సుగుణమ్మ ఒక ఆడ సిపాయే
ముసలవ్వను,తన బిడ్డను అద్దెగుడిసెలో విడిచి
ఉదయం మా పాఠశాలకు బయలుదేరినప్పుడు
ఆమె తరగతి గది తలుపులు కిటికీలు తెరవందే
సూర్యుడి లేతఎండ వాలదు
స్వచ్ఛమైన కొండగాలీ వీయదు
తళతళా మెరవాల్సిందే
పాఠశాల గచ్చునేలైనా తినే బువ్వ పళ్లాలైనా
ఆమెచేతిలో చీపురు పడ్తేచాలు
చెత్తాచెదారమంతా దూరం
వానాకాలం వరండాలో
ప్రతిబింబాలు చూపే నీళ్లమడుగు మాయం
క్లాస్ రూముల్లో ఊడ్చేవేళ బడిపిల్లలు చింపి పారేసిన
చిత్తుకాయిదాలు గాలిఅలల్తో ఆడే భరతనాట్యం
శిశిరాన ఆ కానుగమానులురాల్చినఎండుటాకులరాశులు
బడిలో పనిచేసే ఆమె సహనానికి వార్షిక పరీక్షే
చిరునవ్వు తప్ప చిరాకు కానరాదు ఆ ముఖంలో
ఉదయంపూటా పిల్లల దాహానికి మంచినీరు
ఇంటర్వెల్ లో టీచర్లకు తేనీరు ఆమె
తేనీరు మిగులని వేళ
ఎవరైనా అతిథి అరుదెంచిన వేళ
మీరు తాగితే నేనుతాగినట్టే..అన్న వాక్యంలో
ఆమె దయాహృదయమే ధ్వనిస్తున్నది
నిర్మలమైన ప్రేమే కనిపిస్తుంది నాకు
వంటావార్పుకాడ ఆమె నగుమోముదే వెలుగంతా
మధ్యాహ్నభోజన సమయం
ఆమె వుంటే వుండబోదు ఏ అంతరాయం
భోజన విరామ అనంతరం
వరండా నిండా చిందవందరగా
రహస్యలిపిలా రాలిపడివున్న విద్యార్థులఅన్నం మెతుకులు…
టీచర్ల కంచాలు, ఖాళీగాచూస్తున్న అంట్ల లంచ్ బాక్స్ లు…
స్వాగతం చెబుతుంటాయ్ ఆమెకు
ఐదుపదులు దాటినవయోభారమైనా పనిభారమైనా
ఏనాడూ ధిక్కార స్వరం వినిపించిందిలేదు
పనికాడ వెనుకడుగు వేసిందీలేదు ఆమె
గంటతరపడి బడంతా బండచాకిరీ చేసినా
తనకు బుక్కడుఅన్నంకూడా మిగలనిరోజు
మందహాసం తప్ప నీరసం కంటికి ఆనదు నాకు
సర్దుబాటుతత్వం ఆమె సుగుణం అనుకుంటా
రాజీమార్గం ఆమెకు జీవితం నేర్పిన పాఠం బహుశా
పనిలోనే ఆనందం…పనే దైవం ఆమెకు
ఆకాశాన మార్తాండు మండుతూ పడమరకొండదిశకు వాలేవేళ
ఎపుడో ఆమె పేగుల్లో ఆకలిఆదితాళం
అపుడే పిడికెడు కడుపులో ఇంత ఆహారం
ఆఖరు గంటమోగిన అరగంట తర్వాతే ఆమెకు చుట్టి
పెద్దబడిలో…ఇంతసేవజేసినా ఇంత ఊడిగంజేసినా
గూడులేదు,గుంట భూమీ లేదు
చిల్లి గవ్వా చేతిలో లేదు
కిరాణదుకాణంలో బారువడ్డీ అప్పులు
ఊర్లో అవమానాల,వెటకారాల మాలలు తప్ప
పాఠశాల విద్యాసంవత్సర ఆరంభం నుండి అణారాలేదు ఆమెజీతం
బాధలు,బరువుల బడబాగ్నుల గుండె నాదమై పాడుతున్న గీతం ఆమె
అభినవ సీతమ్మ తల్లి ఆమె
అందుకే ఆమె సుగుణమ్మ కాదు సుగుణాల అమ్మ
సమాన పనికి సమానవేతనమేది?
అంతరిక్షంలో చందమామ అందడం అద్భుతం
నిగూఢ రహస్యాలు పరిశోధనలకు అందనుండడం ఆనందమే
ఆకలి మూలాలు
కార్చిచ్చులా వ్యాపిస్తున్న అవినీతి మూలాలు
అంతుచిక్కకపోవడమే బహుఆశ్చర్యం!
భూలోకంలో ఇంకా ఎన్నాళ్లు ?
సముద్రఅగాధమంతటి సమసిపోని ఈ అంతరాలు?.