Home ఇంద్రధనుస్సు ఆద్యవధాన సరస్వతి, తొలితెలుగు మహిళావధాని శ్రీమతి ఎం.కె. ప్రభావతి

ఆద్యవధాన సరస్వతి, తొలితెలుగు మహిళావధాని శ్రీమతి ఎం.కె. ప్రభావతి

by Dr. Lakshmanacharyulu M

                                సత్యమె మనజాతి, నీతి / సత్యాచరణే
                                సత్య హరిశ్చంద్రు కథయే
                                సత్యము గాంధిని మహాత్ము సలిపెన్‌ భక్తా !
                                ఆంధ్ర భాగవతపు / టందాల వెన్నుచు
                                జన్మ ముగియులోన / చదువవలెను
                                ధన్యుడైతి వోయి / ‘తన’ పోవ(గ) పోతనం
                                ”పోత” ”నా భవాబ్ధి” / నే తరింతు.                                      – ఎం.కె. ప్రభావతి

అది కర్నాటక రాష్ట్రంలోని మధురగిరి తాలూకాలోని తుంకూరు జిల్లాలో ఉన్న దొడ్డధలి గ్రామం. ఆ గ్రామంలో 78-79 సం|| క్రితం జన్మించిన ఒక ‘పాప’, ఎక్కడో తెలుగు రాష్ట్రంలో వృత్తిరీత్యా సైన్సు ఉపాధ్యాయురాలుగా ఆ తర్వాత రైల్వే విద్యాలయం, జూనియర్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ గా పనిచేసి, మంచిపేరు సంపాదించి, జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు, ఎత్తుపల్లాలు దాటి, శ్రీ పొత్తపి శ్రీనివాసరావు గారి అర్ధాంగియై, ముగ్గురు పిల్లలకు తల్లై ఆ తర్వాత, వాగ్ధేవి అద్భుత, అనూహ్య, అఖండ దివ్య కరుణకు పాత్రురాలై, తెలుగు సాహిత్యాన్ని మధించి, తొలి తెలుగు మహిళావధానిగా,  దేశ విదేశాలలో తెలుగు కీర్తి చంద్రికలు వ్యాప్తి చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
తనను ప్రేమించిన వ్యక్తికి 2 షరతులు పెట్టి, ఇంటి పెద్దకుమార్తెగా, తల్లిని పోషిస్తూ, సోదర, సోదరీమణుల జీవితాలు సరిదిద్దాల్సి ఉంటుందని, వారికి స్వావలంబన వచ్చేవరకు మనమే వారికి అన్నీ చూడాలని పెట్టిన అమ్మాయి, ఆ షరతులను తు.చ. తప్పక పాటించి తీరుతుందని, తనకూ భార్యగా ఏ లోటు రానీయక, ఉద్యోగ ధర్మాలు నెరవేరుస్తూనే,  తెలుగు అవధాన గగనంలో సముజ్వల తారగా వెలుగొందుతుందని, ఆ భర్తగాని, వివాహానికి హాజరయిన వారుగాని అస్సలు అనుకోలేదు.
తమకు సైన్సు పాఠాలు చెప్పిన ‘పంతులమ్మ’ తెలుగు అవధానంలో ఒక చరిత్ర సృష్టిస్తుందని 1966 నుండి 2006 వరకూ ఆమె దగ్గర చదువు నేర్చిన ఏ విద్యార్థి భావించలేదు.
అమ్మ తమకు ఏ లోటూ రానీయకుండా పెంచి పెద్దచేస్తూనే తెలుగు ప్రాచీన, ఆధునిక కావ్యాలను ఆపోశన పడుతూ, ఆశువుగా పద్యాలు చెప్పగలిగే స్థాయికి వెళ్ళి అన్ని ఛందస్సులలోనూ రచనలు చేసినదని, ”శ్రీనరసింహ శతకము”, ”రామా! నీ కథ వినుమా!”, ”భవాబ్ది పోతము”, ”భక్తి అంటే?”, ”శ్రీ విద్యాస్తుతి”, ”చదువు”, ”నవ్వు నవ్వించు”, ”చాటువులు”, ”వ్యాస కదంబం”, ”దేవుడొక్కడే” వంటి అద్భుత, అనితర సాధ్య రచనలు చేసి, కన్నవూరికి, తాను ఉద్యోగాలు చేసిన ఊళ్ళకు, నివసించిన  ఊరికి ఘనకీర్తి తెచ్చి, ”తాము ఆమె సంతానం” అన్న గౌరవం తమకు దక్కేస్తుందని వారూ అనుకోలేదు.
తానా సభలు (అమెరికా) ఆమెను ఘనంగా సన్మానించి, తద్వారా తాము గౌరవం పొందుతామని ప్రత్యేకంగా ఆలోచించలేదు. తోటి అవధానుల అవధానంతో పృచ్ఛకురాలిగా, ఎన్నో సాహిత్య ఆధ్యాత్మిక సమావేశాలకు, సభలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీమతి ప్రభావతి స్నేహశీలి, నిగర్వి, జిజ్ఞాసువు, హాస్యచతురత, సంభాషణా కుశలత, సహృదయ స్పందనతో ఎందరినో ప్రోత్సహించిన మృదుభాషిణి, మధురభాషిణి. ఎందరో వర్ధమాన కవుల, రచయితల రచనలకు (ఈ వ్యాసం వ్రాస్తున్న నాతో సహా) చక్కని, చిక్కని, ప్రోత్సాహకమైన, నిర్మాణాత్మక ‘మున్నుడి’ వ్రాసి, అర్థవంతమైన, నొప్పించని శైలిలో, ఆ రచనలను విమర్శ చేసిన విధుషీమణి. మచ్చుకి –
”పద్యంలో ఏ పాదానికా పాదంలో సంపూర్ణమై, అర్థాన్ని ఇవ్వగలిగితే అది సుందరంగా ఉండటమేకాక పాఠకునికి అర్థాన్వయంలో కాఠిన్యమనిపించదు. ఈ లక్షణాన్ని మీరు పట్టుకున్నారు. ఎటువచ్చీ దాన్ని నాలుగు పాదాలలో ఉపయోగించడం వలన ‘చెవికింపు’ మాత్రమే పొందారుగాని పద్యానికి రాదగిన రావలసిన ”చైతన్యం” కొన్ని పద్యాలలో మీరు అందించలేకపోయారు. (మీరు = డా.లక్ష్మణాచార్యులు)
”నేను వ్రాసిన విమర్శలో మొగమాటానికి, ముఖస్తుతికి తావు లేదు. వ్రాసిన ప్రతి మాటకు విలువ అందులోని సత్యమే సుమా!”

”ఈ కవి మంచి భావుకుడు” (అభినందనలు- (దృశ్యాదృశ్యాలు- (ఈ వ్యాసరచయిత పుస్తకం) ఎం.కె. ప్రభావతి)

అమలాపురంలోని ‘త్రివేణి’ సంస్థ ‘అవధాన భారతి’ అని బిరుదును ఇచ్చింది. ‘తానా’ (అమెరికా) రెండుసార్లు (2002 & 2004) ప్రథమ మహిళా అవధానిగా సన్మానించింది. పో.శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.
భారతీయ సంస్కృతిని, హిందూ సంప్రదాయాన్ని, మానవ విలువల్ని, తెలుగు భాష సాహిత్యాలను ఎంతగానో ప్రేమించిన ప్రభావతి భౌతికంగా లేకున్నా, ఆమె యశస్సనే కాయానికి జరా మరణములు ఉండవు. ఆమె సాహిత్య సేవలు అవిస్మరణీయాలు, అనుస్మరణీయాలు.

You may also like

Leave a Comment