Home బాల‌సాహిత్యం ఉడుతా ఉడుతా .. ఊచ్

ఉడుతా ఉడుతా .. ఊచ్

అనగనగా ఒక చెట్టుంది. ఆ చెట్టుకేమో పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్రలో ఉడుత జంట కాపురం ఉంటున్నది. 

ఉడుత త్వరలో తల్లి కాబోతున్నది.  బిడ్డల్ని కనబోతున్నది.  నార, మెత్తటి గడ్డి లాంటివి ఏరుకొచ్చి సన్నగా చీల్చి మెత్తగా దూదిలాగా చేసి, గుండ్రంగా సర్ది,  గూట్లో పరుపులా తయారు చేసాయి ఉడుత జంట. పిల్లలకు ఒత్తిడి తగలకుండా, సౌకర్యంగా ఉండటం కోసం ఆ ఏర్పాటు చేసాయి. 

ఆ ఉడుత జంటకి నాలుగు పిల్లలు పుట్టాయి.   

ఆ తొర్ర ఇంట్లో పిల్లలతో కాపురం ఉంటున్నాయి ఆ జంట. 

ఉడుత పిల్లలు చాలా చిన్నవి. బుజ్జి బుజ్జి గా ఉన్నాయి. వాటిని ముందే తయారు చేసి పెట్టుకున్న మెత్తటి గడ్డి పరుపుపై వాళ్ళమ్మ పడుకోబెట్టింది.  

చిట్టి చిట్టి ఉడుతలు అమ్మని కరుచుకు పడుకున్నాయి. 

అవి వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతాయి.  తర్వాఉడుతా ఉడుతాత నిద్దుర పోతున్నాయి.

పిల్లలు పడుకున్నాయి కదా…  అవి లేచే లోపల తన పిల్లలకు ఆహారం తెద్దామని అమ్మ ఉడుత బయటకు చూసింది. 

తనను ఎవరు గమనించడం లేదు అని నిర్ధారించుకుంది.  బయటకు  వెళ్ళింది. 

టమాటో తోటలో టమాటా కొద్దామని చూసింది. తియ్యటి పెప్పర్ మెంట్ వాసన వస్తోంది . మొహం ఎట్లాగో పెట్టుకుని దూరం జరిగింది. 

వెల్లుల్లి వాసనంటే గిట్టదు . మిరియాల ఘాటు అంటే కూడా ఉడుతకి అస్సలు నచ్చదు.   జాగ్రత్తగా వెతికి వెతికి కూరగాయలు, పళ్ళు తెచ్చింది అమ్మ. 

పగలంతా మొక్కజొన్న, పుట్టగొడుగులు, ఆకుకూరలు, జామకాయలు వెతికి తెచ్చాడు నాన్న.  అన్నిటినీ తెచ్చి చక్కగా ఆ తొర్రలో  భద్ర పరిచారు అమ్మానాన్న.

ప్రతిరోజూ అంతే.  

వెలుతురు ఉన్నప్పుడు ఆహారం, నీళ్లు తెస్తారు.  వెలుతురు పోయే లోపల పనులు ముగించుకుని ఇంటికి చేరుతారు. రాత్రిపూట ఇంట్లో నుంచి బయటకు రారు. విశ్రాంతి తీసుకుంటారు. 

ఉడుత పిల్లలు రోజు రోజుకు పెరిగి పెద్దగా అవుతున్నాయి.  నిద్ర లేచిన పిల్లలు అమ్మ కోసం వెతుక్కోవడం మొదలు పెట్టాయి.  తొర్రలో అమ్మ కనిపించటం లేదు . నాన్న లేడు.  

పిల్లలు నిద్ర పోకుండా అమ్మ నాన్న ఎటు వెళుతున్నాయో చూడాలని అనుకున్నాయి. రెండు రోజులు పిల్లలు నిద్రపోవడం లేదని వాటికి జాగ్రత్తలు చెప్పి అమ్మ నాన్న ఉడుతలు బయటికి వెళ్లడం మొదలు పెట్టాయి. 

ఓ రోజు “అమ్మ నాన్న రోజు ఎటో వెళ్లి వస్తారు. కానీ మనకు మాత్రం ఇక్కడ నుంచి కదలొద్దు అని చెబుతున్నారు. బయటకు తొంగి చూడవద్దని చెప్పి వెళ్తున్నారు.  

బయట ఎలా ఉంటుందో, ఏమి చేస్తారో చూడాలని ఆత్రంగా ఉంది” అన్నది ఓ ఉడుత పిల్ల. 

“అవును నిజమే, రోజంతా గూట్లో కూర్చుంటే విసుగు వస్తున్నది.  మనం కూడా ఎంచక్కా బయటకు పోతే..  ” అన్నది మరో ఉడుత పిల్ల.  

“అబ్బ !.. బయటికి పొతే… ” కళ్ళు మెరిపిస్తూ అన్నాయి మిగతా రెండు ఉడుత పిల్లలు.  

“ఇంకేం, అయితే పదండి పోదాం” ఉత్సాహంగా అన్నది మొదటి పిల్ల 

అంతలో ఒక పిల్ల అదిగో అమ్మ అటు వెళ్ళింది అంటూ తొర్ర పైకి చూపింది 

అందరూ తొర్ర పైకి వచ్చారు. అంతలో అమ్మ ఆహారం తీసుకుని వచ్చింది.  

పిల్లల్ని చూసి “అయ్యో .. మీరు  ఇక్కడికి ఎందుకు వచ్చారు” కంగారుగా అడిగింది 

“నువ్వు ఇటే వెళ్లావుగా .. అందుకే నీకోసం మేము బయలు దేరాం” అని చెప్పారు పిల్లలు.  

“మీరింకా చిన్న పిల్లలు. అట్లా రాకూడదు. ఇంట్లోనే ఉండాలి” బుజ్జగింపుగా చెప్పింది అమ్మ 

“ఏం ఎందుకని ..? ” మొదటి పిల్ల వెంటనే ప్రశ్నించింది. 

“బయట ఎలా మెసలాలో మీకు తెలియదు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మీకు తెలియదు.  రకరకాల ప్రమాదాలు వెన్నంటి ఉంటాయి. ఇంకా కొన్నాళ్ళు పోయాక నేనే తీసుకుపోయి అన్నీ చూపిస్తా, సరేనా ..  ” అని చెప్పింది అమ్మ ఉడుత. 

అంతలో తండ్రి ఉడుత తోక తో ఏదో సంకేతాలు పంపింది .  నోటితో ఏవో శబ్దాలు చేసింది. తల్లి ప్రమాదం పసికట్టింది . 

గప్ చిప్ గా పిల్లల్ని లోపలికి తీసుకుపోయింది తల్లి. 

ప్రతి రోజూ చెట్టు తొర్రలో ఉండే ఉడుతలను గమనించే చిన్నూకి చాలా ఆశ్చర్యంగా ఉంది.  

తండ్రి ఉడుత తోక ఊపగానే తల్లి పిల్లల్ని ఎందుకు లోపలికి  తీసుకుపోయిందో అర్థం కాలేదు.  

“ఉడుత ఉడుతా ఊచ్ .. ఎక్కడికెళ్ళావోచ్ ” పాడుతూ చెట్టు తొర్ర కేసి చూస్తున్నాడు చిన్నూ. 

చెట్టు తొర్ర దగ్గర లో పాము కనిపించింది.   కొమ్మ పైన ఉన్న తండ్రి తోక ఊపుతూ మళ్ళీ ఏదో శబ్దం చేసింది.  

ఇప్పుడర్థం అయింది తండ్రి ఉడుత ఎందుకు తోక ఊపిందో .. 

మరి మీకు అర్ధమైందా .. 

చెప్పండి చూద్దాం .

You may also like

Leave a Comment