Home కథలు ఆదర్శం

ఆదర్శం

by Rama Devi Nellutla

బైకును స్లో చేసి చెట్టు క్రింద ఆపి అటువైపు చూసాడు కార్తీక్. సందేహం లేదు…  సమీరే!
రోడ్డు కవతల కోట గుమ్మం లాంటి జైలు తలుపులకు వున్న చిన్న డోర్ లోంచి బయటికి వచ్చి, సెక్యూరిటీ గార్డ్ తో ఏదో మాట్లాడుతోంది.
అతడు నవ్వుతూ ఏదో అంటున్నాడు. అంతలోనే భుజానికి వేసుకున్న బ్యాగ్ సర్దుకుంటూ వచ్చి బైక్ పార్క్ చేసుకున్న స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది.
హెల్మెట్ పెట్టుకుని వున్న తనను గమనించలేదేమో అనుకున్నాడు కార్తీక్.
ఇది మూడో ఆదివారం సమీరను అలా… జైల్లోంచి బయటకు వస్తూండగా చూడడం. యాదృచ్ఛికమే ఐనా తను జిమ్కు వెళ్ళి వచ్చే టైమ్లోనే ఆమె జైలులోంచి బయటకు రావడం జరుగుతోంది.
కారణం ఏమిటో అడుగుదామని మొబైల్ మీదకు చెయ్యి పోనిచ్చిన వాడల్లా, ఒక్క, క్షణం ఆగాడు.
‘ఏం చెబుతుంది? అసలు… నిజం చెబుతుందా? తను కలిసింది నేరస్థుడినో, తీవ్రవాదినో, హంతకుడినో అని చెపుతుందా? లేకపోతే డిగ్రీ చదివే రోజుల్లోనే అతన్ని ప్రేమించాననీ, ఏదో పెద్దవాళ్ళ బలవంతం వల్లనే, నీతో పెళ్ళికి ఒప్పుకున్నాననీ చెబితే తను భరించగలడా?
తల్లిదండ్రులకు తను ఒక్కడినే కొడుకుననీ, ఎమ్.టెక్. చదివి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిజేసే తనకు ఉమ్మడి కుటుంబంలో వుండి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే అమ్మాయి కావాలనీ అడిగినప్పుడు సమీర సంతోషంగా ఒప్పుకుందే! తను కూడా ఏదో కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేరొచ్చునందే! ఇదేమిటి మరి? వాళ్ళ పేరెంట్స్కు తెలుసో… లేదో!
ఆలోచనలతో అసహనంగా మారడు కార్తీక్. వడివడిగా జైలువైపు నడిచాడు. వెళ్ళిన ఐదునిమిషాల్లోనే బయటికి వచ్చాడు.
‘క్షమించు సమీరా! జైలులో డిగ్రీ పరీక్షలు రాస్తున్న ఖైదీలకు వాలంటరీగా ఇంగ్లీషు టీచ్ చేయడానికి వెళ్తున్న నిన్ను అనుమానించి మగాడిననిపించాను. నీకు అంతా విడమర్చి సారీ చెప్తేగానీ, నా మనస్సు తేరుకోదు!’ అనుకున్నాక అతని హృదయం తేలికైంది.

You may also like

Leave a Comment