ఎలనాగ సాహితీ ప్రియులకు చిరపరిచితమైన పేరు .పుట్టిన ఊరు లోని సగం, ఇంటి పేరులోని సగాన్ని తీసుకొని ‘ఎలనాగ’ కలం పేరుగా చేసుకుని సాహితీ వినీలాకాశంలో ధ్రువతారలా ప్రకాశిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. వృత్తి ధన్వంతరీతత్వం, ప్రవృత్తి సాహితీ సేద్యం, రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన అక్షర కృషీవలుడు.
కరీంనగర్ కు కూతవేటు దూరంలోని ఎలగందుల వీరి జన్మస్థానం .తల్లిదండ్రులు నాగరాజు తిరుమలయ్య ,రంగమ్మ గార్లు. వీరి అన్నయ్య శ్రీ నాగరాజు రామస్వామి ప్రముఖ సాహితీవేత్త కాగా తమ్ముడు డాక్టర్ నాగరాజు రవీందర్ సంస్కృతం, పద్య రచనల్లో దిట్ట.
ఎలనాగ గారు వైద్య విద్యను అభ్యసించి, కొంతకాలం నైజీరియా లో ఉద్యోగం చేసి, ఇండియా తిరిగి వచ్చి వైద్య విధానపరిషత్తు లో వివిధ స్థాయిల లో బాధ్యతలు నిర్వర్తించి రాష్ట్ర స్థాయి అధికారిగా పదవీవిరమణ చేసారు.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న నానుడి అక్షరసత్యం అంటూ బాల్యంలోనే అబ్బిన కవన సురభిళానికి ప్రతీకగా కరీంనగర్ నుండి వెలువడ్డ ‘గౌతమి’ పత్రికలో వీరి తొలి కవిత ప్రచురితమైంది. మెడిసిన్ అభ్యసించే సమయంలో భారతి, కృష్ణా పత్రిక ,స్రవంతి, ఆంధ్ర ప్రభ,తరుణ పొలికేక, విపుల మొదలైన పత్రికల్లో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. అప్పటినుండి వెనుతిరిగిచూడకుండా సాహిత్యంలో కృషి చేస్తూనే ఉన్నారు. నైజీరియాలో వైద్యుడిగా సేవలు అందిస్తూనే తీరిక వేళల్లో ఆంగ్ల సాహిత్యాన్ని ఎక్కువగా చదివి పట్టు సాధించారు. ఆంగ్ల పదాలకు అర్ధాలు వెతికే పనిలో డిక్షనరీకి ఎంతో సమయాన్ని కేటాయించి మరీ చదివేవారు. సోమర్సెట్ మామ్ రచనలను చదివి ప్రభావితమయ్యానని చెప్పే వీరు ‘The Alien Corn ‘ నవలికను తెలుగులో ‘కలుపుమొక్క’ గా అనువదించారు. ఇది 2005లో అచ్చయింది. అప్పటివరకు చేసిన రచనలన్నీ నాగరాజు సురేంద్ర పేరుతో చేసినవి కాగా 2009 నుండి’ ఎలనాగ’ కలం పేరుతో రాయడం మొదలెట్టారు.
ఎన్నో ప్రక్రియల్ని సృజించినా కవిత్వం, అనువాదాలను ఎక్కువగా ఇష్టపడతానంటారు. వచనం రాయడంలో నైపుణ్యం ,ఆకర్షణీయత రెండు ప్రధానమంటారు. అనువాదం ఓ ‘గొప్ప కళ’ దాన్ని తపస్సులా భావించి సాధన చేయాలి. మూల భాష ,లక్ష్య భాషలపై సరైన పట్టుండాలని, పొందికైన పదాలకు భావ సౌందర్యం తోడైతే రచన అందమైన ఆకృతిదాలుస్తుందని వీరి అభిప్రాయం .తెలుగు ఇంగ్లీష్ భాషల్లో సమానమైన పట్టు ఉండడంతో తెలుగు నుండి ఆంగ్లంలోకి ఆంగ్లం నుండి తెలుగులోకి ఎన్నో పుస్తకాలు అనువదించారు .
వచనాన్ని అనువదించడం సులభమని కొందరి అభిప్రాయం, నాకైతే కవిత్వానువాదమే సులభతరమని అనిపిస్తుంది. బహుశా కవిని కావడమే కారణమేమో అంటారు. అనువాద రచనల్లో స్వేచ్ఛ తక్కువే కానీ ఇరు ప్రాంతాల సంస్కృతీసాంప్రదాయాలు ఒకరివొకరికి చేరు వౌతాయనేది వీరి భావన .ఆ ప్రాంత ప్రజల శైలి ,నైపుణ్యాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందంటారు. అనువాద రచనలు చాలా తక్కువ. తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువాదాలు చాలా తక్కువ జరిగాయి. ప్రోత్సాహలేమి ప్రధాన కారణమని పేర్కొన్నారు. జాతీయాలకు ఆంగ్ల పదాలు దొరకవు ,అటువంటి సందర్భాల్లో ఆ పరదాలను ఆంగ్లంలో పెట్టి, క్రింద ఫుట్ నోట్స్ లో వివరిస్తానంటారు. ఉదాహరణ : బొడ్రాయి బతుకమ్మ మొదలైనవి.
కాళోజీ ,దాశరథి ,వట్టికోట ఆళ్వారు స్వామి ,అమ్మంగి వేణుగోపాల్ గార్ల రచనల్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. వీరు తమ పుస్తకాలకు పెట్టే శీర్షికల్లో ఎంతో భావ సౌందర్యం కనిపిస్తుంది.
‘నుడి క్రీడ ‘గళ్ళ నుడికట్టుకు ఎంతోమంది ప్రభావితులయ్యారు. ఒక ప్రముఖ పాఠశాల యాజమాన్యం తమ విద్యార్థుల కోసం కొన్ని పుస్తకాలను తెప్పించి వారి తెలివికి పదునుపెట్టించారు అనడంలో అతిశయం లేదు. శాస్త్రీయ సంగీతం పై మక్కువ, అవగాహనలతో శాస్త్రీయ సంగీతంపై 28 కవితలు,
సంగీతజ్ఞులపై 33 వ్యాసాలతో Memorable Melody Makers and Other Poems on Music అనే గ్రంథాన్ని రాశారు. ఇది కాకుండా అదనంగా సంగీతం మీద సంగీత విద్వాంసుల మీద తెలుగులో ఎన్నో కవితలు, వ్యాసాలు రాశారు.
వీరి మొదటి ప్రచురణాసంకలనం ‘వాగంకురాలు’ . తెలుగులో 16 స్వతంత్ర రచనలు, ఆంగ్లంలో 2 స్వతంత్ర రచనలు,ఇంగ్లీషు -తెలుగు అనువాదాలు -10, తెలుగు-ఇంగ్లీషు అనువాదాలు- 9 చేశారు, మొత్తం 37 పుస్తకాలు వెలువరించారు.
ఆంగ్లంలో రచించిన ‘Dazzlers’ కవితా సంపుటిని ,Kolkata Literary Carnival లో ‘ఉకియోటో’ సంస్థ ప్రచురించి ‘,poet of the year 2023 ‘అంతర్జాతీయ పురస్కారం అందించడమే కాకుండా ఏడు ప్రపంచ భాషల్లోకి అనువదించారు.
( ఫ్రెంచ్ ,చైనీస్, జర్మన్,టర్కిష్ ,రష్యన్, స్పానిష్,జాపనీస్ ) వీరి పుస్తకాన్ని 70 దేశాలకు పంపుతుందీసంస్థ.
సరైన పదాల అన్వేషణ ఓ తపస్సు లాంటిది .ఒక్కోసారి పదాల పొందిక ,అర్థాలకై నెలల తరబడి వెతుకులాడిన సందర్భాలు ఉన్నాయంటారు. కేంద్ర సాహిత్య అకాడమీ కి చేసిన అనువాదాలు రెండే , మొదటిది పవన్. కె. వర్మ రాసిన Galib : The Man, The Times.గాలిబ్ : నాటి కాలం, కాగా రెండవది సైరన్ మిస్త్రి రాసిన ‘Chronicle of corps bearer ‘ ‘శవాలు మోసే వాడి కథ’ . మూడవది ప్రచురణ దిశగా సాగుతోంది . గాలిబ్ – నాటి కాలం పుస్తకానికి (అనువాదంలో) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆ కాలపు సామాజిక ,రాజకీయాంశాలు గాలిబ్ ఆయన రాజకీయ, జీవిత విశేషాలు ,రచనా వ్యాసంగాల ఒడిదొడుకుల నేపథ్యంతో సాగే రచన ఇది. దీనిని పవన్ కె. వర్మ .ఆంగ్లంలో రచించారు.
‘మోర్సింగ్ మీద మాల్కౌస్ రాగం ‘ ఇది కొత్త రకం ప్రక్రియ. అచ్చం వచన కవితలా కనిపించే ఛందోబద్ధ పద్యాలుంటాయి.
పన్ ( pun) నీటి జల్లు : శ్లేషాత్మక వాక్యాలు.
మేధామథనం : ప్రామాణిక గళ్ళ నుడికట్టు ,ఆధారాలు (వాక్యాలు) గ్రిడ్ (గడులు) లేకుండా రూపొందించారు.
19 శతాబ్దంలో పుట్టి ఫ్రాన్స్ లో ప్రాచుర్యం పొందిన’ పేరాగ్రాఫ్’ కవితా ప్రక్రియ, తెలుగులో రాసేవాళ్ళు అంతగా లేరని ఈ కవితారూపాన్ని ఎక్కువగా రాసి పాపులర్ చేశానంటారు . ‘Tempest Of Time ‘ పేరుతో కొండపల్లి నీహారిణి గారి
‘కాల ప్రభంజనం’ కవితా సంపుటిని 2022 లో ఆంగ్లంలోకి అనువదించారు.
పాశ్చాత్తా సాహిత్యంలో శిల్ప సౌందర్యం అద్భుతం అంటూ ,లాటిన్ అమెరికా కథలు చదివేటప్పుడు నిజమనే భ్రాంతికి లోనవుతామన్నారు.
వారి రచనల్లో కొన్ని పంక్తులు: పద్యపు మొక్కను పెంచుతుంటే విశేషణాల మిడతలు
గుంపులుగా వచ్చి వాలుతాయి వాటిని పారద్రోలకలపోతే
పద్యపు మొక్కకు పచ్చదనం చేకూరదు – అని చెప్పే వారిలో, చదువరులకు ఓ అక్షర హాలికుడు మనసులో మెదలక మానడు. సేద్యం చేసే రైతు ఎంత ఎరుకలో ఉండి సాగు చేస్తాడో అలాగే ఈయన కవన సేద్యం కూడా అంతే జాగరూకతతో చేస్తాడు.
ఇక వీరి జ్ఞాపకాలదొంతర తిరిగేసినప్పుడు:
పదవ తరగతిలో తెలుగు మాస్టారు రాజ శర్మ గారు శ్రీనాథునిపై వ్యాసం రాయమనగా పుస్తకంలోని కొన్ని పేరాల్లోని విషయాల్ని తీసుకుని సమాస భూయిష్టంగా రాయగా వారు మెచ్చుకొని ,అన్ని తరగతులు తిరిగి చదివి విద్యార్థులకు వినిపించారని చెప్తారు.
ఇంకో సందర్భంలో సినారె అధ్యక్షతన వేములవాడలో జరిగిన కవి సమ్మేళనంలో ప్రౌఢభాషలో రాసిన ‘తారావిలాసం’ కవితను సమయాభావం వల్ల గబగబా చదవడంతో చివరగా సినారె మెచ్చుకుంటూ , ఇదే కవిత నేను గాని చదివి ఉంటే సభ కరతాళ ధ్వనులతో మార్మోగేదని కితాబిచ్చారు అని అంటారు.
1975లో ఆకాశవాణి కవి సమ్మేళనంలో చదివిన కవిత విని భుజం తట్టి ,బాబూ ఇలాగే రాస్తూ ఉండండి అంటూ సీనియర్ దాశరథి గారు మెచ్చుకోవడం గుర్తు చేస్తారు.
ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు సామల సదాశివ మాస్టారు గారి సాంగత్యం ఎంతో స్ఫూర్తిదాయకమని అప్పుడే సంగీతంపై మరింత ఆసక్తి కలిగిందని ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటారు.
గాలిబ్ – నాటి కాలం లోని కొన్ని పంక్తులు:
‘ నేను సలిపే సమరం పంజరంలో కూడా పుల్లలతో గూడుకట్టుకునే పక్షుల పోరాటం లాంటిది’ అంటాడు ‘ఓ నా హృదయమా దుఃఖ గీతాన్ని సైతం ఉపశమనముగా భావించు లేని పక్షంలో ఈ శరీరం ఎక్కడో ఒకనాడు ఇంద్రియ జ్ఞానం లేకుండా మొద్దుబారిపోతుంది ‘ అంటూ – సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించమంటూ చేసే హితబోధ కనిపిస్తుంది .
కాశీలోని ధూళి స్వర్గపు కనుబొమల నడుమ కమనీయంగా మెరిసే సిందూరపు బొట్టు.. అంటూ
కాశి క్షేత్ర వైభవాన్ని హృద్యంగా వర్ణించారు.
“ఈ ధనస్సులో బాణం లేదు
ఏ వేటగాడు వేట పనిలో లేడు
ఈ బంది ఖానా బతుకులో అంతటి సౌకర్యం ఉంది “
“ఓ గాలిబ్ నావ తీరానికి చేరినప్పుడు
నావికుని అధర్మం గురించి ఫిర్యాదు ఎందుకు
అంటూ తన శారీరక రుగ్మతలతో విసిగి అసంతృప్తిలో హృదయ వేదనను వెల్లడించే క్రమంలోని హృదయ ఘోష.
ఇలా ఓ కవి హృదయాన్ని సరైన రీతిలో ఆవిష్కరించడం మరోకవికే సాధ్యమౌతుందనేది అక్షరసత్యం.
స్థానికంగా తగిన ప్రోత్సాహం లభించలేదనేవీరు, ఆంధ్రప్రదేశ్ నుండివచ్చిన పురస్కారాలే ఎక్కువంటారు.
వీరిని వరించిన పురస్కారాలు :
1. Ukiyoto’s Poet of the year Award – 2023
2. సోమ సుందరం పురస్కారం
3. అద్దేపల్లి పురస్కారం
4. జింక నాగరాజు పురస్కారం
( అనువాదాలకు)
5. తెలుగు విశ్వవిద్యాలయం
వారి కీర్తి పురస్కారం
(అనువాదాలకు )
6. విశ్వ సాహితీ వారి
పురస్కారం
7. గిడుగు రామ్మూర్తి పంతులు
పురస్కారం
8.నెలవంక – నెమలీక వారి
కలహంస పురస్కారం ( రెండేండ్లు వరుసగా)
9. కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం వారి పురస్కారం.
భావోద్వేగం ఎక్కువైనప్పుడే మంచి కవితలు తన్నుకువస్తాయంటారు .తెలుగులో కవిత్వం రాయడం తగ్గించి ఆంగ్ల సాహిత్యం లోనే రాయాలని నిర్ణయించుకున్నానని చెప్పిన వీరు, మరీ భావోద్వేగం ఎక్కువైనప్పుడు తెలుగులో తప్పకుండా రాస్తానని చెప్పారు .వాసి గల కవిత్వం రాసే కొద్ది మంది కవుల కోసం ఫేస్బుక్ చూస్తానంటూ చెప్తారు.
కవిగా, రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా ఇన్ని ప్రక్రియల్లో చేసిన నిరంతర సాధనే వారిని కేంద్ర సాహిత్య అకాడమీ పీఠంపై ఆసీనుడిని చేసిందనడంలో అతిశయోక్తి లేదు .వారు మరిన్ని మంచి రచనలు చేస్తూ, మరెన్నో పురస్కారాలు అందుకుంటూ, సాహిత్యాన్ని మరింత పరిపుష్టం చేయాలని ఆకాంక్షిస్తూ …
అక్షరాభివాదం
విరించి కలానికి భారతి
పాళీని కూర్చగా
సారస్వత క్షేత్రంలో ఉదయించిన తెలుగు తేజం
సృజన పర్వతపు అధిరోహణ మెళకువల్ని ఆపోశన పట్టి
అక్షర శిల్పాలకు మెరుగులద్ది సుందరాకృతినిచ్చిన సాహితీశిల్పి
స్వర ఝరులలోని సారాన్ని గ్రోలి నేర్పుతో సాహితీ సుసేద్యంలో అంకురార్పణ చేసిన అక్షర కృషీవలుడు
స్పృశించే అంశానికి
సృజనాత్మకత చేర్చి
అందంగా మలచిన శిల్పాలెన్నో !
పద కవిత మొదలు పద్య
కవిత వరకు
ప్రక్రియలు ఎన్నింటనో
పరకాయ ప్రవేశం చేసిన
భాషా సాహసికుడు
అనువాద కళకు
అక్షర సొబగులద్ది
భాషాభిమానాన్ని విశ్వవ్యాప్తం చేసిన సాహితీ వైతాళికుడు
వృత్తి ధన్వంతరీతత్వం
ప్రవృత్తి సాహితీమూర్తిమత్వం
సాహిత్య ‘గురుకులం’లో నిత్య పరిశోధకుడు
వాగాడంబరమెరుగని
నిరాడంబర భాష్యకారుడు
( పితృసమానులైన ఎలనాగ గారికి
చిరు కవితాసుమగుచ్ఛం)
1 comment
ఎలనాగ గారి సాహితీ పరిక్రమం బాగా సమీక్షించారు . సంక్షేపసమగ్రం. వ్యాస రచయిత్రి రాధికా సూరిగారికి అభినందనలు.