అప్పుడే బావురుపల్లి స్టేజి వద్ద బస్సు దిగింది ఓ పట్నంపిల్ల లగేజితో పాటు. అక్కడి నుండి ఆ ఊరు దాదాపు 3 కి.మీ. దూరం. మట్టి రోడ్డు.నడుస్తూగానీ, టూవీలర్, ఆటోల్లో గానీ వెళ్ళాల్సిందే.వాళ్ళమ్మమ్మ ఊరు.చాలా సం.ల తర్వాత ఆ ఊరొస్తుంది. పట్నంవాసనలు,పోకడలు ఇంకా పూర్తిగా ఆ ఊరు దరిచేరలేదు.వాళ్ళ తాతయ్యకు చాలాసార్లు కాల్ చేసినా కలవట్లేదు.చేసేదేమీలేక దారెంట నడవడం ప్రారంభించింది.మోడ్రన్ డ్రస్సులో అందంగా ఉంది. అలా కొద్ది దూరం వెళ్ళాక దారిలో ఓ కుర్రాడు సైకిలు మీద ఇటువైపు వస్తూ ఈ అమ్మాయిని చూసాడు. ఆ అమ్మాయి అతన్ని చూసినట్లు అనిపించి తలతిప్పి చూశాడు.అమ్మాయి నవ్వుతూ ఏదో మాట్లడుతూ వెళుతోంది.అతడు ఆలాగే ఆమె వంకే చూస్తూ సైకిలు నడుపుతూ నడుపుతూ రోడ్డు పక్కన గుంతలో పడిపోయి..’అబ్బో..’ అంటూ గావుకేకేశాడు. అమ్మాయి తన దారిన తాను వెళుతోంది.మరికొంత దూరం వెళ్ళాక మరొకతను బైక్ మీద వస్తూ ఈ అమ్మాయిని చూసి…ఆమె తన్ను చూసిందని..నవ్వింది .. ఆమె వంకే చూసుకుంటూ..ఎదురుగా ఉన్న చెట్టుకు గుద్దేసి ”బాబోయ్ ‘.. అంటూ పడిపోయాడు.తర్వాతేంటో అతగాడి పరిస్థితి.ఆమె దారెంట నడుస్తూనే ఉంది.
కొద్ది దూరం వెళ్ళాక పశువులను తోలుకుంటూ మరొకడు ఎదురుపడి ఆ అమ్మాయి ని వింతగా చూస్తూ.. అప్పుడూ ఆమే నవ్వుతూ ఏదో మాట్లాడుతూ చూసింది.అంతే ఆతడు ఆమెనే చూస్తూ నిలుచుండి పోయాడు.ఆమె నడుస్తోంది. పశువులన్నీ పక్కచేలో పడి పొలమంతా పాడుచేస్తోంటే..యజమాని తిడుతూ గట్టిగా కేకలేస్తూంటేగానీ ఆ పశువుల కాపరి ఈ లోకంలోకి రాలేదు.
మరికొంత దూరంలో చెట్టెక్కి కల్లుగీస్తూన్నాయన ఎందుకోగానీ కిందకూ చూస్తూ అమ్మాయి వంక చూసాడు.ఆమె నవ్వుతూ మాట్లాడుతూ తలెత్తి అతని వంక చూసింది. అతడు తన పని మరిచి అలాగే బిగుసుకు పోయాడు. మరికొంత దూరం వెళ్ళాక ఓ ముసలావిడ తలపై నీళ్ళకుండ నెత్తినెట్టుకుని నడుస్తూ ఈ అమ్మాయిని చూసింది.తాను నవ్వుతూ ముందకెళ్ళింది.ఆ వంకే చూస్తూ ముసలావిడ ఆశ్చర్యపోతూ.. ముక్కున వేలేసుకుని నడుస్తూంటే నెత్తిన కుండ జారి నేలబడింది.అయ్యయ్యో…అనుకుందావిడ.
కొద్ది దూరం నడిస్తే ఊరొస్తుందనగా ఓ ముసలితాతొకడు ఈ అమ్మాయిని గమనించి ఎవరాయని చూస్తూంటే అమ్మాయి ఓ నవ్వు నవ్వింది.ఎందుకు నవ్విందో అర్థంకాక పోయినా ముసలోడు సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు…
ఆఖరికి ఆ అమ్మాయి’ బై బై..’ అంటూ మాట్లడ్డం మాని, చెవుల్లో పెట్టుకున్న ‘ఇయర్ బడ్స్ ‘ తీసి దగ్గరలో కనిపిస్తున్న తన అమ్మమ్మ ఇంటివైపు అడుగులేసింది.
కొంతసేపటికి ఊళ్ళో కలకలం బయలుదేరింది.ఊరిపోరగాళ్ళు రోడ్డు పక్కన పడి దెబ్బలు తగిలి విలవిల్లాడుతున్నారని.. తెలిసీ బావురుమన్నారు. వాళ్ళని చూడ్డానికి..హాస్పిటల్ కు చేర్చడానికి కొంతమంది బయలుదేరారు.
అమ్మాయి నవ్వింది…
previous post