ఓ నిష్పక్షపాతమా!
ఎర్రని కాకిలాగా అరుదైనదానివి నువ్వు
ఎవ్వరికీ కనిపించకుండా
దుర్గమారణ్యం మధ్య దాక్కున్న
దుమ్ములగొండి రువ్వే చిత్రమైన నవ్వువు నువ్వు
నిన్ను కౌగిలించుకోవాలని కల గంటాను
కానీ కలవడమే గగనమైనప్పుడు
కల ఎలా తీరుతుంది?!
నీలోని సాధుత్వం నిప్పుల పాలైందా?
ఎంతకూ కనపడని నీ మూలంగా
ఏకాంతం లోకి పోయాను
స్వీయ బహిష్కరణ వైపు అడుగులు వేస్తూ
బాధల పదునైన కోరల్లో చిక్కుకుని
గాయపడుతున్నాను ప్రతిదినం
విశుద్ధ విచక్షణ నీ అనుంగు చెల్లెలు
వెలి వేశారు నీతో పాటు ఆమెనూ!
ముఖం చాటేసిన నీ సోదరికీ కరుణ తక్కువేనా?
బుజ్జగించు ఆమెను, బయటికి రమ్మని.
ఆమెమీది అభిమానాన్ని ఆమెముందే
చాటుకోవాలనుంది నాకు
మీరిద్దరు కలిసి నడయాడితే
ఇక్కడ సజావు నెలకొంటుంది
అస్తవ్యస్తమైన ఈ అవని
ఎదురు చూస్తోంది మీ ఆగమనం కోసం
(The Awaited Arrival అనే నా ఆంగ్లకవితకు స్వీయానువాదం)