Home కవితలు ఇన్‌ల్యాండ్ లెటర్

ఇన్‌ల్యాండ్ లెటర్

చాలా కాలం తర్వాత
ఉత్తర మొచ్చింది.
అదీ ఒక ఇన్‌ల్యాండ్ లెటర్.
ఎంత అందంగా ఉందిది!
ఇది కార్డు ముక్కకు అక్క
లిఫాఫాకు చెల్లెలు.

అందుకోగానే చిరగ కుండా
అపురూపంగా విప్పడం అలవాటు నాకు.
దానిని మడత పెట్టే టప్పుడు కూడా
అంతే జాగ్రత్త!
ఒక వైపు గ్రహీత చిరునామా
ఇటు వైపు మన అడ్రసు
అంటించిన తర్వాత
లోపల ముత్యాల్లాంటి గరగరలు
నాస్టాల్జియా అని
కొట్టి పారెయ్యకండి!
ఇది పోస్టాల్జియా.

మడతలే
ఇన్‌ల్యాండ్ లెటర్ ప్రత్యేకత,
కాని
ఓ మిత్రుడు మరణించిన వార్తను
తెచ్చి నప్పుడు మాత్రం
అది అతనికి కప్పిన
కఫన్‌లా అనిపించింది.

విప్పితే చిన్నదే కావచ్చు
కాని
500 చ. సెంటీ మీటర్ల విస్తీర్ణంలో
అక్షరాల పంట లెన్నో పండించ వచ్చు.
భావుకులకైతే
అదొక కావ్య ఖండికల వేదిక
రాయక ముందూ
రాసిన తర్వాతా
దానిని తూకం వేస్తే
ఎడమ వైపే ఎక్కువ బరువు తూగుతుంది.

అనుబంధాలూ దుఃఖాలూ
అరోపణలూ వాగ్దానాలూ
రోగాలూ రొష్టులూ
అన్నింటినీ భద్రంగా
ఉద్దిష్ట వ్యక్తికి అందించే
ఉత్తమ విశ్వాస ధూతిక.

ఎన్నడూ నేను
శ్రీమంతుణ్ని కాదు
కాని పెళ్లికి ముందు నా అర్ధాంగి రాసిన ప్రేమలేఖలూ
మహా కవి సినారె ఓ కుర్ర కవికి రాసిన
ఆశీః పూర్వక ప్రత్యుత్తరాలూ
ఇప్పటికీ నా పెట్టె అడుగున
ధగధగ లాడుతున్నాయి.

ఎర్రని పోస్టు డబ్బా
అడవిలో కనపడ్డా
ఒక ఆత్మీయుణ్ని కలిసినంత
సంబర పడి పోతాను
ఒక చోట కదల కుండా వుంటూనే
సమస్త విశ్వాన్ని కదిలించే
అద్భుత వ్యవస్థకు ప్రతీక అది.

ఇవాళంతా ఇన్‌ల్యాండ్ లెటర్‌ను
జేబులో పెట్టు కొని తిరుగుతాను
కరెన్సీ నోట్లు
చిన్న బుచ్చు కున్నా సరే.

You may also like

5 comments

Ramakanth N August 25, 2021 - 9:38 am

smart phone vachhina taruvatha inlannd letter vadadamu agipoindi. me kavitha chala madhuramuga undi enno madhura guruthulatho manasunu ananda parichindi

Reply
Dr. Arutla sridevi August 25, 2021 - 3:24 pm

Sir mee kavitha chaala baagundi

Reply
విలాసాగరం రవీందర్ September 26, 2021 - 8:32 am

ఆత్మీయత కలిసిన కవిత్వ మధురిమ సార్

Reply
Dr.P.NAGA MALLIKA October 29, 2021 - 9:07 am

Very nice sir

Reply
Kudikala Vamshidhar December 3, 2021 - 12:49 am

ఆచార్య ఎన్. గోపి గారి కవిత చాలా బాగుంది

Reply

Leave a Comment