Home కవితలు స్వాతంత్ర్యం నా జన్మహక్కు!

స్వాతంత్ర్యం నా జన్మహక్కు!

స్వాతంత్ర్యం నా జన్మహక్కని చాటిన

లక్షగళాల ఘన విజయ సేనానులకిది
అమృతోత్సవాల పుష్పాంజలులను ఘటిస్తున్నాను
నూటముప్పది కోట్ల భరతజాతికిది అనిర్వచనీయ
అస్తిత్వ హేల!
ఒక కుంభమేళ పర్వణియై దేశభక్తి
ఊపిర్లనందిస్తూ
జాతిని ఏకతతో పరమ పావనం చేయాలిప్పుడు!
నాలుగు వందల సంవత్సరాల పర పీడ
చెరను వీడిన భరత భూమి ఎందరెందరో
అమరవీరుల మహోద్యమ త్యాగాలతో విజృభించి,
సర్వస్వతంత్రమై భవ్యతను సాధించింది.
మతాలన్ని ఒక్కటే అని చాటేలా
పింగళి వెంకయ్య రూపుదిద్దిన సమత్వ కేతనం
మువ్వన్నెల జెండా, భువిలో అజేయమై,
బుద్ధిజీవులకు ఉత్తేజమై,
శ్రమైక జీవన సౌందర్యమై
రెపరెపలాడుతున్నది.
కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా
సమైక్యమై,
ఒక్క గొంతుకై,
చక్కని మాతృభూమి తేజమై
సుమపారిజాతాలను వెదజల్లి,
అగ్నిపూల వెలుగులు పంచి,
తెల్లదొరల కర్కశ పద ఘట్టనలకు వ్యతిరిక్తంగా
అనంత అగ్నిపర్వతాల
లావా దావానలమైనట్లు,
శాంతి సమరమోవైపు,
సమర వీరత్వ మోవైపు
చెలరేగిన ఉద్యమాన్ని
మండించిన నాటి అమరవీరుల సమరం అజేయం.
జలియన్ వాలబాగ్ ఒక మరవలేని దమనకాండ!
వేలాది స్వాతంత్ర్య పదయుగళాల
భరతపుత్రుల రక్తం ఏరులై ప్రవహించింది.
బీరిపోక,
వీగిపోక
ఒక పురికి మరొకటి గట్టి బంధమయ్యింది.
అండమాన్ లోని మాండేలా జైల్ జాతీయ చిహ్నమై
చుక్కల్లో చంద్రుని లాగా నిలిచిపోయింది,
వందేమాతరం నినాదం తో పెనవేసుకొన్న శ్వాసలు విడిచిన
విప్లవకారుల చరితలు అమోఘం,
వెనుదిరుగని విప్లవ సింహాల తలకాయలెన్నో!
నేటికీ అది అద్వితీయ చరిత!
నేలకొరిగిన భగత్ సింగ్ నిజమైన వారసులం మనం,
ఆజాద్ హిందూ ఫౌజ్ నేత సుభాష్ చంద్రబోస్,
మన్యం దొరలు అల్లూరి,
కొమురం భీం వీరపుత్రులం మనం,
హిమశృంగాలు కీర్తిలతలతో మలయ మారుతాల
స్వేచ్చా ఊపిర్లను అందిస్తూ,
ఈ అమృతోత్సవాల స్ఫూర్తి పొంగాలి,
విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం జరగాలి,
ఆదర్శ వసుధైక కుటుంబం కోసం
ఈ అమృతోత్సవం విజయోత్సమై నిలవాలి!
మహత్ముని అడుగుజాడల్లో దేశమంతా,
ఒకే మాటపై
ఒకే తాటిపై
అహింసా సత్యాగ్రహవ్రతంతో ధర్మాగ్రహాన్ని చిందించింది,
దండి ఉప్పు సత్యాగ్రహంతో స్వాతంత్ర్య పథం
జనసమ్మోహనమై,
ఫలవంతమై,
తెల్లదొరలను గడగడలాడించింది!
తొలి స్వాతంత్ర్య సంగ్రామం లో వీరనారి ఝాన్సీ లక్ష్మిభాయి,
మంగల్ పాండే,నానా సాహెబ్, బహదుర్స్ జాఫర్,
తాంతియాతోఫే లెంతమందో
అశువులు వదిలి భరతమాత స్వేచ్ఛకు,
రక్తాభిషేకం చేశారు.
మహత్ముడి హృదయకుంజ్ సబర్మతీ ఆశ్రమం పవిత్రాశయాలతో
భారత రాజ్యాంగం భారతరత్న అంభేత్కర శోభితమై ప్రభవించింది!
నైజాం సంస్థానాన్ని పోలీస్ చర్యతో పాలీష్ చేసిన పెద్దాయన,
సర్దార్ వల్లభాయి పటేల్ ఆరువందల సంస్థానాల్ని ఏకబిగిన
విలీనం చేసి
చెక్కు చెదరని ఉక్కు మనిషిగా
చరితలో నిలిచిపోయాడు,
నర్మదాతీరంలో సమైక్యతా విగ్రహరూపుడై
ఈ పవిత్ర అమృతోత్సవానికి వన్నెలద్దుతున్నాడు,
రాజులు పోయారు,
రాజరికాలు పోయాయి,
రాజాభరణాలు రద్దయ్యాయి,
నెహ్రుయామాత్యుని ప్రజాస్వామ్య నేతృత్వంలో
ప్రణాళికల భారతావని అభివృద్ధికి బీజాలు పడ్దాయి.
సరోజినీ నాయుడి స్వేచ్చా సమర గీతాల
కోయిల గానంతో
మూసీ తీరం మన హైదరాబాద్ నగరం
తరించి పులకరించింది,
మహర్షి రవీంద్రుడి జాతీయగీతంతో
జాతి యావత్తూ సమైక్యమై పోయింది,
ఒక రామానంద తీర్థ,
ఒక పివీ,
సంగ్రామ వజ్రాలను కన్నది ఈ నేల,
ఒక దాశరథి కోటి రతనాల తెలంగాణా అని నినదించె,
ఎందరెందరో సమర యోధుల తిలకంతో
భారతమాత అమృత భారతియై,
వెలుగొందే సమయంలో
ఈ ఉత్సవాలు స్ఫూర్తి నివ్వాలి,
నలుదిశల్లో ఎనలేని కీర్తిశిఖరాలను తాకాలి,
ఒకఅనభేరి, రావి నారాయణ రెడ్ది,
బద్దం ఎల్లారెడ్ది, ముగ్దుం మోహినుద్దీన్,
ఒక బోయినపల్లి,
ఒక చెన్నమనేని రాజేశ్వర్ రావు,
మధు గుండయ్య, గుమ్మి పుల్లయ్య, జగన్మోహన సింగ్ లు
విముక్తి స్వాతంత్రోద్యమంలో మండే దివిటీలయ్యారు,
భారత అమృతోత్సవ స్ఫూర్తి దేశానికి విజయ కీర్తులందించాలి,
జైహింద్, జై భారత్!!!

You may also like

Leave a Comment