Home కవితలు ఎందుకో….

ఎందుకో….

by Rama Devi Nellutla


ఎందుకో ఈరోజు కొత్తగా వుంది
పూల గాలి ఒకింత మత్తుగా ఉంది
పుడమి అంతా బంగారు తాపడం చేసినట్టు
నవ కాంతులతో గమ్మత్తుగా ఉంది

కొమ్మలు వింత రంగుల లతాంతాలను ప్రసవించాయి
సూర్యుని లేత కిరణాలు పూలపై ప్రసరించాయి
జగతిలోని సహజ అందాలు నవ్వుతున్నాయి
ధరణిపై దివ్య దీప్తులు ప్రకాశించాయి

చెట్లు కొత్త చిగుళ్ళకు జన్మనిచ్చాయి
ఆకులకు తీగలు ప్రాణమిచ్చాయి
తోట పరిమళపు విరులకు క్రొంగొత్త ఊపునిచ్చాయి
తేటి పాటలకు ఆతిథ్యం ఇచ్చాయి

అగ్నిపూలు అడవంతా ఎర్రని హంగులనద్దాయి
దిరిసెన పూలు పసుపుపచ్చని వింత శోభలు దిద్దాయి
ముందే వచ్చిన వసంతోత్సవ సంబరాలు
వనాలన్నింటికీ ఆకుపచ్చని రంగులు రుద్దాయి

వేపకొమ్మ తెల్లని పువ్వులను సింగారించింది
మామిడి వృక్షం పిందెల హారాలు సవరించింది
చింత చెట్టు వోనగాయల లోలకులు ధరించింది
పొలం చెరుకుగడల వరుసలను అలంకరించింది

పండి వంగిన వరి చేలు పచ్చని శోభలీనాయి
నింగిలోని నక్షత్రాలు మిల మిలలాడాయి
కొమ్మ కొమ్మన కోయిలమ్మలు
కొత్త రాగాలు ఆలపించాయి
మల్లె పూలు మత్తిల్లే సువాసనలు వెదజల్లాయి

ప్రకృతి కాంత వింత శోభతో ఒప్పింది
మావి చెట్టుపై మాధవీలతను
మంచుతెర కప్పేసింది
ఉగాది వచ్చిందని నా మది
పదేపదే చెప్పింది!!!

You may also like

Leave a Comment