Home కవితలు ఇల్లొక స్టోరీ టెల్లర్ !!

ఇల్లొక స్టోరీ టెల్లర్ !!

by Geethanjali

–గీతాంజలి కవిత.(13.1.2023)


ఇప్పుడా నువ్వు వచ్చేది ??నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాక?
నాకు తెలుసు ఇక ఇప్పుడు నువ్వు వస్తావని…
నా వీధిలోకి నింపాదిగా నడుచుకుంటూ ఇప్పుడైనా వస్తానంటావా? సరే.. రా..
నేను లేని ఖాళీ ఇంటి ముందు నిలబడి…
ఒకప్పుడు నీ కోసం ఎదురుచూసిన ఈ శూన్యపు ఇంటిని గాజు కళ్ళతో చూస్కో..
నా ఇంటి నిశ్శబ్దంలో ..నేను నీకు చెప్పాలనుకున్నవి వినిపిస్తే.. ఇప్పటికైనా విను..
కన్నీళ్లేమైనా రాలితే… రాలనివ్వు !
విషాదపు చీకటి నిండిన గదుల్లో వెలుతురు మిణుగురులు ఏమైనా మెరిస్తే పట్టుకో కొన్ని.
ఇక వెళ్లిపో..అక్కడ నేను లేను
నీకు ఇక దొరకను…!
నేనున్నప్పుడు ఇన్నాళ్లూ రాకుండా ఉన్న నువ్వు..
ఖాళీ ఇంటి ముందు కూడా ఉండకుండా వెళ్లిపో..
రాకింక !
మనిషిగా మారానంటావా..
నేను వెలిగించాల్సిన దీపం ఇంకా చీకటిని తాగుతూ ఉందంటావా.. ఉండనివ్వు !
నేను రాకపోతేనేం .. లేకపోతేనేం.. ? దీపం దానంతట అదే వెలుగుతుంది.
వెళ్లు….!
నన్నిక రమ్మనకు !
నువ్వూ రాకు !
నువ్వు లేని ఇల్లేమీ చిన్నబోదు.
నన్ను బాధపెట్టిన నిన్ను ఇల్లేనాడు ప్రేమించలేదు..క్షమించలేదు కూడా !
నువ్వు నాతో లేనప్పుడు ఇల్లే మనిషిగా మారి నాతో కబుర్లు చెప్పేది..వెచ్చగా కౌగలించుకుని ఓదార్చేది !
నేను లేక పోతేనే.. ఇల్లు ఏడుస్తుంది.
దానికదే కథలు చెప్పుకుంటుంది.
గది గదినీ పలకరిస్తుంది.
తనలో తాను ఆరాటంగా తిరుగుతూ నా గాయాల్ని తడుముతుంది.
ఏకాంతపు రాత్రుళ్లల్లో నేను మైమరచి విన్న గులాం అలీ గజల్స్ నీ…నా రఫీ పాటల్ని..నూర్జహాన్ గమకాల్ని తానూ యాద్ చేసుకుంటూ ఇల్లు కన్నీరు పెడుతుంది…
నన్ను తలచుకుంటూ… విరహ వేదనలో కాలిపోతుంటుంది.
నా పాదాల స్పర్శ కోసం నేలను ముధ్ధాడుతూ ఉంటుంది.
నన్ను అక్కడ లేకుండా చేసిన నీపై ఆగ్రహంతో రగిలిపోతుంటుంది.
నా కన్నీళ్ళతో మరకలైన దిండు గలీబుని ప్రేమగా నిమురుతుంది.
నేను రాసిన కథలు.,కవితలూ నువ్వు వినలేదేమో కానీ… ఇల్లు విన్నది.
నేను వెళ్లాక ఇల్లు గడపమీద కూర్చుని తీరిగ్గా నా కవితల పుస్తకాన్ని తిరగేస్తూ కన్నీళ్లు కారుస్తుంది.
కిటికీలతో..గదులతో.,తలుపులతో., పరువులతో..పరదాలతో.,
వంటింటి గిన్నెలతో ..ఆరిపోయిన పొయ్యితో..అలమరలోని పుస్తకాలతో.. టేబుల్ పైని నా కాగితాలతో ..కలంతో..నా చాయ్ కప్పుతో..
హేంగర్లకు వేలాడుతూ గాలికి కదిలే నా చీరలతో..నన్ను నేను చూసుకున్న నిలువెత్తు అధ్ధంతో..
అధ్ధం మీది నా కళ్ళ కాటుక మరకలతో.. గోడమీది నా బొమ్మతో..
ఇంటిని అల్లుకున్న పూల తీగలతో.. పెరటిలోని గువ్వలతో .,ఇంటి డాబాతో.,
డాబా పైని వెన్నెలతో చుక్కలతో…వాకిట్లోని ముగ్గుతో…ముగ్గుపై వాలిన ఎండతో… రాత్రి రాలిన పున్నాగ పూలతో .. కథలు చెబుతుంది ఇల్లు.
ఎవరివి అనుకున్నావు…
నీ–నా కథలే..!
అర్థాంతరంగా ఆగిపోయిన మన కథలు!
ఏమనుకున్నావు మరి…ఇల్లొక స్టోరీ టెల్లర్ !
దిగులు పడకు.. నువ్వు లేకపోతే ఇల్లేమీ చిన్నబోదు.. ఇల్లు కథలే కాదు పాటలు కూడా పాడుతుంది…
పాడకుండా గొంతులో నిలిచిపోయిన పాటలే అందుకుంటుంది ఇల్లు.
నేను రాసిన కవితలనే పాడుతుంది….
అవును ఇల్లు పాడుతుంది
అందుకే ఇల్లు .. నువ్వు నాకు చేసిన గాయాల్ని పాడే గాయకురాలు !
ఇల్లొక సంగీతం !
ఇల్లు కథలు రాస్తుంది
ఇల్లొక పుస్తకం అవుతుంది.
ఇల్లొక కలం అవుతుంది.
ఇల్లొక రచయిత్రిగా మారిపోతుంది
అడిగి చూడు…ఇల్లు మాట్లాడుతుంది.
అచ్చం నా లాగా !
అవును నేను ఇల్లుగా మారాక
ఇల్లు నేనుగా పరివర్తన చెందాక..
ఇల్లూ.. నేనూ ఒకటే అయ్యాక..
నేనా ఇల్లు విడిచి పెట్టిపోయినా
ఇల్లు.. నేనుగా నిలబడి ..నిట్ట నిలువు చూపుల కన్నులతో…నీతో మాట్లాడుతుంది.
నిన్ను నాలాగే ప్రశ్నిస్తుంది
హెచ్చరిస్తుంది.
నిన్ను లోపలికి రానిస్తుందనుకుంటున్నావా…
ఈ ఇల్లు నీ ఉనికికి మాత్రమే కాదు నా దుఃఖానికే చిరునామా !
నేను లేని ఇంట్లో ఉంటే ఉండు..పోతే పో !
ఇల్లు అలానే అక్కడే ఉంటుంది…
ఎందుకంటే ఇల్లు
నన్ను పువ్వు నుంచి కత్తిగా మార్చిన కార్ఖానా !
ఇల్లొక చరిత్ర !!
ఇల్లొక స్టోరీ టెల్లర్ !!

You may also like

Leave a Comment