Home వ్యాసాలు ఆదర్శ ఉపాధ్యాయుడు -ముదుగంటి ప్రతాప్ రెడ్డి

ఆదర్శ ఉపాధ్యాయుడు -ముదుగంటి ప్రతాప్ రెడ్డి

by Narendra Sandineni


ముదుగంటి ప్రతాప్ రెడ్డి తేది 15 – 09 – 1939 రోజున సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించాడు.ప్రతాప్ రెడ్డి ఆసంపెల్లి గ్రామం, గంగాధర మండలం,కరీంనగర్ జిల్లాకు చెందిన వాడు.తల్లి లచ్చమ్మ,తండ్రి మాధవరెడ్డి.తండ్రి మాధవరెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వాడు.తాత లక్ష్మారెడ్డి,నాయనమ్మ రాధమ్మ.తాత లక్ష్మారెడ్డి వ్యవసాయికుడే.
లచ్చమ్మ మాధవరెడ్డి దంపతులకు ఐదుగురు సంతానం.
1) పెద్ద కూతురు నరసమ్మ. 2) రెండో కూతురు మందల సూర్యమ్మ భర్త హనుమంత రెడ్డి.హనుమంత రెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వాడు.
3)మూడో కూతురు చందుపట్ల కమలమ్మ భర్త పాపిరెడ్డి.పాపిరెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వాడు.వీరు పోతిరెడ్డిపల్లి గ్రామమునకు చెందిన వారు. 4)కొడుకు ముదుగంటి ప్రతాప్ రెడ్డి భార్య కమలమ్మ.ప్రతాప్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు. 5)నాలుగో కూతురు గుజ్జుల విమల భర్త లక్ష్మారెడ్డి.లక్ష్మారెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వాడు.విమల,లక్ష్మారెడ్డి,నల్లవెల్లి గ్రామం,నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు. ప్రతాప్ రెడ్డి1 వ తరగతి నుండి 4 వ తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విలాసాగరం గ్రామంలో చదివాడు.ఆసంపెల్లి గ్రామం నుండి విలాసాగరం గ్రామమునకు మూడు కిలోమీటర్ల దూరం ఉండేది. ప్రతాప్ రెడ్డి రోజు ఆసంపెల్లి గ్రామం నుండి విలాసాగరం పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరం నడిచి పోయి వచ్చే వాడు.విలాసాగరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లక్ష్మీ నరసయ్య సారు,రుద్ర నరసయ్య సారు చక్కగా బోధించే వారు.ప్రతాప్ రెడ్డి 5 వ తరగతి నుండి 7 వతరగతి వరకు ఎలగందల్ మిడిల్ స్కూల్ లో చదివాడు.

ఆ రోజుల్లో పాఠశాలకు ఆర్.చంద్ర ప్రభాకర్ హెడ్ మాస్టర్ గా ఉండే వాడు. ఎలగందల్ మిడిల్ స్కూల్లో 30 మంది ఉపాధ్యాయులు పని చేసే వారు.ఎలగందల్ పెద్ద గ్రామం.చుట్టుపక్కల పది గ్రామాల పిల్లలు ఎలగందల్ గ్రామంలో రూములు కిరాయికి తీసుకుని ఉండి స్కూల్లో చదువుకునే వారు.ఎలగందల్ గ్రామంలో రూమ్ కిరాయి మనిషికి ఒక రూపాయి ఉండేది.ఇంటి నుండి బియ్యం,పప్పులు మొదలైనవి తెచ్చుకునే వారు.కట్టెల పొయ్యి మీద వండుకునే వారు.ఆసంపెల్లి గ్రామం ఎలగందల్ గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండేది.ఎలగందల్ ఖిల (కోట) కరీంనగర్ జిల్లాలోని ఎలగందల్ గ్రామంలో ఉంది.కరీంనగర్ కు పది కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీ తీరంలో తాటి చెట్ల మధ్య సుందర ప్రకృతి నేపథ్యంలో ఉన్న ఎలగందుల కోట ఒకప్పుడు కుతుబ్ షాహీ వంశం, మొగల్ సామ్రాజ్యం,హైదరాబాద్ నిజాం నియంత్రణలో ఉండేది.నిజాం పాలనలో ఎలగందల్ కోట కరీంనగర్ కు ప్రధాన కార్యాలయంగా ఉండేది. కరీంనగర్ జిల్లాలో చారిత్రకంగా ఈ ప్రదేశం ఐదు సామ్రాజ్యాల చేత పాలించబడింది.పురాతన జ్ఞాపక చిహ్నాలతో కొండ శిఖరాన ఉన్న కోట,తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన సరస్సు 1774 ఎ.డి.లో ఫాఫర్ – ఉద్ – దౌలా చేత నిర్మించబడినవి. ఎలగందల్ కోటలోని మీనార్లు ముస్లిం సన్యాసులైన సయ్యద్ షాహ్ మున్నార్ క్వాద్రి సాహెబ్,దూలా షాహ్ సాహెబ్,సయ్యద్ మరూఫ్ సాహెబ్,షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్,వాలి హైదర్ సాహెబ్, సమాధులను కదిలిస్తే అక్కడ కోటలో ఉన్న మీనార్లు ఊగుతాయట.ఎలగందల్ గ్రామంలోని ఇంకో చివర దో మీనార్ అనే కట్టడం ఉంది.ఇది ముస్లిం పండుగ రోజుల్లో ప్రార్థన చేసే ఈద్గా.ఎలగందల్ గ్రామంలో ఈద్గాను బహమని సుల్తానులు నిర్మించారు.మీనార్ పైకి వెళ్ళడానికి లోపల నుండి మెట్లు ఉన్నాయి. ఎలగందల్ గ్రామం స్కూల్ వెనకాల ఈద్గా ఉంది. ప్రతాప్ రెడ్డి పాఠశాలలో చదువుతున్నప్పుడు మీనార్ ఎక్కే వాడు.ఎలగందల్ పాఠశాల పిల్లలు మీనార్ మెట్ల ద్వారా మీనార్ ఎక్కి అక్కడ కూర్చుండి చదువుకునే వారట.హైదరాబాద్ చార్మినార్ లో నాలుగు మీనార్లు ఉన్నాయి. ఎలగందల్ పాఠశాల వెనుక రెండు మీనార్లు ఉండేవి.మీనార్ ఎక్కి అక్కడ ఖాళీ ప్రదేశంలో విద్యార్థులు కూర్చుండి చదువుకునే వారు.ప్రతాప్ రెడ్డికి మీనార్ ఎక్కితే ఎంతో సంతోషంగా ఉండేదట.ప్రతాప్ రెడ్డి 8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు గవర్నమెంట్ హైస్కూల్ కరీంనగర్ లో చదువుకున్నాడు.మంకమ్మ తోటలో గల పొన్నం వాళ్ల క్వార్టర్స్ లో కిరాయికి ఉండి చదువుకున్నాడు. ఆసంపెల్లి గ్రామం నుండి కరీంనగర్ ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉంది. ప్రతాప్ రెడ్డి 10 వ తరగతి 1962 సంవత్సరంలో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రతాప్ రెడ్డి 1962 – 1964 సంవత్సరం వరకు ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ,జగిత్యాల తాలూకాలో టీచర్ ట్రైనింగ్ చేసి ఉత్తీర్ణత సాధించాడు.జగిత్యాలలో టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక సంవత్సరం హాస్టల్లో ఉన్నాడు. రెండవ సంవత్సరం రూమ్ కిరాయికి తీసుకొని ఉన్నాడు.ప్రతాప్ రెడ్డి తేది 27-09 -1965 రోజున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పొట్యాల దగ్గర గల బామండ్లపల్లి గ్రామంలో ఉపాధ్యాయుడుగా నియమించబడ్డాడు.బామండ్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉండేది.ఇద్దరు టీచర్లు ఉండేవారు. ప్రతాప్ రెడ్డి అన్ని సబ్జెక్టులు బోధించేవాడు.పిల్లలకు రోజు పాఠ్యాంశాలు బోధిస్తూ ఉంటే అవి కంఠస్థం అయ్యేవి.పిల్లలు కూడా పాఠశాలలో చక్కగా చదువుకునే వారు.ప్రతాప్ రెడ్డి వివాహం కమలతో 1966 సంవత్సరంలో ఆర్నకొండ గ్రామంలో జరిగింది. వారి మామయ్య దామెర రామ్ నర్సింహారెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు.ప్రతాప్ రెడ్డి బామండ్లపల్లి గ్రామ పాఠశాలలో పని చేస్తున్న రోజుల్లో ఒక రెడ్డి ఇంట్లో ఉచితంగా ఉండే వాడు. కిరాయి లేదు ఏమీ లేదు.బామండ్ల పల్లి గ్రామ ప్రజల ఆప్యాయత మరువ రానిదిగా ఉండేది.1969 సంవత్సరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అందరు ఉద్యోగులు అరువది నాలుగు రోజులు సమ్మె చేయడం జరిగింది.చదువుకున్న వాళ్లకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉండేది.పల్లెటూరు వాళ్లకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి అంతగా తెలియదు.ప్రతాప్ రెడ్డి ఎక్కడికి బదిలీ అయితే అక్కడికే పోయి భార్యా పిల్లలతో ఉండి పాఠశాలలో పని చేశాడు.ప్రతాప్ రెడ్డి కమల దంపతులకు ఇద్దరు సంతానం.
ప్రథమ సంతానం ముదిగంటి శ్రీనివాసరెడ్డి భార్య కవిత.శ్రీనివాస్ రెడ్డి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు.వీరికి ఇద్దరు సంతానం – రాజేశ్వర్ రెడ్డి,సంజయ్ రెడ్డి.
2) ద్వితీయ సంతానం : పిన్రెడ్డి మమత భర్త రమణారెడ్డి.వీరికి ఇద్దరు పిల్లలు.ఒకరు సంజన. రెండవ వారు మేఘన.రమణారెడ్డి సీనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతాప్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత ఎక్కడ పని చేయ లేదు.2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల తనకు చాలా సంతోషంగా కలిగిందట.1998 సంవత్సరంలో కరీంనగర్ లో రెండు గుంటల జాగ కొని సొంత ఇంటిని నిర్మించుకున్నాడు.ప్రతాప్ రెడ్డి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు జీతం 100 రూపాయలు ఉండేది.పల్లెటూర్లో ఐదు రూపాయలు కూడా ఖర్చు అయ్యేవి కావట.స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు చదువుకోవడానికి ప్రతాప్ రెడ్డి ఇంటికి వచ్చే వారు.తాను ఉచితంగా పిల్లలకు చదువు చెప్పే వాడు.గ్రామాల్లో టీచర్ అంటే అపారమైన గౌరవం ఉండేది.ప్రతాప్ రెడ్డికి పిల్లలకు చదువు చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇచ్చేది.ప్రతాప్ రెడ్డి గుంపుల గ్రామంలో ఎనిమిది సంవత్సరాలు పని చేశాడు.అప్పుడు గుంపుల గ్రామంలో ప్రైమరీ స్కూల్ ఉండేది.ఇప్పుడు ఈ గ్రామంలో హై స్కూల్ ఏర్పాటు అయింది.గుంపుల గ్రామస్తులు 2010 సంవత్సరంలో టీచర్ ప్రతాప్ రెడ్డిని సన్మానించారు. ఈ సన్మానం తనకు జీవితంలో మరిచిపోలేనిది అని చెప్పినాడు.ప్రతాప్ రెడ్డి పిల్లలను శ్రద్ధగా చదువుకోవాలని ఉత్సాహపరిచే వాడు.ప్రతాపరెడ్డి పని చేస్తున్న ప్రైమరీ పాఠశాలలో ఇద్దరు టీచర్లు మాత్రమే ఉండేవారు.ప్రతాప్ రెడ్డి తన శిష్యుడు కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్నాడని సగర్వంగా చెప్పుకున్నాడు.వీరు తేది 27 -09 – 1997 రోజున బోయినిపల్లి మండలం,రత్నం పేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుండి రిటైర్ అయ్యారు.వీరు ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దారు.వీరి శిష్యులు ఎందరో ఉన్నత స్థానానికి ఎదిగారు.నిరాడంబరుడైన ప్రతాప్ రెడ్డి ఉపాధ్యాయునిగా సమాజానికి చేసిన సేవ అమూల్యమైనటువంటిది.వారికి వారు పనిచేసిన గ్రామాలలో ఉత్తమ ఉపాధ్యాయునిగా విశేషమైన గుర్తింపు లభించిండం వల్ల తన జన్మ సార్థకమైందని ప్రతాప్ రెడ్డి తెలియజేశారు.సాయం సమయాలలో శివాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక భావనతో అక్కడ కొంత సమయాన్ని గడుపడం వారి నిత్య కృత్యం.

You may also like

1 comment

在线视频下载器 September 28, 2024 - 7:40 am

Fantastic beat I would like to apprentice while you amend your web site how could i subscribe for a blog site The account helped me a acceptable deal I had been a little bit acquainted of this your broadcast offered bright clear concept

Reply

Leave a Comment