Home వ్యాసాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం – సినీ గీత విశ్లేషణ.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం – సినీ గీత విశ్లేషణ.

by Padmasri Chennojwala

‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ’ అనే పాట భావం ఎంత గొప్ప గా ఉందో చూద్దాం:-
1969 వ సంవత్సరంలో మహానటి సావిత్రి గారి దర్శకత్వంలో విడుదలైన ‘మాతృదేవత ‘అనే చిత్రంలో ని పాట ఇది.
సి .నారాయణ రెడ్డి గారు రచించి కె.వి.మహదేవన్ గారు స్వరపరిచి, పి. సుశీల , వి. వసంత గార్లు గానం చేసిన పాట. ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ ‘ అనే ఈ సినీ గీతం స్త్రీ ను మనిషి జీవితంలో పరిణామక్రమంలోని భిన్న దశలను ఆవిష్కరింపజేస్తుంది.

‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ ‘

జాతికి ప్రాణం పోసింది అనకుండా జాతి మనుగడకే ప్రాణం పోసింది అనడంలోనే నిత్యజీవితంలోనూ, జీవన గమనంలోని వివిధ అధ్యాయాల్లోనూ ఆమె పోషిస్తున్న పాత్ర ఎంత శక్తివంతమైందో , తన వారి ఆనందం కోసం అవసరమైతే ఎటువంటి త్యాగానికైనా వెనుకాడని అనురాగమూర్తి అని చెబుతున్నారు .

‘ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక రామయ్యకే కన్న తల్లి సకలావనికే కల్పవల్లి ‘

చెల్లిగా , ప్రేయసిగా , తల్లిగా జీవితంలోని వివిధ మలుపుల్లో బాధ్యతనెరిగిన ఆమె తీరును చక్కగా ఉటంకిస్తూ , సమయానికి అందరికీ అన్నీ సమకూర్చే ఆమె భువిపై వెలసిన కల్పవృక్షం వంటిదని అంటున్నారు . ఈ చరణంలో జీవితంలోని వివిధ బంధాల పట్ల ఆమె వ్యవహార శైలిని చక్కగా వర్ణించారు . ‘

‘సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది ‘

సహనంలో ఆమె భూమాత పుత్రిక అయిన సీతమ్మ వంటిది అంటున్నారు . అయితే అయి ఉండవచ్చు . సహనం ఉన్నతమైన లక్షణమే . దాన్ని ఎవ్వరూ కాదన లేరు . కానీ ఎదుటి వ్యక్తి దాన్ని అలుసుగా తీసుకుంటే మాత్రం సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందనీ , అది ఒక్కసారి హద్దు దాటితే గనుక ఎదురయ్యే పరిస్థితులను తక్కువగా అంచనా వేయకూడదనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది . ఇక్కడ మనం ఇంకాస్త లోతైన విశ్లేషణలోనికి వెళితే ఏ తిరుగుబాటైనా అణచివేత నుండే పుడుతుందనీ, ఏ తిరుగుబాటుకైనా పురిటిగడ్డ అణచివేతేననీ ఎన్నో పురాణాలు , చారిత్రక ఆధారాల ద్వారా ఇది నిరూపితమైందనే విషయాన్ని మనం మరువకూడదు.

‘రాధగా మధుర బాధగా ప్రణయ గాధల మీటినది ‘

యమునా తీరాన కృష్ణుని రాకకై ఎదురుచూసే రాధమ్మ గుండెలోని తీయని వేదనను వ్యక్తపరచడంలో అంటే మధుర భక్తిని , శృంగార రసాన్ని పలికించే స్వాధీనపతిక (జయదేవ కవి తన గీతగోవిందం కావ్యం లో రాధమ్మను స్వాధీన పతికగా అభివర్ణించారు ) కూడా ఈమెలో దాగుంటుందని చెబుతున్నారు .

‘మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది’

కలం అనే దారంతో అక్షర కుసుమాలను హారంగా అల్లగలిగే కుసుమ కోమలి అనీ, శరత్కాల పున్నమి వెలుగులు ఆ కవనవనంపై తేనెజల్లుగా కురిపించగల ప్రజ్ఞాశాలి అని అంటున్నారు .

‘లక్ష్మిగా ఝాన్సిలక్ష్మిగా సమర రంగాన దూకినది ‘

స్నేహాన్నీ, అనురాగాన్ని పంచితే ఎంత సుతిమెత్తగా మసులుకుంటుందో, పరిస్థితులు వేడెక్కితే అపరదుర్గలా తిరగబడుతుందనీ , ఈమెలో భిన్న పార్శ్వాలు దాగుంటాయనీ, పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఏది అవసరమైతే అది ఆమెలోంచి బయటకు వెలువడుతుందనీ, ఎదుటి వ్యక్తి జాగరూకుడై మెలగాలని హెచ్చరిస్తున్నారు. ఈ చరణం లో రచయిత స్త్రీలోని భావోద్వేగాలను గూర్చి , ఆమెలోని మానసిక సంఘర్షణను , ప్రజ్ఞాపాటవాలను అందంగా విశదీకరించారు .

“తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరయును ముత్యాలసరులు”

ఆమె పెదవిపై మెరిసిన చిరునవ్వును ముత్యాల సరులతో పోల్చుతున్నారు . ఇక్కడ మనం ఇంకాస్త ముందుకెళ్లి ఉత్ప్రేక్షను అన్వయిస్తే గనుక ఆమె నోటిని నగల పెట్టగా , ఆమె రెండు పెదవులను ఆ పెట్టయొక్క రెండు భాగాలుగా , ఆ పెట్టెను తెరవగానే మెరిసే ముత్యాల హారాలు అంటే ఇక్కడ ముత్యాల దండలాంటి ఆమె పలువరస ఏం తెలుపుతుంది అంటే, ఆమె గుండె లోతుల్లోంచి పెల్లుబికే భావాలు ఆమె ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతోంది ,అవి నవ్వులుగా విరబూయిస్తుంది అనే విషయాన్ని తెలుపుతున్నాయి .ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె మనసుకు కష్టం కలిగించకూడదని హితాన్ని బోధిస్తున్నారు . “

“కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవురా సిరులు “

స్త్రీ హృదయంలో తుఫానులు, సునామీలు సృష్టిస్తే ఆమె కన్నీరు కార్చే చోట సిరి క్షణం కూడా నిలబడదని హెచ్చరిస్తున్నారు. సిరి తొలగిన చోటు ఎంత దుర్భరంగా ఉంటుందో , ఎంత వేదన తాండవిస్తుందో అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే ఏం లాభం? ఆమె కన్నీటిని తేలికగా తీసుకోకూడదని , ఆ కళ్ళలోంచి రాలిన ఒక్కొక్క కన్నీటి చుక్క సప్త సముద్రాలై ఉప్పొంగి వాటికి కారణమైన వారిని ముంచేస్తుందని హెచ్చరిస్తున్నారు .

“కన్న కడుపున చిచ్చు రగిలెనా కరువుల పాలవును దేశం “
కరువు అంటే ఏమిటి? వర్షాలు కురవక పంటలు పండక, తాగునీటి కీ, సాగునీటి కీ తట్టుకోలేని ఇబ్బందులు ఎదుర్కోవటం. సరిగ్గా ఈ భావాలను మనుషుల నిత్య జీవితానికి అన్వయించుకుని పాటలోని ఈ భావాన్ని విశ్లేషించుకోవాలి. ఇక్కడ,
కరువు అంటే అమ్మాయి ల ను అంటే ఆడపిల్ల లను కనవద్దని బెదిరిస్తాడు ఆంక్షలు పెడతారు. దొంగచాటుగా పరీక్ష లు చేయించి భ్రూణ హత్యలకు పాల్పడతారు. ‘ఆమె ల‘ హృదయం లలో అగ్ని పర్వతాలు బ్రద్దలయ్యి అసలు పిల్లలను కనడానికే నిరాకరించారంటే ఇక జనాభా ఉండదు. కొన్ని దశాబ్దాల తర్వాత ఎండిన బీడులా, పచ్చదనం మొలకెత్తని ఎడారి లా ఈ భూమి మనుషులు లేక మొత్తం కరువుల పాలవుతుంది అని హెచ్చరించారు . అంతే కాదు ,
ఇక్కడ స్త్రీ ని దేవతగా , ఆమె కడుపును
గర్భగుడిగా భావిస్తే , గర్భగుడిలో దీపం వెలిగిస్తే అందులో కొలువై ఉన్న దేవతామూర్తి రక్షణ కవచమై మనల్ని కాపాడుతుంది . అదే చిచ్చు పెడితే కార్చిచ్చై దహించి వేస్తుంది . అంటే కడుపు రగిలిన స్త్రీ శాపం పెడితే ఎంత శక్తిమంతంగా ఉంటుందో , ఆమెలో రగిలిన ఆ చిచ్చుకు కారణమైన జీవితాలను అది ఎంతగా తుత్తునియలు చేయగలదో , అత్యంత బరువైన బాధను చాలా చక్కని పదాలతో చెప్పగలిగిన రచయిత రచనాకౌశలానికి వేనవేల వందనాలు .

“తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం ” కనిపెంచిన తల్లిని (తల్లిదండ్రులను ) దైవ సమానులుగా పూజించాలని, వృద్ధాప్యంలో వారిని నిర్దాక్షిణ్యంగా వదిలి వేయకూడదనీ, వారికి ఊతమై కంటికి రెప్పలా కాపాడాలని హితాన్ని బోధిస్తున్నారు. ఈ చరణంలో రచయిత స్త్రీ తో మెలగాల్సిన తీరును సూచించారు. ఆ స్త్రీ తల్లి అయినా , సోదరైనా భార్య అయినా ఇంకెవరైనా అది బంధమైనా లేక స్నేహమైనా ఆమె మానవ కళ్యాణానికి జీవగర్ర అని తెలుసుకోవాలి.

మూడు చరణాలుగా సాగిన ఈ గీతంలోని మొదటి చరణంలో ఆమె వ్యవహార శైలిని , రెండవ చరణంలో ఆమెలోని భావోద్వేగాలను , మూడవ చరణంలో ఆమె పట్ల ఇతరులు మెలగాల్సిన తీరును రచయిత చక్కగా వర్ణించారు .

ఈ గీతం ప్రబోధాత్మకమైనదా లేక సందేశాత్మకమైనదా అనే ప్రశ్న నాలో తలెత్తినప్పుడు రెండింటి కలయిక అనే నిశ్చయానికి రాగలిగాను . ఇంత చక్కని గీతాన్ని రచించిన రచయిత గారికి , సంగీతాన్ని సమకూర్చిన స్వరకర్తల వారికి , తమ గాత్ర సౌందర్యంతో శ్రోతలను గాన సుధా స్రవంతిలో ఓలలాడించిన గాయనీమణులకు అందరికీ అభివందనాలు . స్త్రీ ఉనికిని అన్ని కోణాలలో ఆవిష్కరింపజేసిన ఈ గీతాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫురించుకోవడం ఆ గీతానికి మనం అందించే చక్కని గౌరవం.

                   పద్మశ్రీ చెన్నోజ్వల

You may also like

1 comment

Ravindar March 15, 2023 - 9:08 am

Chala Baagundi

Reply

Leave a Comment