పాలనాధిపతులకు నిప్పుల దుఃఖం తెలియదు
ఆకుపచ్చని పురుగులు మేపటానికే
ఈ వినాశకర శాసనాల్ని తెచ్చింది
కార్పోరేటు పుష్పగుచ్ఛాల వెనుక దాక్కున్న తర్వాత
సొల్లు దుఃఖం కురిపించటమెందుకు
కంటనీరెట్టు కోవడమెందుకు
సేద్యభక్తుల్లా ఆ భజనలెందుకు
మీ రాజకీయ ఖడ్గ విద్యంతా
కుబుసం విడిచిన వ్యాపార సర్పాలకే కట్టబెడుతున్నపుడు
ఆకుపచ్చ పురుగుల్ని హతమార్చలేరిక –
శాసన హాలాహలాన్ని నిమ్మరసంలో కలిపి
హాలిక శ్రమను హతమారుస్తారెందుకు
అయ్యా!
దేవుని మెడలోని పూలదండలు సైతం
మా రెక్కల కష్టంలోంచే పరిమళిస్తున్నవి
సేద్యభూమి మాదే
సేద్యం చేసే చేతులూ మావె
గీతమీద ప్రమాణం చేసే చెబుతున్నాం
కాలం కడుపులో శ్రమిస్తున్న నిష్కామ కర్షకులం మేమే!
ఖనిజ సంపద పేర
ఆదివాసులను అంగట్లోకి లాగింది చాలదా!
మా మీద పడి పీల్చి పిప్పి చేస్తారెందుకు
నమ్మూ నమ్మకపో
మేం సాయుధ రైతాంగ పోరాట వారసులమే!
ఇప్పుడు అనుభవిస్తున్న నరకం చాలు కొత్తనరకాల్లోకి తోయకండి.
పాలక పురుగుల్ని సైతం రైతు రణం మట్టి కరిపించగలదు
మద్దతు ధరకు మహాద్వారాలు తెరవగలదు