ప్రాంగణం ప్రవేశించేసరికి
విద్యార్థులు చిన్న చిన్న
కోడి పిల్లల లాగా ఇంగ్లీషులో
కిచ కిచ అంటారు
తెల్లబాతుల్లాంటి ఉపాధ్యాయులు
పాఠశాల సరసులో
చిరునవ్వు లేత గాలితో
పిల్లలని స్పృశిస్తారు
పిల్లలను చూస్తే వచ్చి
పోయే వాహనాలు ట్రాఫిక్
సిగ్నల్ లో ఎర్రలైట్లు అవుతాయి
పిల్లల్ని బడిలో దిగబెడుతున్న
తల్లి కోడి లాంటి మమ్మీలు డాడీలు
ముక్కుతో కోడి పిల్లలస్పర్శిస్తారు
ఎక్కడనుంచో ఒక మ్యాక్ ఫై
ఎగురుతూ వచ్చి నన్నో బలిని చేస్తుంది
బుజ్జి గాంధీలు సీట్ డౌన్ సీట్ డౌన్
అంటూ ప్రబోధిస్తారు
జీవన సమరంలో నిరంతరం జ్వలించే
ఇండియా బుద్ధి
ఈ పూల తోటలో
ఆకుల పైన మంచు
బిందువు అవుతుంది
అక్షర సేద్యాలు ఆకుపచ్చగా
మొలకెత్తే పని మెదడు బీడు
భూమిలో మొదలైపోతుంది
మైకులో వినబడుతున్న
సంగీతం లాంటి అనౌన్స్మెంట్
గువ్వ గువ్వల చిరు గొంతుల పైన
నిశ్శబ్దం ముసుగు కప్పేస్తుంది
జీవితం ఎన్ని లలిత క్షణాలను
ఆవాహన చేసుకుంటుందో
ఆస్ట్రేలియా బడిలో మనవరాలితో
అడుగుపెట్టిన క్షణాలలో
అర్థం చేసు కొంటూ
శుభ్ర స్నానం చేసిన
నగ్న మూర్తిగా బయటికి వస్తాను
ఆస్ట్రేలియాలో బడి..
previous post