ఈ దేహం ఒక వ్యవస్థ అనుక్షణం దానితో అవస్థ
‘ఇక్కడికి రా నాన్నా’ కొడుకు పిలుపు
స్నానాల గదికి పోలేనివాడు సముద్రాలు దాటగలడా?
పక్కింటి పిల్లలే నీ బర్త్ డే చేస్తారు
కొవ్వొత్తి ఆర్పి కేక్ లోకి చాకు దించుతుంటే
ఏవేవో భావాలు
క్రమంగా జబ్బు గ్రహణమవుతుంది
‘ఆపరేషన్’ అంటాడు డాక్టర్
నీ గదిలో ఫినాయిల్ వాసన గుప్పుమంటుంది
మేకప్ చేసుకున్న మేకపోతు గాంభీర్యం
నీరు కారిపోతుంది
కళ్ళుమూస్తే పాపం చచ్చిపోయిన వాళ్ళంతా
కలలో క్యూ కడుతున్నారు
ఆపరేషన్ థియేటర్ లోకి అడుగుపెట్టగానే
కోడి రెక్కల టపటపలా గుండె దడ
ప్రాణభయం ఉదాసీనంగా మొదలై ఉధృతమవుతుంది
మణికట్టుమీద శరీరంలోకి రహదారి పరుస్తారు
రక్తం బొట్టు బొట్టుగా దేహంలో కలుస్తుంటే
నీ రక్తాన్ని నువ్వే తాగుతున్న భ్రాంతి
ముక్కుతో పొడిచి షుగర్ ను కొలిచి
వడ్రంగి పిట్టలా ఎగిరిపోతుంది గ్లూకోమీటర్
ఆక్సీజన్ పైపు దేహాన్నో బెలూన్ను చేస్తుంది
మెత్తగా మత్తుసూది దిగుతుంది
కత్తులు కత్తెర్లు కాసేపు సర్జన్ చేతులవుతాయి
‘ఆపరేషన్ సక్సెస్’ అన్న అభినందనతో
రాలబోతున్న పువ్వును
అంటుపెట్టుకుంటుంది ఆశాలత
ఐసియు అజ్ఞాతవాసంలో కూడా
గాయంమీద కుట్టుమిషన్ నడుస్తూనే ఉంటుంది
మగత నిద్రలో ఎవరో పిలిచినట్లనిపిస్తే
మూగరోదన దైవస్మరణ ఫలించి
నీ వాళ్లు వచ్చారని భ్రమపడతావు
వాళ్ళు నీ పక్క పేషంట్ కొడుకు కోడలు
ఆమె చంకలోని పాప ‘తాతా’ అని పిలుస్తూ
ఎత్తుకొమ్మని నీకు చేతులందిస్తుంది
పోయిన ప్రాణం లేచి వస్తుంది
నీ జీవితం లెక్కలో మిగిలిన కాలం రెట్టింపవుతుంది!
1 comment
ఆపరేషన్ కవిత
ఆశాలతలు పూయించింది
అభినందనలు 🎉🎉🎉🎉🌹🎉🌹🎉🌹
సార్ 🙏
ఏడెల్లి రాములు ✍️