Home బాల‌సాహిత్యం ఆపదలో సాయం

   సుందరవనం అనే అడవిలో ఒక బుజ్జి కుందేలు ఆహారం కొరకై బయలుదేరింది.   అది పెద్దపులి గాండ్రింపు విని  భయంతో పరుగెత్తి  పొరపాటున  ఒక పెద్ద గోతిలో పడింది.  ఆ పెద్దపులి అక్కడికి రానే లేదు. అది ఎటో వెళ్లి పోయింది.  అయినా ఆ బుజ్జి కుందేలు ప్రాణభయంతో    ” కాపాడండి! కాపాడండి!” అని గట్టిగా అరచింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక జిత్తులమారి  నక్క దానిని చూసి కూడా చూడనట్టు నటించి దానిని ఎవరు కాపాడుతారో అని అక్కడనే వేచి ఉంది.  
          అప్పుడే ఆ కుందేలు పిల్ల అరపులు విని  అక్కడికి పరుగున వచ్చిన ఏనుగు అది చూసి   ఆ బుజ్జి కుందేలును తన తొండంతో లాగి  ఆ గోతి నుండి కాపాడింది.   తర్వాత అది ఆ నక్కతో ” ఓ నక్కా! ఈ  పిల్ల కుందేలు ఆపదలో ఉంటే నీవు  కాపాడకుండా ఎటో చూస్తున్నావు. ఇది నీకు తగునా!   అది కాపాడమని అంటే వినరానట్టు ఉంటావా !”అని అంది. అప్పుడు నక్క ఏమి మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి  వెళ్ళిపోయింది.
         కొన్ని రోజులకు ఒక బుజ్జి నక్క కూడా  దూరంగా ఒక చిరుతపులి అరపు విని భయంతో పరుగెత్తి  ఇదే చోటకు వచ్చి అదే గోతిలో పొరపాటున పడింది. అది కూడా తనను  కాపాడమని  గట్టిగా అరిచింది.   దూరం నుండి ఇది చూసిన ఒక పెద్ద కుందేలు పరుగున వచ్చి ఆ బుజ్జి నక్కను ఒక కర్రను అందించి దాని  సాయంతో కాపాడింది .  వెంటనే దాని తల్లి  పెద్దనక్క పరుగున అక్కడికి వచ్చింది.  అప్పుడే అక్కడికి వచ్చిన ఇదివరకటి ఏనుగు ఇది చూసి  ” ఓ కుందేలా! నీవు ఈ బుజ్జి నక్క ప్రాణాలు కాపాడి దానికి   చాలా మేలు చేశావు.  ఈ నక్కనే గతంలో నీ బిడ్డను కాపాడలేదు. అయినా అది మనసులో పెట్టుకోకుండా ఒక తల్లి మనసును అర్థం చేసుకున్నావు.   అపకారికి ఉపకారమంటే ఇదే  “అని అంది.  అప్పుడు కుందేలు ” ఓ గజమా! ఆపదలో ఉన్న ఎవరినైనా కాపాడడం మన ధర్మం. అందులో అది చిన్న పిల్ల.  పొరపాటున ఆ గోతిలో పడింది.  మరేదైనా క్రూర మృగం చూస్తే దీని ప్రాణాలు దక్కవు.  అందువల్లనే నేను దానిని కాపాడాను.  అది సాయం చేయలేదని నేను కాపాడకుంటే  ఒకవేళ దాని ప్రాణం పోతే  తిరిగి వస్తుందా! అందుకే ఈ చిన్న మేలు చేశాను” అని అంది.
      అప్పుడు నక్క తాను గతంలో  కుందేలు బిడ్డకు చేసిన అపకారం గురించి చెప్పి కన్నీళ్లు కార్చింది.   తన బిడ్డను బ్రతికించినందుకు ఆ కుందేలుకు తన ధన్యవాదాలు తెలిపింది. ఆ  కుందేలు ఆ నక్క కన్నీళ్లను తుడిచింది.  తర్వాత    ఆ నక్క పశ్చాత్తాపపడి  మరోసారి ఎటువంటి తప్పు చేయలేదు. అంతేకాదు. ఆ కుందేలుతో అది  చాలా   స్నేహపూర్వకంగా మెలగింది.    అందుకే అపకారికి ఉపకారం చేస్తే  స్నేహం పెంపొందుతుంది. 

You may also like

Leave a Comment