తెలుగు భాషకు అపారమైన పదసంపద ఉంది . మనలో చాలామందికి తెలుగులో మాట్లాడడం ,రాయడం నామోషీ . తాము వాడే కాసిన్ని మాటలు తా మనుకుంటున్న అర్థాన్ని ఇస్తున్నాయా అని తెలుసుకోవడం అవమానం. తెలిసిన పెద్దవారినీ ,నిఘంటువులనూ సంప్రదించడము అనవసరమనే విశ్వాసం . ఇవన్నిటికి తోడు మనం మాట్లాడేది కల్తీ లేని తెలుగనీ అభిప్రాయం.
ఇలా నడుస్తున్న రోజులలో వచ్చిన కరొన ప్రపంచాన్ని ఓ కుదుపు కుది పింది .
దాంతో వ్యక్తుల ఆలోచన ధో రణిలో కొంత మార్పు వచ్చింది . మన చా రిత్రక , సాంస్కృతిక మూలాలను గురించి తెలుసుకోవాలనే ఆలోచన మొదలైంది . మాతృ భాష చదవడం సరిగ్గా రాకున్న విని ఆనందించడం ,కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆరాటం అనేకవిధాలుగా విస్తరిస్తున్నది . ఇది శుభ పరిణామం .
ఈ నేపధ్యంలో తెలుగు భాషాభిమానిగా నాకు తోచిన రీతిలో తరచుగా వాడే పదాలలో కొన్నింటిని ఎంచుకొని ,వాటి వెనకున్న ఆసక్తికర అంశాలను క్లుప్తంగా తెలియచెప్పాలని ప్రయత్నించా .
ఒక ముఖ్య గమనిక . ఈ మాటల మూటలు నిత్య జీవితంలో మాటలను ప్రయోగించేటప్పుడు ,కాస్త తెలుసుకోవాలనే ఉత్సాహవంతులకోసమే గాని ,పండితులకు , కవులకు , రచయితలకోసం ఉద్దేశించినది కాదని మనవి .
ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు భాష పట్ల ఆసక్తి పెరుగుతుందని ,పెరగాలని చిన్న ఆశ.
ఎక్కడినుంచి మొదలెట్టాలి అనేదే పెద్ద ప్రశ్న . మాటలమూట లు అనుకున్నాం గనుక అక్షరం నుండి మొదలెడతా .
అక్షరం అనే మాటను అక్కరం ,అచ్చరం అని కూడా అంటారు . ఇది సంస్కృత పదం . క్షరం కానిది –నశించనిది అని అర్థం . భాష అనేది ధ్వనులుగా మొదలై లిపి ఏర్పడి ,తాటాకులు ,భూర్జపత్రాలు ,రాగిరేకులు ,శిలలపై ప్రయాణం సాగించి ,కాగితాలు వరకూ సాగి, ఆ తర్వాత అనేక విధాలుగా విస్తరించింది. ఈ రకంగా భాష , సాహిత్యం కలకాలం నిలిచి ఉంటుందని ,నశించనవి అనే అర్థంలో అక్షరాలన్నారు . కొందరి అభిప్రాయంలో అ నుండి క్ష వరకున్న వర్ణమాలలోని ఆద్యంతా లను చేర్చి , అక్షరమైందని అన్నారు .
సంఖ్య లో వెల్లడించిన సమాచారం కన్నా ,అక్షరాలలో రాసిందే ప్రామా ణీకమనే మన న్యాయ వ్య వ హారాల్లో నూ , బ్యాంక్ లా వా దేవీల్లోనూ నమ్ముతారు . అందుకే దస్తావేజుల్లో , బ్యాంక్ పత్రాల్లోనూ అక్షరా లా ఇంత అనీ మళ్ళీ రాస్తారు .అంకెలను దిద్దినంత సులభంగా అక్షరాలను దిద్దలేము కదా . అదీ సంగతి.
అంతేకాదు . ఆయన మాట అక్షరాలా జరిగి తీ రాల్సిందే అన్నప్పుడు తప్పకుండా ,మార్పు లేకుండా అనే అర్థాలు అక్షరాలా కు వర్తిస్తాయి . ఇదండీ అక్షరాలా అక్షరాల కథ .
అత్తెసరు
నిఘంటువుల ప్రకారం చూస్తే ఇది అత్తు +ఎసరు అనే రెండు పదాలతో ఏర్పడ్డ సమాసం . వంటకు సంబంధించి ముఖ్యంగా బియ్యం అన్నంగా మారే ప్రక్రియ లో వాడే మాట . ఇప్పుడంటే కుక్కర్లు వచ్చాయిగానీ ,ఒకప్పడు విడిగా వండి ,గంజి వార్చడం ఒక పద్ధతి . మరో విధానంలో నీళ్ళను మరిగించి ,తగిన పాళ్ళలో కడిగిన బియ్యం వేసి ,ఉడికించడం . ఎన్ని నీళ్ళకు ఎంత బియ్యం అనేది అనుభవసారం . దీంట్లో అన్నం వార్చే పని ఉండదు . అయితే అన్నం బిరుసు గాను,పలుకుగాను ఉండకూడదు . అలా ఉంటే నీళ్ళు తగ్గినట్లు లేదా గిన్నె సరి పడిందిగా లేనట్లు . అన్నం మృదువుగా ఉండాలి . ఎక్కువగా ఉడికి ముద్దలా కారాదు . అత్తెసరు అంటే నీరు ,బియ్యం కలిసి అన్నం మాత్రమే మిగలడం అన్నమాట . దీ నికి సారూప్యంగా అత్తెసరు మార్కులు అని వాడతారు . అంటే బొటాబోటీగా సరిపోయేటట్లుగా ,పెద్ద విశేషంగా చెప్పనక్కర్లేని అని అర్థం.
ఆటవిడుపు
ఈ రోజుల్లో చదువుల్ని ఆటపాట ల రూపంలో నేర్పించాలనే పద్ధతికి ఆదరణ పె రిగింది . అదివారాలు , పండుగలు , వేడుకలప్పుడు పరీక్షల తరువాత సెలవులు ఉంటూనే ఉంటాయి . మరి వెనకటి రోజుల సంగతి ఏంటి ?అని ఆలోచిస్తే వారికీ మరో విధంగా సెలవులు ఉండేవి .అలా అడుకోవడానికి కేటాయించే సమయమే ఆటవిడుపులు . ఒకప్పుడు ఆశ్రమాలకు , గురుకులాలకు వెళ్ళి చదువుకునేవారు . అ చదువంతా చెట్ల కిందనే జరిగేది . అందువల్ల ముసురు పట్టినా ,ఆశ్రమానికి ప్రముఖులు ,గురువులు వచ్చినా సెలవులే .దాంతో బాటు పౌర్ణమి దానికి ముందు రోజు ,అమావాస్య ,దానికి ముందు రోజు ఇలా నాలుగు రోజులూ అనధ్యయనపు దినాలు .అయితే , ఆ రోజుల్లో దినమంత ఆటల్లో వృధా చేయకుండా ,కొంత చదువు , కొంత వినోదం కలిసొచ్చేలా కొన్ని కంట స్థ పద్యాలనిచ్చి నేర్చుకొమ్మనే వారు . ఇలా సాధారణంగా సుమతీ ,వేమన , కృష్ణ ,దాశరధి శతక పద్యాల నిచ్చి నేర్చుకునేలా చేసేవారు . క్రమంగా అసలర్ధం మరుగున పడిపోయింది . విశ్రాంతి ,పనిలేకపోవడం ,పని చేయకపోవడం అనే కొత్త అర్ధాలు స్తిరపడిపోయాయి .
ఇంగితం
ఇంగితం అంటే సంస్కృతంలో అభిప్రాయం అని అర్థం . ఒకప్పుడయితే నుదురు చిట్లించడం ,బొమముడి అనే అర్థంలో కూడా వాడేవారు . ఈ పదాన్ని విశేషణంగా తీ సుకుంటే చలించిన ,కదిలిన అనే అర్థాలు ఏర్పడుతాయి . నామవాచకంగా తీసుకుంటే కదలిక , చలనం ,మనోభావం ,అభిప్రాయం అనే అర్థాలు వస్తాయి .
ఇంగితజ్ఞు డు అంటే ఇతరుల అభిప్రాయం తెలుసుకోగలిగినవాడని భావం . అయితే ఇంగిత జ్ఞానం అనే మాటకే వాడు కెక్కువ ఇంగితం లేదంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని వాడ న్నమాట . పాత అర్థాల స్థానంలో కొత్త అ ర్థా లొచ్చేశాయి .
ఈసడించు
ఇది క్రియా పదం . డి క్షనరీల్లో వెతికేతే ,రోతపడు , కోపించు ,నిరసించు ఇలా ఎన్నో అర్థాలు . నేటి కాలంలో తగ్గించి , తీసివేసి ,తక్కువ చేసి మాట్లాడు అనే అర్థాలు మిగిలా యి . ఈసడించారు ,ఈసడించి మాట్లాడారు . అనేవే నేటి ప్రయోగాలు .
ఉడుం పట్టు
ఉడుం అనేది బల్లి జాతికి చెందిన ప్రాణి . పాతకాలంలో అంటే రాజరికపు రోజుల్లో సైనికులు దీన్ని పెంచి , తర్ఫీదు నిచ్చి యుద్ధాలలో ,ముట్టడులలో ఉపయోగించేవారు ఉడుం నడుముకు మోకుకట్టి ,బలంగా కోట గోడలమీదికి విసిరేవారు . దాని నాలుకకు తేనె రాసేవారు . ఏ పాటి పట్టు దొరికినా అది గోడను కరిచి పట్టుకుంటుంది . ఎంత బలంగా అంటే వేలాడే మోకును పట్టుకుని సై నికులు పైకి పాకి కోట గోడ పైభాగానికి చేరి ,లోపల్నుంచి తలుపులు తెరిచేవారు . బయటి నుండి సైన్యం లోనికి చేరి, రాజనగరును ముట్టడించి స్వాధీనం చేసుకునేవారు .
ఇప్పుడు అలాంటి అవసరాలు లేకున్నా పట్టినపట్టు వీడని ,వదలని మొండి పట్టును సూ చించడానికి ఉడుం పట్టు అనే మాటను వాడు తున్నాం .
ఊదరపెట్టు
అదే పనిగా నస పెట్టు , పొగ బెట్టు అనే అర్థం లో వాడుతాము . ఎలుకల వంటి వాటిని బయటికి వెళ్ళ గొట్టడానికి పొగబెట్టడాన్ని ఉదరబెట్టడం అంటారు . చుట్టలను , సిగరెట్లను ఒకదానికొకటి ఆ నించి నిప్పు అంటించడాన్ని ఊదరబెట్టడమంటారు . అగ్గిపెట్టలు అందుబాటులోకి వచ్చాక దీ నీ అవసరం తీ రిపోయింది . మామిడి వంటి కాయలను త్వరగా పళ్ళుగా మార్చడానికి పెట్టే పొగను ఊదర అంటారు . ఒక విషయాన్ని పదే పదే చెప్తూ ఉండ డాన్ని ఈ రోజుల్లో ఊదరపెట్టుగా అంటున్నాం
ఋ జువు
ఋ కారాన్ని పలకడం , రాయడం ఎప్పుడో మానేసాము . అయితే వినిపించే కొద్ది మాటల్లో ఎక్కువగా వినిపించే మాట ఋ జువు . సంస్కృతం లో ఈ పదానికి సత్యం , సూటి అనే అర్థాలున్నాయి . నిదర్శనం అనే అర్థం లో తెలుగులో ఉపయోగిస్తున్నాం . ఈ అర్థంలో వాడే ఈ మాట పర్షియన్ నుంచి హిందీ ద్వారా తెలుగులోకి ప్రవేశించింది .
ఎద్దు
సరే దీని గురించి తెలియనిదేవరికి ? కాబట్టి దీనికి సంభందించిన కొన్ని విషయాలు చెప్పుకుందాం . ఎద్దు అనగానే నాకు స్పెయిన్ దేశం గుర్తొస్తుంది . అక్కడ ఎద్దుల్ని రెచ్చగొట్టి ,వాటితో పొడిపించుకుంటూ ,తొక్కించుకుంటూ ఆడే ,ఆడించే Bull Fighting ఆటను జనాలు వెర్రెత్తినట్లు ఆ డుతారు . ఎ ద్దులమీద కుక్కల్ని ఉసిగొల్పి ,బుల్ రింగ్ లో ఆడించే ఆట కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది .
పూర్వం వేటాడడానికి ఎద్దుల్ని ఎరగా చూపించి , సింహల్ని , పులులని వేటాడేవారు . దుక్కిటె ద్దుని హాలికం అని ,బండికి కట్టే ఎద్దుని అన ద్యాహమ్ అనీ అంటారు . సాధు ఎద్దుని గంగిరెద్దు అంటారు .
నంద్యాల , నందిగామ , మహానంది వంటి గ్రామాలు మనకు ఎద్దులకూ ఉన్న అనుభందాన్ని గుర్తు చేస్తాయి .
ఏ బ్రాసి
ఈ మాటను రోత మనిషి , అమాయకుడు , చేతగానివాడు మొదలైన అర్థాల్లో ఉపయోగిస్తారు . అసహ్యమైన వ్యక్తి అనే అర్థంలో సంస్కృతంలో ఏభ్య రాశి అనే పదం ఉంది . ఈ మాట నుంచి ఏర్పడ్డ తెలుగు పద్యం ఏబ్రాసి . ఏబ్రాసి వెధవ ,ఏబ్రాసిగాడు అనే వ్యవహారం
ఐ రావతం
ఐ రావతం అంటే భా రీ కాయంతో తెల్లటి మేని ఛాయ తో ,మెరి సి పోయే ఏనుగు . ఇది క్షీర సాగర మధనంలో పుట్టింది . ఇo ద్రు నికి వాహనం . దీ న్ని మేఘాల ఏనుగు ,సూర్యుని సోదరుడు అని కూడా పిలుస్తారు . మాతంగ లీల అనే గ్రంధం ప్రకారం బ్రహ్మ వరంతో 8 మగ 8 ఆడ ఏనుగులు పుట్టాయి . మగ ఏనుగులకు ప్రతినిధి ఐ రావతం .
జైన ,బౌద్ధ మతాలలో కూడా ఐ రావతం ప్రస్తావన ఉంది . థా య్ లాండ్ ,లావోస్ వంటి దేశాలలో దీన్ని ఆరాధిస్తారు . అక్కడి ప్రాచీన రాజ్యాల పతాకాలమీద మూడు తొండములతో ఉండే ఐ రావతం బొమ్మ చిత్రించబడి ఉంటుంది
ఒంటికంటి రామలింగం
ఓ అనగానే నాకు ఒంటికంటి రామలింగం గుర్తొస్తాడు . ఆయనెవరు ? అని ఆడక్కండి . నాకూ తెలీదు . ఇంకోలా చెప్పాలంటే ఎవరైనా కావచ్చు . ఎందుకంటే ఇక్కడ రామలింగం అనే మాట పేరులా కాక ఒక గుణా నికి ,స్వభావానికి ప్రతీకగా చెప్పుకుంటున్నాం . ఒంటి కన్ను అంటే ఒక కన్నున్న వాడని గాక ఇతరుల సుఖశాంతులను చూసి ఓర్వలేని వాడని అర్థం .అసూయపరుడిని ఒంటికంటి రామలింగం అని సంభో ధిస్తూంటారు
ఓంకారం
ఓ అనగానే ఓంకా రం మెదులుతుంది మదిలో . ఇది అకార ,ఉకార ,మకారాల సమ్మేళనం . సృష్టిలో మొదట వినబడ్డ శబ్దం ఓమ్ . దీన్ని పదేపదే జపించడం వల్ల శరీరంలో ప్రాణవాయువు శా తం పెరుగుతుంది .కంఠ నాళంలోని అడ్డంకులను తొలగిస్తుంది . స్పష్టమైన ఉచ్చారణకు తోడ్పడుతుంది . సనాతన హిందూ ధర్మంలో ఓంకారా నికి ఎంతో ప్రాముఖ్యత ఉంది . పరమశివుని నాద రూపమే ఓంకారం . వేద సారం ఓంకారం. ఓమ్ అనేది ఏకాక్షర మంత్రం . ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది కాదు .
నిత్యం సాధన చేయడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది .. మానసిక అలసట తగ్గి ప్రశాంతత కలుగుతుంది. దీన్ని జపించే సమయంలో వచ్చే ప్రకంపనలు మన నాడీ వ్యవస్థ పై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతాయి . ఏకాగ్రత మెరుగుపడుతుంది .
ఔచిత్యం
నీవు చెప్పిన మాట ఔచిత్యం గా లేదు. పెద్ద మనుషులున్నప్పుడు ఔచిత్యంగా మాట్లా డా లని తెలీదూ అంటూ ఔచిత్యం ప్రదర్శిస్తూ ఉంటాం . కానీ నిఘంటువులలో ఉచితత్వం , యోగ్యత ,సత్యమనే అర్థాలే ఉన్నాయి . తగినవిధంగా ,యుక్తంగా ,యోగ్యతగా అనే అర్థాల్లోనే వాడుతున్నాం . సందర్భానికి తగినట్లు మాట్లాడుట ,ప్రవర్తించుట అనే సందర్భంగా ప్రస్తుతం వాడుతున్నాం .
అం –అః
0 ( అః వీటిని వ్యాకరణ పరిభాషలో ఉభయాక్షరాలు అంటారు . ప్రస్తుతం బండి ఱ ను , అరసున్న ను వాడుకలోంచీ పక్కకు జరిపేసాము . మిగిలిన రెంటికీ విడిగా ప్రయోగం లేదు .
అంబరం అంటే ఆకాశం సాధారణ అర్థం . అయితే దిగంబరుడు అంటే దిక్కులే అంబరంగా కలవాడు అని అర్థం చెప్పుకుంటాం . ఇక్కడ అంబరంఅంటే వస్త్రం . నిఘంటువుల్లో దీనికి దూది , అనుస్వారం అనే అర్థాలను ఇచ్చారు .
అంతఃపురం
విసర్గ కు సంస్కృతంలో బోలెడన్ని ఉదాహరణలు దొరుకుతాయి . తెలుగులో విసర్గ అనగానే టక్కున గుర్తొచ్చే పదము అంతఃపురం . రాజుగారికి సంభంధించిన స్త్రీలు ఉండే ప్రాంతం అని అర్థం . రాణివాసం అని కూడా అనవచ్చు గానీ మనకు అంతఃపురమే నచ్చుతుంది ..
ఇ దండీ అచ్చంగా అచ్చులే చిరు వ్యాసం. కేవలం వ్యాకరణ పరిభాషలో కాకుండా కాసింత ఉప్పు , పులుపు ,కారం కలిపి గుచ్చెత్తి , వండి వార్చిన వంటకం .