Home కథలు అతిథిదేవోభవ

అతిథిదేవోభవ

by Tirunagari Devaki Devi

సుమన శుభలేఖ ఇచ్చిన మరునాటి నుండే వీడియో మెసేజ్ పదే పదే పెళ్ళికి రమ్మంటూ
ఆహ్వానం పలుకుతుంది.శుభలేకే వాళ్ళ ఆర్థిక హోదాను కొంత మోసుకొచ్చింది.ఇక వీడియో మెసేజ్ సంగతి చెప్పఖ్ఖర్లేదు.కాని సుమనలో ఆ ఆర్థిక డాంబికత్వం కనపడినే లేదు.”మనసుకు
తగ్గ పేరే ఆ అమ్మాయిది.” అనుకుంది వైశాలి.
కాలం నిరంతర వాహిని.ఏ అవరోధాలు దానిని ఆపలేవు.ఆ కాల గమనంలో ఎన్నో సంఘటనలు.మరెన్నో మార్పులు. అవి రాజకీయమో..సామాజికమో..భౌగోళికమో..మంచో చెడో ఆపత్తో..విపత్తో… వేటితో కాలానికి సంబంధం లేదు.దాని మానాన అది తన ప్రయాణాన్ని కొన సాగిస్తుంది తన కొలీగ్ సౌమ్య పదవీ విరమణ సందర్భంగా జరిగిన వీడ్కోలు సమావేశం నుండి ఇంటికి చేరుకునే సరికే ఆరు కావచ్చింది.ఆ రాత్రే వినోద్ కాంప్ ప్రయాణం.రోజువారి పనులతో పాటు ప్రతి ప్రయాణ సన్నాహం తన చేతులమీదుగా జరగాల్సిందే.”ఎంత మొత్తుకున్నా మానవుడిలో మార్పు లేదు. ఏమంటే ఆఫీసు పని ఒత్తిడి పోజు…తనేమొ ఏ ఉద్యోగం సద్యోగం లేకుండ ఇంటి పట్టునే ఉన్నట్టు.” తనలో తానే ఉడుక్కుంది వైశాలి. ఉడుక్కుని మాత్రం ఏం చేయగలదు పాపం ..మనసుకీ చేతలకూ సంఘర్షణ తప్ప.ఉద్యోగాలు చేసి ఊళ్ళేలినా ఆడ వాళ్ళ ఇంటి చాకిరీకి విముక్తి లేదు.మగ వాళ్ళ ప్రయాణసన్నాహాలు భార్యామణుల చేతిమీదుగా జరిగి తీర్చాల్సిందే .తప్పదు సరే. మరి భార్యామణి కాలు బయట పెట్టాలంటే తన ప్రయాణ సన్నాహం తోపాటు ఇంట్లో పిల్లలకే కాదు పతిదేవుడికి అన్నీ అందుబాటులో ఉంచి కాలు కదుపాలి.”ఏవేవో రకరకాలుగా ఆలోచిస్తూ పెద్దగా నిట్టూర్చింది వైశాలి.ఏ నిట్టూర్పులు..సంఘర్షణలు..అలసటలు వినోద్ ప్రయాణాన్ని అడ్డుకోలేదు.టంచనుగా రాత్రి పదకొండు గంటలకు ముంబాయి ట్రేన్ కాచ్ చేసాడు.పనులకు ముక్తాయింపు పలికే సరికి గడియారంలో డేటు వారం మారిపోయినై.బెడ్ రూంలోకి నడచుకుంటూ పోతుండగా గోడమీది కాలెండరు పలకరించింది ఓ తేదీ దగ్గర రైట్ మార్క తో.దాన్ని చూస్తేగాని సుమన పెళ్ళి మరునాడే అని గుర్తు రాలేదు వైశాలికి.ఆ అమ్మాయి కోసం పెళ్ళికి అటెండెన్స్ వేసుకోక తప్పదు. ఇంకా ఏవేవో ఆలోచిస్తూనే బెడ్ పై వాలిపోయింది. ఆలోచనలను ఏవైనా వాటిని అలసట డామినేటు చేయడంతో నిద్రాదేవత ఆమెను ఆవహిం చింది.

                                                                                                      ****************
అదే పనిగా మోగుతూ నిద్రాభంగం కల్గించిన గడియారం నెత్తిన ఓ మొట్టికాయ మొట్టి మళ్ళీ నిద్రకు ఉపక్రమించింది వైశాలి ఓ అర గంట తర్వాత లేద్దామని.ఈ సారి ఆమెను పాల బ్బాయి కాలింగ్ బెల్ లేపింది .దానర్థం ఏడైందని.నాలిక్కరుచుకుంటూ లేచింది .వారం రోజులుగా పని మనిషి కూడా రావడం లేదు.అంతా భిన్నత్వంలో ఏకత్వమే.ఆమె పాచిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఈదుకొస్తుంది.భర్త మాత్రం పున్నమ అమాసకన్నట్లు కూలికి పోయి తాగి తందనా లాడుతూ కుటుంబానికి భారంగానే మిగిలిపోయాడు.పైగా వారం రోజుల కింద తాగిన మైకంలో ఓ మోరీలో పడి కాలు విరగ్గొట్టుకున్నాడు. “మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం.మద్యం వల్ల ప్రజల ఆరోగ్యానికి నష్టం.కానీ మద్యానిది మాత్రం ప్రభుత్వ ఆదాయం వైపే మొగ్గు .ఈ విషయాలన్నీ ఆమె ను ప్రతి రోజూ కలత పెడుతున్నవే. పెళ్ళి 8.45కే అని ఉంది. ఊడ్వడాలు తుడువడాలు పనికి నడుం బిగించి యమ స్పీడుగా పూర్తి చేసి స్నానం వగైరాలు ముగించి గోడ వైపు చూస్తే పది హేను నిమిషాలే ఉంది పెళ్ళి టైం సుమా అన్నట్లు గడియారం హెచ్చరించింది.కాఫీ తో తృప్తి పడ మని ఆత్మారాముడికి నచ్చ చెప్పి ఇంటి నుండి బయట పడింది వైశాలి.వెతుకుతున్న కళ్ళకు ఒక్క ఆటో కనపడి చావలేదు .మరో నాలుగడుగులు ముందుకు వేసింది.ఐనా ఆటోలు కనపడలేదు. కన పడ్డా రద్దీతో.చౌరస్తాలో దొరకవచ్చన్న ఆశతో కాళ్లకు పని చెప్పింది.సడెన్ గా పక్కనే ఓ కారు ఆగ డమే కాదు డోరూ తెరుచు కుంది .
“వైశాలీ ఎచటికోయి నీ పయనం” అంటూ కారులోంచి చిరునవ్వులు చిందిస్తూ వైశాలీ స్నేహితురాలు సరళ పలకరింపు.
“ఓ పాత విద్యార్థిని పెళ్ళికి” కొంచెం ఆరాటంగానే సమాధానమిచ్చింది వైశాలి.
“పెళ్ళెక్కడ?”
“లక్ష్మీ గార్డెన్స్. ఒక్క ఆటో దొరికి చాపడం లేదు.”అంది ఆతృతగా.
“నేనూ అటే. అమ్మ వాళ్ళింటికి.కారెక్కేసెయ్.”సరళ. బతుకు జీవుడా అనుకుంటూ కారెక్కింది వైశాలి
“మాఇంటి దారే మరిచిపోయినట్లున్నవ్?”వైశాలి
“మరిచిపోవడమా పాడా? టైం దొరికితే కదా! డిసెంబరంతా తేజస్వితోనే సరిపోయిం దనుకో. తునున్నన్ని రోజులూ చుట్టపక్కాలు ..తన స్నేహితులు….వంటా వార్పులు..షాపింగులు.. ఒకటా రెండా…సమస్తం నామీద దాడి చేసాయనుకో.ఫ్లైటెక్కే వరకు ఊపిరాడలేదనుకో.” సమా ధానం చెప్పింది సరళ.
“అదీ నిజమే. నాకు తెలియందేముంది. తరుణ్ వచ్చినప్పుడు నా కథ కూడా అంతే. ఏమరికానో ఏమో?పిల్లలు వచ్చే వరకు నిరీక్షణ. వచ్చింతర్వాత అదో ఒత్తిడి.తిరుగుముఖం పట్టిం
తర్వాత అదో రంది.”అంటూ వివరణ ఇచ్చింది వైశాలి
“ఆటో దొరకకపోవడం ఒకందుకు మంచిదే ఐంది కదూ!”అన్నది సరళ
“అదీ నిజమే..కాని ఎందుకు దొరకలేదంటవ్?” తన సందేహాన్ని వెలిబుచ్చ్ంది వైశాలి
” తర్వాత మూడాలు వస్తున్నాయట .రెండునెలల వరకు మళ్ళీ ముహూర్తాలు లేవట. అందుకే మంచి రోజంటూ ఇవాళ్ళ్టి ముహూర్తంపై అందరి దాడి.” సరళ
“ఏం ముహూర్తాలో ? ఏం మూడాలో? ఏం జాతకాలో? అన్నీ చూసి చేసినా ఎన్నో దురదృష్టాలు.” వైశాలి
“వాటికిచ్చే విలువను మనుషుల వ్యక్తిత్వాలకివ్వడం లేదు. ప్రపంచమంతా డబ్బు మయం ఐపోయింది.” సరళ
“అది సరేగాని మీ అమ్మదగ్గరినుండి వచ్చేప్పుడు మా యింటికి రాకూడదూ? మా ఆయన కూడా ఇంట్లో లేరు “అడిగింది వైశాలి .
” ఐతే మరీ మంచిది. కొంచెం ఫ్రీగా గడపొచ్చు.కానీ నేనొచ్చేవరకు నాలుగవుతుందేమో?” అంది సరళ
“ఐతే ఏంటట? బహుషా ఒంటిగంటకల్లా నేనింట్లో ఉంటాననుకుంట.”వైశాలి
“ఓకే డన్”అంటూ సరళ చెయ్యి కలిపింది.
వాళ్ళ మాటల్లోనే లక్ష్మీ గార్డెన్ వచ్చేసింది .బైబై చెప్తూ కారు దిగిన వైశాలి కాళ్ళు హాలు వైపుగా సరళ కారు వాళ్ళమ్మ ఉండే కృష్ణ కాలనీ దిశగా కదిలినై.వైశాలి లక్ష్మీగార్డెన్స్ ముఖద్వారం చేరుకుంది.పార్కింగ్ ఏరియా రకరకాల కార్లతో నిండిపోయిఉంది ఓ కార్ల ఎగ్స్ బిషన్ లా. ముహూ ర్తం దగ్గర పడుతుండటంతో కొంచెం ఆరాటంగానే అడుగులు వేసింది.ముఖద్వారానికి ఒకవైపు
వధూవరుల ఫొటోలు..మరో వైపు అమ్మాయి తల్లిదండ్రుల ఫొటోలు ఆహ్వానితులుగా. .అన్నిటినీ మించి పౌరాణిక సినిమాల్లో లాగా ఇద్దరు ద్వారపాలకులు అందమైన కట్టెలను ఇంటూ ఆకారంగా పట్టుకొని .ఇదేదో రాచ మర్యాదలా ఉందనుకొని మరో అడుగు ముందుకు వేసింది.కాని ఆ ఇంటూ ఆకారం భీష్మించుకుంది.పోవడానికి వీల్లేదంది.అది వి ఐ పి లద్వారమని తేల్చి చెప్తూ ఓ ద్వార పాలకుని చెయ్యి రెండో గేటుని సామాన్యుల దారిగా చూపిం చింది.వైశాలికి ఆ తీరు అసౌకర్యం గానే కాదు కొంత అవమానంగా కూడా ఫీలైంది. చేసేదేంలేక లోపలికి నడిచింది. పూలవాసనల గుబాళింపు నాసికారంధ్రాలను అదరగొడ్తుంది.తోరణాలు.. డేరాలు..నడిచే దారంతా ఎప్పటి తివాసీలు.. కళ్ళు జిగేల్మంటున్నైడెకరేషన్ అదిరి పోయింది.అది పోస్ట్ హోదాను అద్దం పడు తుంది.హాలంతా అతిథులతో నిండిపోయింది. సీటు ఖాళీగా ఉన్న దాఖలా కనపడలేదు.వైశాలి తన కళ్ళకు పని చెప్పింది సీటు వెతుకమని. ఈ లోగా ఆపద్బంధవిలా సుమన స్నేహితురాలు
మానస ” నమస్కారం” అంటూ పలకరించి ఓ సీటు చూపించింది. “బ్రతుకు జీవి ” అనుకుంటూ వైశాలి ఆ సీటుకు పాత్రత్వం కల్పించింది.
స్టేజ్ వైపు తిరిగిన వైశాలికి వధూవరుల జిలకర బెల్లం కార్యక్రమం కనిపించింది. సమయానికి చేరుకున్నందుకు హాయిగా ఊపిరి పీల్చుకుంది.అదేదో తను చేరకపోయుంటే ఆ కార్యక్రమానికి సార్థకత ఉండేది కాదేమో అన్నంత ఫీలింగ్ తో.ఆ ఆలోచన రాగానే తనలో తానే నవ్వుకుంది.ఒకసారి హాలంతా కలియ చూసింది.సీతాకోకచిలుకలు వచ్చి వాలాయేమో అన్నంతగా మహిళామణుల చీరా జాకెట్లు..గాగ్రాలు..లంగాలకంత ఓణీలు..ఒక దానిని మించి
మరోకటి.ఒళ్ళంతా తాపడం చేసుకున్నారేమో అనే బ్రమను కల్పించే కళ్ళకు మిరుమిట్లుగొలిపే
నగలు .ఒయ్యారాలు ఒలుకబోస్తూ చిరునవ్వులు చిందిస్తూ యువతరంగిణులు.”ఆ అలంకరణలో
అందం చందం సరే.కాని ఈ ఎండల్లో శరీరం వాటిని ఎట్లా తట్టుకుంటుందో పాపం.”వైశాలి తనలో తానే ప్రశ్నించుకుంది వైశాలి తనలో తాను.ఐనా పీత కష్టాలు పీతవి.కందకు లేని దురద
కత్తికెందుకట అని సమాధానమూ తానే చెప్పుకుంది.
మరోసారి వేదిక వైపు దృష్టిని సారించింది. దానికి దగ్గరగా క్రేన్ వంటిదేదో పైకి ..కిందికి…కుడి…ఎడమలుగా కదులుతూ కనిపించింది.కొంచెం గమనిస్తే అది ఫొటోలు తీస్తుందని అర్థమైంది. వేదిక మీదకు చేరి కార్యక్రమ నిర్వాహకులకు వాళ్ళ ఇబ్బంది కొంత తొలగిపోతుందని తృప్తి పడింది.
తెలిసిన తలకాయలేమైనా కనపడుతాయేమోనని హాలంతా కలియచూసింది.ప్చ్..లాభం లేకపోయింది.కాని ఆ కళ్ళకు హాల్లో ఐదారు చోట్ల ప్రొజెక్టర్లు కనిపించాయి.వాటిలో పెళ్ళి తంతును స్పష్టంగా చూడొచ్చన్నమాట.. “అంటే ఏంటన్నట్లు ” తనకు తానే ఓ ప్రశ్న వేసుకుంది.
“పెళ్ళికంటూ వచ్చి ఆ పెళ్లిని స్పష్టంగా చూడలేక ప్రొజెక్టర్ లో పెళ్ళి చూడట మన్నమాట. ”
అనుకుంటుండగానే ఆ ప్రొజెక్టర్ లలో పెళ్ళికి ముందు పెళ్ళి కొడుకు , పెళ్ళి కూతురు విభిన్న భంగి మలలో దిగిన రకరకాల ఫొటోలు కనపడుతున్నాయి.బహుషా దాన్నే ఫొటో షూటింగ్ అంటారేమొ . ఈ మధ్య పిల్లలు మాట్లాడుకుంటుంటె విన్నాను.కొత్త నాగరికతలు.. సరికొత్త సంప్రదాయాలు. ఎవరి ఆనందం వాళ్ళది.కాని ఈ డబ్బులున్న వాళ్ళు ఎన్ని తతంగాలైనా చేయొచ్చు. కాని పులిని చూసి నక్క వాత పెట్టు కున్నట్లు సాధారణ జనం సంగతేంటి?”లక్ష ఆలోచనలు వైశాలి మనస్సులో.
“.వైశాలి ఆలోచనలను భంగం చేస్తూ ధన్ ధన్ మంటూ బాండ్ మోత.ఆ గర్జనకు సమాంతరంగా పెళ్ళి కొడుకు సుమన మెడలో తాళి కడుతున్న దృశ్యం మెరుపులా.కాని వేదిక మెట్ల దగ్గర నల్ల సఫారీలతో బలిష్టమైన కండరాలతో కొందరి ఉనికి దాదాల్లా.
.”ఓహో! వీళ్ళనే బౌన్సర్లు అంటార”ని గుర్తుకొచ్చింది వైశాలికి.
“పెళ్లిలో రౌడీలు లేరే..మరి గొడవ చేసే వాళ్ళెవరు.అంతా అతిథులే కదా!”మళ్ళీ తనలో తనే ప్రశ్నించుకుంది వైశాలి.అమ్మాయి మెడలో మంగళసూత్రం పడిందో లేదో…కనీసం వధూవరులకు వేదిక మీద కుర్చీలను వేయనే లేదు. హాల్లో జనమంతా లేచి బిలబిలమంటూ వేదిక వైపు దండెత్తినంత పని చేసారు.వెంటనే బౌన్సర్లు రంగంలోకి దిగారు.కేవలం పదిమంది చొప్పున మాత్రమే వదలడం మొదలు పెట్టారు. కాని ఆ తతంగం ఓ పదినిమిషాలు కూడా సాగ లేదు. ఆ జన వాహినికి బదులుగా రాజకీయ వాహిని కనపడింది.వచ్చిన రాజకీయ ప్రముఖుడు
యం. యల్. ఏ అని అర్థమైంది. కాని వెనుక ఉన్న జనం..నాయకుల హోదాను చూపించడానికి వచ్చే జనమని జగమెరిగిన సత్యమే. “ఆ నాయకుల వెంట ఉన్నప్పుడు సంఖ్య పక్కన సున్నాలు. వాళ్ళే లేకపోతె కేవలం జీరోలు” తనలో తాను నవ్వుకుంది వైశాలి. బహుషా వాళ్ళు వస్తున్నట్టు సుమన తండ్రికి ముందే సమాచారముందేమొ…వేదిక దిగి వాళ్ళను ఎదుర్కొని వచ్చాడు. మందస్మిత ముఖారవిందాలతో అక్షతాశిస్సులు..కరచాలనాలు..ఆత్మీయ ఆలింగనాలు..ఫొటో దిగటాలు..అన్నీ కళ్ళు మూసి తెరిసే లోపె.ఆ వాహిని సుమ వాళ్ళన్నయ్య అసిస్టెన్స్ లో డైనింగ్
హాలు దిశగా సాగింది.మళ్ళీ జనవాహిని మంద్రంగా…బౌన్సర్ల అదుపాజ్ఞల్లో.
వైశాలి కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి.బ్రేక్ ఫాస్ట్ చేయనందుకు తనను తానే తిట్టుకుంది.లేచి ఆ లైన్లో కలుద్దామనే అనుకుంది . కానీ చీమ కూడా దూరడానికి వీలు లేదన్నట్లు
ఆ లైను కదులుతుంది.” ఇంటి దారి పడితే…” మరో ఆలోచన.”ఉడికే దాక ఉన్న ఓపిక ఉమ్మొగిలే
దాక ఉండాలి కదా! పైగా సుమన ఫీలౌతుంది. లాభం లేదు. ఉండి తీర్చాల్సిందే . ఓపిక పట్టా ల్సిందే” నిర్ణయానికి వచ్చింది.ఆకలిని జయించడానికా అన్నట్లు తన చూపులను వేదిక వైపు తిప్పింది.దానికి కుడి వైపుగా యువతుల గుంపు దాండియా ఆడుతూ..నవ్వుతూ ..తుళ్ళుతూ..
ఆనంద డోలికల్లో. “సరదాకు అవకాశం కల్పంచిన పెళ్ళి సందడి.” అనుకుంది వైశాలి.ఆమె చూపులు వధూవరులను వెతికాయి.కాని ఆ చూపులకు భంగపాటు ఎదురైంది.ఎందుకిలా జరి గిందనుకుంటూ ఎడమ వైపుగా కదిలిన ఆ చూపులకు చప్పుళ్ళతో ఓపెన్ స్పేస్ వైపు పూజారితో సహా పోతున్నట్లు తెలిసింది.” పగలే వెన్నెలలో అబ్బాయి అమ్మాయికి అరుంధతీ (లేని)నక్షత్ర దర్శనం చేయిస్తాడేమొ.తప్పదు మరి ఈ అమ్మాయీ అరుంధంత పవిత్రంగా.. పతి వ్రతగా ఉంటేనే ఆ వరుడి జన్మ సార్థకం. !”గొణుక్కుంది తనలో తను. ఎంతకీ లైనుకు ముక్తాయింపు
కనపడక పోవడంతో కొందరు క్యూ ను క్విట్ చేసి భోజనాల దారి పట్టారు.దాంతో లైను కొంచెం పలుచ పడ్డది. ఒంటిగంటకా వస్తుంది. ఆకలి ఆగలేనంటుంది. వైశాలి లేచింది.లైన్లో కి చొచ్చుక పోయింది.ఆమె వెనుక మరికొందరాడవాళ్ళు.ఆ తర్వాత చాలామంది అచ్చంగా పరీక్ష హాల్లో విద్యార్థుల్లా. మొత్తానికి వైశాలి ఆడవాళ్ళకో దారి చూపించినామె ఐంది.వెనకాల ఉన్న మగ
మహారాజులు మొదట కొంత బిత్తర పోయినా ఆ తర్వాత తమ ఓపికను పరీక్షించే సత్తా ఈ ప్రపంచంలో ఎక్కడా లేదని నిరూపిస్తూ తమ చేతుల్లో ఉన్న అక్షతలను నిలబడిన చోటినుండే (ఉద్యమ కారులు బస్సులపై రాళ్ళు విసిరినంత స్పీడులో )వధూవరులపైకి విసిరి డైనింగ్ హాల్ దారి పట్టారు.
” పెళ్ళి కి వెళ్ళి రావడాన్ని మొత్తంగా ఐదు అధ్యాయాలుగా విభజించ వచ్చేమొ.వెళ్ళడం
మొదటి అధ్యాయం కాగా..పెళ్ళి తతంగం పూర్తయ్యే వరకు నిరీక్షించి వేదిక చేరుకొని వధూవరు లను కలవడాలు రెండు మూడు అధ్యాయాలు కాగా భోజన కార్యక్రమం నాలుగు తిరిగి వాహనం దొరికి ఇంటికి చేరుకోవడం ఏదో అధ్యాయం.దానితో పెళ్ళి తతంగం సమాప్తమన్న మాట.”అని తీర్మా నించుకున్న వైశాలి ఆరాటంతో కదిలి అక్షతలతో ఆశీర్వదించి సుమన చేతిలో తను తెచ్చిన
గంగు నవల ను కానుకగా ఇచ్చింది .తనను చూసిన సుమన సంతోషానికి అవధులు లేవు.ఉబ్బి తబ్బిబైపోయింది .ఉన్నఫళంగా పాదాభి వందనం చేసింది.ఆ అమ్మాయి ఆనందం చూడగానే అంతసేపు వైశాలి పడ్డ యాతన మటు మాయమైంది. పెళ్ళి కొడుకుతో పాటు తన తల్లితండ్రులకు తన టీచర్ ను సుమన పరిచయం చేసినా అవి మొక్కుబడి పలకరింపులే అయ్యాయి. భోజనం తప్పకుండా చేయమని ఆ అమ్మాయి అభ్యర్థన.తప్పదన్నట్లు వైశాలి డైనింగ్ హాలు వైపు దారి తీసింది.

                                                                                                    ****************

డైనింగ్ హాల్లోకి అడుగు పెడుతున్న వైశాలికి అక్కడే ఏదో పార్టీషియన్ కనిపించింది.దానిముందూ ధవళ వస్త్రముల వేత్రహస్తులు …వేత్రములను ఇంటూ ఆకారంగా పట్టుకొని.అటువైపు వెళ్లిన వాళ్ళందరిని ఓ ఖద్దరు శాల్తీ జనరల్ డైనింగ్ కు వెళ్ళాల్సిందిగా సూచిస .ఆ సూచన ఓ వృధ్ధదంపతులకూ చేరింది.హాలంతా దోస..పానీ పూరి.. సమోసా చాట్ ..ఐస్ క్రీం..స్వీట్స్ ..ఫ్రూట్స్ వంటి తిను బండారాలతో ముస్తాబై ఉంది .అన్నం..పప్పు ..కూరలు..వంటి కూరలు షరా మామూలే. వైశాలి మనసు భోజనం వైపే మొగ్గు చూపింది .అన్ని చోట్ల ఉన్నట్లు అక్కడా అంతే రద్ది.ఐనా తప్పదు.ఇంట్లో తిండి ఎట్లగూ సిద్ధంగా లేదు.ఇక్కడే
ఇంత ఎంగిలి పడుదామని ముందుకు కదిలింది.ప్లేట్ లో రెండు నాన్ ముక్కలు..ఓ కూర.. పప్పు ..కొంచెం అన్నం పెట్టుకొని పక్కకు జరిగి తినడానికి ఉపక్రమించింది .నాన్ నుండి ఓ చిన్న ముక్క
తీసుకుందామని ప్రయత్నం చేసింది. కాని దాని నుండి ముక్క భీష్మించుకుని చినగను గాక చినగనంది.మొత్తానికి వైశాలి విశ్వప్రయత్నంతో చేతిలోకి ఓ ముక్క చేరింది.కూరను చేర్చి నోట్లో పె
ట్టుకుంది.నోరంతా నూనె మాయమవటమే కాదు ఆ నాన్ ను పళ్ళు నమలలేమని తేల్చి చెప్పు తున్నాయి.తినడానికి మరి కొంత ప్రయత్నం చేసింది . అన్నమైనా తిందామనుకుంటే సరిగా ఉడుకనే లేదు.ఇక లాభం లేదనుకొని ప్లేటును టబ్ లో చేర్చింది.ఆ టబ్ ను చూసి వైశాలి మనసు జాలితో నిండి పోయింది.పాపం దాని నిండా తినకుండా మిగిలిన ఆహార పదార్థాలూ నిండి పోవ
డంతో మా దీనావస్థను చూడండని వేడుకుంటుంటున్నాయి.
చేతులు కడుక్కొని వస్తున్న వైశాలికి ఇందాక కనిపించిన పెద్దవాళ్ళు ప్లేట్ల భారంతో నిలబడక..తినలేక.” డబ్బు దర్పం ఉన్న వాళ్ళకేమొ టేబుల్ ముందు కూర్చొని తినే సౌకర్యవంత మైన ఏర్పాట్లా?ముసలి ముతుక..పిల్లా జెల్లా నానా అగచాట్లు పడాలా? “ఎవరినీ ప్రశ్నించలేక
తనలోతానే గొణుక్కుంది.ఇక ఇంటి దారికై ఎక్సిట్ వైపు పోతుండగా ఆ పెద్దాయన జారి పడబోగా
ఎవరో ఒకాయన గబుక్కున ఆసరా ఇచ్చాడు. లేదంటే పాపం ఏ కాలో చెయ్యో విరగ్గొట్టుకుని హాస్పిటల్ కు ఆదాయం పెంచేవాడు.అక్కడంతా నీళ్ళ రొచ్చుందని వైశాలి కళ్ళు గమనించాయి.
“పాపం ముసలాయనచస్తుండే . జర అసొంటిదెవతొ పొయ్యి చేతులు కడుగొచ్చు కదా”
ఓ గొంతు ప్రశ్న.
” సగం తాగిన గిలాసలు సుత ఏడంటె ఆణ్ణే పెట్టవట్టరి.మల్లంత సదివిన మారాజులే.”ఓ పనామె
“కూరనారలు సుత నిలబడ్డకాన్నే ఎయ్యవట్ట్రి. బగ్గ నగలు దిగేసుకొని షోకు షోకు బట్టలేసుకోంగనే సరిపోతాది?”ఇంకో పనామె
వాస్తవాలైన వాళ్ళ మాటలను వింటూ “చదువు వల్ల వివేకం కలిగే రోజులకు కాలం చెల్లి
పోయిందని తనకు తానే సమాధానం చెప్పుకొని అక్కడినుంచి నిష్క్రమించింది వైశాలి.

                                                                                                   ****************

వైశాలి ఇంటికి చేరుకుని కాళ్ళు చేతులు కడుక్కుందో లేదో మంచానికి తన శరీరాన్ని అప్పచెప్పింది. పెళ్ళి వాతావరణం కారణంగా ఆమె పై ఆకలి ..అలసట…అశాంతి ముప్పేటలా దాడి చేసాయి. కాని ఆ మూడింటిని నిద్రాదేవత జయించింది.నాలుగింటి వరకు ఆమెకు తోడుగా నిలిచి కాలింగ్ బెల్ చప్పుడు తో బై బై చెప్పి వెళ్ళిపోయింది. తలపు తీసిన వైశాలికి సరళ కనపడటంతో నాల్క కరచుకుంది.
“మంచి నిద్రలో ఉన్నట్టున్నవ్? డిస్టర్బ్ చేసానేమొ?”అంది సరళ
“అదేం లేదు.రెండు గంటలు మాంచి నిద్ర పోయాననుకో రా! రా! .”అంటూ డైరెక్ట్ గా వంటింట్లోకి దారి తీసింది.
“కాసేపు ఇక్కడే కూర్చొని ముచ్చట్లాడుదాం. ఎట్లాగూ మీ ఆయన కూడా లేరు కదా! ఇవాళైనా ఆ వంటింటి గొడవను మరిచిపోదాం. పైగా నువ్వేమొ పెళ్ళి భోజనం …నేనేమొ అమ్మ చేతి వంట.” సరళ.
“పెళ్ళి భోజనమా? మరేమన్నానా? “అంటూ తన ఆకలి ఘోషకు కారణాలన్నిటినీ పెళ్ళి
తతంగాలతో పాటు సరళ ముందు కుమ్మరించింది వైశాలి.
“నిజమే వైశాలీ ! ఈ మధ్య కాలంలో పెళ్ళి పిలుపులకు..కల్పించే సౌకర్యాలకు.. ఏమా త్రం పొంతన ఉండటం లేదు..హోదా ప్రదర్శనలకిచ్చే ఇంపార్టెన్స్ ఆతిథ్యానికి లేదు.”
“ఔననుకో. కాని చిన్న సవరణ. రాజకీయ నాయకులకు …డబ్బును మారాజులకు మంచి ఆతిథ్యమే ఇస్తారు.”సరళ
“అదే కదా! నేననేది.వాళ్ళకేమొ ప్రత్యేకమైన డైనింగ్ ఏరియా …టేబుళ్ళు.. కుర్చీలు.. వడ్డనలు…మర్యాదలు…సమస్తం.మిగిలిన వాళ్ళేమొ ప్లేట్లను అడుక్కునే చిప్పల్లాగ పట్టుకొని
అన్నం పప్పు ..కూరా ..చారంటూ లైన్లో.”బాధతో అంది వైశాలి.
“ఆ లైనైనా సరిగా ఏడ్చి చస్తుందా అంటే అదీ లేదు.నేను వడ్డించుకుని వెనక్కి తిరుగు తున్నానో లేదో ఓ వీర వనిత నా నెత్తి మీదుగా ప్లేటు పెట్టి కూర వేయించుకోవడంలో నా బ్లౌజు ను కూడా పావనం చేసింది.ఆ బ్లౌజిప్పుడు డ్రై క్లీనింగ్ దర్శనం చేసుకోక తప్పదు.”మళ్ళీ చెప్పుకొచ్చింది వైశాలి .
“జనాన్ని పిలిచి అవమానించడమంటే ఇదేనేమొ.”సరళ
“ఈ పెళ్ళిలో అతిథి దేవో భవ..గురు దేవో భవ..రెండు అభాసుపాలైనై. అఫ్ కోర్స్.. ఇందులో సుమన ప్రమేయం లేదనుకో.” సుమనకు మాట రాకూడదన్నట్లు మాట్లాడింది వైశాలి.
“శిష్యురాలంటే ఎంతభిమానమో..నాకూ ఈ అనుభవాలు చాలానే ఉన్నాయి.”నవ్వింది సరళ.
“అందరి అనుభవాలూ అవేనమ్మా! మార్గాన్వేషణ చేస్తే బాగుండు.”వైశాలి
” ఎవరో ఎందుకు .పిల్లి మెడలో గంట కట్టడంలా.మనింటి పెళ్ళిల్లే నాంది .”
” ఓకే డన్ “అంటూ ఇద్దరు చేతులు కలుపుకున్నారు.మాట్లాడుతూనే వైశాలి వెజిటేబుల్ కమ్ టమాటా బాత్ ను ఆరగించి టీ సేవించారు.ఆపై ఎన్నో సామాజికాంశాలూ వాళ్ళ చర్చలలో వచ్చాయి.గోడ గడియారం ఏడైందని హెచ్చరించడంతో “ఇక నాకు సెలవియ్యి తల్లీ”అనుకుంటూ ఉన్నఫళంగా లేచింది సరళ.
“ఇంకాసేపుడ్డొచ్చు కదా!”బతిమాలింపు ధోరణిలో.
“మా మానవుణ్ణి ఎంత సేపు నిరీక్షణలో పెట్టమంటావు.?”
“మనలాగా నిరీక్షణలు తట్టుకునే శక్తి వాళ్ళకెక్కడిదిలే. “అంటూ సరళను సాగనంపింది
వైశాలి.

****************

ఓ సంవత్సర కాలం గడిచింది.యాదృఛ్ఛికమో …ప్రణాళికో…డిసెంబరు నెలలో తరుణ్
తేజస్వి ఇండియాకు వచ్చేసారు.తామిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డామంటూ పెళ్ళి ప్రపోజల్ ను తల్లి కతండ్రుల ముందుంచారు.ఒప్పుకోకపోవడానికి వాళ్ళ కే కారణాలు కన్పించలేదు. ఒప్పేసు కున్నారు కూడా.రెండు కుటుంబాలు కూచుని రిజిస్టర్ మారేజ్ కమ్ రిసెప్షన్ అరేంజ్ చేసు కున్నా రు. అంటే రిసెప్షన్ హాల్లో నే రిజిస్టేషన్ జరిగేట్టు.మొత్తంగా ఆహ్వానితులను రెండు వందలకు పరిమితం చేసుకున్నారు. వేదికకు ఒకవైపు సుమధురగాన లహరిని ఏర్పాటు చేసారు. అతిథు లంతా హాయిగా టేబుళ్ళ ముందు కూచుని హాయిగా ఆతిథ్యాన్ని స్వీకరించగల్గిన వాతావరణం
కల్పించారు.హాలులో “అతిథి దేవో భవ”. “అన్నం పరబ్రహ్మ స్వరూపం” “భోజనం న పరిత్యక్త
వంటి బానర్లను ఏర్పాటు చేసారు.వచ్చిన వాళ్ళందరిని పేరు పేరునా పలకరించారు.పసందైన విందునిచ్చి వీడ్కోలునిచ్చారు.ఈ బాట పదుగురికి ఆదర్షం మరేమున్నది.

You may also like

Leave a Comment