Home ఇంట‌ర్వ్యూలు అన్ని విజ్ఞాన సర్వస్వాలు ఒకే విధంగా ఉండవు

అన్ని విజ్ఞాన సర్వస్వాలు ఒకే విధంగా ఉండవు

by Aruna Dhulipala

‘విజ్ఞాన సర్వస్వ కళానిధి’ బిరుదాంకితులు, ప్రసిద్ధ కవి, రచయిత డా. గుంజి వెంకటరత్నం గారితో మయూఖ ముఖాముఖి.

******************************************

       నిరంతర శ్రమ, పట్టుదల, అంకితభావం ముప్పేటలుగా ఒక్కచేతి మీదుగా విజ్ఞాన సర్వస్వాలను వెలయించి సాహిత్యరంగానికి ఎనలేని సేవను చేసిన డా. జి.వి. రత్నం గారి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్🙏🏼 మీ గురించి మా మయూఖ పాఠకులకు పరిచయం చేయబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

1ప్ర:-  మొదటగా మీ జననం, మీ బాల్యం ఎట్లా గడిచిందో వివరంగా తెలపండి.
జ.  నమస్కారం మేడం. మాది నెల్లూరు జిల్లాలోని మైకా మైన్స్ ఏరియా కలిచేడు గ్రామం. నేను మే 16,1937లో పుట్టాను. మా నాన్న గుంజి వెంకటేశ్వర్లు, అమ్మ వెంకట లక్ష్మమ్మ. మా తాతగారు గుంజి చిన్నయ్యగారు మైకా కాంట్రాక్టులు చేసేవాడు. ఆయనకు మా నాన్న ఏకైక సంతానం. మా తాతయ్య మా నాన్నను ఆ రోజుల్లోనే (1920కి పూర్వం) మా ఊళ్ళో ఉన్న మహేశ్వర్ల వెంకట రత్నయ్య గారు అనే సంస్కృత పండితుని వద్ద చదివించాడు. మా నాన్న ఆయన దగ్గర అమరకోశం, నిఘంటుత్రయం, త్రిలింగశేషం, సాంబ నిఘంటువు, భారత భాగవతాలను ఆ తర్వాత పాఠశాల చదువు చదువుకున్నారు. తరువాత స్వయంగా ఇంగ్లీషు నేర్చుకున్నారు. ఆ కాలంలో ఆయన దగ్గర శంకర నారాయణ డిక్షనరీలు ఉండేవంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. అట్లా చదువుకోవడం వల్ల మా నాన్నకు మైకా మైన్స్ లో స్టోర్ కీపర్ గా ఉద్యోగం వచ్చింది. నేను పుట్టకముందే మా తాతగారు చనిపోయారు. మా నాన్నకు ముప్పయి రూపాయల జీతం ఉండేది. మా ఊళ్ళో ప్రయివేటు స్కూల్ ఉండేది. అందులో భాస్కర్ రావు గారు టీచరు. ఊరు చిన్నదే అయినప్పటికీ మైకా మైన్స్ వల్ల కాలనీలు ఏర్పడ్డాయి. ఈ కాలనీలలో తమిళనాడు, బెంగుళూరు, ఒరిస్సా నుంచి ఉద్యోగరీత్యా ప్రజలు రావడం వల్ల మిక్స్ డ్ కల్చర్ ఏర్పడింది. కాఫీ,టీలు తెలియని రోజుల్లో అక్కడ అవి ఉండేవి. వీళ్ళ పిల్లలంతా చదువుకోవడానికి టీచరు సరిపోక మరో టీచరును పెట్టారు. ఆ ప్రైమరీ స్కూల్లో నేను నాలుగవ తరగతి దాకా చదువుకున్నాను. మైకా మైన్స్ వెల్ఫేర్ ఫండ్ అని ఉండేది (1948-49). మైకా కార్మికుల సంక్షేమనిధి. కార్మికుల సంక్షేమం కోసం ఒక ఆసుపత్రి, స్కూల్ పెట్టారు. మా నాన్నగారు అందులో పనిచేయడం వల్ల మేము ఆ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. ఆ స్కూల్లో నేను అయిదవ తరగతి చదువుకున్నాను. అక్కడ మాథ్యూస్ సర్ ఉండేవాడు. అటు తరువాత పదవతరగతి సైదాపురం హైస్కూల్లో చదివాను. నెల్లూరు వి ఆర్ కళాశాలలో ఎస్ ఎస్ ఎల్ సి, బి.ఏ. చదివాను. బిఏలో కొత్తగా ఒక కోర్సు పెట్టారు. దాంట్లో మెయిన్ తెలుగు 6 పేపర్లు, సంస్కృతం 4 పేపర్లు, హిందీ 4 పేపర్లు. అన్నీ లాంగ్వేజెసే. సబ్జెక్టులు ఉండేవి కావు.

2ప్ర:- సాహిత్య పరంగా మిమ్మల్ని ప్రభావితం చేసిన గురువులు ఎవరైనా ఉన్నారా?
జ. ఉన్నారు. మాకు బిఏ లో చెప్పిన టీచర్లు గొప్ప పండితులు. దర్భా వేంకట కృష్ణమూర్తి గారు. ఆయనను చూస్తే… “ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞ మూర్తి భా/ షాపర శేషభోగి…….” అని మనుచరిత్రలోని అల్లసాని పెద్దన పద్యం గుర్తుకు వచ్చేది. మరచెంబులో నీళ్లు, గొడుగు, లాల్చీ, ధోవతి, పైన కండువా ధరించి వచ్చేవారు. బోధన కూడా అంత అద్భుతంగా ఉండేది. ఆయన మాకు వ్యాకరణం నాటకాలు చెప్పేవారు. పిసుపాటి విశ్వేశ్వర శాస్త్రి ప్రాచీన పద్యభాగం చెప్పేవారు. పోలూరి హనుమజ్జానకీ శర్మ వంటి వారుండేవారు. వాళ్ళ ప్రభావం వల్ల సాహిత్యమే కాక టీచరునవ్వాలన్న కోరిక బలీయంగా ఏర్పడింది.

వెంకటరత్నం గారితో ముఖాముఖి గ్రహీత అరుణధూళిపాళ

3ప్ర:- మైకా మైన్స్ లో ఉద్యోగం చేశారని విన్నాం. ఆ నేపథ్యం, వివరాలు చెప్పండి.
జ.  నాకు బి ఏ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే పెళ్లి అయింది. నా భార్య పేరు ఆదిలక్ష్మి. ఆమె తండ్రి ఆలకుంట అంకయ్య గారు. ఆయన మైకా మైన్సు కాంట్రాక్టు లీజు పద్ధతిలో నడిపేవారు. అందువల్ల నేను కూడా అందులో వ్యాపారంలో చేరాను. కానీ కారణాలు ఏవైనా నాకది సరిపడలేదు. నేనందులో ఇమడలేకపోయాను. బయటకు వచ్చాను. ఇట్లా కాదని మా నాన్నగారు పదిరూపాయలు చేతిలో పెట్టి ఇవన్నీ నీతో కావు. నెల్లూరుకు పోయి ఎంప్లాయ్ మెంట్ ఆఫీసులో పేరు నమోదు చేయించుకోమన్నారు. ఉద్యోగంలో స్థిరపడమన్నారు. వారం తిరక్కుండానే వరంగల్లు అజాం జాహి బట్టల మిల్లులో ప్రభుత్వోద్యోగం వచ్చింది. మన ప్రాంతంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అది. అందులో క్లర్క్ గా ఉద్యోగం వచ్చింది (1965). అప్పటికే ఇద్దరు పిల్లలు, 92 రూపాయల జీతం. కొంతకాలం చేశాను కానీ అదీ నచ్చలేదు. టీచరు కావాలనే కోరికతో బి ఇ డి కి అప్లై చేశాను.

4ప్ర. ఎక్కడో కలిచేడులో పుట్టిన మీరు కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్ డి చేయడానికి, ఇక్కడే స్థిరపడిపోవడానికి కారణాలు ఏమిటి?
జ:-   1967వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ వారు బిరుదురాజు రామరాజు గారి ఆధ్వర్యంలో  వరంగల్లులో పిజి సెంటర్ పెట్టారు. నేను వెంటనే అప్లై చేశాను. అప్పటికే బట్టల మిల్లులో పనిచేస్తున్నాను. మిల్లులో మూడు షిఫ్టులు ఉండేవి. నాకు ‘సి’ షిఫ్ట్ ఉండేది. అది కాగానే క్లాసెస్ అటెండ్ అయ్యేవాడిని. నెలనెలా షిఫ్టులు మారతాయి కానీ నా షిఫ్ట్ మార్చకుండా యాజమాన్యం వారు నాకు సహకరించారు. మీరడిగినట్లు కాకతీయ విశ్వవిద్యాలయంలో చేరడానికి కారణం ఉంది. నాకు వరంగల్ అంటే చాలా అభిమానం. దానికి ఒక కారణం ఉంది. నేను నాల్గవ తరగతిలో ఉన్నప్పుడు రెండవ ప్రోలరాజు కథ పాఠ్యాంశంగా ఉండింది. అందులో ప్రోలరాజు సరుకులు వేసుకొని బండిలో వస్తుంటే బండి చక్రం దిగబడిపోయి ఆ చక్ర ‘నేమి’ బంగారంగా మారిందని దానితో ఓరుగల్లు కోట నిర్మించారని విన్న నాకు…అది మనసులో అది బలంగా నాటుకొనిపోయింది. ఇంకోటి బి ఏ స్పెషల్ తెలుగులో ‘క్రీడాభిరామం’ చదివాను. అది మొత్తం ఓరుగల్లు వర్ణన. అప్పటినుండి ఓరుగల్లును ఒక్కసారి చూడాలనే కోరిక కలిగింది. అటువంటిది మొత్తం ఇక్కడే స్థిరనివాసం ఏర్పడింది. వరంగల్లు కామసానమ్మ అంటే నాకు ఎంతో అభిమానం. కాకతీయుల వల్ల ఓరుగల్లుకే కాదు తెలుగు సంస్కృతికి ఒక గుర్తింపు వచ్చిందని నా అభిప్రాయం. అందువల్ల పిజి సెంటర్ రాగానే అందులో చేరాను. నాకు జన్మనిచ్చింది కలిచేడు అయినా జీవితాన్నిచ్చింది ఓరుగల్లు. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అనే కాదు. నాకు జీవితాన్నిచ్చిన ఓరుగల్లు కూడా నాకు “స్వర్గాదపి గరీయసి”(సంతృప్తిగా నవ్వుతూ).

5ప్ర:-  అయ్యలరాజు నారాయణామాత్యుని ‘హంసవింశతి’ ని పూర్తి శృంగారకావ్యంగా చెప్పుకుంటారు. అటువంటి దానిని విజ్ఞాన సర్వస్వంగా చేయాలనే మీ విభిన్న ఆలోచనకు ప్రేరణ ఎవరు?
జ.  నిజమే. అది పూర్తి జార శృంగార కావ్యం. పిజి సెంటర్ లో నా పిజి రెండేళ్లు పూర్తయిన తరువాత పిహెచ్ డి చేయాలనుకొని బిరుదురాజు రామరాజు గారిని కలిశాను. ‘హంస వింశతి’ లోని తెలుగువాళ్ళ జీవితాల గురించి ముందు చేయమన్నారు. ప్రొఫెసర్ కుమార్ అని ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ‘హంస వింశతి- సమకాలీన జీవన విధానం’ (The contemporary life as defected in Hamsa Vimshathi) అనే అంశాన్నిచ్చారు. దీనికి గైడ్ రామరాజుగారు. అప్పుడు ఎమ్ లిట్. లో మొదటి విద్యార్థిని, చివరి విద్యార్థిని నేనే. ఎందుకంటే దాన్ని తరువాత ఎమ్ ఫిల్ కోర్సుగా మార్చారు. ఆ తర్వాత సుప్రసన్నాచార్య గారు “హంస వింశతి విజ్ఞాన సర్వస్వ లక్షణాలు” అనే అంశాన్ని ఇచ్చి ఆయన ఆధ్వర్యంలో పిహెచ్ డి చేయించారు.
        అయ్యలరాజు నారాయణామాత్యుడు ఎంతో విజ్ఞానం కలిగినవాడు. ఆనాటి 18వ శతాబ్దం నాటి తెలుగు జాతి సంస్కృతిని, చరిత్రను రికార్డు చేయాలని ఆయనకు గాఢంగా ఉండింది. ఇటువంటి వాళ్లను మన పరిశోధకులు, “విజ్ఞాన ప్రసారాపేక్ష కలిగిన కవులు” అని అంటుంటారు. ఇంతటి విజ్ఞాన కావ్యాలను కథా కావ్యాలుగా రాయడానికి కారణం ఆ రోజుల్లో వయసు నిమిత్తం లేకుండా అందరూ కథలంటే ఆసక్తి కలవారు కావడం. అందువల్ల కథారూపంలో ఉండే విజ్ఞానం అందరికీ సులభంగా అవగాహనను కల్గిస్తుందని వాళ్ళ ఉద్దేశ్యం. నా పుస్తకానికి ముందుమాట రాస్తూ బిరుదురాజు రామరాజు గారు “ఇది చెప్పకపోతే ఎంత విజ్ఞానాన్ని కోల్పోయి ఉండేవారేమో” అన్నారు. హంసవింశతి కావ్యంలో వందల కొలది ఆటల పేర్లు, పక్షుల పేర్లు, కుస్తీ పట్లు వంటి వాటిని గురించి అనేకం ఉన్నాయి. అక్కడి సంస్థానానికి వెళ్లి కుస్తీ పట్టేవారిని బతిమిలాడి వాళ్ళ దగ్గరనుండి విషయాలు తీసుకున్నాను. వాళ్లకు మన భాష రాకపోవడం వల్ల చాలా కష్టపడ్డాను. ఇదంతా సుప్రసన్నాచార్య గారి చలవ. విజ్ఞాన సర్వస్వ లక్షణాలు అన్నప్పుడు కేవలం లక్షణాలు చెబితే సరిపోతుంది. కానీ సుప్రసన్నాచార్య గారు దీనిని రెండు భాగాలు చేశారు. 1. విషయప్రకరణం 2. సిద్ధాంత ప్రకరణం…నిజానికి సిద్ధాంత ప్రకరణంతో నా పిహెచ్ డి పూర్తవుతుంది. కానీ సుప్రసన్నాచార్య గారు దాంట్లోని మొత్తం విషయాన్ని వివరంగా రాయించారు. వివరణ ప్రకరణం అద్భుతంగా ఉంటుంది.

6ప్ర:-  మీ ‘హంసవింశతి’ లో విజ్ఞాన పరమైన ఏ విషయాలను తీసుకున్నారు?
జ. అన్ని రంగాలనూ తీసుకున్నాను. జీవితాలకు సంబంధించిన అన్ని విషయాలున్నాయి. ఆటలు, వంటలు, కులాలు, కులవృత్తులు…సాల, కుమ్మరి, కమ్మరి, వ్యవసాయ మొదలగు వృత్తులతో పాటు అన్ని వృత్తుల వారికి సంబంధించిన ఉపకరణాలు కూడా ఉన్నాయి. సాంస్కృతికంగా తిరునాళ్ళు, శివరాత్రి జాతరలు, వీధి బడి విద్యావిధానం, గణితం, జ్యోతిష్యం, వాస్తు, లలితకళలు ఇట్లా భారతంలో
“యది హాస్తి తదన్యత్ర, యన్నేహాస్తి న తత్క్వచిత్” అన్నట్లు..18వ శతాబ్దికి చెందిన తెలుగు జాతికి సంబంధించి ఏది ఉందో అది ‘హంసవింశతి’ లో ఉంది. ఇందులో లేనిది బయట ఎక్కడా ఉండదు. నేను మాన్యుస్క్రిప్టులో రాసింది నాలుగు సంపుటాలు అయింది. పుస్తక రూపం వచ్చేసరికి కొన్ని పేర్లను లిస్ట్ వరకు మాత్రమే పరిమితం చేసి కొంత తగ్గించాను.

7ప్ర:-  మీరు రాసిన విజ్ఞాన సర్వస్వాలన్నీ హంస వింశతి పద్ధతిలో అన్నిరంగాలకు చెందినట్లుగా రాశారా? కేవలం సాహిత్యపరంగా చేశారా? విజ్ఞాన సర్వస్వాల నిర్మాణ పద్ధతులు ఏవి? మీరు ప్రత్యేకంగా ఏర్పరచినవి ఏమైనా ఉన్నాయా?
జ.   నేను రాసిన విజ్ఞాన సర్వస్వాలన్నిటినీ ‘హంసవింశతి’ పద్ధతిలోనే రాశాను. ప్రత్యేకంగా అని కాదు కానీ నా పద్ధతిలో కొంత మార్పు చేసి రాశాను. విజ్ఞాన సర్వస్వాలు తెలుగులో పెద్దగా లేవు. ఇంగ్లీషులో ఎక్కువగా ఉంటాయి. హంసవింశతి రాసే కంటే ముందు ఇంగ్లీషులో ఉండే విజ్ఞాన సర్వస్వాలను బాగా అధ్యయనం చేశాను. వాటిలో ‘పియర్స్ ఎన్ సైక్లో పీడియా’ అని ఉంది. దాన్ని ఎక్కువగా నేను అనుసరించాను. సాధారణంగా విజ్ఞాన సర్వస్వాలను  డిక్షనరీ టైప్ లో తయారుచేస్తారు. దాన్ని ‘యూనిట్ లెటర్ సిస్టమ్’ అంటారు. ఇది వరుసగా అల్ఫాబెటికెల్ ఆర్డరులో ఉంటుంది. మనం తీసుకునే అంశాన్ని బట్టి కూడా పద్ధతి మారే అవకాశం ఉంటుంది. ‘యూనిట్ లెటర్ సిస్టమ్’ విశ్వవిజ్ఞానానికి సంబంధించింది. చాలా పెద్దది కూడా. ‘హంసవింశతి’ లాంటివైతే ఆ కావ్యానికి సంబంధించినంత వరకు మాత్రమే ఉంటుంది. నేను దీనిని పియర్స్ ఎన్ సైక్లో పీడియా మాదిరిగా తయారు చేశాను. దీని ప్రకారంగా ‘హంసవింశతి’ లో ఇరవై ప్రకరణాలు ఏర్పడ్డాయి. ఈ విభాగాలను అన్నిటినీ అక్షరక్రమంలో కూర్చాను. దీన్ని ప్రాకరణిక అక్షరక్రమం (సెక్షనల్ ఆల్ఫాబెటిక్) అంటారు. పిహెచ్ డి కి సబ్మిట్ చేసింది అట్లా చేశాను కానీ తరువాత అందరికీ అందుబాటులో ఉండేలాగా దాన్ని ‘యూనిట్ లెటర్ సిస్టమ్’ లాగా మార్చాను. భూగోళానికి సంబంధించి ‘హంసవింశతి’ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. రీసెర్చ్ కు రెండు మెథడ్స్ ఉంటాయి. ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ ఎవిడెన్సెస్. ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీష్ లాంటి లిటరేచర్ లలో ఇంటర్నల్ ఎవిడెన్సెస్ సరిపోతాయి. ఇంటర్నల్ అనేది గ్రంథస్థ సమాచారం. కానీ హంసవింశతి లాంటి వాటికి మాత్రం ఎక్స్ టర్నల్ సమాచారం కావాలి. ఉదా..కోడిపందాలు వంటి వాటిని వివరించాలంటే ఏ గ్రంథంలోనూ ఉండవు. అక్కడి ప్రాంతాలకు వెళ్లి తెలుసుకోవాలి. ఎంతో కష్టపడ్డాను. కష్టానికి తగిన గుర్తింపు కూడా వచ్చింది. ఇప్పుడు యూనివర్సిటీలలో ఇట్లాంటి టాపిక్స్ ఇవ్వడం ఒక ట్రెండ్ అయింది. నిజంగా నారాయణామాత్యునికి మనం ఋణపడి ఉంటాం. ఆయన రాయకపోతే ఇంత విజ్ఞానం మరుగున పడి ఉండేది. ఆ క్రెడిట్ సుప్రసన్నా చార్య గారికి దక్కుతుంది.

8ప్ర:-  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద గిరిజన పీఠంలో రిసెర్చి ఫెలోగా చేసిన అనుభవాలు, కృషి ఎటువంటిది?
జ.   ఒకరకంగా ‘హంసవింశతి’ లో కూడా జానపద విజ్ఞానమే ఉంది. నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద విజ్ఞాన పీఠానికి వెళ్ళేటప్పటికి అక్కడ జానపద విజ్ఞానం వేరుగా ఉంది. దానికి సంబంధించిన ముడిసరుకు కూడా చాలా ఉంది. అందువల్ల నాకు జానపద విజ్ఞాన సర్వస్వాన్ని చేయాలని ఉండింది. ఆ సమయంలో ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు వి.సి గా ఉన్నారు. హంస వింశతితో పాటు శుకసప్తతి కూడా ఉంది. అందుకే నేను సెక్షనల్ ఆల్ఫాబెటిక్ గా చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. సరైన సహకారం వాళ్ళ నుండి నాకు లభించలేదు. భూమయ్యగారు ఇలాంటివి మామూలేనని “నువ్వు తప్ప ఈ పని ఇంకెవరూ చేయలేరని” చెప్పినప్పటికీ నాకు ఉండాలనిపించలేదు. రెండేళ్లు చేసిన తరువాత రిజైన్ చేశాను. అట్లా చేయడం వల్లనే మహాభారత విజ్ఞాన సర్వస్వం చేయగలిగాను.

10ప్ర:-   “మహా భారతంలో ఇవి మీకు తెలుసా?” అంటూ  ప్రత్యేకంగా రాసిన పుస్తకంలో మీ నూతన దృక్పథం ఎటువంటిది?
జ.   ఆ ప్రశ్న నేను ఊరకే వేయలేదు. విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చేస్తుంటే ఈ ప్రశ్నలు నాకు వచ్చాయి. దాని తర్వాతనే ఇది రాశాను. వందపైన ప్రశ్నలు వచ్చినప్పటికీ ఇరవై ఏడు మాత్రం తీసుకొని పుస్తకం వేశాను. ఉదా:- “మాండవ మర్యాద బాల నేరస్థుల పాలిటి వరమా”? అని దీంట్లో ఒక ప్రశ్న ఉంది. మీకు మాండవ్య మహర్షి కథ తెలుసు కదా! మరణానంతరం నరకానికి వెళ్లిన ఆ మహర్షి శూలపాత శిక్షకు గురై తాను చేసిన పాపమేమిటని యమధర్మరాజును అడుగుతాడు. “మీరు చిన్నతనంలో తూనీగల తోకలకు ముళ్ళు గుచ్చి ఎగరనీయకుండా హింసించారు. దాని వల్ల ఈ శిక్ష పడిందని యముడు చెబుతాడు. “విచక్షణా జ్ఞానం లేని బాల్యంలో చేసిన తప్పును తెలుసుకొని సరిదిద్దేలా చేయాలి కానీ ఇంత శిక్ష ఏమిటి? నీవు సమవర్తివి అయి ఉండి ఇంత అన్యాయానికి పాల్పడతావా?” అని కోపంతో శూద్రునివి కమ్మని యముడిని శపిస్తాడు మాండవ్య మహర్షి. ఆ శాపంతో శూద్రజన్మతో విదురునిగా పుడతాడు యమధర్మరాజు. “బాల్యంలో తెలిసీ తెలియక చేసిన తప్పును దోషంగా పరిగణించవద్దని ఇది నా మర్యాద” అని మాండవ్యుడు కట్టడి ఏర్పరిచాడు. ఈ నియమం బాల నేరస్థుల పాలిట వరంగా పరిణమించిందా? అనే ప్రశ్న వేసుకొని దీనికి నేను లింక్ చేశాను. నిజంగా అదే కట్టడి బాలలకు వరమై ‘చిల్డ్రన్స్ ఆక్ట్’ వచ్చింది. అట్లాగే “దీర్ఘతముడి శాపం భారతీయ స్త్రీల పాలిటి శాపమా?” నిజానికి భర్త చనిపోతే అన్ని అలంకారాలు తీసేసి ఉండడం ఎంతవరకు సమంజసం? ఇది దీర్ఘతముడు ఇచ్చిన శాపం. అదే ఇప్పటికీ ఆడవారి పట్ల శాపంగా పరిణమించింది. ఇట్లా పరిశోధించి అనేక విషయాలను సామాజిక దృక్కోణంతో చూసి సమన్వయం చేస్తూ రాశాను.

11:- “ప్రాచీన సమాజ విజ్ఞాన సర్వస్వం”లో ప్రాచీనం అంటే కాల పరిమితిగానా? లేదా కావ్యాల పరంగా తీసుకున్నారా? అందులోని అంశాలేవి?
జ.  ఇది కాల పరిమితి కాదు. కావ్య పరిమితి కాదు. సాహిత్యంలో కావ్యాలన్నీ విజ్ఞాన సర్వస్వాలుగా చెప్పగలిగేవి ఉండవు. కథాపరంగా సామాజిక అంశాలు సహజంగానే వస్తాయి. కవుల్లో కొంతమందికి తమకు తెలిసిన విజ్ఞానమంతా కావ్యాలలో చెప్పాలనే కోరిక ఉంటుంది. నిస్సందేహంగా వ్యాసుడు అటువంటివాడు. అట్లాగే ‘శుకసప్తతి’ రాసినటువంటి కదిరీపతి, ‘సింహాసన ద్వాత్రింశిక’ రచించిన కొరవి గోపరాజు, ‘బసవపురాణం’, ‘పండితారాధ్యచరిత్ర’, రచించిన పాల్కురికి సోమన  ‘వాణీ విలాస వనమాలిక’ రచించిన టేకుమళ్ళ రంగశాయి, ‘హంసవింశతి’ రచించిన అయ్యలరాజు నారాయణామాత్యుడు అటువంటివారు. నారాయణామాత్యుడు వైష్ణవుడు అయినప్పటికీ ఆయన శ్రీరాముని ఉత్సవాలను ఎంత గొప్పగా వర్ణించాడో, శివరాత్రి ఉత్సవాలను కూడా అంత గొప్పగా వర్ణించాడు. కుల వివక్ష ఎక్కడా చూపించలేదు. అనేక విషయాల్లో నారాయణామాత్యుడు గొప్పవాడు. ఆ విధంగా నేను ఏ కావ్యాల్లో కవులు అధికంగా విజ్ఞాన విషయాలను ప్రతిపాదించారో అట్లా కొన్ని కావ్యాలను గురించి రాశాను. మహాభారతం ముందే రాశాను కాబట్టి దాన్ని తీసుకోలేదు. బసవ పురాణంతో పోలిస్తే పండితారాధ్యచరిత్రలో విజ్ఞాన విషయాలు ఎక్కువ. అందుకే దాన్ని తీసుకున్నాను. హంసవింశతి, శుకసప్తతి, సింహాసన ద్వాత్రింశిక, వాణీ విలాస వనమాలిక, పండితారాధ్య చరిత్ర ఈ ఐదు కావ్యాలను తీసుకున్నాను. వీటి విజ్ఞానాలలోనూ తేడాలున్నాయి. హంసవింశతి, శుకసప్తతిలో జానపద విజ్ఞానం ఉంది. సింహాసన ద్వాత్రింశికలో అన్ని విషయాలున్నాయి.

12ప్ర:-  నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువడిన ‘తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు’ పుస్తక నేపథ్యం, ప్రేరణ తెలపండి.
జ.   నాకు ప్రాచీన విజ్ఞాన సర్వస్వాన్ని రాయడానికి ప్రోత్సహించింది, ప్రేరేపించింది ఆనాటి తెలుగు అకాడెమీ ఛైర్మన్ ఆచార్య కె. యాదగిరి గారు. ఆయన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగులో విజ్ఞాన సర్వస్వాలను గురించి రాయమన్నారు. అంతకుముందే నాకు అది రాయాలని ఉండింది. ఆ కోరిక ఆయన అడగడంతో తీరింది.

13ప్ర:-  భగవద్గీతను తెలుగులోకి తేటగీతి పద్యాలుగా చేశారు కదా! దాని గురించి చెప్పండి.
జ.  దానికి కూడా ఒక నేపథ్యం ఉంది. నాకు ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు కరోనా కాలంలో చనిపోయాడు. ఆ దుఃఖోపశమనం కోసం భగవద్గీతను చదవడం ప్రారంభించాను. ఒకసారి చదివిన తర్వాత కొంత ఊరట చెందాను. మళ్లీ రెండవసారి చదువుతూ ఉండగా అర్జున విషాదయోగం పూర్తయి దాన్ని రాద్దామని మొదలుపెట్టాను. అవన్నీ తేటగీతి పద్యాలుగా వచ్చాయి. మీరు నమ్మకపోవచ్చు. కానీ ఇది నా అనుభవం. రెండు నెలల్లో ఏడు వందల శ్లోకాలకు ఏడు వందల పద్యాలు రాశాను. తెలుగే అయినా కొన్ని పదాలు అర్థం కావు కదా! అందుకే తాత్పర్యాలు కూడా రాశాను. ఎవరైనా చనిపోయిన సందర్భంలో భగవద్గీత రికార్డు ఎందుకు వేస్తారని సందేహం ఉండేది. కానీ తర్వాత అర్థమయిందేంటంటే ఆ వ్యక్తి తాలూకు వారి దుఃఖాన్ని ఉపశమింపజేసేందుకు వేస్తారని. అర్జునుడంతటి వీరుడే ఉపశమనం  పొందగా లేనిది మనమెంత? అని సర్ది చెప్పుకున్నాను.

14:-  భగవద్గీత వ్యాసాలు కూడా రచించారు కదా! అది మీ సంకల్పమేనా? మరేదైనా కారణం ఉందా?
జ:-   హనుమకొండలో అరవింద సొసైటీ ఉంది. ఒకసారి అరవిందుని జయంతి సందర్భంగా వాళ్ళు నన్ను గెస్ట్ గా పిలిచారు. అప్పటికి అరవిందుల గురించి పూర్తిగా నాకు తెలియదు. ఆ సొసైటీ వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది చదువుతుంటే నాకొక ఆలోచన వచ్చింది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఆధ్యాత్మిక చింతన. మానవ జీవిత చరమదశలో గమ్యమేంటి? కర్మ, కర్మ యొక్క ఫలితాలు, చివరగా భగవంతుని చేరడం అనేది ఆయన చెప్పాడు. అదే సచ్చిదానందం, పరమానందం, బ్రహ్మానందం. (It is an eternal). దాన్నే అరవిందులు దివ్య జీవనంగా  (life devine) చెప్పారు.
‘Essays on the Geetha’ అని ఆయన యాభై, అరవై వ్యాసాలు రాశారు. అక్కడి సభలో మాట్లాడి వచ్చిన తరువాత అరవిందులను క్షుణ్ణంగా తెలుసుకోవడం కోసం అవన్నీ చదివాను. ఆ ప్రభావం నా మీద బాగా ఉంది. భగవద్గీతలో మూడే విభాగాలున్నాయి. అవే కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగాలు. అసలైనది కర్మయోగమే. మిగతా రెండింటిలోనూ కర్మ ఉంటుంది.భగవద్గీతలోని గొప్ప విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు కర్మను యూనివర్సల్ చేశాడు. వేదభాషలో కర్మ అంటే హోమకాండలు మొదలైనవి. కానీ కృష్ణుడు మనం చేసే ప్రతీ పనిని కర్మ అన్నాడు. ఈ కర్మను నియమానుసారంగా, చేయాల్సినవి, చేయకూడనివి, దేనివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చెప్పాడు. అరవిందుని ప్రభావంతో నేను కర్మను శ్రమగా భావించాను. కర్మలను నియమబద్ధంగా ఆచరించడం వల్ల జీవితం ప్రశాంతంగా, సుఖవంతంగా ఉంటుంది. దాన్ని నేను శ్రమజీవన సౌందర్యం అన్నాను. శ్రీకృష్ణుడిది ఆధ్యాత్మ జీవనం, అరవిందులది దివ్యజీవనం అయితే నాది శ్రమ జీవనం. ఆలంకారికులు చెప్పినట్లు “హృదయాహ్లాదకరమైన శక్తి సౌందర్యం” అది భౌతికమైనది కాదు. అందువల్ల నలభై ఐదు వ్యాసాలతో ‘శ్రీమద్భగవద్గీత లోనారసి’ అనే పేరుతో పుస్తకం వేయబోతున్నాను. భగవద్గీత విజ్ఞాన సర్వస్వం కూడా రాస్తున్నాను.

15ప్ర:- మీరు రచించిన ‘తెలుగు బాల శతకం’ గురించి చెప్పండి.
జ.  నేను వి.ఆర్ కాలేజీలో ఉన్నప్పుడు పద్యాలు రాసేవాడిని. అరవై ఏళ్ళ తరువాత గ్యాప్ తరువాత మళ్లీ రాసిన పద్యాలు అవి. మా మనవడికి కాలిఫోర్నియాలో స్నాతకోత్సవానికి (Convocation) ఆహ్వానం వచ్చింది. ఆ సందర్భంగా అక్కడికి వెళ్లిన నాకు ఇక్కడ ప్రతిరోజూ రాయడం, చదవడం అలవాటై ఏమీ తోచకపోయేది. నాకు వేమన అంటే చాలా ఇష్టం. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ సమాజాన్ని మంచి వైపు నడిపించడానికి కృషి చేసిన మహానుభావుడాయన. నేను కూడా వంద పద్యాలు రాద్దామని మొదలు పెట్టాను. ఏకంగా వెయ్యి ఎనిమిది పద్యాలు అయ్యాయి. దానికి నేను మహాశతకం అని పేరు పెట్టాను(నవ్వుతూ). మరొకటి ‘నీతిపద్య రత్నావళి’.

రచనల స్వీకరణ

16ప్ర:- ఆంగ్లంలో కూడా అనువాదాలు చేశారు కదా! వాటిని గురించి చెప్పండి.
జ.   నేను అనువాదాలు వేరే ఏవీ చేయలేదు. నా ఏం సైక్లో పీడియాలనే చేశాను. “విజ్ఞాన సర్వస్వాలు – విశ్లేషణాత్మక అధ్యయనం” పుస్తకాన్ని తెలుగులోకి అనువదించమని నా దగ్గరి స్నేహితుడు ఇటీవలే అకాల మరణానికి గురైన గంగిశెట్టి లక్ష్మీ నారాయణ ప్రోద్బలం చేయడంతో “Circle of learning – A study in Encyclopaedia” అని అనువదించాను. నా కృషిని గుర్తించి యునైటెడ్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. చెన్నయ్ సాహితీ సంస్థ వారు ‘FUWAI’ (Fellow United Writers Association of India) అనే అవార్డుతో సత్కరించారు. ఆ తరువాత “విజ్ఞాన సర్వస్వాలు – వాటి నిర్మాణం” పుస్తకాన్ని “Encyclopaedia -It’s make” అని అనువాదం చేశాను.

17ప్ర:-  మీ సంపాదకత్వంలో వెలువరించించిన వాటిలో ‘ప్రసన్న శారద’ ను గురించి చెప్పండి.
జ.  ‘ప్రసన్న శారద’ సుప్రసన్నాచార్య గారు రిటైర్ అవుతున్న సందర్భంగా వేసిన అభినందన సంచిక. ఆయనంటే నాకు, నేనంటే ఆయనకు ఎంతో అభిమానం. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అభినందన సంచిక లాగా కాకుండా మూడు విభాగాలుగా చేయాలని ఆలోచన వచ్చింది. మొదటి భాగమంతా అభినందనలు, రెండవ భాగమంతా ఆయన ఫిలాసఫీతో కూడుకున్న కవిత్వం ఉంటుంది. ఆ తర్వాత ఆయన విమర్శ. ఇవన్నీ ప్రముఖులతో రాయించాము. మా పూర్వ విద్యార్థులు నాకు ఒక గొప్ప సన్మానం చేశారు. ఆ సమయంలో నన్ను గురించి ‘రత్నమాల’ పేరుతో పుస్తకం వేశారు. వాళ్ళు దాంట్లో అభినందనలు ఒక భాగం, నిఘంటువులు ఒకభాగం, నా విజ్ఞాన సర్వస్వాలు ఒకభాగంగా మూడు కలిపి పుస్తకం వేశారు. అది నాకు బాగా నచ్చింది. అదేవిధంగా సుప్రసన్న గారిది వేశాం.  ఈ రెండూ సాధారణమైన అభినందన సంచికలకు భిన్నంగా నిలిచాయి. ఆయన భార్య పేరు శారద. ఆ పేరు, ఆయన పేరు కలిపి, ఆయన ప్రసన్నమైన మనస్తత్వానికి తగ్గట్టు ‘ప్రసన్న శారద’ అని పెట్టాం. ఆయన పుంభావ సరస్వతి ఆ రకంగా కూడా ఆయన సార్థక నామధేయులు అయ్యారు

18ప్ర:-  కథారచనల్లో కూడా మీ ప్రత్యేకతను నిరూపించుకున్నారు. కాకతీయ పంచ వింశతి-ఓరుగల్లు కథలు, ‘కలిచేడు కథా విపంచి- మైకా మైన్స్ కథల’ను గురించి వివరించండి.
జ.  ‘ఓరుగల్లు కథలు’ రాయడానికి ఇన్స్పిరేషన్ కామసానమ్మ. నాకు ఆమె అంటే అభిమానమని ఇంతకుముందే చెప్పాను కదా! ఆమె లేకపోతే ఓరుగల్లు లేదు. కాలపరంపరగా చూస్తే ఆమె తర్వాత వస్తుంది. అయినా మొదటగా ఆమె కథనే పెట్టాను. నా దృష్టిలో కాకతీయులు గొప్ప తెలుగురాజులు. తెలుగు సంస్కృతికి, భాషకు సేవ చేసినటువంటివారు. కానీ ఏ కారణాల వల్లనో చరిత్రలో వారికి తగిన గుర్తింపు, స్థానం లేదని నా అభిప్రాయం. కాబట్టి కథలైతే అందరికీ చదవడానికి ఆసక్తి ఉంటుంది. అందుకని కథల రూపంలో రాశాను. ఒక్క కామసానమ్మ మాత్రమే కాదు కాకతీయ స్త్రీలు, వారి భర్తలు యుద్ధానికి వెళ్ళినప్పుడు గుళ్లు గోపురాలు కట్టించడం, చెరువులు తవ్వించడం, దానధర్మాలు చేయడం లాంటి ఎన్నో మంచి కార్యాలు చేశారు.  ప్రతాపరుద్రుని భార్య ధన్నల దేవి ధర్మకీర్తిగా పేరు పొందింది. బయ్యాంబ, మైలమాంబ, ముమ్ముడాంబ, రుద్రమదేవి వంటి మహిళలు స్ఫూర్తి దాతలు. వాళ్ళ పేర్ల మీద చెరువులు ఉండడం మనకు కనిపిస్తుంది. అంత కృషి చేసిన వాళ్ళ పేర్లు కూడా తెలిసిన వాళ్ళు లేరంటే ఆశ్చర్యపడాలి. కథా శీర్షికలు కూడా వారి పేర్ల మీదనే పెట్టాను. చరిత్రకు దూరంగా పోకుండానే రాశాను కానీ అవసరాన్ని బట్టి అక్కడక్కడ సందర్భాలు, పేర్లు మార్చాను.
          ఇక కలిచేడు కథలకు వస్తే మా ఊరు గురించి తెలియకపోయినా మైకా మైన్స్ కు సెంటర్ మాది. కలిచేడు అంటే మైకా మైన్స్ గా పేరు గాంచింది. భూగర్భంలో తవ్వుకుంటూ పోతుంటే ఎక్కడో లోపల అభ్రకం దొరుకుతుంది. చాలా కష్టపడాల్సి ఉంటుంది. మైకా మైన్స్ కాలనీల వాళ్ళ కోసం ఆఫీసు, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. కాబట్టి నా జన్మ స్థలమైన కలిచేడు గురించి మాత్రమే కాక మైకా మైన్స్ ను గురించి, విభిన్న సంస్కృతులు కలిగిన అక్కడి ప్రజల జీవితాలను గురించి ఏదీ దాచకుండా ఇరవై కథలు ‘కలిచేడు కథా విపంచి-మైకా మైన్స్ కథలు’ అన్న పేరుతో రాశాను.

19ప్ర:-  ఇప్పటివరకు వచ్చిన మీ రచనలు, రాబోతున్న రచనలు, మీకు వచ్చిన పురస్కారాలను గురించి తెలపండి.
జ.    ఇప్పటివరకు దాదాపు ఇరవై ఐదు పుస్తకాలు వచ్చాయి. అందులో ఐదు విజ్ఞాన సర్వస్వాలు ఉన్నాయి. పీఠికలు, వ్యాసాలు, సమీక్షలు ఇట్లా అముద్రితంగా లెక్కకు మించి ఉన్నాయి. ఎమెస్కో వాళ్ళు వేస్తున్నారు. ఒక రచయితగా మనం చెప్పేవి నలుగురికి చేరాలన్న ఆశ తప్ప నాకింకేమీ లేదు. పురస్కారాల విషయానికి వస్తే పురస్కారాల వల్ల ఒక రచయితగా నాకు గుర్తింపు వచ్చిందని భావిస్తాను. కళాదీప్తి సంస్థ వారు ‘విజ్ఞాన సర్వస్వ కళానిధి’ అనే బిరుదునిచ్చి సత్కరించారు. వేద సంస్కృతీ పరిషత్ వారు ఇచ్చిన బి ఎన్ శాస్త్రి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, తెలంగాణ సారస్వత పరిషత్తు వారి పోలూరి హనుమజ్జానకీ శర్మ స్మారక పురస్కారం, వరంగల్ సాహితీ బంధు సంస్థ వారి ఓరుగల్లు సాహితీ కీర్తి పతాక పురస్కారం వంటి పురస్కారాలు నా కృషికి ప్రతిఫలంగా లభించాయి.

21ప్ర:-  ఒక్క చేతిమీదుగా ఇన్ని విజ్ఞాన సర్వస్వాలను వెలువరించిన మీరు భవిష్యత్తులో ఇటువంటి కృషికి పూనుకునే వారికి మా మయూఖ పత్రికా ముఖంగా కావలసిన మార్గనిర్దేశాన్నివ్వండి.
జ.   మంచిప్రశ్న. మనం రాయలనుకున్న దాన్ని బట్టే మన ప్రణాళిక ఉంటుంది. అన్ని విజ్ఞాన సర్వస్వాలు ఒకే విధంగా ఉండవు. జనరల్ ఎన్ సైక్లో పీడియా, విశ్వ విజ్ఞాన సర్వస్వం, సాహిత్య విజ్ఞాన సర్వస్వం, ప్రాంతీయ విజ్ఞాన సర్వస్వం ఇట్లా రకరకాలుగా ఉంటాయి. మొత్తంగా ఒక ప్రణాళిక చేయాలంటే నా అనుభవ పూర్వకంగా చెప్తున్న విషయాలు. మొదటిది… మనం ఏ అంశాన్ని తీసుకుంటామో దానికి ఒక ప్రణాళిక తయారుచేసుకోవాలి. మొత్తం అక్షర క్రమంలో చేయాలనుకున్నావా? సెక్షనల్ గా చేయాలనుకున్నావా నిర్ణయించుకోవాలి. రెండవది…ఈ ప్రణాళికననుసరించి చెప్పదలచుకొన్న విషయానికి ఆరోపాలు ( selection of entries) తయారుచేసుకోవాలి. మూడవది…లిస్ట్ తయారు చేసుకోవడం. దాంట్లో పునరుక్తులు వస్తాయి. వాటిని సరి చేసుకొని ఎడిట్ చేసుకోవాలి. దాన్ని చెక్ లిస్ట్ అంటారు. ఇక నాలుగవది…చెక్ లిస్ట్ ప్రకారం సమాచారాన్ని సేకరించాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏదో రాస్తూ పోతుంటే అక్షరక్రమాన్ని కూర్చలేము. అందువల్ల కార్డు సిస్టమ్ అని ఉంటుంది. ఒక్కొక్క ఆరోపాన్ని కార్డు మీద లేదా పేపర్ పైన రాసుకోవాలి. రెండు లైన్ల విషయం అయినా ప్రత్యేకంగానే ఉండాలి. సెక్షనల్ గానో, లేక మొత్తంగానో అనుకున్నరీతిలో వీటన్నింటినీ అక్షరక్రమంలో పెట్టుకోవాలి. ఐదవది, చివరది…డిటిపి చేయించడం, కవర్ పేజీ డిజైన్ చేయించడం, ముందుమాటలు, అభిప్రాయాలు రాయించడం ఇవన్నీ అయిపోతే పుస్తకరూపం తయారవుతుంది. ఇట్లా ఐదు దశల్లో విజ్ఞాన సర్వస్వ నిర్మాణం పూర్తవుతుంది.

22ప్ర:-  విజ్ఞాన సర్వస్వ నిర్మాతలుగానే కాకుండా ఒక రచయితగా వర్తమాన రచయితలకు ఏదైనా సూచననివ్వండి.
జ.   రచయిత అంటేనే రచన సమాజాన్ని ప్రతిఫలించేదిగా ఉండాలి. కాకపోతే చాలామందికి నచ్చకపోవచ్చు కానీ ‘డెనిస్ డిడిరో’ అని ఫ్రెంచ్ విజ్ఞాన సర్వస్వాలను నిర్మించిన వాళ్లలో ప్రముఖుడు. “పూర్వ తరాలవారి విజ్ఞానం సమకాలీనులకే కాకుండా భావితరాల వారికి అందించవలసిన బాధ్యత ప్రస్తుత రచయితల మీద ఉంది. దానిని విస్మరిస్తే ఆ జాతి ప్రగతికి గొడ్డలిపెట్టు లాంటిది” అన్నారాయన. ఈ మాటలు నాలో బాగా ప్రభావాన్ని చూపాయి. అందుకే కథలు, కవిత్వం ఏది రాసినా, ప్రక్రియ ఏదైనా సమాజానికి మంచి చేసే విధంగా రచన ఉండాలి. ముఖ్యంగా మన ప్రాచీన సంస్కృతిని, చరిత్రను, వారి సమకాలీన సమాజాన్ని భావితరాలకు అందించాలి. గతం లేనిదే భవిష్యత్తు లేదు. పూర్వకాల సమాజంలో ఆ పరిస్థితులకు ఏం జరిగిందో తెలుసుకుంటే ఇప్పటి నీ పరిస్థితులకు నీకు ఏం కావాలో, ఏం చేయాలో తెలుస్తుంది కదా! సమాజ హితమే సాహిత్య లక్షణం కదా! ఉదా..వ్యాసుడు ఆనాడు కావలసింది చెప్పాడు. అందులో ఇప్పుడు నీకు కావలసింది తీసుకో. మనం ఏ ప్రక్రియలో రాసినా జరిగింది తెలుస్తేనే జరగాల్సింది తెలుస్తుంది. రచయితలు సన్మార్గంలో నడుస్తూ, సమాజానికి కావాల్సింది చెప్పాలి. ఇదే నేను చెప్పదలచుకున్నది.

ధన్యవాదాలు సార్..విజ్ఞాన సర్వస్వాల గురించి పాఠకులకు ఎన్నో విషయాలు అందజేశారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి, సమగ్రంగా అన్ని విషయాలు తెలియజేసినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు.

You may also like

3 comments

Kenneth2615 September 25, 2025 - 2:23 am Reply
Serenity315 September 25, 2025 - 4:57 am Reply
Luna3830 September 29, 2025 - 12:34 pm Reply

Leave a Reply to Serenity315 Cancel Reply