Home కవితలు హృదయాంజలి

హృదయాంజలి

by Jyostna Prabha

ఆ కలం జన గణాలకు జయకేతనమైంది
అతడు అడుగుపెట్టిన చోటు శాంతినికేతనమైంది
విశ్వాన్ని వెలిగించిన రవీంద్రుడు
కవిత్వాన్ని శ్వాసించిన
విశ్వకవీంద్రుడు .
అతడి కోసం నీలి మేఘాలు తేలి వచ్చాయి
వర్షంగా కురవడానికో
తూఫాన్ గా భయపెట్టడానికో కాదు
అతని జీవన సంధ్యా రేఖను వర్ణమయం చేయడానికి..
నిద్రించి కలగన్నాడు
జీవితమంటే సంతోషమేనని
మేలుకొని తెలుసుకున్నాడు
జీవితమంటే ” సేవేనని”..
ఎక్కడ మనసుకు భయం ఉండదో
ఎక్కడ శిరస్సు సమున్నతంగా నిలబెడతామో
ఎక్కడ జ్ఞానానికి స్వేచ్ఛ ఉందో
అక్కడ స్వాతంత్ర్యం పరిమళిస్తుందన్నాడు
కడలి అలలను చూస్తూ కలవరపడక
.కడదాకా ఈది
ఆవలి గట్టును చేరుకోవాలన్నాడు
చిగురాకులపై నర్తించే మం చు బిందువుగా
కాలమనే అంచులపై కదలి సాగమన్నాడు
అతడు ఆత్మవిశ్వాసాన్ని అనుశాసించాడు
అతడు ఆధ్యాత్మికతను ఆస్వాదించాడు
అందరి మనసులో అమరుడైనాడు
హృదయాన్ని గీతాంజలిగా అక్షరీకరించాడు
అందరి హృదయాంజలి అందుకొన్నాడు.

You may also like

Leave a Comment