Padmasri Chennojwala
భరతమాత దాస్యశృంఖలాలను త్రెంచడానికి తమ జీవితాలను ఫణంగా పెట్టిన ఎంతోమంది వీరులు, యోధుల చరిత్రలు మనకు తెలిసినవే. అది ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామమే కావచ్చు , సిపాయిల తిరుగుబాటే కావచ్చు , మరింకేదైనా అయి ఉండవచ్చు. కానీ అంతిమంగా వారందరి లక్ష్యం ఒక్కటే. స్వాతంత్ర్య సముపార్జన. ఎన్నో త్యాగాల ఫలితంగా వారు మన కందించిన స్వేచ్ఛా వాయువులకు సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారీ మనం అభిమానం చాటుకుంటూనే ఉన్నాం. అంజలి ఘటిస్తూనే ఉన్నాం. మరి లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ చరిత్ర కెక్కని శతఘ్నుల మాటేమిటి? వీరి త్యాగాలు తెర మరుగు కావాల్సిందేనా? వీరు చిందించిన రక్తం ఈ మట్టిలో ఇంకిపోవాల్సిందేనా? అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ వీరవనితల త్యాగాలను మన వంతు బాధ్యతగా మరికొంత మందికి తెలియజేద్దాం.
వీరమంగై కుయిలీ :

పరాయి పాలనను అంతమొందించడానికి తన్నుతాను ఆహుతి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి ఆత్మార్పణ యోధురాలు. శివగంగై (తమిళనాడు) రాజ్యపు వీరమంగై కుయిలీ.
పెరియముతాన్ – రాకు దంపతులకు జన్మించిన 17వ శతాబ్దపు దళిత యువతి. పంట పొలాలను నాశనం చేస్తున్న ఒక అడవి ఎద్దును ఎదుర్కొనే ప్రయత్నంలో హతమైన సాహస వంతురాలి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఈ కుయిలీ. భార్య మరణంతో కలత చెంది, కూతురిని తీసుకుని తానున్న చోటు నుండి శివగంగై రాజ్యానికి వెళ్ళిపోతాడు ఈమె తండ్రి. తండ్రి ద్వారా తన తల్లి యొక్క వీరోచిత గాథల్ని తెలుసుకొని, స్ఫూర్తి పొంది తల్లిని మించిన తనయగా రూపుదాలుస్తుంది. తండ్రి మార్గదర్శకత్వంలో యుద్ధ విద్యలన్నిటిలోనూ అంతులేని నైపుణ్యాన్ని సంపాదిస్తుంది.
1780 లో జరిగిన మొట్టమొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వలసదారులపై తిరగబడిన మొట్టమొదటి భారతీయ పాలకురాలు రాణి వేలునాచియార్. బ్రిటిష్ వారితో సలిపిన పోరులో తన భర్త అమరుడవడంతో, అజ్ఞాతంలోకి వెళ్లిన రాణీగారి సైన్యంలో గూఢచారిగా ఇతను (కుయిలీ తండ్రి) నియమింపబడుతాడు. అతనిలోని అంకితభావం, నిబద్దతల కారణంగా రాణీగారికి అత్యంత విశ్వాసపాత్రుడిగా మారుతాడు. అతని ద్వారా అతని కూతురులోని ధైర్యసాహసాలను తెలుసుకున్న రాణీగారు ఆమెను తన అంతరంగికురాలిగా నియమించుకుంటారు. తల్లి రక్తపుజాడలు, తండ్రి దిశా నిర్దేశంతో రాణీగారిని కంటికి రెప్పలా కాపాడుతూ, బ్రిటిష్ వారు 2,3 సార్లు ఆమెపై చేసిన హత్యా యత్నాలను అత్యంత చాకచక్యంగా తిప్పికొడుతుంది. ఈ ప్రయత్నంలో తీవ్రంగా గాయపడుతుంది. రక్త మోడుతున్న ఆమె గాయాలకు కట్టుగట్టే నిమిత్తం రాణీగారు తృటిలో తన చీరకొంగును చింపారంటే, వారి హృదయంలో ఆమె ఎంతటి స్థానాన్ని సంపాదించుకుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరో సందర్భంలో తన సిలంబం(ఆయుధ ఆధారిత యుద్ధ కళ) గురువును రాణీ గారిని హతమార్చడానికి నియమింపబడిన శత్రుపక్షపు గూఢచారిగా పసిగట్టి, అతన్ని అక్కడికక్కడే హతమారుస్తుంది. దీంతో రాణీగారు ఆమెను తన సైన్యంలోని మహిళా విభాగానికి సైన్యాధ్యక్షురాలిగా నియమిస్తారు.
ఎనిమిదేళ్ల అజ్ఞాతవాసంలో మారుతుపాండ్యార్లు, టిప్పు సుల్తాన్, హైదర్అలీ వంటి రాజకీయ దిగ్గజాలతో కూటమి నేర్పరచుకున్న రాణీగారు పటిష్టమైన సైన్యంతో తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి బ్రిటిష్ వారిపై సమరశంఖం పూరిస్తారు. ఈ ప్రయత్నంలో వారిపై పలుమార్లు విజయం సాధించినప్పటికీ, అత్యంత శక్తిమంతమైన వారి ఆయుధ సంపత్తి తమ విజయానికి అవరోధం అనే ఆలోచనలో పడతారు వేలునాచియార్.
నాచియార్ నీడైన కుయిలీకి పరిష్కారమార్గం రెండు రూపాల్లో కనిపిస్తుంది. మొదటిది వారి ఆయుధాలను స్వాధీనం పరుచుకోవడం లేని పక్షంలో వాటిని సమూలంగా నాశనం చేయడం. దీనికోసం పథకం రచించడం మొదలు పెడుతుంది.
శరన్నవరాత్రుల పరిసమాప్తి సందర్భంగా పదవ రోజు కోటలోని రాజరాజేశ్వరి అమ్మన్ దర్శనార్థం మహిళలను లోనికి అనుమతించారన్న వార్తను వింటుంది. తలవని తలంపుగా అందిన ఈ అవకాశాన్ని తన పథకం అమలుకు దొరికిన సువర్ణావకాశం గా భావిస్తుంది.
తన అధ్యక్షతలోని మహిళా (40,000 మందితో కూడిన) సైన్యాన్ని సాధారణ పౌరుల వలె కోట చుట్టూ మోహరింపజేస్తుంది. పువ్వులు, పండ్ల బుట్టల లోపల ఆయుధాలను దాచిపెట్టి మరి కొంతమంది మహిళలు కోటలోనికి ప్రవేశిస్తారు. వీరిని అంచనా వేయడంలో బ్రిటిష్ వారు దారుణంగా విఫలమౌతారు. దీపాలు వెలిగించడానికి వెంట తెచ్చుకున్న నెయ్యిని (పథకంలో భాగంగా) మహిళలు మూకుమ్మడిగా ఆమెపై గుమ్మరించడం, ఆమె స్వయంగా నిప్పంటించుకుని, జ్వలించే అగ్నిగోళమై రెప్పపాటులో ఆయుధాగారంలోకి దూసుకెళ్తుంది. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపో యిన బ్రిటిష్ వారు తీరుకునేలోపే జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఈ అవకాశాన్ని అస్త్రంగా చేసుకొని వేలునాచియార్ వారిపై గెలుపు సాధించి రాజ్యాన్ని కైవసం చేసుకుంటుంది.
తమిళ భాషలో ‘వీరమంగై’ అంటే వీరనారి అని అర్థం. తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు వీరి స్మారక స్థూపాన్ని తమిళనాడులోని శివగంగ జిల్లాలో
స్థాపించింది.
హాడీరాణి(సహల్ కన్వర్):
హాడీరాణి అంటే ‘హడా’ వంశానికి చెందిన స్త్రీ అని అర్థం. ఈ విధంగా పిలువబడటం వారి వంశాచారం.శౌర్యప్రతాపాలకు మారుపేరైన వీరు యుద్ధ ప్రియులు. రాజపుత్రులు పరిపాలించిన రాజ్యం కనుక ఈ ప్రాంతం ‘ రాజస్థాన్ ‘ గా పేరుగాంచింది.
పలు వీరగాథలతో నిండిన సాహిత్యం, చరిత్రలను బట్టి వీరి పరాక్రమాలను అంచనా వేయవచ్చు. యుద్ధానికి వెళ్లే రాజులకు వారి జీవిత భాగస్వాములైన రాణులు వీర తిలకం దిద్ది పంపించడం మనం చరిత్రలో చాలాసార్లు చదువుకున్నాం. కానీ యుద్ధభూమిలోని భర్తకు ఒక అసాధారణమైన కానుకను పంపించిన క్షత్రియకాంతనే ఈ హాడీరాణి. రాజ్య శ్రేయస్సు కోసం ఆమె చేసిన త్యాగమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హడా చౌహాన్(చౌహాన్ అనేది ఉత్తర భారతదేశంలోని రాజపుత్ర తెగకు చెందిన వారి ఇంటి పేరు. ‘రాజు’ మరియు ‘ధర్మానికి అధిపతి’ అని దీని అర్థం. అగ్నిగుండం నుండి ఉద్భవించిన వారు అని మరో నమ్మకం ఉంది. అందువల్లనే వీరిని అగ్ని వంశీయులు అని కూడా అంటారు.రాజ్ పుత్ సంగ్రామ్ సింగ్ కుమార్తె సహల్ కన్వర్ (హాడీ రాణి). మేవాడ్ లోని సలుంబర్ ప్రాంతానికి చెందిన రతన్ సింగ్ చుండవత్ అనే వ్యక్తిని వివాహమాడుతుంది. మేవాడ్ పాలకుడైన రాణా రాజ్ సింగ్ సైన్యంలో ఇతను సైన్యాధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తూ ఉంటాడు.
మొఘల్ చక్రవర్తి ఐన ఔరంగజేబు తన సైన్యంతో మేవాడ్ రాజ్యాన్ని చుట్టుముట్టడంతో, సైన్యాధ్యక్షుడిగా యుద్ధభూమికి వెళ్లవలిసిందిగా రాజుగారు ఆజ్ఞను జారీ చేస్తారు.
అప్పటికి అతనికి వివాహమై కేవలం రెండు రోజులు మాత్రమే అవుతుంది. సౌందర్యంతో వెలిగిపోతున్న నవవధువు (అర్ధాంగిని)ను వదిలి యుద్ధభూమికి వెళ్ళడానికి అతని మనసు అంగీకరించదు. కర్తవ్య పాలనలో భాగంగా యుద్ధానికి వెళతాడే కానీ
అతని మనసు ఆమె చుట్టే తిరుగుతూ ఉంటుంది.
పగలంతా శత్రువులతో పోరాడిన అతను, యుద్ధ విరామ సమయంలో ప్రతీరోజు ఒక సైనికుడిని ఆమె వద్దకు పంపించి, ఆమె క్షేమసమాచారాన్ని తెలుసుకొని, ఆమెకు ప్రతిగా ఆమె నుండి ఏదైనా కానుకను తీసుకొని రమ్మని పంపిస్తూ ఉండేవాడు. వరుసగా నాలుగు రోజులు ఇదే తతంగం నడవడంతో ఆమె ఆలోచనలో
పడుతుంది. తనపై ఉన్న మోహం కారణంగా అతడు యుద్దంపై మనసు లగ్నం చేయలేక పోతున్నాడనీ,ఇదే పరిస్థితి కొనసాగితే రాజ్యం శత్రువుల వశమై పోతుందనీ, అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వకూడదని ఒక బలమైన నిర్ణయానికి వస్తుంది.
శత్రువుపై గెలవడానికి యుద్ధభూమిలో వారు (యోధులు) ఎంత వీరోచితంగా పోరాడుతారో, అంతఃపుర కాంతలు అదే స్థాయిలో వారికి మానసిక బలాన్ని అందిస్తారనే చారిత్రక సత్యం పలుమార్లు రుజువైనదే.
మోహానికి లొంగడం వీరుడి లక్షణం కాదనీ, తన నుండి మనసు మరల్చుకోకపోతే, శత్రువుపై విజయం సాధించడం అసంభవమనీ, తాను అతని వెంటనే ఉన్నాననే భావనతో రణరంగంలో విజృంభించమనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాననీ ఉత్తరం వ్రాసి, మరసటి రోజు సైనికుడి రాగానే అతనికి విషయాన్ని తెలియపరచి, తన తలను ఖడ్గంతో నరికేసుకుని, అతనికి కానుకగా పంపిస్తుంది. దానిపై ఒక తెల్లని వస్త్రాన్ని కప్పి ఆమె చెప్పిన ప్రకారంగా అతను (సైనికుడు) వెళ్లి, ఆమె భర్తకు అందజేస్తాడు. విషయం తెలుసుకున్న అతని మనసు తీవ్రమైన దుఃఖానికి లోనైనప్పటికీ, అతనిలోని వీరుడిని మేల్కొల్పుతుంది. తలకు వేలాడుతున్న ఆమె జడతో తన మెడలో ముడి వేసుకొని,అరివీర భయంకరుడై శత్రుసైన్యాన్ని ఆవలిగట్టుకు తరిమికొడతాడు. కానీ ఆమె వియోగాన్ని భరించలేక అదే యుద్ధభూమిలో మోకాళ్ళపై కూర్చుని ఖడ్గంతో తన తలను నరుక్కుని, ఆమె జాడ వెతుక్కుంటూ స్వర్గానికి చేరుతాడు.
రాజస్థాన్ సైన్యంలోని ఒక బెటాలియన్ కు ఈమె పేరును పెట్టారు. డానీ సోలంకి అనే రచయిత ఈమె పేరు మీదుగా ‘ హాడీ రాణి ‘ అనే కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఈమె సాహసం రాజస్థాన్ లోని పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చబడింది. అక్కడి జానపదులు ఈమె సాహసంపై బాణీ కట్టి ఆమెపై తమకున్న గౌరవాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఉంటారు.

ఓనకే ఓబవ్వ:
కన్నడ చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన 17 వ. శతాబ్దపు ధీరవనిత. హోలయ తెగకు చెందిన ఒక సాధారణ స్త్రీ. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం పేరు వినపడగానే చరిత్రకారులకు ఈమె సాహసం జ్ఞాపకం రాక మానదు. చిత్రదుర్గంలోని రాతికోటకు కాపలాదారుడైన కాహళే ముద్ద హనుమ భార్య. శత్రువులు కోటను చుట్టుముట్టినప్పుడు సైనికులను అప్రమత్తపరచడం అతని విధి. కానీ ఒకరోజు అతను భోజనానికి వెళ్లిన సమయంలో హైదర్ అలీ (మైసూర్ పాలకుడు మరియు టిప్పు సుల్తాన్ తండ్రి) సేనలు ప్రదుర్గంపై దాడిలో భాగంగా కోటలోని చిన్న రంధ్రం ద్వారా లోపలికి రావడాన్ని గమనిస్తుంది. పక్కనే ఉన్న రోకలి బండను తీసుకొని వాళ్ల తలలపై బాదుతూ ముందుకు వెళ్లకుండా ఆపగలుగుతుంది. ఆమె దాడిలో చాలామంది శత్రు సైనికులు హతమౌతారు. భోజనానికి వెళ్లిన ఆమె భర్త తిరిగి వచ్చేసరికి ఆమె చేతిలో రోకలిబండతో ఒళ్లంతా రక్తమోడుతూ అప్రమత్తం చేయడంతో, శత్రువుల బారి నుండి వారు కోటను రక్షిస్తారు. కానీ శత్రువర్గంలోని ఒక సైనికుడు అకస్మాత్తుగా ఆమెపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తుంది.
కన్నడ భాషలోని ‘ ఓనకే ‘ అనే పదానికి తెలుగులో రోకలిబండ అని అర్థం. రోకలి బండతో శత్రువుల నెదుర్కొన్నందు వలన ‘ఓనకే ఓబవ్వ ‘ అని చరిత్రలో స్థిరపడింది.
ఎటువంటి అత్యాధునిక ఆయుధాలు లేకుండా ఒక సాధారణమైన పనిముట్టుతో బలవంతమైన శత్రుసైన్యాన్ని ఎదుర్కొన్న ఆమె ధైర్యం స్త్రీ శక్తికి నిదర్శనంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. యుద్ధ విద్యల్లో నైపుణ్యం,ఆయుధాల వినియోగంపై అవగాహన కంటే కూడా బుద్ధి కుశలత, సమయస్ఫూర్తి యుద్ధభూమిలో కీలకమైన పాత్ర పోషిస్తాయనీ, ఒక సాధారణ స్త్రీని సైతం అసాధారణ శక్తిగా నిలుపగలవని నిరూపించింది.
కర్ణాటక ప్రభుత్వం 2021 వ. సంవత్సరం నుండి నవంబర్ 11 వ. తేదీని ‘ఓనకే ఓబక్క జయంతి’ గా అధికారికంగా నిర్వహిస్తోంది.
జీవన గమనంలోని మరే పార్శ్వాన్నీ పట్టించుకోకుండా, బంధాలు, అనుబంధాలకు లొంగకుండా కేవలం స్వాతంత్ర్య ఫలాలను పండించడమే లక్ష్యంగా కదిలిన ఈ దేశభక్తులకు చరిత్రలో సముచిత స్థానం దక్కలేదన్నది మేధావుల భావన. ఇటువంటి మహోన్నతుల విజయగాథలు తెలుసుకోవడం, నలుగురికి తెలియపరచడమే (చంద్రునికో నూలుపోగులా) మనం వారికి సమర్పించే నివాళి.

అక్షరాలు పట్టు దారాల నడుమ మెరిసిన జరీ బూటాలై
పదాలు పైటచెంగులో ఒదిగిన ప్రకృతి అందాలై
వాక్యాలు అంచుల వెంట బారులు తీరిన హంస నడకలై
సంధులన్నీ పైట మడతల్లో ఒదిగిన ఒంపులై
సమాసాలు చీర కుచ్చిళ్ళలో ఇమిడిన నేర్పులై
అలంకారాలు మేనికి అలదిన అత్తరులై మెరిసిన కావ్యకన్నియ
నిలువుటద్దాన స్వీయసౌందర్యం
అరమోడ్పు కన్నుల పారవశ్యమై
అధరాన విరిసిన చిరుదరహాసమై
అక్షరాలను దోసిట పట్టి అలవోకగా జారవిడిస్తే… అవి
ఘల్లుమన్న మువ్వలై
పరిమళించిన పువ్వులై
ఫక్కుమన్న నవ్వులై
పాలనురగలై పండువెన్నెలై
తెలుగు తల్లికి చేసే పల్లకి సేవ
ఆ పల్లకిని మోసే బోయీలు నేటి బాలలైతే
ఆ మకరందాన్ని గ్రోలే రేపటి తుమ్మెదలై
భాషాపరాగరేణువులను ముక్కున కరచుకుని రివ్వుమన్న పక్షులైతే
పలుకులన్నీ చిలుకలై పాటలన్నీ కోయిలలై
జారిపడ్డ పుప్పొడి రేణువుల్లో
విశ్వవ్యాప్తమయే పచ్చని తెలుగు తోట
సంగీత జలధిలో మునకలేస్తూ, స్వరాలను శ్వాసిస్తూ, రాగాలను పానంచేస్తూ, పంచప్రాణాలుగా అభిమానిస్తూ, ఆరోప్రాణంగా ఆరాధిస్తూ వన్నె తెచ్చిన స్వరకర్త లెందరో. పలు చరణాలతో కూడిన స్వరకల్పనకి పల్లవి తిరగలి చక్రమై రాగానికి శోభ నిచ్చిన విధంగానే బాలభానుడి లేత కిరణాలైనా, సోముడి వెన్నెల జల్లులైనా ప్రకృతి సోయగమై మనసుకు హాయి గొలుపుతాయి.
సంగీత పరిభాషలో స్వరాల సమూహాన్ని ‘రాగం ‘ అంటారు. ఒక్కొక్క రాగం ఒక్కొక్క మూర్చనను కలిగి ఉంటుంది. ప్రతీ మూర్చన తనవైన స్వరాలను కలిగి ఉంటుంది. స్వరాలేవైనప్పటికీ రాగభావం మాత్రం మాధుర్యభరితమే.
చుక్కలు పరిచిన నీలాల దుప్పటి కవులకు కవితావస్తువై, కావ్యాల్లో సైతం తనదైన ముద్ర వేసుకుంది.
ఎదఎదను రంజింపజేసే సంగీత సుధ దేశకాలాల్ని బట్టి ఏ రూపు సంతరించుకున్నా(కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య), ఏ చోట ప్రవహించినా అంతిమంగా దాని లక్ష్యం అలౌకికానందమే.
సంగీత వీచికతో కూడిన శబ్దాన్ని ‘నాదం ‘ అంటారు. అనంతరాగాల సమన్వితమైన సంగీతం నాదమయం. గుప్పెడు గుండెలో కోటి భావనలు దాగి ఉన్నట్టే, అసంఖ్యాక రాగాలలో ఇమిడి ఉన్న నాదమొక్కటే.
మధురమైన ఆ సుధాగానాన్ని గ్రోలుతూ, ఆ నాద జగత్తులో పరవశిస్తూ, సంగీత సరస్సులో వికసించిన పద్మాలెన్నో.
నారాయణ అయ్యర్, అమ్మిని అమ్మాళ్ దంపతుల తనయగా 08/04/1938 భారతదేశంలోని చెన్నై నగరంలో జన్మించి, సంగీత సరస్సులో ముచ్చటగా మూడోసారి{( పద్మశ్రీ-1984), (పద్మభూషణ్-2004), (పద్మ విభూషణ్-2026)}వికసించి, తన పూదేనియల వెదజల్లిన ఈ పద్మమే ఎన్. రాజం.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన 2026వ సంవత్సరపు పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ పొందిన ఐదుగురు సభ్యుల్లో ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ వాయు లీన విద్వాంసురాలు వయొలిన్ వాద్యంలో (కళల విభాగంలో)సాధించిన ప్రతిభకుగాను ఈ అవార్డును పొందారు.
హిందుస్థానీ సంగీతంలో నిష్ణాతురాలైన వీరు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత ప్రొఫెసర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తమ ఉద్యోగ నిర్వహణలో సంబంధిత విభాగానికి అధిపతిగా, ప్రదర్శన కళల విశ్వవిద్యాలయ విభాగాధిపతిగా తమ సమర్థవంతమైన సేవలు అందించి, పలు పదవులకు వన్నె తెచ్చారు.

వీరంందించిన సేవలకు గాను సంగీత నాటక అకాడమీ (1990) అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమి అందించే అత్యున్నత గౌరవమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ 2012లో వీరిని వరించింది.
సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడైన తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గారి శిష్యురాలిగా సంగీతంపై పట్టు సాధించారు.
ఘర్(ఇల్లు) అనే హిందీ పదం నుండి ఉద్భవించిన’ ఘరానా ‘ అనే సంగీత ప్రక్రియలో నిష్ణాతులైన హిందుస్తానీ సంగీత గురువు ఓంకారనాథ్ ఠాగూర్ వద్ద రాగవికాసాన్ని నేర్చుకున్నారు.
ఘరానా అనే పదానికి సంగీత వారసత్వం, గురుశిష్య సంప్రదాయం అని అర్థం. ఇది ఒక నిర్దిష్ట సంగీత శైలి. రాగ, గాత్ర వాద్య శైలులను అభ్యసించే విధానాన్ని సూచించే ప్రక్రియ.
వారణాసిలో మహదేవ్ ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో ఆ నగరం యొక్క ఠుమ్రీ సంప్రదాయాన్ని కూడా అభ్యసించారు. క్రమంగా వాద్య సంగీతంలోకి అడుగుపెట్టి చివరకు హిందుస్తానీ సంగీతంలో వయొలిన్ విద్వాంసురాలిగా ఖ్యాతి గాంచారు. తండ్రి మార్గదర్శకత్వం లో ‘గయాకి అంగ్ (గాత్ర శైలి)’ అనే ప్రక్రియను అభివృద్ధి పరిచారు. గయాకి అంటే హిందీ, అరబిక్ భాషలలో పాడటం అని అర్థం. ఖయాల్ అంటే హిందీ భాషలో ఆలోచన అనీ, పర్షియన్ భాషలో సాహిత్యం అని అర్థం. సరళంగా చెప్పాలంటే ఖయాల్ గయాకి అనేది నిర్దిష్ట శైలి, వేగం లేని వివరణాత్మక గానకళ. వీరు తమలోని సంగీత పరిజ్ఞానానికి సాధనను జోడించి వయొలిన్ వాద్యంపై మనుషుల స్వరాన్ని పోలిన విధంగా వాయించే విధానాన్ని కనిపెట్టారు. వయొలిన్ భారతీయ సంగీత కచేరీలో, ముఖ్యంగా కర్ణాటక సంగీత కచేరీలో ఉపయోగింపబడే ప్రధాన సహకార తంత్రీవాద్యం. దీనికి ‘ ఫిడేలు ‘ అని మరో పేరు. గాంభీర్యంతో కూడిన మాధుర్యం దీని సొంతం. ఇది పాశ్చాత్య వాయిద్యమైనప్పటికీ, కర్ణాటక సంగీతంలోని అతి సూక్ష్మ గమక విశేషములను కూడా పలికించగల సామర్థ్యం ఉండటంచే ప్రధాన పక్క వాయిద్యంగా, తని వాయిద్యంగా భారతీయ సంగీతంలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించుకుంది. కర్ణాటక సంగీత శైలిలో ప్రముఖ వయొలిన్ విద్వాంసుడైన T.N. శేషన్ తోబుట్టువు వీరు. చార్టెడ్ అకౌంటెంట్ ఐన T.S. సుబ్రహ్మణియన్ అనే వ్యక్తిని వివాహమాడి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి, ఆ శిశువుకు సంగీత శంకర్ అని నామకరణం చేశారు. కూతురైన సంగీత శంకర్ గారికి, మనవరాళ్లైన (సంగీత శంకర్ గారి తనయలు) రాగిణి శంకర్, నందిని శంకర్ లను వయొలిన్ వాద్యంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు.
మేనకోడలైన కళారాంనాథ్, డా. సత్యప్రకాష్ మెహంతీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఐన ప్రణవ్ కుమార్ వీరి శిష్యులు. కర్ణాటక సంగీత గాయని మరియు సామాజికవేత్త ఐన పద్మా స్వామినాథన్ వీరికి అత్తగారు. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రముఖ నేపధ్య గాయని ఐన వాణీజయరాం వీరికి వదిన.
సంగీత కుటుంబంలో జన్మించి, ఆ సాగరాన్ని మథించి, అందుండి లభించిన అమృత సుధల్ని వారసత్వంగా తనవారికి పంచడమే కాకుండా, స్వపర భేదాలెంచక అభిమానించి, ఆరాధించిన (సంగీతాన్ని) వారందరికీ వితరణ చేసి, అందులోనే తాదాత్మ్యం చెందిన ఈ సంగీత శిఖరానికి(రాజం గారికి) కైమోడ్పులర్పిస్తూ…..
“రవి గాంచని చోటు కవి గాంచున్”
“కత్తి కంటే కలం గొప్పది”
సాహితీ రంగానికి సంబంధించి తరుచుగా వినిపించే రెండు సూక్తులు.
వస్తువు ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయగలిగే శక్తి కవులకు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ (రవి……. గాంచన్)నానుడి పుట్టి ఉండవచ్చు.
“కత్తి కంటే కలం గొప్పది”
కత్తి శరీరాన్ని గాయపరిస్తే, కలం ఆలోచనను రేకెత్తిస్తుందన్న భావన ఈ సూక్తిలో మనకు కనిపిస్తుంది. [గాయపరచడం మాత్రమే కాదు, శస్త్రచికిత్సలోనూ తనదైన పాత్ర పోషించి, వ్యాధి పీడితులకు స్వస్థత చేకూర్చడంలో బలమైన పనిముట్టుగా ఉపయోగపడుతుందనేది (ప్రస్తుతానికి అనవసరమైనా) అందరూ ఆమోదించాల్సిన మరో కోణం].
కలం అజ్ఞానాన్ని పారద్రోలి, జ్ఞాన దీపాన్ని వెలిగిస్తుంది. ఆలోచనను రేకెత్తించి, మార్పు వైపు నడిపిస్తుంది. ఆ మార్పు మనిషిలోని మాలిన్యాన్ని కడిగేసేదైనా కావచ్చు, అభివృద్ధి బాట పట్టించేదైనా అయి ఉండవచ్చు.
మేము సైతం అంటూ కలాన్ని చేతబట్టి, తమకంటూ ఒక గుర్తింపును సంతరించుకున్న 19వ శతాబ్దపు ఈ సరస్వతీ పుత్రికలను కెమెరాలో బంధించిన ఆనాటి అపూర్వ ఘట్టం, తీయని జ్ఞాపకమై నేడు నెట్టింట వైరల్ గా మారుతోంది. వారు వెదజల్లిన పరిమళాలను ఆఘ్రాణిస్తూ, ఈ చిరు అక్షర నీరాజనం.
రంగనాయకమ్మగారు
సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రిగా, విమర్శకురాలిగా, మార్క్సిస్ట్(శ్రామిక వర్గ ప్రయోజనాలను సమర్ధించే వ్యక్తి) గా సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజాస్వామిక విలువలు, కుల వ్యతిరేకత, సమానత్వం, భారతీయ పురాణాలు వంటి అంశాలపై రచనలు చేశారు. 1955లో రచనా వ్యాసంగం ప్రారంభించిన వీరు 15 నవలలు, 70 కథలు,వ్యాసాలు మాత్రమే కాకుండా భారత కమ్యూనిస్టు ఉద్యమం, మావోయిజంపై కలాన్ని సంధించారు.
కలం పట్టిన తొలినాళ్లలో దద్దనాల (తండ్రి ఇంటి పేరు) రంగనాయకమ్మగా, వివాహానంతరం ముప్పాళ్ళ రంగనాయకమ్మగా పాఠకులకు చిరపరిచితులు.
1965 లో ‘ బలిపీఠం’ నవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. మార్క్సిస్ట్ దృక్పథంతో రాసిన ‘రామాయణ విషవృక్షం’ బ్రాహ్మణ వ్యతిరేకిగా, స్త్రీవాద రచనలు చేయడం వల్ల పురుష వ్యతిరేకంగా ముద్ర పడింది.
జానకి విముక్తి, కళ్ళు తెరిచిన సీత, కృష్ణవేణి, బలిపీఠం, రచయిత్రి, కళ ఎందుకు, ప్రేమకి ముగింపు ఎప్పుడు?, వాళ్ళిద్దరూ అంతేనా?, రామాయణ విషవృక్షం,ఇదండీ మహాభారతం వంటి రచనలు చేసి, సాహిత్య రంగంలో పలు సంచలనాలు సృష్టించారు.
పాకాల యశోదా రెడ్డి
తెలంగాణ భాష,యాసలతో కూడిన రచనలు చేసిన వీరు తమలోని ప్రతిభకుగాను ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో ఆచార్య పీఠాన్ని అలంకరించారు. ప్రాచీన తెలుగు సాహిత్యంపై వీరు చేసిన ప్రసంగాలు పలువురి మన్నన లందుకున్నాయి. ఆకాశవాణిలో తెలంగాణ మండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయిత్రిగా వినుతి కె క్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, లలితకళా అకాడమీ,సంగీత అకాడమీ సభ్యురాలిగా కొనసాగారు. ఆంధ్ర సారస్వత పరిషత్, జానపద కళా సాహిత్య సంస్థలతో వీరికి విడదీయరాని అనుబంధం ఉంది. ధర్మశాల, ఎచ్చమ్మ కథలు, మా ఊరి ముచ్చట్లు, భారతీయ చిత్రకళ, ద్విపద వాంగ్మయం, ప్రబంధ వాంగ్మయం, భావిక వంటి రచనలు, పలు విమర్శనాత్మక గ్రంథాలు రచించారు.
కాసు రాఘవమ్మ గారు
గాంధీజీ సిద్ధాంతాలకు ప్రభావితురాలై, జాతీయ ఖాదీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేటలో కాసు రాఘవమ్మ – బ్రహ్మానందరెడ్డి పేరుమీద 1972 లో జూనియర్ కళాశాల,1974 లో డిగ్రీ కళాశాలలు(25 ఎకరాల విస్తీర్ణంలో) స్థాపించబడినవి.

ఈ రెండు కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో వెలువడే ‘ప్రతిభ’
అనే వార్షిక పత్రిక విద్యార్థుల్లో దాగిన సాహితీ విలువలకు అద్దం పడుతూ ఉండేది.
భానుమతీ రామకృష్ణ
అటు చలనచిత్ర రంగం, ఇటు సాహితీ రంగం. రెండింటిని సమన్వయ పరచుకున్న తీరు అద్భుతం. నటిగా, గాయనిగా, స్టూడియో అధినేత్రిగా, నిర్మాతగా, దర్శకురాలిగా అన్ని పాత్రల్లో ఒ దిగిపోయి మెప్పించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. శ్రోతలను మురిపించి, మరిపించిన కంఠస్వరం ఆమె వరం. హాస్యంతో కూడిన రచనలు, చక్కని వాగ్దాటితో కట్టిపడేసే ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణలు. ఆత్మవిశ్వాసం పాలు ఒకింత ఎక్కువై గర్విష్టి(కొంతమంది దృష్టిలో)గా ముద్రపడినా, వారిలోని భక్తి తత్పరత, స్నేహశీలతల కారణంగా అందరి మనసుల్ని చూరగొనేవారు.
తమిళనాడులోని సంగీత కళాశాలకు ప్రధాన ఆచార్యులుగా సేవలందించారు. వీణ వా ద్యంలోనూ ప్రావీణ్యం గడించారు. వస్త్రాలపై ఎంబ్రాయిడరీ చేయడాన్ని బాగా ఇష్టపడేవారు. తమిళం పై పట్టు సాధించినప్పటికీ,తెలుగు భాషపై ఉన్న అభిమానంతో అచ్చమైన తెలుగులో మాట్లాడేవారు. తప్పనిసరైతే తప్ప సంభాషణల్లో ఆంగ్ల పదాలను వాడేవారు కాదు.
ప్రతీ వాక్యంలో హాస్యాన్ని గుప్పిస్తూ, సులభ శైలిలో రచించిన ‘అత్తగారి కథలు’ అనే రచన పేరు ప్రఖ్యాతల్ని మాత్రమే కాకుండా, సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందించింది. వ్యక్తిగత జీవితంలోని పార్శ్వాలను, చలనచిత్ర ప్రస్థానాన్ని ఉటంకిస్తూ వ్రాసిన ‘నాలో నేను ‘ అనే స్వీయ రచన 1994లో జాతీయ బహుమతిని అందించింది.
చలనచిత్రాలకు దర్శకత్వం వహించడం వారిలోని ఆత్మవిశ్వాసానికి, సాహసానికి ప్రతీకగా పరిగణించవచ్చు. ప్రతీ చిత్రంలోను ఒక త్యాగరాయ కీర్తన, ఒక జావళి ఉండటాన్ని ఇష్టపడేవారు. చలన చిత్రాల్లో స్త్రీకి సముచిత స్థానం కల్పించేవారు.
1953లో నిర్మించిన ‘చండీరాణి ‘తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన తొలి తెలుగు మహిళా దర్శకురాలి చలనచిత్రంగా రికార్డుల కెక్కింది.
తెలుగు చలన చిత్ర చరిత్రలో తొలి మహిళా సూపర్ స్టార్ ఐన వీరిని1996లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషణ్ వరించింది.
ఇల్లిందుల సరస్వతి
ప్రముఖ తెలుగు కథా రచయిత్రిగా వాసికెక్కిన వీరు స్వయంకృషితో హిందీ, ఆంగ్ల భాషలపై పట్టు సాధించి, జర్నలిజంలో డిప్లమా పొందారు. 250 కథలు, 5 నవలలు,5 వ్యాస సంపుటాలు, జీవిత చరిత్రలు, రేడియో నాటకాలు రచించారు. వివిధ భాషల్లోంచి అనువాదాలు చేసి, కథాసంకలనాలు వెలువరించారు. బాల సాహిత్యంలో రచనలు చేసి, చక్కటి గుర్తింపును పొందారు.
ముత్యాల మనసు, కల్యాణ కల్పవల్లి, మనం – మన ఆహారం (అనువాదం), రాజహంసలు స్వర్ణకమలాలు, భారతనారి – నాడూ నేడూ వంటి విశిష్ట రచనలు చేశారు.
1934లో హైదరాబాద్ మహానగరంలో ఎల్లాప్రగడ సీతాకుమారి గారితో కలిసి ‘ఆంధ్ర యువతి మండలి’ని స్థాపించి, దానికి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు నెరవేర్చారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకు వచ్చేందుకుగాను మూడు సంవత్సరాల పాటు జైలు విజిటర్ గా సేవలందించారు. కేంద్ర రాష్ట్ర సినిమా అవార్డు కమిటీలో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రిగా రికార్డుల కెక్కారు. ‘స్వర్ణకమలాలు’ కథా సంకలనానికిగాను 1982లో ఈ అవార్డు వీరిని వరించింది.
1958లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి నలంకరించారు.
తురగా జానకీరాణి
ప్రముఖ తెలుగు రచయిత్రి, సంఘ సేవకురాలైన వీరు 1975 లో ఆకాశవాణిలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినది మొదలు పలు సవాళ్లు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో అలుపెరుగని పోరు సలిపారు. వీరు ఉద్యోగంలో చేరే నాటికి దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉన్నది. ఆ గడ్డుకాలంలో ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలను ప్రజలకు చేరవేయడాన్ని, వారిని చైతన్య పరచడాన్ని సవాలుగా స్వీకరించారు. వారిలోని అంకితభావం, నిబద్దతలపై స్పష్టమైన అవగాహన ఉన్న పై అధికారులు, వారి నిర్ణయాలను ఆమోదించి, వాటిని అమలు పరిచే విధానంలో పూర్తి స్వేచ్చ నిచ్చేవారు. ప్రణాళిక, నిర్వహణ, ప్రదర్శన అనే ఈ మూడు అంశాలు దృఢంగా ఉంటే ఏ కార్యక్రమంలోనైనా చక్కగా రాణించవచ్చని చెబుతారు.
100 పైగా కథలు (3 సంపుటాలు),3 నవలలు, 5 బాల సాహిత్య గ్రంథాలు, 3 అనువాద రచనలు చేశారు. రేడియో పాటలు, నాటికలు, రూపకాలు రచించి, వాటిని పిల్లలతో ప్రదర్శింపజేసి, రేడియో అక్కయ్యగా అందరి ప్రేమను చూరగొన్నారు. సభా ప్రసంగాలు, సాధారణంగా మైక్ పట్ల ఉండే జంకును పోగొట్టి, చక్కని వక్తలుగా మలచడానికి ‘బాలానందం’కార్యక్రమాన్ని బలమైన వేదికగా ఎంచుకున్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే క్రమంలోనే వీరిలోని సంఘసంస్కర్త మేల్కొన్నారు. బాలల హక్కులు, బాలల సమస్యలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. UNICEF, NCRT, బాల జాగృతి (బాజా), ప్రభుత్వ శాఖల సమన్వయంతో 670 వీథి ప్రదర్శనలు నిర్వహించారు. ‘ఇది నా సమస్య’ అనే స్త్రీల కార్యక్రమాన్ని, వృద్ధులకు సంబంధించి ‘స్రవంతి’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, వాటి ద్వారా వారి సాదకబాధకాలను తెలుసుకుని, పరిష్కరించేవారు. పంచాయితీలలోని మహిళలను సంఘటిత పరిచి, ‘అందరికీ చదువు’ అనే కార్యక్రమం ద్వారా వారికి విద్యనందించడమే గా కుండా, వారిలోనే రచనా శక్తిని జాగృత పరిచేవారు.’మా చేతి పంపు – మా బిందె నింపు’ అనే సామాజిక అవగాహనా కార్యక్రమానికి చక్కని స్పందన లభించింది.
వీరి వెలలేని సేవలకు గాను గృహలక్ష్మి స్వర్ణ కంకణం, బాల సాహిత్య రత్న, బాలబంధు, ఈనాడు, ఆంధ్ర సారస్వత పరిషత్ లో పరిణిత వాణి, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (2 సార్లు), రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, పింగళి వెంకయ్య స్మారక సత్కారం, అరవిందమ్మ మాతృమూర్తి పురస్కారం, సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం వరించాయి. 1994లో IBPS సహాయ దర్శకురాలి (అసిస్టెంట్ డైరెక్టర్) గా పదవీ విరమణ చేశారు.
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు
రచయిత్రిగా, పండితురాలిగా, పరిశోధకురాలిగా, ఉపన్యాసకురాలిగా ప్రఖ్యాతి గాంచిన వీరు, కృష్ణకుమారి అనే పేరుతో ‘భారతి ‘ మాస పత్రికలో రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు. వ్యాసం, గేయం, వచన కవిత, ఖండకావ్యం, చారిత్రక పరిశోధన వంటి పలు ప్రక్రియల్లో పాండిత్యం గడించారు. 10 సంవత్సరాల వయసులోనే వేదికలెక్కి ఉపన్యసిస్తూ, ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను ప్రేరేపించేవారు. 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి కవిత్వం, నృత్యం, కుట్టుపని, ఎంబ్రాయిడరీ వంటి కళల్లో నైపుణ్యం సంపాదించారు. విజయవాడ, మద్రాసు రేడియో కేంద్రాలలో వీరి రచనలు, ప్రసంగాలు తరచుగా ప్రసారమవుతూ ఉండేది. 18 వ. ఏట ‘ఉభయ భాషా ప్రవీణ ‘పట్టా పొందారు.
కోరల మధ్యన కోటి స్వర్గాలు, లజ్జ కిరీట ధారిణి, చీకటిరాజ్యం, దేవి స్తవతారావళి, మన సాహితి – మధుర భారతి, కనకమ్మ నివాళి, మహిళా విక్రమ సూక్తము, ఆంధ్ర కవయిత్రులు వంటి రచనలు అఖిల భారత కవయిత్రిగా గుర్తింపు నిచ్చాయి. చంద్రమతి కథ, యుగళ సిరి అనేవి వీరి అముద్రిత రచనలు. వాగ్గేయకారులు, పదాలు, జావళీలు,తత్వాలు, సంకీర్తనలపై సునిశిత పరిశీలనాశక్తితో ‘ఆంధ్ర కీర్తన వాంగ్మయ సేవ ‘ అనే గ్రంథాన్ని రచించారు. ఆకాశవాణిలో లలిత, భక్తి గీతాల ప్రసారంలో గణనీయమైన పాత్ర పోషించారు. 1968లో ‘కథామందారం ‘ అనే సంకలనాన్ని ప్రచురించారు. తెలుగు మొలక, విద్వత్కవయిత్రి, ఆంధ్ర విదుషీ కుమారి, ఆంధ్రసరస్వతి, కవయిత్రీతిలక, సాహితీరుద్రమ, కళాప్రపూర్ణ వంటి పలు బిరుదులను పొందారు. గృహలక్ష్మి స్వర్ణ కంకణం అవార్డు పొందారు. కనకాభిషేకం, పౌర సన్మానం, గజారోహణం వంటి ఘన సన్మానాలు పొందిన ఆధునిక తెలుగు కవయిత్రిగా వాసికెక్కారు.
తెన్నేటి హేమలతగారు
రెండు పదులు కూడా నిండని వయసులోనే రచనకు శ్రీకారం చుట్టిన జానకి రమాకృష్ణవేణి వివాహానంతరం తెన్నేటి హేమలతగా పేరు మార్చుకుని పాఠకుల హృదయాల్లో స్థానం సంపాదించారు.5 వ. తరగతి వరకు మాత్రమే పాఠశాలలో చదివినప్పటికీ, జిజ్ఞాస కారణంగా తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషలపై పట్టు సాధించారు.70,80 దశకాల్లో వీరి రచనలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
1955లో విజయవాడ ఆకాశవాణి కేంద్ర అనౌన్సర్ గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన వీరు, పలు రేడియో నాటకాలు, సినిమాల్లో నటించి, మాటలు వ్రాయడం మొదలుపెట్టారు. ‘శిలా హృదయం’పేరుతో వీరు రచించిన మొదటి రేడియో నాటకం 1952లో డక్కన్ రేడియోలో ప్రసారమైంది. సంగీతాన్ని అమితంగా ఆరాధించే వీరు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిపై ఉన్న అభిమానంతో వారు స్వరపరచిన కొన్ని రాగాలకు చక్కని సాహిత్యాన్ని అందించారు.
100 కథలు,105 నవలలు, 700 రేడియో నాటకాలు, 10 రంగస్థల నాటకాలు,5 సాహిత్య వ్యాసంపుటాలు, 2 సాహిత్య విమర్శనా సంపుటాలు, ‘లత వ్యాసాలు’ పేరుతో సంపుటి, ‘చరిత్ర కందని ప్రేమ కథలు’ అనే కవితా సంపుటుల వెలువరించారు.
ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రచించిన ‘రామాయణ విషవృక్షం’ నవలను విమర్శిస్తూ ‘రామాయణ విషవృక్ష ఖండన’ రచించారు. హైదరాబాద్ 6 వ. నిజాం నవాబైన మీర్మఖ్బూల్ అలీఖాన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ ప్రియతముడు ‘ అనే నవలను రచించారు. పాంచాలి,ఎడారి పువ్వులు, మహానగరంలో స్త్రీ, రక్తపంకం, మోహనవంశీ, గాలి పడగలు – నీటి బుడగలు, అంతరంగ చిత్రం వంటి రచనలు చేశారు. ‘గాలి పడగలు – నీటి బుడగలు’ నవలలో వేశ్యల దుర్భర జీవితాలను చిత్రీకరించడంతో పలు విమర్శలు ఎదురైనప్పటికీ, ఏమాత్రం జడవకుండా ‘రక్తపంకం’ లో వారి దైన్యాన్ని మరింత లోతుగా అక్షరబద్ధం చేశారు.ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక క్షోభ అనుభవించాననీ, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన సందర్భాలు లేకపోలేదని చెబుతారు. మోహనవంశీ, అంతరంగ చిత్రం నవలల్లో వీరికి జీవితానికి సంబంధించిన పలు విషయాలను పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఘట్టి ఆంజనేయ శర్మగారు ‘సాహితీలత’ అనే పేరుతో వీరి జీవిత చరిత్రను వ్రాశారు.
1963 లో గృహలక్ష్మి స్వర్ణకంకణం, 1981లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలక్షణ మహిళా పురస్కారం వీరిని వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో 20 సంవత్సరాల పాటు వీరు తమ విశిష్ట సేవలను అందించారు.
సామాజిక చైతన్యానికి ఆయువుపట్టైన రచనా వ్యాసంగాన్ని కొనసాగించే కవులు, రచయితలు అప్పుడూ,ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటారు. వారు తమ రచనల ద్వారా గొప్ప కార్యక్రమాలకు పునాదులు వేయకపోయినా, దృఢమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టక పోయినా పరవాలేదు. ఎక్కడో, ఏ మారుమూలో ఒక నిస్సహాయుడి కంటి వెలుగై, ఒక నిరుపేద ఇంట చిరుదీపం వెలిగించ గలిగితే చాలు. ఆ రచన సార్థకం. ఆ రచయిత జన్మ ధన్యం.
‘అల్మారా’ మూడక్షరాల పదం. అతి సామాన్యుడికైనా, అపర కుబేరుడికైనా అత్యంత ముఖ్యమైన వస్తువు. స్థాయిని బట్టి నిర్మాణపరమైన తేడాలుండ వచ్చేమోగానీ అవసరంలో మాత్రం అందరిదీ.
కవి దాసరి మోహన్ గారు ‘దండెం ‘ మీద ఆరేసిన బట్టల్ని మడత వేసి ‘అల్మారా ‘ లో సర్దినట్టున్నారు. రండి, ఒకసారి తెరిచి చూద్దాం.
భరించడానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన అమ్మ పోర్టుఫోలియో లన్నిటిని చక్కబెట్టుకుంటూ త్యాగాల తోరణాలను గుమ్మానికి కట్టి, బొట్టుపెట్టెలో కన్నీటి బొట్లను దాచుకొని, తనివి తీరా ఏడవడానికి ప్రైవసీ కోరుకుంటుందంటూ కవితా సంపుటిని అమ్మతోనే ప్రారంభించారు.
తండ్రిని బాధ్యతల భూగోళం మోసే హెర్కులస్ అనీ, అతని అడుగుజాడలే జీవిత పాఠాలనీ, చెమట బిందువులు గంగాజలమంత పవిత్రమైనవని అంటూనే శక్తి సన్నగిల్లిన అతని దేహాన్ని పాలు పితకలేని పొదుగు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు.
గుండె కింది పాయకు ఆనకట్ట కట్టి,కొవ్వొత్తిలా కరిగిపోతూ ఇంటిని బృందావనంలా, సప్తవర్ణ సింగిడిలా మార్చే ఇల్లాలి ఔన్నత్యానికి, ఔచిత్యానికి మెచ్చి బతుకు చుక్కాని అని అంటూ కితాబిస్తారు.
అడవి ఆనంద తాండవం జింకలకు ప్రాణహాని లేదిక/
గంగ యమున నదులన్నీ
స్వచ్ఛ రాగాల నృత్య హేల/
అంటూ పర్యావరణాన్ని దెబ్బతీసే మానవ తప్పిదాలపై ధ్వజమెత్తారు.
ఎండోమెంట్ ఎరుగని పేద దేవుళ్లను స్తుతిస్తూ, పాదుల వేదికలపై పక్షులతో పాట కచేరీలు నిర్వహిస్తారు. రాలిన పూలలో రంగోలిని, కొమ్మల్లో కూచిపూడి ముద్రల్ని చూసి ప్రకృతికి పట్టాభిషేకం చేస్తారు.
పాత జ్ఞాపకాల్ని తోడటానికి గుప్పెడంత గుండెబావిలోకి పాతాళగరిగె వేస్తారు. ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లు అది సింధువును ఇముడ్చుకున్న బిందువని వారికి తెలుసు.
ఎంత ఆడితే అంత/ ఇంటిల్లి పాదికి తమాషా/ శిలువ మాత్రం నీ పైనే హమేషా/
అంటూ
గాలిపటం ఎంత ఎత్తులో ఎగిరినప్పటికీ, దానికి ఆధారమైన దారం మరొకరి చేతిలో ఉన్నట్లుగానే, కుటుంబ భారాన్నంతా మోసే మనిషి బంధాలకు బానిసైన తీరును ‘పతంగి బతుకు ‘ అంటూ తన చిత్రాన్ని తానే గీసుకుంటారు.
ఎదలో గుచ్చిన ముల్లు వేయి క్యూసెక్కుల ప్రవాహమై స్రవిస్తూనే ఉంటుందని మాటను తూటాగా ప్రయోగించే మనుషులపై ఘాటుగా స్పందిస్తారు.
మువ్వల పట్టీల్ని సందుకలో పెట్టి తాళం వేసినా, గెరిల్లా వీరుల్ని అల్మారాలో బంధించినా అది వారికే చెల్లు.
గుండె ఆగిన రోజు గడప లోపల ఎంత తొందరో /
అంటూ మనిషి జీవితం ప్రకృతితో మమేకమైన తీరును స్పష్టంగా వివరిస్తారు.
కీమోథెరపీ కొలిమి/ దేహమి ప్పుడు ఆకులు రాలుతున్న వృక్షం/ నన్ను నేరుగా చూసే ధైర్యం చాలడం లేదు/
క్యాన్సర్ చికిత్సలో భాగమైన కీమోథెరపీతో మనిషి శరీరంలో కనిపించే మార్పులను హృద్యంగా వర్ణించారు.
కట్టప్ప వచ్చి కత్తితో పొడిచినా బాగుండు/ ఈ పాటకి శుభం కార్డు పడేది/
అంటూ క్యాన్సర్ వ్యాధితో విలవిల్లాడే రోగి దైన్యాన్ని తెలుపుతూనే,
లోకమంతా నన్ను మొదటిసారి పొగిడేది/
మనిషి బ్రతికున్నంత వరకు విలువను గుర్తించని సమాజం(కొంతమంది) ప్రాణాలు గాల్లో కలిశాకగానీ అనుకూలతలను ఏకరువు పెట్టదంటూ వ్యంగ్యాస్త్రాన్ని సంధిస్తారు.
మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలక బోసుకునే మనస్తత్వాలకు(ఇంకాస్త) చురక లంటిస్తారు.
కళ్ళెదుట ఎన్ని వసతులున్నా, మరెన్ని వనరులున్నా వాటన్నిటినీ సద్వినియోగ పరుచుకొని తన్ను తాను నిరూపించు కోవడంలోనే విజయరహస్యం (ఏదో) దాగుంటుందని చక్కని సందేశాన్నందించారు.
సామాజిక మాధ్యమాల సాలెగూటిలో చిక్కి విలవిల్లాడే మనుషులను తప్పులో తలో చెయ్యేసి కర్మ పాట పాడే కనికట్టు లోకమంటూ నిరసిస్తూనే, నిలువునా ముంచే నీలిచిత్రాల బారి నుండి ఆడపిల్లను అర్జెంటుగా దాచి పెట్టండంటూ హెచ్చరిస్తున్నారు.
ఎదిగిన తొవ్వెనక, ఎగరేసిన జెండా కింద ఊతమై, ఊపిరై నిలిచిన వారెందరో ఉంటారనీ, వారందించిన స్ఫూర్తిని ఏ స్థితిలోనూ మరవకూడదనీ హితవును బోధించారు.
తెలుగు ద(ధ)నాన్ని హరించి వేస్తున్న ఆధునికతకు వగచి మల్లెతీగను మన్నించమని వేడుకుంటారు.
నాగరిక మోజులో వాడిపోయే పచ్చందాలను కరోనా అద్దంలో కళ్ళకు కడుతూ, పల్లెతల్లి ఒడిలోని లాలనను జ్ఞప్తికి తెస్తారు.
ఊరి తొవ్వలో వాయిలి చెట్ల వయోలిన్ రాగాలు వింటూ మూలికల్లో ముక్కోటి దేవతలను కొలుస్తారు.
టెన్షన్ చొరబడని కోటగోడల్లో వారికి వారే రాజై,మంత్రై కలం,కాగితం పట్టుకుని మరో కవితా సంపుటికి వ్యూహరచన చేయాలని అభినందిస్తూ, ఆకాంక్షిస్తూ…..
సంగీత జలధిలో మునకలేస్తూ, స్వరాలను శ్వాసిస్తూ, రాగాలను పానంచేస్తూ, పంచప్రాణాలుగా అభిమానిస్తూ, ఆరోప్రాణంగా ఆరాధిస్తూ వన్నె తెచ్చిన స్వరకర్త లెందరో.
పలు చరణాలతో కూడిన స్వరకల్పనకి పల్లవి తిరగలి చక్రమై రాగానికి శోభ నిచ్చిన విధంగానే బాలభానుడి లేత కిరణాలైనా, సోముడి వెన్నెల జల్లులైనా ప్రకృతి సోయగమై మనసుకు హాయి గొలుపుతాయి.
సంగీత పరిభాషలో స్వరాల సమూహాన్ని ‘రాగం ‘ అంటారు. ఒక్కొక్క రాగం ఒక్కొక్క మూర్చనను కలిగి ఉంటుంది. ప్రతీ మూర్చన తనవైన స్వరాలను కలిగి ఉంటుంది. స్వరాలేవైనప్పటికీ రాగభావం మాత్రం మాధుర్యభరితమే.
చుక్కలు పరిచిన నీలాల దుప్పటి కవులకు కవితావస్తువై, కావ్యాల్లో సైతం తనదైన ముద్ర వేసుకుంది.
ఎదఎదను రంజింపజేసే సంగీత సుధ దేశకాలాల్ని బట్టి ఏ రూపు సంతరించుకున్నా(కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య), ఏ చోట ప్రవహించినా అంతిమంగా దాని లక్ష్యం అలౌకికానందమే.
సంగీత వీచికతో కూడిన శబ్దాన్ని ‘నాదం ‘ అంటారు. అనంతరాగాల సమన్వితమైన సంగీతం నాదమయం. గుప్పెడు గుండెలో కోటి భావనలు దాగి ఉన్నట్టే, అసంఖ్యాక రాగాలలో ఇమిడి ఉన్న నాదమొక్కటే.
మధురమైన ఆ సుధాగానాన్ని గ్రోలుతూ, ఆ నాద జగత్తులో పరవశిస్తూ, సంగీత సరస్సులో వికసించిన పద్మాలెన్నో.

నారాయణ అయ్యర్, అమ్మిని అమ్మాళ్ దంపతుల తనయగా 08/04/1938 భారతదేశంలోని చెన్నై నగరంలో జన్మించి, సంగీత సరస్సులో ముచ్చటగా మూడోసారి{( పద్మశ్రీ-1984), (పద్మభూషణ్-2004), (పద్మ విభూషణ్-2026)}వికసించి, తన పూదేనియల వెదజల్లిన ఈ పద్మమే ఎన్. రాజం.
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన 2026వ సంవత్సరపు పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ పొందిన ఐదుగురు సభ్యుల్లో ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ వాయు లీన విద్వాంసురాలు వయొలిన్ వాద్యంలో (కళల విభాగంలో)సాధించిన ప్రతిభకుగాను ఈ అవార్డును పొందారు.
హిందుస్థానీ సంగీతంలో నిష్ణాతురాలైన వీరు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంగీత ప్రొఫెసర్ గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తమ ఉద్యోగ నిర్వహణలో సంబంధిత విభాగానికి అధిపతిగా, ప్రదర్శన కళల విశ్వవిద్యాలయ విభాగాధిపతిగా తమ సమర్థవంతమైన సేవలు అందించి, పలు పదవులకు వన్నె తెచ్చారు.
వీరంందించిన సేవలకు గాను సంగీత నాటక అకాడమీ (1990) అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమి అందించే అత్యున్నత గౌరవమైన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ 2012లో వీరిని వరించింది.
సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడైన తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గారి శిష్యురాలిగా సంగీతంపై పట్టు సాధించారు.
ఘర్(ఇల్లు) అనే హిందీ పదం నుండి ఉద్భవించిన’ ఘరానా ‘ అనే సంగీత ప్రక్రియలో నిష్ణాతులైన హిందుస్తానీ సంగీత గురువు ఓంకారనాథ్ ఠాగూర్ వద్ద రాగవికాసాన్ని నేర్చుకున్నారు.
ఘరానా అనే పదానికి సంగీత వారసత్వం, గురుశిష్య సంప్రదాయం అని అర్థం. ఇది ఒక నిర్దిష్ట సంగీత శైలి. రాగ, గాత్ర వాద్య శైలులను అభ్యసించే విధానాన్ని సూచించే ప్రక్రియ(గ్వాలియర్ ఘరానా).
వారణాసిలో మహదేవ్ ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో ఆ నగరం యొక్క ఠుమ్రీ సంప్రదాయాన్ని కూడా అభ్యసించారు. క్రమంగా వాద్య సంగీతంలోకి అడుగుపెట్టి చివరకు హిందుస్తానీ సంగీతంలో వయొలిన్ విద్వాంసురాలిగా ఖ్యాతి గాంచారు.
తండ్రి మార్గదర్శకత్వం లో ‘గయాకి అంగ్ (గాత్ర శైలి)’ అనే ప్రక్రియను అభివృద్ధి పరిచారు. గయాకి అంటే హిందీ, అరబిక్ భాషలలో పాడటం అని అర్థం. ఖయాల్ అంటే హిందీ భాషలో ఆలోచన అనీ, పర్షియన్ భాషలో సాహిత్యం అని అర్థం. సరళంగా చెప్పాలంటే ఖయాల్ గయాకి అనేది నిర్దిష్ట శైలి, వేగం లేని వివరణాత్మక గానకళ. వీరు తమలోని సంగీత పరిజ్ఞానానికి సాధనను జోడించి వయొలిన్ వాద్యంపై మనుషుల స్వరాన్ని పోలిన విధంగా వాయించే విధానాన్ని కనిపెట్టారు.
వయొలిన్ భారతీయ సంగీత కచేరీలో, ముఖ్యంగా కర్ణాటక సంగీత కచేరీలో ఉపయోగింపబడే ప్రధాన సహకార తంత్రీవాద్యం. దీనికి ‘ ఫిడేలు ‘ అని మరో పేరు. గాంభీర్యంతో కూడిన మాధుర్యం దీని సొంతం. ఇది పాశ్చాత్య వాయిద్యమైనప్పటికీ, కర్ణాటక సంగీతంలోని అతి సూక్ష్మ గమక విశేషములను కూడా పలికించగల సామర్థ్యం ఉండటంచే ప్రధాన పక్క వాయిద్యంగా, తని వాయిద్యంగా భారతీయ సంగీతంలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించుకుంది.
కర్ణాటక సంగీత శైలిలో ప్రముఖ వయొలిన్ విద్వాంసుడైన T.N. శేషన్ తోబుట్టువు వీరు. చార్టెడ్ అకౌంటెంట్ ఐన T.S. సుబ్రహ్మణియన్ అనే వ్యక్తిని వివాహమాడి ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి, ఆ శిశువుకు సంగీత శంకర్ అని నామకరణం చేశారు.
కూతురైన సంగీత శంకర్ గారికి, మనవరాళ్లైన (సంగీత శంకర్ గారి తనయలు) రాగిణి శంకర్, నందిని శంకర్ లను వయొలిన్ వాద్యంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు.
మేనకోడలైన కళారాంనాథ్, డా. సత్యప్రకాష్ మెహంతీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఐన ప్రణవ్ కుమార్ వీరి శిష్యులు. కర్ణాటక సంగీత గాయని మరియు సామాజికవేత్త ఐన పద్మా స్వామినాథన్ వీరికి అత్తగారు. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రముఖ నేపధ్య గాయని ఐన వాణీజయరాం వీరికి వదిన.
సంగీత కుటుంబంలో జన్మించి, ఆ సాగరాన్ని మథించి, అందుండి లభించిన రాగసుధల్ని వారసత్వంగా తనవారికి పంచడమే కాకుండా, స్వపర భేదాలెంచక అభిమానించి, ఆరాధించిన (సంగీతాన్ని) వారందరికీ వితరణ చేసి, అందులోనే తాదాత్మ్యం చెందిన ఈ సంగీత శిఖరానికి(రాజం గారికి) కైమోడ్పులర్పిస్తూ…..
వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమన్వయ పరచుకుంటూ ముందు కెళ్లిన కవయిత్రి సులోచన గారి భావాల్లోంచి మొలకెత్తిన గింజ నాలుగు పదులకు పైగా కొమ్మలతో మాటల చెట్టై ఎదిగింది. కొమ్మలన్నీ (శాఖలు) కొమ్మ(స్త్రీలు)లై కత్తులు దూస్తూ ఎద లోయల్లోని ఆవేదనలను వెలిబుచ్చిన కవితలు ఎక్కువగా కనిపించాయి. కూతురిగా, ఇల్లాలిగా, తల్లిగా, ఉపాధ్యాయురాలిగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నప్పటికీ, మనసు మూలల్లో ఎక్కడో దాగిన అసంతృప్తి కొన్నిచోట్ల కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అంతే గాకుండా జన చేతనలు, భాషా ఉద్యమాలు, సైనిక వందనాలు వీరి అక్షరాల్లో కనిపిస్తాయి. వీరి సిరా చుక్కల్లో పిచ్చుకలు గూళ్ళు కట్టాయి, పిల్లనగ్రోవులు అలరించాయి. పుటలు తిరగేస్తే…..
నా లేత హృదయ కాన్వాస్ పై పంతులమ్మ చిత్రం గీసి రంగులద్దినది నీవే
ఎప్పటికీ నా హీరో వి నువ్వే (నాన్న – నేను)//
అంటూ తనను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన తన తండ్రే తాను మెచ్చిన కథానాయకుడని (ప్రతీ ఆడపిల్ల జీవితానికి మొట్టమొదటి హీరో ఆమె కన్నతండ్రే అని మానసిక విశ్లేషకులు తరచుగా చెప్పే మాట)చెబుతారు. ఒప్పుగ నను మలచిన ఒజ్జవు నీవమ్మా//
అంటూ అనురాగమూర్తి ఐన అమ్మకు వందనం సమర్పించుకుంటూనే
సంధ్య పొద్దున నేనేమి ఇవ్వగలన మ్మా నీకు నీ సేవలో తరించెద నమ్మా (ప్రేమ బంధం)//
అంటూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల పాల్జేసే వారిపై చర్నాకోల ఝుళిపించారు.
నా క్షేమం కోరి స్వేచ్ఛను హరిస్తారు (అందమైన పంజరం) //
ఆడపిల్లను అరటాకుగా కాపాడుకునే ప్రయత్నంలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ఒక స్త్రీ మానసిక వేదనకు ఎంతగా కారణమవుతోందన్న విషయాన్ని కళ్ళక కట్టారు.
ఉదయాస్తమయాల నడుమ బొంగరంలా తిరిగే ఒక ఇల్లాలి అంతరంగాన్ని నాలుగు చేతుల దేవత నవ్వుల వెనుక నలిగిన ఆశలు,ఆశయాలను(ఆ నవ్వు వెనుక) అంటూ హృద్యంగా వర్ణించారు.
ప్రేమ మొలక(మిథునం)కు వలపుల పరిమళాల నలది దాంపత్య బంధాన్ని నిర్వచించిన తీరు అద్భుతం.
నీట కరిగే రూపం నుండి నీటిని నిలుపుకునే స్థాయిగా ….. జీవితమూ (పరిణామ పరిణతి)ఇంతే //
జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలే మనిషిని పరిపూర్ణుడని చేస్తాయని చెబుతూనే,
నాగరిక ఉప్పెనలో కొట్టుకుపోయిన మట్టి గంధానికి సమస్త సుగంధ ద్రవ్యాల సారం(మట్టి- మనిషి)అంటూ పట్టం కట్టిన తీరు మహోన్నతం.
కుంచె నా చేతిలోనే ఉన్నది
నా చేయి పట్టుకున్నది ఎవరో
రంగులు నావే అద్దుతున్నది నేనే…..
ఒక్కటంటే ఒక్కటి నాకు తృప్తినివ్వలేదు (జీవన చిత్రం)
ఎన్ని విధాలుగా దూసుకెళ్లినా, ఎంత ఫలప్రదమైన జీవితాన్ని అనుభవించినా మనసు అట్టడుగు పొరల్లో ఘనీభవించి ఉన్న పరాధీనత సెగై స్త్రీ హృదయాన్ని ఎంతగా రగిలిస్తుందో ఆర్తి గా వ్యక్తీకరించారు.
కొరివితోనే మోక్షం అయితే (ప్రశ్నిస్తున్నన్నా)నే పట్టలేనా? పెట్టలేనా!
అంటూ సమాజంలో వేళ్ళు కొనిపోయిన లింగ వివక్షపై అస్త్రాన్ని సంధించారు.
నేలకేసి కొడితే నింగిదాకా ఎగురుతా//
అంటూ
శృతి మించిన అణచివేత తిరుగుబాటుకు పునాది అవుతుందని హెచ్చరించారు.
సమస్యల సుడిగుండంలో చిక్కి విలవిల్లాడే సాటి స్త్రీని (కత్తులు దూస్తున్న కొమ్మలు) అవసరమైతే సంఘటితమై ఛేదించి సాధించాలని చైతన్య పరుస్తున్నారు.
సగంలో వదిలిన రాగాలను శృతి చేసుకుంటూ, కరిగే మంచై, రగిలే నిప్పై, విలువలపై స్వారీ చేస్తూ విశ్వమంతా చుట్టే వజ్ర సంకల్పంతో సాహితీ లోకానికి మరిన్ని సంకలనాలను అందించాలని అభినందిస్తూ, ఆకాంక్షిస్తూ…..
సృష్టికర్త ఆకుపచ్చని మగ్గాలపై అందంగా నేసిన జరీ నేతలు రంగుల పూలై కనువిందు చేసే పూల జాతర
పసుపు రాసిన గడపల్లోంచి
అలికి పూసిన లోగిళ్ళలోకి
అరుదెంచిన పుత్తడి బొమ్మ
గునుగు పూల అందెలు ధరించి గుమ్మడిపూల కిరీటం దాల్చి పసిడి కాంతుల్లో తళుకులీనే తంగెడు కొమ్మ
ఆరుబయళ్లలో విరబూసిన అడవి పూల సోయగాలకు జతగూడిన కాంతల కళానైపుణ్యంలో వెదురు బుట్టలో మెరిసిన ముద్దుగుమ్మ
పుష్పదొంతరల నడుమ పూలంగి సేవలో కొలువుదీరిన పువ్వుల బొమ్మ
రంగుల కోకలు దాల్చిన కలికి చిలుకలు పంచవన్నెల రామచిలుకలై శ్రీ గౌరీకి చేసే ఉయ్యాల సేవ
కొత్త కోడలికి అత్తవారింటి ఆత్మీయ వాయినం
తరువులమ్మ నదీమ తల్లికి సమర్పించే పూల వాయినం
సత్యవతీ ధర్మాంగుల ముద్దుల పట్టిగా వేములవాడకు వేంచేసిన బృహదమ్మ
గాజుల గలగలలు గజ్జెల చప్పుళ్లలో రమణులంతా గూడి రాగ సరాగాల్లో సందడి చేసే సాంస్కృతిక సమ్మేళనం
మంగళ వాద్యాల హోరులో కొవ్వొత్తుల వెలుగుల్లో బృహ దీషుని చేరుకోమంటూ చాళుక్యులు సదిగట్టి సాగనంపే సద్దుల బతుకమ్మ
చారిత్రక నవలాచక్రవర్తి , చారిత్రక నవలాసమ్రాట్, అభినవ పాల్కుర్కి బిరుదులు పొందిన డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారి కలం లోంచి వెలువడి ఆగస్టు – సెప్టెంబర్,1977 వ. సంవత్సరములో విజయబాపినీడు వారి ‘ విజయ ‘ పత్రికలో అనుబంధ నవలగా ప్రచురించబడిన ‘ఆవాహన ‘ అనే చారిత్రక నవలకు నేను వ్రాసిన విమర్శనాత్మక వ్యాసం.
ముదిగొండ శివప్రసాద్ గారి ఆవాహన నవల తల్లి ఐతే, ఆ తల్లి గర్భంలోంచి పురుడు పోసుకున్న శిశువే నా ఈ రచన.
ఇంత అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ రచించిన శివప్రసాద్ గారికి ముందుగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వారే గనుక ఈ రచన చేయకపోయి ఉంటే, ఈ చారిత్రక కథ ప్రపంచానికి ఎప్పటికీ తెలిసి ఉండేది కాదు.
ఈ నవలపై నేను వ్యాసం వ్రాయడానికి గల కారణాలు తెలియాలంటే, నా జీవితంలో విచిత్రంగా జరిగిన కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాల్సి ఉంటుంది.
నాకు దాదాపు 8 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు మా ఇంట్లో అందరూ ఈ నవలను చాలా ఆసక్తిగా చదివేవారు. ఇంతకంటే ఆసక్తికరమైన మరో విషయమే మిటంటే, ఇది చదివే సమయంలో మా అక్క (అందరిలో పెద్ద) కు మొదటిసారిగా ప్రసవం జరిగిన రోజులవి.ఇంట్లో పసిబిడ్డ ఉన్నప్పుడు ఆ కుటుంబంలోని వారు, ముఖ్యంగా ఆమె(బాలింత) తల్లి ఎంతగా పనుల ఒత్తిడిలో ఉంటారో నేను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను. పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకుని మా అక్క, ఊపిరి సలుపని పనుల్లో ఉండి కూడా ఏ కాస్త సమయం చిక్కినా మా అమ్మ, ఇంటికి వచ్చీ రావడంతోనే మా నాన్న ఇలా అందరూ ఆసక్తిగా చదివేవారు.చదవడమేగాకుండా దాని గురించి చర్చిస్తూ ఉండేవారు. ఆడుకోవడానికి పక్కింటికీ, ఎదురింటికీ వెళ్లినా,అక్కడ కూడా ఇవే చర్చలు సాగుతూ ఉండేవి. వాళ్ళ చర్చల్లో ఎక్కువగా కామసాని, ఆవాహన, నర్తకి , శిల్పి వంటి పదాలు దొర్లుతూ ఉండేవి. ఆ మాటలు అర్థం చేసుకునే వయసు గానీ, కథను గురించి ఆలోచించే శక్తి గానీ నాకు లేకపోయినప్పటికీ, ఎందుకో రెప్ప వెయ్యకుండా వాళ్ళనే చూస్తూ, వాళ్ళ మాటలు వింటూ ఉండేదాన్ని.
అంతమందిని కదిలించిన ఆ కథ ఏమై ఉంటుందా!? అన్న ఆలోచన నా వయసు తో పాటే పెరుగ సాగింది. కాస్త సమయం గడిచాక ఆలోచిస్తే నాకు అర్థమైన విషయ మేమిటంటే, స్థానికత వాళ్ల ఆసక్తికి ఒక బలమైన కారణమని. మేమ ప్పుడు వరంగల్ జిల్లాలోని ములుగు లో నివాసం ఉండే వాళ్ళం.
పుస్తక పఠనం అనేది నాకు ఒక అభిరుచిగా మారడం, క్రమక్రమంగా కాస్తో,కూస్తో కలాన్ని కదిలించే శక్తి నాకు దైవదత్తంగా అబ్బడంవల్ల ఎందుకో నాకు ఈ కథను తప్పనిసరిగా చదవాలి, విషయమేమిటో తెలుసుకోవాలి, వీలైతే దానిపై వ్యాసం వ్రాయాలి అన్న కోరిక క్షణక్షణానికీ పెరుగసాగింది. విషయం తెలుసుకున్న మావారు పలు పుస్తక విక్రయదారులను సంప్రదించి 30-08-2022 నాడు పుస్తకాన్ని తెచ్చి నా చేతిలో పెట్టడం, నేను అదే క్షణంలో మొదలుపెట్టి ఏకబిగిన పూర్తి చేయడం, కథలో లీనమై కళ్ళారా దర్శించిన అనుభూతికిలోనై వర్తమానానికి రావడం జరిగింది. నవల చదివాకగానీ నాకు అర్థం కాలేదు, అది వరంగల్లోని వేయి స్తంభాల గుడికి సంబంధించిన కథ అని.అప్పటి వరకు నేను అది రామప్ప గుడికి సంబంధించినద నుకున్నాను. ఇక చదవడం పూర్తయ్యాక నా మదిలో మెదిలిన భావాలను వ్యక్తపరచాలంటే బహుశా నా రచనాపటిమ సరిపోదేమో అనిపించింది. ఆసక్తీ, ఆశ్చర్యం, ఉద్విగ్నత అన్నీ మిళితమైన అనిర్వచనీయమైన భావన. గతానికీ,వర్తమానానికీ; ఆనందానికీ,విషాదానికీ నడుమ అంతు చిక్కని అవ్యక్తానుభూతి.

మనం ఎన్నో ప్రేమ కథల్ని చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అందులో కొన్ని ఫలించి ఆనందాల హరివిల్లులైతే మరికొన్ని ఎండమావులకు ప్రతీకలుగా మిగిలిపోతాయి. మనిషి యొక్క ఆత్మ దేహత్యాగం చేసిన మరుక్షణం అందులో ఒదగబడిన ఈ ప్రేమ అనే సుగంధ కుసుమం కూడా పంచభూతాల్లో కలిసిపోతుంది. అది సర్వసాధారణం, కానీ ఇక్కడ వైవిధ్యభరితమైన, గుండెల్ని మెలిబెట్టే అంశమే నా చేత ఈ వ్యాసం వ్రాయించింది.
కాకతీయ సామ్రాజ్య ఆస్థాన శిల్పి భళ్లాల సోమేశ్వరునికీ, ఆస్థాన నర్తకి కామసానికీ నడుమ విరిసిన ప్రణయ కథ.
వరంగల్ జిల్లా పాల్కుర్కి గ్రామంలో జన్మించిన సోమేశ్వరుడు శైశవ దశలో ఉండగానే తల్లిదండ్రులు కాలం చేయడంతో మల్యాల గుండయ్య, కుప్పమ్మ దంపతుల బిడ్డగా పెరిగి పెద్దవాడవుతాడు. ఆస్థాన నర్తకి చామకాంబ కూతురైన కామసాని తల్లి వద్ద నాట్యాన్ని అభ్యసించి, తన నాట్యకౌశలంతో సామ్రాజ్య విస్తరణ గావించినందుకుగాను ప్రభువుల మన్ననలందుకొని ఆస్థాన నర్తకి పదవినలంకరిస్తుంది.
ఐతే ఫలించని ఈ ప్రేమ కథకు కారణాలేమిటి ? వేయి స్తంభాల గుడికీ,ఈ కథకూ మధ్య ఉన్న సంబంధమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే, ‘ఆవాహన’ అనే ఈ నవలా వారధిపై 12వ శతాబ్దంలోకి మన ప్రయాణం సాగాల్సిందే.
కళాశాల అధ్యాపకుడైన రామచంద్రరావు, బ్యాంకు ఉద్యోగై న మాధవరావు ఇద్దరూ మంచి స్నేహితులు. ఉద్యోగరీత్యా వరంగల్ బదిలీ ఐన మాధవ్ అంతకుముందే వరంగల్లో నివాసముంటున్న రామచంద్రకు తాము వరంగల్ వస్తున్నామనీ, తమకొక మంచి ఇల్లు అద్దెకు చూసి పెట్టమనీ ఉత్తరం వ్రాయడంతో కథ మొదలవుతుంది.
భార్యను, కూతుర్ని వెంటబెట్టుకొని మాధవ్ కాజీపేట రైల్వే స్టేషన్ లో రైలు దిగడం, రామచంద్ర దంపతులు ఆతిథ్య మివ్వడం మామూలే అయినప్పటికీ, రెండు జంటలూ మొదటి కలయికలోనే స్థానిక దర్శనీయ స్థలాలపై పోటాపోటీగా చర్చించుకోవడం, ఎప్పుడెప్పుడు చూడాలా ?! అని అందరికందరూ ఉబలాటపడటం, అప్పటికప్పుడు పట్టిక రూపొందించుకోవడం కాస్త నవ్వు తెప్పిస్తుంది.
ఐతే కథనెక్కువగా సాగదీయకుండా, పని వేళలు ముగిసి బ్యాంకు నుండి ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో వేయి స్తంభాలగుడి చూడాలన్న ఉత్సు కతతో మాధవ్ లోపలికి అడుగుపెట్టడంతో, గజ్జెకట్టిన కట్టిన కాలికీ,ఉలి పట్టిన చేతికీ నడుమ విరిసిన ప్రణయానికి తెరతీశారు రచయిత.
ఆలయంలోని అణువణువూ నిశితంగా పరిశీలిస్తూ వెళుతున్న మాధవ్ కు పుష్కరిణి, దాని పక్కనే శిలాశాసనం, అక్కడి నుండి పడమరకు మళ్లగా ఉత్తర దిశగా ముఖం పెట్టి ఉన్న నంది కనిపిస్తాయి. నందిపై చెక్కి ఉన్న శిల్ప సౌందర్యానికి ముగ్ధుడవుతూ ఎదురుగా ఉన్న శివాలయంలోకి అడుగుపెట్టి, ఆలయ నిర్మాణాన్నీ , ఆలయ స్తంభాల మీద చెక్కబడి ఉన్న డిజైన్లనూ,సన్నటి లతలనూ గమనిస్తూ,పరమేశ్వరుని దర్శించుకొని ఇవతలికి వచ్చి నందీశ్వరుని వెనుక ఉన్న మరో ఆలయంలోకి అడుగు పెడతాడు.

కొంత భాగం శిథిలమై, మరికొంత అసంపూర్ణంగా ఉన్న ఆ కట్టడాన్ని చూసి , “ఏ కారణం చేతనో కాకతీయులు ఈ మంటపాన్ని పూర్తి చేసినట్లు లేదు, ఆ రోజుల్లోనే ” అని తనలో తాను అనుకుంటూ ఇంకాస్త ముందుకెళతాడు.
వైశాఖ పూర్ణిమనాటి ఆ వెన్నెల మంటపంలోని శిలలు, శిల్పాలు, లతలపై కురుస్తూ ఆ పర్యాటకుని లోని కళాతృష్ణను రెట్టింపు చేస్తోంది.నెమ్మదిగా మరో అడుగు ముందుకేసిన అతనికి ఒక నర్తకి బొమ్మ కనిపిస్తుంది. ఎందుకో ఆ బొమ్మను చూడగానే అతని శరీరం గగుర్పొడిచి, కాళ్ళు అంగుళం కూడా కదలకుండా, కళ్ళనుండి నీరు కారిపోతూ ఉంటే, ఆ శిల్పాన్నీ,దానిలోని రామణీయక సజీవ చిత్రణను చూస్తూ, ముగ్ధుడై ఆ బొమ్మ ముందు తానూ ఒక రాతి బొమ్మలా చలనం లేకుండా నిలబడిపోతాడు. అలా ఎంతసేపు నిలబడ్డాడో? ఎందుకు నిలబడ్డాడో తెలియదు (శిల్ప శాస్త్రానికి సంబంధించిన ఏ విధమైన పరిజ్ఞానంలేని, ఉలి మలుపుల్లో ఇమిడిన రసాత్మకతపై ఏ విధమైన అవగాహనలేని వ్యక్తి నీళ్లు నిండిన కళ్ళతో, తన్మయత్వంతో చూస్తూ, దాని ముందు స్థాణువులా నిలబడి పోవడానికిగల కారణమేమై ఉంటుందన్న ఆలోచన పాఠకుల మదిలో మెదులుతుంది). ఇతను మాత్రమే కాకుండా, ఈ కథను చదివే పాఠకులందరిలోనూ ఇదే గగుర్పాటు కలగడానికి కారణం కంచికి చేరని ఈ కథేనా?! లేక రచనా వైదుష్యమా?! అనే ప్రశ్నకు సమాధానాన్ని ఎవరికి వారే శోధించాలి.
ఆ పారవశ్యంలో అతను ఇంకెంతసేపు ఉండిపోయేవాడో గానీ,” ఏమిటి చూస్తున్నావు?” అనే పలకరింపుతో ఉలిక్కిపడి వెనుదిరిగిన అతనికి, కాళ్లు చాపుకొని,మోకాళ్ళపై రెండు చేతులు ఆనించుకొని, రాశిపోసిన సౌందర్యంతో వెలిగిపోతూ స్వర్గలోకం నుండి దిగివచ్చిన అప్సరకాంతలా కిలకిల నవ్వుల జవరాలు శిథిల మంటపంలో ఓ వారగా కూర్చుని దర్శనమిచ్చింది.
“మీరు ఎవరు ?”అని యాంత్రికంగా అతనడిగిన ప్రశ్నకు “నేను మీ అమ్మగారి సేవకురాలిని” అని వ్యంగ్యంగా సమాధానమి వ్వడం, ఆజ్ఞాపించినట్లున్న కంఠస్వరంతో “కూర్చో” అంటూ ఏకవచన సంబోధన చేయడం, “సోమూ!” అంటూ తనను ఆత్మీయంగా, చనువుగా సంబోధించడం, అప్పుడే కిలకిలా నవ్వుతూ, మరుసటి క్షణంలోనే వలవలా ఏడుస్తూ, తానెన్నడూ చూడని ఆ స్త్రీ , తానెప్పటి నుండో పరిచయం ఉన్న వ్యక్తి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే, ఆమె మాటలను అర్థం చేసుకోలేకా ,ఆమె భావోద్వేగాలను అంచనా వేయలేకా , తికమకపడుతూ ఏం మాట్లాడితే ఎక్కడ తననొదిలి వెళ్ళిపోతుందేమోననే భయంతో ఆమె కోపాన్ని, వ్యంగ్యాన్ని, బాధను, దుఃఖాన్ని, ఆమెలోని అనుకూల – ప్రతికూల భావాలకు సానుకూలంగా స్పందిస్తూ, సుతిమెత్తగా సమాధానాలిస్తూ ఉండగానే, ఆమె ఏడుస్తూ శిల్పాల చాటుకు వెళ్లి కనుమరుగ వుతుంది. ఎంత వెతికినా ఏ విధమైన ప్రయోజనం లేకపోవడంతో, మౌనంగా ఇంటిదారి పట్టి,మరుసటి రోజు సాయంకాలం మళ్లీ అదే చోటుకి వచ్చి ఆమె జాడ కోసం వేచి చూస్తూ ఉంటాడు.
జాబిలి కిరణాల జల్లుల్లో తడుస్తున్నది అతని శరీరం మాత్రమే. నిన్న జరిగిన సంఘటన నిజమా?! కలా?! అన్న సందిగ్ధంలో మనసు అల్లకల్లోలమవుతోంది. మూడోనాటి వరకు సాగిన ప్రయత్నం వృధా ప్రయాసే కావడంతో నిస్పృహకు లోనైన అతని అంతరంగంలో రామచంద్రను చూడగానే కొత్త ఆశ చిగురిస్తుంది. ఆదివారంనాటి ఆ విహారయాత్రలో రెండు కుటుంబాలు కోట చుట్టూ హుషారుగా కలియదిరుగుతూ ఉంటే,గుండెలో రేగుతున్న అలజడి అతడిని మాత్రం ఓ పట్టాన నిలువనియ్యడం లేదు. ఒక్కొక్క రాతినీ తాకుతుంటే , అంతుపట్టని అలజడేదో తరంగాలై అతని నాడీ మండలానికి అజ్ఞాత సందేశాలు అందిస్తూనే ఉంది.
ఇక ఏమాత్రం తమాయించుకునే శక్తిలేని మాధవ్, తనకెదురైన అనుభవాన్ని పూసగుచ్చినట్లుగా రామచంద్రకు తెలుపడం, తిరుగు ప్రయాణంలో భద్రకాళి అమ్మవారి గుడిలో మాధవ్ స్పృహ కోల్పోవడంతో సాలోచనలో పడిన రామచంద్ర ఒకనాడు ఒంటరిగా ఆలయానికి వెళ్లి, ఆ పరిసరాల న్నిటినీ జాగ్రత్తగా గమనించి, అక్కడ కనిపించిన భక్తులను మాటల్లోకి దింపి ఏదైనా సమాచారాన్ని రాబట్టాలని ప్రయత్నించి, ఏ విధమైన ప్రయోజనంలేక ఇంటికి తిరిగివచ్చి, ఆమె మాధవ్ తో పలికిన పలుకులను మననం చేసుకుంటూ తన స్టడీ రూమ్ లోనికి వెళ్లి, వరంగల్ కు సంబంధించిన చరిత్ర పుస్తకాలను శోధిస్తూ ఉంటాడు.
స్నేహానికి ప్రాణమిచ్చే రామచంద్ర చరిత్ర పరిశోధకుడు కావడం యాదృచ్ఛికమే అయినా, అదే బలమైన కారణమై ఈ కథను ప్రపంచానికి అందించింది.
తనువు, మనసు అదుపు తప్పిన మాధవ్ కు ఎప్పటికప్పుడు కొత్త శక్తి నందిస్తూ ,ఆమె నోటి నుండి వెలువడిన (చిన్నమ్మ, పెద్దమ్మ, మల్యాల గుండయ్య, త్రిసరాలు, తాటంకాలు) మాటలను ఎప్పటికప్పుడు మాధవ్ నుండి తెలుసుకుంటూ, వాటిని గ్రంథాలయంలో రూఢి పరుచుకుంటూ, శిధిల మంటపం లో భూస్థాపితమైన ప్రణయ ప్రబంధాన్ని వెలికి తీసి, జాతికి అందించిన సాహసి, ప్రేమ పిపాసి(రామచంద్ర).
మొత్తం 10 పున్నములు ఆమె ప్రత్యక్షమవగా, చతుర్దశి నాటి సాయంత్రం అలికిడి ప్రారంభమై, పౌర్ణమి నాడు కనిపిస్తుందంటూ రెండవ కలయికలోనే చెప్పగలిగిన అతని (రామచంద్ర) తెలివితేటలు, గ్రహణశక్తి పాఠకులను ఆశ్చర్యంలో ముంచేస్తాయి.భార్యాబిడ్డలతో మొదటిసారి కాజీపేటలో రైలు దిగిన మాధవ్ తో ” మా చెల్లెలికేం సమస్యలేరా ? నేను లేనా శ్రీకృష్ణుడి లాంటి అన్నయ్యను, ఏదైనా కష్టం వస్తే చక్రం అడ్డువేయనూ ” అనీ,
నీవేం భయపడకమ్మా ! ఊళ్ళో నల్లాలు బందైతే నీకోసం హుస్సేన్ సాగర్ నుంచి తెప్పిస్తాం” అనీ
మంచితనం, మాటకారితనం కలగలిసిన పరిహాసంతో అన్న మాటలే అయినప్పటికీ, మానసికంగా, శారీరకంగా కృంగిపోయిన భర్తను చూసి ఆ ఇల్లాలు(మాధవ్ భార్య) పడే వేదనకు శ్రీకృష్ణుడిలా చక్రం అడ్డువేసి వారి అనురాగ బంధాన్ని పువ్వుల్లో పెట్టి వారికప్పగించిన రామచంద్ర ఈ కథకు గుండెకాయ వంటివాడు. ఊళ్లో నా అన్న వారెవరూలేని ఆ ఇల్లాలికి అన్నీ తానై బాసటగా నిలిచిన కాత్యాయిని (రామచంద్ర భార్య) మహిళాలోకానికి ఆదర్శ ప్రాయురాలు. రామచంద్ర కు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించిన ఆనందరావు గారు ఆవాహన అనే ఈ క్రతువులో శ్రీగంధం వంటి వారు.
కోయిల గానాలు, వీణానాదాలు, సెలయేటి గలగలలు, వలిమిన్న జల్లుల అందాలన్నీ కలబోసిన వెన్నెల బొమ్మ ప్రతి పున్నమి రేయిలో అతడిని కరుణిస్తూనే ఉంది. కళ్లెదుట సాక్షాత్కరిస్తూనే ఉంది.
మూడవ కలయికైన ఆషాఢ పున్నమినాటి రాత్రి ఆమె మాటలను బట్టి ఆమె పేరు కామసాని అనీ, అతని పేరు సోమేశ్వరుడనీ, కాకతీయ సామ్రాజ్య మల్లెపందిరిపై వాలిన ఈ ప్రేమపక్షులు సామ్రాజ్యకాంక్ష అనే శ రాఘాతానికి నేలరాలిన జంట గువ్వలనే విషయం పాఠకులకు అర్థమవుతుంది.
తమ పూర్వీకుల నిర్మాణకాంక్ష ఐ న సహస్రమంటపం శిల్ప రూపంలో సజీవంగా ఉండాలన్న సంకల్పంతో రుయ్యమ్మ (తన తల్లి, కాకతీయ సామ్రాజ్ఞి ఐన రుద్రమదేవి పేరుమీద ఆజ్ఞాపత్రం రూపొందించి) గోళకీ మఠ నిర్మాణానికై సోమేశ్వరుని మందడ పంపించేస్తుంది.

సోమేశ్వరుని అమరశిల్పిగా మలచాలనీ,కాకతీయ శిల్పం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలనీ, కామసానీ సోమేశ్వరులు వివాహ చట్రంలో ఇమిడితే, వారిరువురి నడుమ ఏర్పడే బంధం అతనిలోని కళాభిని వేషానికి ప్రతిబంధకంగా మారుతుందనీ,అందుకే అతడిని మందడ పంపించడం అనివార్యమైందనేది ఆమె వాదన.
పుత్ర సంతానం లేని గణపతి దేవులవారు తమ కుమార్తె అయిన రుద్రమదేవిని తమ రాజకీయ వారసురాలిగా ప్రకటించడం, వారి నిర్ణయానుసారం ఆమె పురుష వేషాన్ని ధరించి అత్యంత సమర్థవంతంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండటాన్ని కళ్లారా చూస్తూ ఉండి కూడా, రుయ్యమ్మ వివాహం వీరిద్దరిలోని కళను దూరం చేస్తుందని ఆలోచించడంలో ఏ విధమైన బలం లేదు. ఇకపోతే రుద్రమదేవిగారికి కూడా పుత్ర సంతానం లేదు. వారి కుమార్తెలైన ముమ్మడమ్మగానీ, రుయ్యమ్మగానీ వారి తదనంతరం ఏ క్షణంలోనైనా పాలనా బాధ్యతలు చేబూనడానికి సర్వసన్నద్ధులై ఉండాలి, కానీ ఈ ఇద్దరు సోదరీమణుల్లో ఏ ఒక్కరు కూడా అవివాహితులుగా మిగిలిపోలేదు సరికదా, చక్కని గృహస్థ జీవితంలో ఇమిడిపోయారు.రాజ్యపాలనకు ప్రతిబంధకంకాని వివాహం కళా సాధనకు ఎందుకు ఈమెకు కారణంగా కనిపించిందన్న ఆలోచనకు సమాధానం దొరకడం లేదు.
తనకు అస్వస్థతగా ఉందన్న విషయం తెలుసుకున్న రుయ్యమ్మ పరామర్శ అనే మిషతో ఒకనాటి సాయంత్రం తమ ఇంటికి వచ్చి, తనకు(కామసానికి) తీరని అన్యాయం చేశానన్న మాట నిజమేననీ(పేజీ-116), ఒక జంటను తీరని బాధకు గురి చేశానని తనకు తెలుసనీ (పేజీ-118), ఒక స్త్రీ మరొక స్త్రీని కోరకూడనిదే – అయినా కోరుతున్నాను (పేజీ-119) అని అన్నదనీ, ఐనప్పటికీ తామిద్దరూ విడిపోవడానికి, తాను(రుయ్యమ్మ) పూర్తి కారకురాలిని కాననీ,అందులో తన పాత్ర కొంత వరకే పరిమితమై ఉందనీ మిగిలినదంతా దివ్య సంకల్పాలలో భాగమనీ, ఐతే అదంతా తన కోసం కాదనీ,కాకతీయ సామ్రాజ్య క్షేమం కోసం, సోమేశ్వరుని అమరత్వం కోసం ఈ త్యాగం చేయక తప్పదని (పేజీ- 119)తనతో అన్నదని అతనితో చెబుతుంది. దివ్య సంకల్పాల సంగతి దేవుడెరుగు,దివ్య సంకల్పాలలో భాగమే అయితే తాము విడిపోవడం కూడా యాదృచ్ఛికంగా జరగాలేతప్ప ఏ రాజకుమార్తె పనిగట్టుకుని చక్రం తిప్పాల్సిన అవసరం లేదు. త్యాగం అనేది పగిలిన గుండెలోంచి ఎగిసిపడే విస్ఫోటనం, తట్టుకోలేని బాధలు, తీరని వేదనల నుండి పెల్లుబికే కఠిన శిలాద్రవం. అక్కడ తడికి ఆనవాలుగానీ, చెమ్మకు చోటుగానీ ఉండదు. అది బద్దలైన అగ్నిపర్వతం లోంచి వెలువడే లావా, భూమి(గుండె) పొరల్ని చీల్చుకొచ్చే మాగ్మా. ఏ వ్యక్తి అయినా తనకు తానుగా తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప, సంతలో దొరికే రెడీమేడ్ వస్తువు కాదు. ఎవ్వరిని అడగడానికైనా, ఎవ్వరికి ఇవ్వడానికైనా. తెర వెనుక సూత్రధారై,తెరమీద పా త్రధారై,చేదు గుళికలకు చక్కెర పూతలద్దినట్లు, మాటలతో మంచు తెరలు కట్టి, ఆమె ఎంత శాంతంగా చెప్పినప్పటికీ, తన గుండెల్లో కుంపటి రాజు కుంటున్నట్టుగానే ఉందనీ చెప్పిన తీరు”పేదల కోపం పెదవికి చేటన్నట్లు………. ప్రకటించారు (పేజీ – 115) అనే మాట ద్వారా పాఠకులకు స్పష్టమవుతుంది.
“నాకు మిగిలింది అదే రాజకుమారి గారూ!” (పేజీ- 114)అనీ,”నన్ను చూడటం కోసం ఏ రాజకుమార్తె రానవసరం లేదు”(పేజీ – 115) అనీ,”ఒక రాజకుకుమార్తెగా కాక ఒక స్త్రీగా ఆలోచించు” (పేజీ-116) అని అనడం వంటివి ఆమె అనుభవించే వేదనను తెలుపడమే గాక, ఆమెలోని ముక్కు సూటితనం, నిక్కచ్చిత్వం, తన సమస్యను ఎదుర్కోవడానికి ఎంత ఘాటుగా నైనా (కోపం, ఆవేశం, దుఃఖం, వ్యంగ్యం, ధిక్కారం అన్నీ కలగలిసిన ప్రవర్తన) స్పందించే మనస్తత్వాన్ని వీరిద్దరి నడుమ జరిగిన ఆనాటి వాగ్వాదం పాఠకులకు అద్దంలో చూపెడుతుంది.
వెంజావళి రవిక, హూని పట్టు చీరలో ముస్తాబై వచ్చిన కొత్త పెళ్ళికూతురు సాటి ఆడపిల్లతో ప్రేమను త్యాగం చేయమనీ, పెళ్లిని విరమించుకోమనీ శాసిస్తోంది. ఆమె ఔన్నత్యానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ఆమెలోని రాజనీతికి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను.
రుయ్యమ్మ చేసిన ధర్మోపన్యాసం(పేజీ -122) ఎంత గొప్పదైనా,ఆదర్శప్రాయమైనదైనా మానసికంగా తాను ఆ స్థాయికి ఎదగలేదనీ,తన స్థానంలో ఆమె ఉంటే ఇలాగే ఆలోచించి ఉండేదా? అనీ అతనితో అంటుంది. కాంచీపురంపై కాకతీయ బావుటా నెగరేసిన అసాధారణ ప్రతిభాశాలి ఐన కామసాని ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ఏ విధమైన ఆశ్చర్యం లేదు.
కాకతీయ సామ్రాజ్యపు మకుటం లేని మహారాణిగా రుయమ్మనూ, రాజకీయ దురంధరనిగా అన్నయా మాత్యుల వారిని చరిత్రలో సుస్థిర పరచాలని మరెవరైనా పథకం రచించి, అమలు పరిస్తే అప్పుడు గానీ అర్థమయ్యేది కాదు రుయ్యమ్మకు తన ఆదర్శ స్వప్నం సంగతి అన్న ఉక్రోషం ఆమె మాటల్లో ధ్వనిస్తుంది. సామ్రాజ్య క్షేమం కోసం సాంసారిక జీవితంలో పాక్షిక త్యాగాన్ని తాను కూడా చేయగలననీ, కానీ నృత్యానికి అంకితమైన ఒక దేవదాసి లాగా(పేజీ-124), జీవితాంతం ఒక బౌద్ధ సన్యాసినిగా జీవించేందుకు తన మనసు సిద్ధంగా లేదనీ
సోమేశ్వరునితో చెప్పి బాధపడుతుంది (పేజీ – 122).
ఇద్దరూ కాకతీయ సామ్రాజ్య కళాకారులే అయినప్పటికీ, శిథిల మంటపంలోని వారి మొదటి కలయికలో “నేను మీ అమ్మగారి సేవకురాలిని”(పేజీ- 13)అని ఆమె జీవాత్మ మాధవ్ తో వ్యంగ్యంగా అంటుంది.
కాంచీపుర విజయానంతరం వీరిద్దరికీ ఏకాంతం దొరకనివ్వకూడదని తన రాజకుమార్తె స్థాయిని కూడా పక్కనపెట్టి నిరంతరం శిల్పాల వద్ద కూర్చుని సోమేశ్వరునితో శాస్త్రం గురించి చర్చలు జరపడం, గోళకీమఠ నిర్మాణానికై అతడిని మందడ పంపించేయడం, ప్రతాపరుద్రుని నామకరణ మహోత్సవానికి అతడిని రానివ్వకపోవడం వంటి విషయాలతో పథకం ప్రకారమే రుయ్యమ్మ తామిద్దరినీ విడదీస్తుందని తెలిసి కూడా, సామ్రాజ్య విస్తరణలో ప్రజల్ని, కళాకారుల్ని భాగస్వామ్యం చేయా లే తప్ప, సామ్రాజ్య కాంక్షకు వాళ్లను సమిధలుగా మార్చకూడదన్న విషయాన్ని ఒక రాజ్యాధినేతగా, ఒక మాతృమూర్తిగా రుద్రమదేవి రుయ్యమ్మకు హితవును బోధించకుండా మౌనంగా ఉండటమే ఆమె గొంతులోని వ్యంగ్యానికి కారణమన్న విషయం పాఠకులకు స్పష్టంగా అర్థమ వుతుంది.
వారి అసమాన శౌర్య ప్రతాపాలు, పరిపాలనా దక్షతలతో ప్రపంచ దృష్టిని ఏకశిలా నగరం వైపు ఆకర్షించి, చరిత్రలో కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన ఒక ధీరవనిత పేగు తెంచుకు పుట్టిన కుమార్తెను విమర్శించే స్థాయి నాకు లేకపోయినా, బద్దలైన ప్రేమభాండమే నా ఈ స్పందనకు కారణమని పాఠకులకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ స్పందన నాకు మాత్రమే పరిమితమైంది కాదనీ, నా వంటి ఎంతో మందిలో ఇవే ఆలోచనలు రేకెత్తాయనడానికి ఈ నవల (ఆవాహన) ప్రచురితమైన తొలినాళ్లలో ఇంటింటా జరిగిన చర్చలే బలమైన నిదర్శనాలు.
కేవలం కళ అజరామరం కావాలనీ, కళాకారులైన కామసానీ, సోమేశ్వరులను కళాతపస్వులుగా మలిచి, అమరత్వం ప్రసాదించాలని రుయ్యమ్మ రాజకీయంగా ఇలా పావులు కదిపి ఉండవచ్చా?, ఆదర్శాలనేవి మనకు మాత్రమే పరిమితమైనవనీ, మరొకరిపై బలవంతంగా వేసేవీ, శాసించేవి ఆదర్శాలనిపించుకోవనే సూక్ష్మాన్ని ఆమె గ్రహించగలిగి ఉంటే బహుశా కథ ఈ మలుపు తిరిగి ఉండకపోవచ్చు? ఈ హఠాత్పరిణామాన్ని (ఒకరి కోసం ఒకరు అమరులవడం) ఆమె ఊహించకపోయి ఉండవచ్చా?, ఊహించని ఆ మలుపు ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసి ఉండవచ్చా?,అంతులేని పశ్చాత్తాపంతో ఆమె హృదయం కలత చెంది ఉండవచ్చా ? కామసాని చాళుక్య పరంపరకు చెందిన వ్యక్తి అయి ఉంటుందా
?, గుండయ్య,కుప్పమ్మల బిడ్డగా పెరిగిన సోమేశ్వరుడు వారికి సమీప బంధువై ఉంటాడా?లీనమై చదివిన పాఠకుల్లో తోడిన కొద్దీ ఊటలై ఊరే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఏ చరిత్రకారుడో కంకణం కట్టుకోవాలే తప్ప, నావంటి సామాన్యులకు సాధ్యపడే విషయం కాదు.
కార్తీక సోమవారం నాటి ప్రదోషకాలంలో స్వయంభూ దేవాలయం నుండి బయటకు వచ్చి, వెనుక ఉన్న కొత్త నిర్మాణాన్ని చూడాలనిపించి వెళ్లిన కామసాని, పద్మకార శిల్పం మీద తలానించి, ఆకాశం వంక చూస్తూ, ధ్యాన నిమగ్నుడై మునిపుంగవుని ప్రతీకగా ఉన్న సోమేశ్వరుని మొదటిసారిగా చూస్తుంది.
శ్రీవన్నియ చీర, వాయు మేఘపు రవిక ధరించి, ముంగర, కమ్మలు భవిరెల అలంకరణలో రత్నదీప కాంతుల నడుమ మెరిసిపోయే కళాభినేత్రి అతనికి తపోభంగం కలిగించ లేకపోయినా, అతని అందమైన ముఖం,కలలుగనే ఆ కళ్ళు మొదటి చూపులోనే ఆమెలో అతని యెడ అనురక్తిని కలిగిస్తాయి. ఆరోజు వారిరువురి నడుమ జరిగిన సంభాషణ, అతనితో ఆమె ప్రవర్తన ఆమెపై గడుసైన సొగసరి అనే భావనను పాఠకుల్లో కలిగిస్తుంది.
శ్రీవన్నియ చీర, వాయు మేఘపు రవిక ధరించి ఉన్నానని(అప్పటి రోజులను గురించి) శిథిల మంటపంలో కామసాని మాధవ్ తో రెండు, మూడుసార్లు చెబుతుంది. అది ఆమెకు బాగా నచ్చిన వస్త్ర విశేషమై (ఆ రంగుల కలయిక) ఉండవచ్చు. ఆమె నర్తకి కావడం వల్ల సహజంగానే అలంకరణపై ఆసక్తీ,పట్టు ఉంటుంది.
సోమేశ్వరుని నోటి వెంట ‘గిరిజ ‘ అన్న పేరు విన్నప్పుడు ఆమెలో స్త్రీ సహజమైన ఈర్ష్యను, మాహూరయ్యతో జరిపిన సంభాషణలో చిలిపిదనంతో కూడిన పరిణతిని పాఠకులు గమనిస్తారు. కాంచీపుర యాత్ర గురించి చెబుతూ అతను కూడా వస్తున్నాడని తెలిసి ఆనందంతో ఎగిరి గంతేస్తుందేతప్ప పులిబోనులో తలదూర్చబోతున్నాననే భయం ఏమాత్రం కనిపించకపోవడం ఆ ప్రేమ ఎంత ఘాటైనదో చెప్పకనే చెబుతుంది.
శ్రీదేవి చొక్కనాధుల ముసుగులో కాంచీపురంవైపు సాగింది వారి రాజకీయ యాత్ర మాత్రమే. ఆ ముసుగు మాటున దాగిన కామసానీ సోమేశ్వరులకు మాత్రం అది ప్రేమయాత్ర. దారి పొడవునా పలు క్షేత్రాలు దర్శిస్తూ , నదీ స్నానాలు చేస్తూ అదొక ప్రేమయాత్రగా వెళతారేతప్ప అత్యంత సాహసోపేతమైన ప్రయాణమనీ,ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఎదురయ్యే పరిణామాలను గురించిన ఆదుర్దా గానీ మచ్చుకు కూడా కనిపించక పోవడం మనసున్న వారిని కలిచి వెయ్యకుండా ఉండగలదంటారా?
కాంచీపురంలో తాను నెరప బోయే గూఢచర్యం గురించి సోమేశ్వరునికి వివరిస్తూ,
” అభినయం దాని ముసుగు. విజయ గండనికీ,శ్రీధర స్వామికీ మధ్య విభేదాలు కల్పించడం అంకురార్పణ.
విజయ గండ పతనం ఫలప్రాప్తి – ఇదీ నా కార్యక్రమం ” అని చెప్పడం,
“నా కళ్ళూ, కాళ్ళూ నీ చేతులతో కలిసి కాంచీపురాన్ని పతనం చేశాయి” అనీ,
“శాస్త్రం – శస్త్రం ఒకే చోట దర్శనమిచ్చింది ఆ రాత్రి” అని చెప్పిన తీరు సింధువును బిందువులో ఇమిడ్చగలిగే, బ్రహ్మాండాన్ని పరమాణువులో బంధించగలిగే ఆమెలోని ప్రతిభాపాటవాలను అంచనా వేయడానికి ఇంతకన్నా బలమైన పదాలుంటాయా?
(కళ అనేది కేవలం హృదయాన్ని రంజింపజేసేది మాత్రమే కాదనీ, సామ్రాజ్య విస్తరణలోను కీలకమైన పాత్ర పోషిస్తుందన్న కొత్త విషయాన్ని మొదటిసారిగా తెలుసుకున్నానన్న విషయాన్ని పాఠకులతో పంచుకోవాలనిపించి….)
రుయ్యమ్మ,అన్నయల పెళ్లి జరిగిన కళ్యాణ మంటపం (ఈ మంటపాన్ని సోమేశ్వరుడే చెక్కుతాడు) లోనే తమ పెళ్లి కూడా జరగాలని ఉందని సోమేశ్వరునితో అనడం, అదే పెళ్లిలో విశ్వంభర శివాచార్యుల వారికి నమస్కరించి “మమ్మల్ని ఆశీర్వదించండి స్వామీ” అనడం పద్మాక్షమ్మ కొండపై నుండి నీళ్లు నిండిన కళ్ళతో నిస్సహాయంగా మెట్లు దిగి వెళ్ళిపోవడం వంటి విషయాలు తడి ఉన్న గుండెల్ని వడి వెట్టకుండా ఉండగలవంటారా?
కూతురి స్థానంలో ఆస్థాన నర్త కిగా తిరిగి తనను నియమించదలచినట్లు రాజప్రాసాదం నుండి వచ్చిన శ్రీముఖాన్ని చామకాంబ సున్నితంగా తిరస్కరిస్తుంది. కళ్ళ ముందే కృంగికృషించి పోతున్న కూతురిని చూస్తూ ఆ తల్లి మనసు ఎలా అంగీకరించగలుగుతుంది?
“ఆస్థాన నర్తకి ప్రథమాభినయమా” అన్న సోమేశ్వరుని మాటలకు ఆమె ఇచ్చిన సమాధానం, తనను పరామర్శించడానికి వచ్చిన రుయ్యమ్మతో జరిపిన వాగ్వాదం,
“నీ ముందు నాకీ సామ్రాజ్యమెంత ?” అని సోమేశ్వరునితో అనడం వంటివన్నీ అతని ప్రేమ కంటే విలువైనదేదీ ఆమెకీ ప్రపంచంలో లేదనే విషయం తేటతెల్లమవుతుంది.
తామిద్దరినీ రుయ్యమ్మే విడదీసిందన్న విషయం రుయ్యమ్మ నోటి వెంటే విన్న కామసాని
‘ నాకీ ఆస్థాన నర్తకి పదవీ వద్దు. ఈ సామ్రాజ్యమూ వద్దు’ అనుకుని అక్కడ అరక్షణం కూడా నిలబడకుండా గిర్రున వెనక్కి తిరిగి రావడం, అంతఃపురం నుండి పరిచారికలతో కబురు మీద కబురంపినా, “రుద్రమగారి తర్వాత ఇతనే రాజవుతాడా? ఈ ప్రతాపరుద్రునితోనే ఈ సామ్రాజ్యం ఏమైనా అయిపోతుందా? నా నృత్య ప్రదర్శన లేకపోతే?” అంటూ పరిచారికలను తరిమేయడం, రాజాజ్ఞని కూడా ధిక్కరించిన వైఖరి ప్రేమ పట్ల ఆమెకున్న నిబద్ధతను, అది గెలిపించుకోవడానికి సర్వశక్తులొడ్డి పోరాడిన తీరును తెలుపుతుంది.
కామసాని అతడినెంత గాఢంగా ప్రేమిస్తుందో, అతను కూడా అంతే గాఢంగా, నిజాయితీగా ఆమెను ప్రేమిస్తాడు. కాంచీపుర యాత్రలో భాగంగా సువర్ణముఖి నదిలో స్నానం చేస్తూ, ” కొంగులు ముడి వేసుకొని చేద్దామా ?” అనడం, తిరుగు ప్రయాణంలో “బాలాజీ దర్శనంతో మన వైవాహిక జీవితం ప్రారంభమవుతుంది” అనడం వంటి మరికొన్ని మాటలను బట్టి ఆ విషయం పాఠకులకు స్పష్టంగా అర్థమవుతుంది.

మనఃస్ఫూర్తిగా ప్రేమిస్తాడేగానీ దానిని పండించుకునే ధైర్యం, స్థైర్యం (ఆమెలో నూటికి నూరుపాళ్ళు ఉంటే) ఇతనిలో మచ్చుకు కూడా కనిపించవు. అవే గనుక ఉండి ఉంటే ఈ కథ విషాదాంతం అయి ఉండేదే కాదు. ఆమెతో మాట మాత్రంగానైనా చెప్పకుండా మందడ వెళ్లిపోవడం, తిరిగి ఏకశిలకు వచ్చాక కూడా ఆమెకు ఏ విధమైన సమాచారం ఆమెకు అందించకపోవడం, వారి ఆఖరి కలయికైన పద్మాక్షమ్మ కొండపైన ఆమె ఎన్ని రకాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా(బీద పలుకులు పలుకుతాడేతప్ప) ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకపోవడం ఇతనిలోని పలాయన వాదానికి నిదర్శనాలు.
కామసానికి ప్రతీకగా యశోదర విగ్రహాన్ని వేయి స్తంభాల గుడిలో చెక్కుతానని అంటాడు. వీరశైవం అధికార మతంగా ఉన్న రాజ్యంలో బౌద్ధ మతపరమైన శిల్పం చెక్కడ మేమిటన్న ఆమె మాటలకు మానవత మతానికి అతీతమైందనీ, అది అన్ని చోట్లా వ్యాపించి ఉంటుందనీ, సర్వసంగ పరిత్యాగి ఐన బుద్ధుడు ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకపోయినప్పటికీ , తాను చేసిన త్యాగానికి లక్ష రెట్ల కీర్తిప్రతిష్టల్ని పొంది, లోకానికి ఆదర్శ పురుషుడైనాడనీ, కానీ యశోదర మానసిక సంఘర్షణను ప్రపంచం గుర్తించలేదనీ, అందుకే ఆమెపై తనకున్న అపారమైన గౌరవానికి సూచనగా చెక్కుతానని అంటాడు.
సిద్ధార్థుడు యశోదరను వదిలి వెళ్ళిన విధంగానే తాను కూడా కామసానిని వదిలి వెళుతున్నానని అతని అంతరంగ భావన అయి ఉండవచ్చు. తనలోని కళా నైపుణ్యం శిల్ప రూపంలో కొన్ని యుగాల పాటు నిలిచి ఉంటుందనీ, కానీ కామసాని ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన కొద్ది కాలానికి ఆమెలోని మానసిక సంఘర్షణను, ఆమె అందెల రవళులను ప్రపంచం మరిచిపోతుందని కూడా అతడి భావన అయి ఉండవచ్చు.
పైకి యశోదరను ఉదాహరణగా చూపిస్తూ, మాట్లాడుతున్నాడే గానీ అతను చెప్పేదంతా తన గురించేనని క్షణంలో పసిగట్టిన కామసాని అదే మాట అతనితో అంటుంది కూడా. ఆమె ఎన్ని రకాలుగా నచ్చజెప్పాలని ప్రయత్నించినా, అతను ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకపోవడంతో, నీళ్లు నిండిన కళ్ళతో నిస్సహాయంగా కొండ దిగి వెళ్ళిపోతుంది.
శిల్పం కోసం ప్రేమను త్యాగం చేస్తానన్నవాడు మరి ఆ శిల్పానికైనా న్యాయం చేశాడా అంటే అదీ లేదు. గోళకీ మఠ నిర్మాణానికై వెళ్ళినప్పటికీ, శిల్పం పై దృష్టి నిలపలేకపోతున్నాడనీ, ఇటు తాను రోగిష్టినయ్యాననీ, ఇద్దరినీ కళాతపస్వులుగా చేయాలన్న రుయ్యమ్మ ఆదర్శ స్వప్నం ఫలించలేదనీ,తన తల్లి ఐ న చామకాంబ తనతో చెప్పిందనీ, అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తాను ఆ విషయం తెలిసి పూర్తిగా కుదేలయ్యాననీ, ఆ తదుపరి సంఘటనలు కలలో జరిగినట్లుగా జ్ఞాపకం ఉన్నాయనీ, ఎందుకో శివాచార్యులవారు వచ్చినట్లు,తనను అభిమంత్రిస్తున్నట్లు ఏదో లీలాగా స్ఫురించిందనీ,ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అతడిని చూస్తున్నాననీ చెబుతుంది.
మొత్తం 10 పున్నములుగా జరిగిన ఈ కథలో (శిథిల మంటపంలో) ఇక్కడి వరకే ఆమె మాధవ్ తో చెబుతుంది.
మాధవ్ మానసిక, శారీరక పరిస్థితి పూర్తిగా దిగజారడంతో ఆయుర్వేద వైద్యులైన వేణుగోపాలాచార్యులవారి సలహా మేరకు వరంగల్ వాస్తవ్యులైన మహామంత్రవేత్త, ఉపాసకులైన ముదిగొండ జ్వాలాపతి లింగశాస్త్రి గారిని కలిసి శిథిల మంటపంలో మొదటి నుండి మాధవ్ కె దురవుతున్న అనుభవాలను, అతని ప్రస్తుత పరిస్థితిని వివరించి ఎలాగైనా అతడినీ, అతడి కుటుంబాన్నీ ఈ కష్టం నుండి గట్టెక్కించమని ప్రాధేయపడతాడు రామచంద్ర.
తన ఆధ్యాత్మిక శక్తి అంత దృఢమైనది కాదనీ, ఇదివరకెన్నడూ ఈ రకమైన సమస్యలను పరిష్కరించిన అనుభవం తనకు లేదనీ మొదట అన్నప్పటికీ, చివరకు అంగీకరిస్తారు జ్వాలాపతిగారు.
రామచంద్ర చెబుతున్న విషయాలన్నిటిని కళ్ళు మూసుకొని పారవశ్యంతో విన్న ఆ మహనీయుడు ఊహాలోకం నుండి వాస్తవానికి వచ్చి, ఈ మాధవరావే ఆనాటి భళ్ళాల సోమేశ్వరుడనీ, కామసాని అతడి ప్రేయసి అనీ, శిథిల మంటపంలో ప్రతి పౌర్ణమికి అతడికి కనిపించి, మాట్లాడుతూ న్నది ఆమె జీవాత్మ అనీ చెబుతాడు.
మరుసటి రోజైన త్రయోదశీ,సోమవారం మాస శివరాత్రి నాడు అఖండం వెలిగించి పూజ ప్రారంభిస్తాననీ, ధ్యానంలో తనకేవైనా కొత్త ఊహలు రావచ్చనీ, ఎల్లుండి వచ్చి కనిపించమని చెప్పి పంపిస్తారు.
వారి మాట ప్రకారం మరుసటి రోజు వెళ్లిన రామచంద్రకు నవ్వుతూ ఎదురొచ్చిన జ్వాలాపతి గారు తమకు ధ్యానంలోస్ఫురించిన విషయాలను రామచంద్రకు చెబుతూ….
మందడ నిర్మాణం పూర్తి చేసి, ఏకశిలకు వచ్చిన సోమేశ్వరుడు మనసు అల్లకల్లోలమవుతుండగా సహస్రమంటపాన్ని చెక్కుతూ ఉంటే, ఒకనాడు చామకాంబ వచ్చి కామసాని ఆఖరి ఘడియల్లో ఉందని తెలుపడంతో వెళ్లి చూస్తాడు. పరిస్థితి ఇలా చేయి దాటి పోతుందని ఊహించని అతను కన్నీరుమున్నీరుగా విలపిస్తూ,మహామంత్రవేత్త, రాజ గురువైన విశ్వంభర శివాచార్యుల వారినాశ్రయించి, తన గుండెలోని వేదనను, ఆమె కళ్ళలోని ఆవేదనను తన ఉలి మలుపుల్లో బిగించి, ఆమెకు ప్రతీకగా తాను చెక్కిన శిల్పం శిథిల మంటపంలో యశోదర విగ్రహమై ఉందనీ, తిరుపతిలో బాలాత్రిపుర సుందరి సమక్షంలో మానసికంగా తమకు వివాహం జరిగిందనీ,ఆమె ఆత్మను అందులో ఆవాహన చేయమని ప్రాధేయపడతాడు.
“స్వామీ! కామసాని నన్ను అమరుణ్ణి చేయడం కోసం తన్ను తాను సర్వసమర్పణ చేసుకున్నది. ఆమెను మీరు అమరస్త్రీగా మార్చండి. నా శిల్పంలో ఆమె ప్రాణ ప్రతిష్ట చేయండి” అని అర్థిస్తాడు.
(జ్వాలాపతిగారు రామచంద్రకు తెలిపిన ఈ విషయంపై నా స్పందనను పాఠకులతో పంచుకోవాలనిపించి……
కామసాని – సోమేశ్వరులకు సంబంధించిన ఈ కథను నేను ఈ ఒక్క పుస్తకంలోనే చదివాను. ‘క్రీడాభిరామం’ అనే నవలలో కూడా కామసాని ప్రస్తావన ఉందన్న విషయం ఎక్కడో విన్నాను గానీ,ఆ పుస్తకాన్ని మాత్రం నేను చదవలేదు.
అతని ఉన్నతిని అతనికంటే ఎక్కువగా ఆమె కోరుకుందే తప్ప, తన ప్రేమను త్యాగం చేయడానికి గానీ,అతడితో బంధాన్ని వదులుకోవడానికి గానీ ఆమె ఎప్పుడు కూడా సిద్ధపడలేదు. నవల మొదటి నుండి చివరి వరకు ఎక్కడ కూడా ఈ విషయం పాఠకులకు కనిపించదు, స్ఫురించదు.మరి సోమేశ్వరుడు శివాచార్యుల వారితో ‘ అమరుణ్ణి ‘ అనే పదం ఎందుకు వాడారో నాకు ఎంత ఆలోచించినా బోధపడలేదు).
మొదట అంగీకరించని శివాచార్యులవారు ఒకనాటి పూర్ణిమనాడు భద్రకాళి అమ్మవారికి పూజలు నిర్వహించి, శాస్త్రోక్తంగా ఆమె జీవాత్మను యశోదర విగ్రహంలో ఆవాహన చేశారనీ, ప్రతిష్ట కాలంలో దుఃఖిస్తూ ఉన్న సోమేశ్వరుడు పూజాదికాలు సక్రమంగా నిర్వహించ లేకపోయాడనీ, ఆ కారణంగా ఆకర్షణ సమయంలో పూజలోనో, మంత్రంలోనో ఏదో లోపం జరిగిందనీ,ఫలితంగా ఆ శిల్పం ఎవరు పిలిస్తే వారికి పలకడం లేదనీ, ప్రతి పౌర్ణమినాటి చంద్రోదయ కాలంలో కేవలం 15 నిమిషాలపాటు సోమేశ్వరునితో మాట్లాడుతుందనీ, ఆ పదిహేను నిమిషాల కాలమే జీవప్రతిష్ట జరిపిన ముహూర్తమై ఉండవచ్చనీ, ఎనిమిది వందల సంవత్సరాలుగా ఇదేవిధంగా బయటకు వస్తూ, అతని కోసం ఎదురుచూస్తూనే ఉండి ఉండవచ్చనీ ,ఇంత కాలానికిగానీ ఆమె నిరీక్షణ ఫలించ లేదనీ, ఆనాటి సోమేశ్వర రూపానికీ ,ఈ మాధవరావు రూపానికీ సంపూర్ణ సాన్నిహిత్యం ఉండటమే ఆమె అతడిని గుర్తుపట్టడానికి కారణమై ఉండవచ్చనీ,అతనే సోమేశ్వరుడ వ్వడంవల్ల అతడికి మాత్రమే కనిపిస్తూ, అతనితోనే మాట్లాడుతూ ఉందనీ, ఆమె భౌతికంగా మరణించిన అనంతరం కళాభినివేషాన్ని పూర్తిగా కోల్పోయిన సోమేశ్వరుడు ” దేవీ! దేవీ!” అంటూ కామసాని నామస్మరణలో పిచ్చివాడై, నిరంతరం సహస్ర స్తంభ మంటపంలో తిరుగుతూ, తనువు చాలించి ఉంటాడనీ కామసాని సశేషంగా మిగిల్చిన కథను తన ఉపాసనా బలంతో సంపూర్ణం గావించారు .
ఆ తర్వాత మాధవ్ నూ,అతని కుటుంబాన్ని కాపాడమంటూ అర్థించిన స్నేహశీలి (రామచంద్ర) ఆవేదనకు స్పందించి శాస్త్రోక్తంగా ఆమె జీవాత్మకు విముక్తిని ప్రసాదిస్తారు జ్వాలాపతి గారు.
( ఇక్కడ నా మనసులో మెదిలిన మరో విషయాన్ని కూడా పాఠకులతో పంచుకోవాలనిపించి…..
ఎంత గొప్ప శిల్పి ఐనప్పటికీ, అతి సామాన్య మానవుడైన సోమేశ్వరుడు ఆమె తనను వదిలి వెళుతుందనే ఊహను తట్టుకునే శక్తిలేకా,ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను అంచనా వేయగలిగే పరిజ్ఞానంలేకా ఆవాహన చేయమని అభ్యర్థించి ఉండవచ్చు. కానీ మహా మంత్రవేత్త, తపఃసంపన్నులైన శివాచార్యులవారు ఎలా అంగీకరించగలిగారు? అన్న ప్రశ్న మాత్రం నాలో తలెత్తింది. మరుసటి క్షణంలోనే సాధుసత్పురుషుల ఆలోచనల వెనుక ఏదో అర్థం, వారు వాటిని అమలుపరిచే విధానాల వెనుక మరేదో పరమార్ధం దాగుంటుందని మళ్లీ ఆ (నా) మనసే నాకు హితవును బోధించింది.
రాబోయే కాలంలో ఈ కథ ప్రపంచానికి తెలియాల్సిన అవసరముందని వారు భావించి ఉండవచ్చనీ, అందుకే శిల్పంలో ఆవాహన చేసి ఉండవచ్చనీ నాకనిపించింది.
నవల చదవక ముందు అది చదవాలనీ,దానికిపై వ్యాసం వ్రాయాలని మాత్రమే ఉండేది, కానీ ఎప్పుడైతే నేనా నవల చదివానో,ఆ క్షణం నుండే నాలో ఆ శిల్పాన్ని చూడాలన్న కోరిక పెరుగసాగింది. వ్యాసం వ్రాయాలన్న ప్రయత్నం మధ్యలోనే ఆగిపోవడం, ఎంత ప్రయత్నించినా ముందుకు సాగకపోవడంతో, ఇక ఉండబట్ట లేక 02/07/ 2024 నాడు నేను, మావారు వరంగల్ కు బయలుదేరాం. నేను శిల్పశాస్త్రం, పురాతత్వశాస్త్రం, చరిత్ర వంటి వాటిలో ఏమాత్రం పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని కాకపోయినప్పటికీ, ఆ శిల్పం చూసి రావాలనుకోవడానికి కారణం, ప్రత్యక్షంగా చూసి వ్రాస్తే నా రచన ఒకింత బలాన్ని పుంజుకుంటుందనీ, మరికాస్త జీవం పోసుకుని కొంతమందినైనా కదిలించగలుగుతుందేమోనన్న చిన్న ఆశ. ప్రయాణం చేస్తున్నంతసేపు ఏదో తెలియని ఆనందం. ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకోవడం స్పష్టంగా గమనించాను.
విశాలమైన ఆవరణలో అడుగుపెట్టగానే 3 శివలింగాలు, వాటికి కాస్త దూరంలో పుష్కరిణి, పద్మాకారంలో ఉన్న వేదిక, దానిపై ఆలయ నిర్మాణం (ఈ ఆలయ నిర్మాణమే నాకు వినూత్నంగా కనిపించింది. ఇటువంటి నిర్మాణశైలి నేను ఇది వరకెక్కడా చూడలేదు. బహుశా ఉండి ఉండవచ్చు, కానీ పర్యాటక ప్రదేశాలను చూడటంలో నేను అంత చురుకుగా ఎప్పుడూ లేను, అందుకే నాకలా అనిపించి ఉండవచ్చు) మరోవైపు హనుమంతుడు, నాగదేవతల ప్రతిష్ట కనిపించింది. గుడిలోనికి వెళ్లి స్వామిని దర్శించుకుని, కాకతీయ సామ్రాజ్యపు ఆలోచనలు తలలో చక్రభ్రమణం చేస్తూ ఉంటే, గోడలను చేతులతో స్పృశిస్తూ, ఆ విషాదగాథను నెమరేసుకుంటూ, అడుగులో అడుగేసుకుంటూ, నందీశ్వరుని చెంతకు చేరుకొని, ఆవాహన నవలను చేతిలో పట్టుకొని,గుండె దడదడలాడుతూ ఉండగా, నెమ్మదిగా శిథిలమంటపం లోనికి అడుగు పెట్టాను.
800 సంవత్సరాల విషాదాన్ని మోసిన ఆ విగ్రహాన్ని చూడాలన్న తపన నన్ను రోమాంచితం చేస్తూ ఉంది. అంగుళం కూడా వదలకుండా మంటపమంతా కలియజూస్తూ, మధ్య మధ్యలో పుస్తకాన్ని తిరగేస్తూ, ఒక్కొక్క సంఘటనను సరిచూసుకుంటూ, ఒక్కొక్క అడుగే వేస్తూ, అప్పుడప్పుడు దాని గురించి మా వారితో చర్చిస్తూ, అవసరమైన చోట అతని సలహాలు తీసుకుంటూ, అంగుళం అంగుళం గాలించాను.
ఆ మంటప నిర్మాణమే నాకు సరికొత్తగా అనిపించింది. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఏ విధమైన పరిజ్ఞానం లేకపోయినప్పటికీ, ఎందుకో చాలా విచిత్రంగా అనిపించింది. నవలలో పద్మాకార శిల్పాలు అనే మాట కామసాని నోటి వెంట చాలాసార్లు వస్తుంది. ఈ పద్మాకార శిల్పాలు ఏమిటనే విషయంపై చాలా జాగ్రత్తగా గమనించాను. ప్రధాన ఆలయంలో, శిథిలమంటపంలో రెండు చోట్లా నాకు పద్మకార చెక్కడాలు కనిపించాయి. ప్రధాన ఆలయంలో కప్పు పైభాగంలో అన్ని పద్మాకారంలో చెక్కిన చక్రాలు కనిపించాయి (బహుశా అవి ఇవే అయి ఉండవచ్చు అనుకున్నాను). శిథిలమంటపంలో 4 వరుసల్లో వరుసకు 6 చొప్పున మొత్తం 24 స్తంభాలు కనిపించాయి. ప్రధాన మంటపానికి నాలుగు వైపులా 4 ఉపమంటపాలు కనిపించాయి. ప్రతి ఉపమంటపానికి నాలుగు వైపులా 11 చొప్పున మొత్తం 44 చిన్న,చిన్న స్తంభాలు కనిపించాయి. కానీ ఎంత వెతికినా నాకు యశోదర శిల్పం జాడ కనిపించలేదు. అప్పుడు నాలో కలిగిన ఆలోచనలనుగానీ,నా గుండెలో రేగిన అలజడినిగానీ కాగితంపై పెట్టాలంటే, నా రచనా శక్తి సరిపోదేమో అనిపించింది. కామసాని మాధవ్ తో మాట్లాడుతూ శిల్పాల చాటుకు వెళుతుందనీ ,అలా వెళుతూ, వెళుతూ అదృశ్యమవుతుందనీ ఉ టంకించారు. యశోదర శిల్పం మాత్రమే కాదు, ఆ మంటపంలో నాకు ఏ ఒక్క శిల్పమూ కనిపించలేదు. రాతి స్తంభాలపై సన్నటి లతలు, చిన్న, చిన్న దేవతా రూపాలు కనిపించిన మాట వాస్తవమేగానీ, స్తంభాలపైగానీ, స్తంభాల చెంతగానీ నాకు ఎటువంటి విగ్రహాల జాడ కనిపించలేదు. అక్కడ ఉన్నవాళ్లను కొందరిని గైడ్స్ గురించి అడిగితే, గైడ్స్ ఉదయం పూట మాత్రమే అందుబాటులో ఉంటారని చెప్పారు.నలుగురైదుగురు భక్తులను అడిగినప్పటికీ , ఏ విధమైన సమాచారం లభించలేదు. ఆలయ అర్చకులను సంప్రదించమని ఒకరిద్దరు సలహా ఇచ్చారుగానీ నాకెందుకో సమాచారం దొరుకుతుందన్న నమ్మకం కలుగక మౌనంగా ఉండిపోయాను. చివరి ప్రయత్నం గా గోడకు చేరగిలబడి సెల్ ఫోన్ చూసుకుంటున్న ఒక యువకుడి దగ్గరకు వెళ్లి,విషయం తెలియజేశాను. నా చేతిలో ఉన్న నవలను చూపించి కాస్త వివరించమని అభ్యర్థించాను. దానికతడు తాను చరిత్ర తెలిసిన వ్యక్తిని గానని , ఈ గుడికి సంబంధించిన విషయాలు కూడా తనకేమీ తెలియవని, కాకపోతే ఇక్కడ తానొక డాన్సర్ విగ్రహాన్ని చూశానని, దాన్ని (ఆ శిల్పాన్ని) పగులగొట్టి అటువైపుగా పడేశారని మంటపానికి కుడివైపున చేతితో చూపిస్తూ , వెళ్లి చూడమని సలహా ఇచ్చాడు. ఆ మాత్రం సమాచారమిచ్చిన ఆ యువకుడికి కృతజ్ఞతలు తెలిపి, నవలను చేతిలో పట్టుకొని పరుగు లాంటి నడకతో ఇద్దరం ఆశగా వెళ్ళాం. అక్కడ పగిలిపోయిన శిలా ప్రతిమలు కుప్పగా పడవేసి ఉన్నాయి. అందులో ఆత్రుతగా వెతుకుతూనే, అక్కడ ఉద్యోగ నిర్వహణలో ఉన్న సఫాయి కార్మికులను అడిగితే ఆ విషయాలేవీ తమకు తెలియవని చెప్పారు. కాకపోతే వారిలో ఒక తను నా చేతిలోని నవల ముఖచిత్రాన్ని చూసి , దాన్ని చేతిలోకి తీసుకొని ఇవి రామప్ప దేవాలయంపై చెక్కిన రాగిణి, నాగిని విగ్రహాలనీ, మేమడిగే సమాచారం అక్కడ దొరుకుతుందనీ, చెప్పడంతో ఇక అంతకంటే ఎక్కువ అతనిని అడగడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని మౌనం వహించి, మళ్లీ వెదకడం మొదలు పెట్టగా, అందులో ఒక స్త్రీ విగ్రహం నా కంట పడనే పడింది.
దాన్ని నాకున్న అతి స్వల్ప పరిజ్ఞానంతో నఖశిఖ పర్యంతం పరీక్షించాను. ఇది నర్తకి శిల్పమే అయి ఉంటుందా ? అని కళ్లింతలు చేసుకుని చూశాను. అత్యంత బాధాకరమైన విషయమేమంటే ఆ శిల్పం రెండు ముక్కలుగా పగిలి, మోకాళ్ళ కింది నుండి వేరు చేయబడి ఉంది. కాళ్లకు నర్తకీమణులు ధరించే అందెలు ఉన్నాయా ?లేదా? అని గమనించాను. అందెలు ధరించిన నాజూకైన కాళ్లతో అది ఆ శిల్పమేనన్న నిర్ణయానికి వచ్చాను. కింది భాగానికి సరిపోలే మరో శిల్ప శకలానికై మళ్లీ వెదుకులాట ప్రారంభించాను. చక్కని అవయవ సౌష్టవంతో నృత్య భంగిమలో ఉన్న మరో శకలం కనిపించింది. ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే తలభాగం మొండెం నుండి వేరైతే పడలేదుగానీ, ఒక వర్తులాకార ఫలకంపై చెక్కిన ముఖ భాగం (తల భాగానికి చెందిన వర్తులాకార ఫలకమేదైతే ఉందో అది మొండానికి అతుక్కునే ఉంది కానీ దానిపై చెక్కిన ముఖభాగం లేదు. పాఠకులకు విషయం స్పష్టంగా అర్థమవ్వాలన్న ఉద్దేశంతో ఇంత వివరంగా వ్రాస్తున్నాను) మాత్రం కనిపించలేదు.
ఆ శిల్పం లోని ముద్రనూ, నిలుచున్న భంగిమనూ (ఇంటికి వచ్చాక కాస్త నాట్యశాస్త్రంతో పరిచయం ఉన్న వారిని అన్ని వివరిస్తూ అడిగితే అది ‘ కపిథ’ ముద్ర అని చెప్పడంతో నా ప్రయత్నం మరింత బలపడిందనిపించింది) జాగ్రత్తగా గమనించాను. మోకాళ్ళపై వరకు ధరింపజేసిన ఆ వస్త్రాలను(ఆ మరుసటి రోజు గూగుల్లో నర్తకీమణులు ధరించే వస్త్రాలు అని వెదికితే దానిని ‘ చల్లడం ‘ లేదా ‘చల్లాడం ‘ అని అంటారని తెలిసింది), ఆభరణాలను జాగ్రత్తగా పరిశీలించాను. ఆ రెండు భాగాలు ఆ శిల్పానికి సంబంధించినవే అయి ఉండవచ్చని నా మనసు చెబుతూనే ఉంది. ఆ శిల్ప శకలాలను చూడగానే నా గుండె విలవిల్లాడిపోయింది. కామసాని కాళ్ళను ఎవరైనా నరికితే సోమేశ్వరుడు ఎంతగా విలవిల్లాడుతాడో నా మనసు కూడా అంతగా విలవిల్లాడింది. చేతిలోని కామసాని – సోమేశ్వరుల ప్రణయ కావ్యం (ఆవాహన నవల) పుటలన్నీ తెగిపోయి గాల్లో ఎగురుతూ వేయి స్తంభాల గుడి నిండా చెల్లాచెదురై పడిపోతున్నట్టు, వాటిని పట్టుకోవడానికి నేను ఆలయమంతా పరుగులు తీస్తున్నట్టు ఏవేవో భావ చిత్రాలు.
మనసు అల్లకల్లోలమవుతుండగా భారంగా పుష్కరిణి వైపు అడుగులు వేసిన నాకు దాన్నిండా తాబేళ్లు కనిపించాయి. తాబేలు జీవితకాలం సుదీర్ఘమైంది కదా , వీరి ప్రణయానికివి ప్రత్యక్ష సాక్షులై ఉంటాయన్న నా ఆలోచన నాకే నవ్వు తెప్పించింది. ఆ శిల్ప శకలాలను చూసి మొదలు నరికిన చెట్టులా చతికిలబడిన నన్ను చూసి మావారు “పర్వతాలే కాలగర్భంలో కలిసిపోగా లేనిది ఒక శిల్పం కోసం అంతగా బాధపడటం అవసరమా ? ” అన్నారు. వారన్నది నిజమే, నేను కాదనడం లేదు, కానీ అది మామూలు శిల్పమా?! కొన్ని శతాబ్దాల గుండె బరువును మోసిన శిల్పం. కొన్ని శతాబ్దాల నిరీక్షణకు వేదికైన శిల్పం. పగిలిన గుండెను తనలో పొదువుకున్న శిల్పం. పగిలిన మరో గుండె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే మౌనసాక్షిగా మిగిలిన శిల్పం. స్పందించే విధానంలో గుండె గుండెకూ తేడా ఉంటుంది. పైగా అది నా పసితనంలో (అప్పటి) నాలో నాటుకున్న విత్తనం. మొక్కై, మానై ,శాఖోపశాఖలుగా నా హృదయక్షేత్రంలో విస్తరించిన వటవృక్షం. దాన్ని నేనెలా తేలిగా తీసుకోగలను ? అది నాకెలా సాధ్యం? అంత తేలిగ్గా తీసుకొని ఉంటే నాలోంచి ఈ రచన వెలువడేది కాదు సరికదా, ఒక్క అక్షరం కూడా నా కలం లోంచి వచ్చి ఉండేదే కాదు. మనసు స్పందించిన చోటే భావాల ఊట. ఎద కరిగిన చోటే కన్నీటి పాట. నెమ్మదిగా అక్కడి నుండి బయటకు వచ్చి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని నా రచనను నిర్విఘ్నంగా కొనసాగించే శక్తిని ప్రసాదించమని ప్రార్థించి వెనక్కి మళ్ళాం.
తిరుగు ప్రయాణంలో పగిలిపోయిన ఆ శిలామూర్తి ఎంత వద్దనుకున్నా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఉలితో పగిలిన శిలలా అయింది నా మనసు. ఆ పగుళ్లలోంచి కామసానీ, సోమేశ్వరుల ప్రణయ కథ ఒక్కొక్క అంకం నా మనోఫలకంపై కదలాడుతూ ఉంది. సన్నటి నీటి తెర నా కళ్ళలో చిప్పిలుతూనే ఉంది.
ఎన్ని ప్రేమ కథలు విఫలం కావు? మరీ ఇంతగా స్పందించడం అవసరమా? అన్న ఆలోచన కొందరిలో తలెత్తవచ్చు, అంత ఉన్నత స్థాయిలోని వ్యక్తులను చూసి అంతగా బాధ పడటం ఏమిటి ? అన్న ఆలోచన కూడా మరి కొందరిలో రావచ్చు. ఇక్కడ స్థాయి, సుఖాంతం, విషాదాంతం అని కాదు.నా బాధకు నాకు 3 కారణాలు కనిపించాయి 1. జాలి 2. జాలి 3. జాలి 800 సంవత్సరాలు ఆ జీవాత్మ అనుభవించిన గుండెల్ని పీల్చి పిప్పి చేసే దుర్భరమైన వేదన. నా వంటి ఎంతోమందిని కదిలించిన యాతన. అక్షరాల వెంట పరుగులు తీస్తూ ఉన్నప్పుడు మా నాన్న కళ్ళలోని తడి, మా అమ్మ కళ్ళ నుండి జలజలా రాలిన కన్నీళ్లు నాకిప్పటికీ గుర్తే.తడి ఉన్న ప్రతి గుండెను ఈ కథ కన్నీరు పెట్టించింది. దానికి నా కళ్ళతో నేను చూసిన ఎంతోమంది నాకు సాక్ష్యం. దానికి నేను ప్రత్యేకమూ కాదు, మినహాయింపూ కాదు.
ప్రేమ కథలు కొన్ని సుఖాంతమౌ వుతాయి, కొన్ని విషాదాంత మౌతాయి. కానీ మనిషి బ్రతికి ఉన్నంతవరకే ఆ మనుషులను అవి స్పందింపజేస్తాయి. ఒక్కసారి ఆత్మ దేహాన్ని వదిలిపెడితే గనుక అవి (ఆ భావాలు) పంచభూతాల్లో కలిసిపోతాయి. కానీ ఈ కథ వాటన్నిటికీ అతీతమైనది.
ఒక ఆత్మను శిలలో నిక్షిప్తం చేయడం, ఆ దేహం నిస్తేజమై, కట్టె కాలిపోవడం, ఆత్మ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం, ఆ ఎదురుచూపు ఎంతకూ ఫలించక, ఆ మనసు నలిగిపోవడం, అటు ఆత్మకు మోక్షంలేకా,ఇటు ఎదురుచూపుకు అంతంలేకా త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడిన ఆ యాతనే నా ఈ స్పందనకు కారణం.
నా దృష్టిలో అది శిథిల మంటపం కాదు. కామసానీ, సోమేశ్వరుల ప్రేమసామ్రాజ్యం. మోహానికీ, ప్రేమకూ హస్తిమశకాంతరం ఉంది. భూమికీ,ఆకాశానికీ మధ్య ఉన్నంత భేదం ఉంది. అది మోహమే ఐతే నా గుండె లోతుల్లోంచి ఈ భావాల వెల్లువ ఉప్పొంగే కాదు. ఆది కాంక్షే ఐతే నా కలం లోంచి ఒక్క సిరాచుక్క కూడా అక్షర రూపు దాల్చి ఉండేదే కాదు. అది రెండు మధుధారలతో నిండిన అమృతభాండం. రెండు హృదయాల నిర్మల ప్రేమను ఆవాహన చేసిన ప్రణయకలశం. సోమేశ్వరుడు మాధవ్ గా పునర్జన్మ నెత్తి వచ్చినట్లుగానే, కామసానీ, సోమేశ్వరులు పునర్జన్మనెత్తాలి. ఆమె కాలి మువ్వల ఘల్లుఘల్లుల్లో ఆలయ ప్రాంగణం (వేయి స్తంభాల గుడి) సందడించాలి. వారిద్దరూ జంట పావురాలై జావళీలు పాడాలి. మూడు పువ్వులు ఆరు కాయలుగా పిల్లాపాపలతో వర్ధిల్లాలి. వారి నవ్వులన్నీ పువ్వులై ఆ రుద్రేశ్వరునికి పుష్పయాగం చేయాలి.
ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు
పుత్రపౌత్రాభివృద్దిరస్తు
సమస్త సన్మంగళాని భవంతు
స్వస్తి
(విజ్ఞప్తి: ఆ శిల్ప శకలాలు యశోదర విగ్రహానికి సంబంధించినవే అని నేను ఇప్పుడు కూడా అనటం లేదు, బహుశా అయి ఉండవచ్చు అని మాత్రమే అంటున్నాను. విషయ పరిజ్ఞానం లేనప్పుడు నొక్కి చెప్పడం సరైనది కాదని నాకు తెలుసు. ఒకవేళ ఆ శిల్పానివే అయితే, మన చారిత్రక సంపదైన, కాకతీయుల కళావైభవ చిహ్నమైన ఆ శిల్పాన్ని ఏ కాస్త అవకాశం ఉన్నా, పునర్నిర్మించి, యథాస్థానంలో ప్రతిష్టించి,ముందు తరాలకు అపురూపమైన కానుకగా అందించాలని నేను అన్ని రంగాల ప్రముఖులకు పేరుపేరునా చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను).
