంకొక కొడుకుని భరతునికి అప్పగించింది. సుమిత్ర తన బిడ్డలు, సవతి బిడ్డలు అనే భేదభావం లేనిది. రామునియందు అమితమైన ప్రేమ కలది. లోకంలో ఎవ్వరైనా తమ సవతి బిడ్డల కోసం తమ బిడ్డలను త్యాగం చేయలేరు. సుమిత్ర అంతటి త్యాగశీలి. గుణవతి. ఈమె చరిత్ర రామాయణంలో ఆచంద్రతారార్కం నిలిచి ఉంటుంది.