అంగూరుతోటలో
అంగూరు నేలమీద అంగూరు తీగలు తీగలు
అందాల అంగూరుగుత్తుల ఆకాశం
ఆ ఆకాశం కింద అంతా అంగూరు తియ్యని గాలే
అన్ని పండ్లు కండ్లైచూచే అద్భుతఅంగూరులోకం
అది అంగూరురైతు కలలుగన్న స్వప్నదేశం
పండ్లవ్యాపారం బండీలెక్కి
అంగూరు గుత్తులు ఆసిఫాబాద్ అంగట్లోకి చేరాక
అగ్గువగా, అంగూరంగూరని తియతియ్యగా పిలుస్తాయ్
తోపుడు బండ్ల పై లేతఆకుపచ్చగా,పసిడిపచ్చగా అమాయక పసిపాపల కండ్ల అంగూరుగుత్తులు
మార్కెట్టులో ఆపిల్స్ ధర ఆకాశాన్నంటినా
తమ రేటు
అరకిలో యాభైయే అని అంగూర్లంటవి
గిరిజన గ్రామాలకు,లంబాడి తండాలకు,గుట్ట మీది పల్లెలకు, గ్రామగ్రామానికి, ఆసిఫాబాద్ పట్టణం ప్రతీవాడకు
యాబై కరెన్సీ నోటుకు ముస్తాబై ఉషారుగా బయలుదేరుతవి
ఆస్తులున్నవారని,పస్తులున్నవారనిభేదంలేకుండా
కడుపులోకింత అంగూరు మధుర రసం భేషరతుగా దుంకుతది
అంగూరపండ్లవానికి
ఉసురు మన్న రోజులు కొన్ని అతనిగుండెలను గాయంచేస్తాయ్
ఊహకందని రోజులు కొన్ని ఆ గుండెలకే మలాం రాస్తాయ్
కలవారి కలల ముందు
శపించిన జీవితం వేస్తున్న ప్రశ్నలముందు
నీరసించి నీల్గుతూతోపుడు బండిని ఈడ్చుకెళ్లిన రోజులుకొన్ని
అతని జీవితానికి పాఠమవుతాయి
ద్రాక్షా గుత్తుల్లో కొన్నిపండ్లు కుళ్లి పోయి పండ్లమ్మేవాడిగుండెను బరువెక్కించినా
ఆధునిక సంఘం ముందు అవంతగా కుళ్ళినవేం కావు బహుశా
ఉస్సురుమంటున్న చీకట్లు తొలగి గిరాకీ సూర్యుడుదయించినపుడు అతడు ఆనందుడవుతాడు
మమకారంగామాట్లాడి అరకిలోపండ్లకి ముత్యమంత ప్రేమను,చిరునవ్వునూ మొగ్గుగా ఇస్తాడు పండ్లవాడు
మరలా రావాలంటది
అతడికండ్లనిండా తొంగిచూసే గిరాకీఆశ
గంపెడు బరువు గల నాలుగుటైర్లతోపుడు బండి
పండ్లవానికి ఎంతఅమ్ముడు పోతే అతనిగుండె అంత అల్కగవుతది కదా
పండ్లను బాగమ్మినరోజు అతడి కండ్లల్లో నియాను వెలుగులు నిండుతాయ్
పండ్లఅమ్మకాలరాబడి ఆగిఆగి పడే వానలు
ఐనా గానీ,రాతిరివేళ ఇల్లు మురుస్తుంది
ఒక కుటుంబం పచ్చవడ్తది
తాజాదనం,సరసమైనధరలనీ ధనవంతులసూపర్ మార్కెట్లు కాకుండా
తోపుడు బండ్ల పై అంగూరుగుత్తుల
బేల చూపుల్ని చూడండి
వేల చూపుల్ని చూడండి
ఆ చూపుల్లో దాగున్న రోజువారి జీవితాల పిలుపులు వినబడతాయ్
అంగూర్ అంగూర్
అరకిలో యాభై అరకిలో యాభై….
మనం బజారుకెల్దాం పదండి, అరకిలోఅంగూర్లకోసం.