Home కథలు ఒకే తాను ముక్కలు

ఒకే తాను ముక్కలు

by Sheela Subhadra devi

”టీచర్‌ టీచర్‌! ఇందాకటిసంది యాదగిరి క్లాసుల ఒర్రుతుండు టీచర్‌” అయిదో క్లాసు పిల్లలిద్దరు పరుగుపరుగున అరుంధతి దగ్గరికి వచ్చారు.

అప్పుడే అదే క్లాసునుండి బెల్‌ అయిందని స్టాఫ్‌ రూముకి వచ్చిన అరుంధతి గుండె దడ దడ లాడుతుండగా పరుగున మళ్ళీ ఆ క్లాసుకి వెళ్ళింది. టీచర్‌ రాగానే క్లాసంతా గప్‌ చిప్‌ అయిపోయారు. అరుంధతి క్లాసంతా కలయచూసింది. మామూలుగానే ఉంది. తనని పిల్చుకొచ్చిన పిల్లల్ని ”యాదగిరి ఎవరు?” అని అడిగింది అరుంధతి.

వాళ్లు చూపిన వైపు చూస్తే ఒక పిల్లాడు లేచి నిల్చుని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.

అంతలో ఆ పీరియడు టీచరు సావిత్రి గుమ్మం దగ్గర నిలబడి ”ఇంకా క్లాసులో పాఠం కాలేదా అరుంధతీ?” అంటూ వచ్చింది.

తానెందుకు పరుగున మళ్ళీ రావాల్సివచ్చిందో చెపుతూ ”యాదగిరి ఒర్రుతుండని పిల్లలు పిలుస్తే వచ్చాను” అని చెప్పి గుమ్మం బైటికి వచ్చి ‘ఒర్రటం అంటే?’ రహస్యంగా మెల్లగా అడిగింది అరుంధతి.

సావిత్రి నవ్వి ”అరవటం…” అంది.

”హమ్మయ్య, ఇంకేమిటో అనుకున్నాను” అరుంధతి కూడా నవ్వుతూ వెళ్ళిపోయింది.

వివాహం అయ్యాక హైదరాబాదులో అడుగుపెట్టిన అరుంధతి ఇంకా అక్కడి తెలుగు నుడికారానికి అలవాటుపడలేదు.

స్టాఫ్‌ రూముకి వచ్చి పుస్తకాలు దిద్దటానికి తీసి ఆలోచనలో పడింది.

అరుంధతికి అకస్మాత్తుగా చిన్నప్పటి స్కూల్లోని హిందీ టీచరు గుర్తుకొచ్చారు. మిగతా సబ్జెక్టుల మీదున్న శ్రద్ధ రెండో భాషగా ఉన్న హిందీ భాష మీద పెట్టటం లేదని విద్యార్థులని కోప్పడుతూ ఉండేవారు.

ఒకరోజు ఆమె కోపం తారాస్థాయికి చేరి ”మీరు పెద్దయ్యాకో, పెళ్ళయ్యాకో ఏ బొంబాయో, ఢిల్లీయో వెళ్తే అక్కడ భాష రాక యిబ్బంది పడతారు, కాస్త శ్రద్ధ పెట్టి నేర్చుకోండి” అని క్లాసులోని అందర్నీ తిట్టారు.

దానికి ఆడపిల్లలందరూ ‘అంతదూరం వెళ్ళే అవకాశం కానీ, అవసరం కానీ మాకురాదు’ అని చిన్నగా అనుకుంటూ నవ్వుకున్నారు.

అది గుర్తొచ్చిన అరుంధతి, స్టాఫ్‌ రూములోని టీచర్లతో చెపుతూ ”ఆవిడ అన్నట్లే నేనొచ్చి హైదరాబాదులో పడడమే కాకుండా, ఈ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు తధాస్తు దేవతలు ”తథాస్తు తథాస్తు’ అన్నట్లున్నారు” అంటూ నవ్వింది. అక్కడున్న టీచర్లు కూడా అరుంధతి మాటలకు పడీ పడి నవ్వారు.

ఉపాధ్యాయ శిక్షణ అనంతరం మొట్టమొదట చేరిన స్కూలు ఇది. అందులో ఎక్కువమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా మైనారిటీ వర్గానికి చెందినవారు. అంతేకాక విద్యార్థులు చాలావరకూ శ్రామిక, కార్మిక వర్గానికి చెందినవారు. దాంతో అరుంధతికి భాష ప్రధాన సమస్య అయిపోయింది.

కొత్తగా చేరటంవలన అన్నీ ప్రాథమిక తరగతులు కేటాయించటం మూలాన క్లాసులో తాను చెప్తున్న పాఠం పిల్లలు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో అని బెంగ పట్టుకునేది.

అరుంధతితోబాటే ఉద్యోగంలో చేరిన సావిత్రి ఆమెకు కొంత సహాయకారిగా ఉంటూ ఉండేది.

ఒకరోజు అరుంధతి మూడో తరగతి క్లాసుకి వెళ్ళింది. క్లాసుకి క్రమం తప్పకుండా వచ్చే రాజు ఆ రోజు రాకపోవటం చూసి క్లాసులో పిల్లల్ని ప్రశ్నించింది ”రాజు రాలేదెందుకని”.

అంతలో మెల్లగా నడుచుకొంటూ, చొక్కా అంచుతో కళ్ళు తుడుచుకొంటూ వచ్చాడు రాజు.

”ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు?” అని గద్దించింది అరుంధతి.

రాజు తలదించుకొని ”మా నాయన పన్లో పోయిండని అమ్మ నన్ను ఇంట్లనే ఉండి చెల్లిని జర చూస్తుండమని, ఇస్కూలుకి ఎళ్లొద్దని అంది టీచర్‌. నేనే ఇస్కూలు పోతానని వచ్చేసిన” అన్నాడు మధ్యమధ్యలో వెక్కిళ్ళు పెడుతూనే.

”అయ్యో, ఎందుకు వచ్చావు. ఇంట్లో ఉండకపోయావా” కంగారుగా అంటూ ఏంచేయాలో తోచక పక్క క్లాసులోనే ఉన్న సావిత్రిని పిలిచింది ”సావిత్రీ! రాజు వాళ్ళ నాన్న పోయాడని, వాళ్ళమ్మ ఇంట్లో ఉండమంటే వచ్చేసానని చెపుతున్నాడు రాజు. ఏం చెయ్యాలి” అంది.

సావిత్రి కూడా వచ్చి రాజుని ప్రశ్నించింది ”ఏందిరా మీ నాన్నకేమయింది?” అని.

”ఏంకాలే టీచర్‌. మా నాయన పన్లోకి పోయిండు. మాయమ్మ ఏడకో పోవాల్నంట. ఇస్కూలు మాని చెల్లిని చూసుకోమనె. ఇస్కూలుకి పోతనంటే మాయమ్మ తిట్టింది” అన్నాడు రాజు.

సావిత్రి నవ్వుతూ ”ఇలా ప్రతీదానికీ కంగారు పడ్తావేంటి అరుంధతీ! రాజు నాన్న పనిచేయడానికి వెళ్ళాడట” అంది.

”అంతేనా! ఇంకా నేను ఇక్కడి యాసకు అలవాటుపడలేదు. అందుకే కంగారుపడ్డాను” అంటూ సిగ్గుపడింది అరుంధతి.

అప్పటినుండి విద్యార్థులు మాట్లాడుతున్నంతసేపూ ప్రతి పదాన్ని జాగ్రత్తగా గమనించసాగింది అరుంధతి.

పాఠం చెపుతున్నపుడుకూడా వాళ్ళని పదే పదే పాఠానికి చెందిన ప్రశ్నలు వేసి, వాళ్లు తన మాటల్ని అర్థం చేసుకొనేవరకూ ఆగి జవాబుల్ని వినేది.

వింటున్నకొద్దీ తెలుగులోని ఆ ప్రాంతీయ యాస సొబగు అరుంధతికి అర్థం కాసాగింది. అంతేకాదు తానుకూడా విద్యార్థులతో వాళ్ళ యాసలోనే మాట్లాడడానికి ప్రయత్నించేది. అంతేకాక విద్యార్థులతో మాట్లాడుతూనే హిందీ ఉర్దూ పదాలు కూడా మెల్లమెల్లగా నేర్చుకోవటం మొదలుపెట్టింది.

విద్యార్థులుకూడా తన ప్రాంత యాస పదాలు వారికి కొత్తగా అనిపించి పదే పదే అర్థంకాక ప్రశ్నించేవారు. మొదట్లో ఎంత స్పష్టంగా వివరించి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోకపోవటం చికాకై విసుక్కొనే అరుంధతి, రాను రాను స్వీయ అనుభవంతో తనను తాను మెరుగుపరచుకొంది.

వాళ్ళ ప్రాంతీయతను తాను మరోలా అర్థం చేసుకొన్నట్లే తన ప్రాంత యాసా వారికీ వింతగా తోస్తుందనేది అనుభవ పూర్వకంగా అర్థమైంది అరుంధతికి.

ఆ నెల జీతం అందుకుని తన సహ ఉపాధ్యాయినిలు ఫాతీమా, సావిత్రిలతో కలిసి షాపింగుకు వెళ్ళింది అరుంధతి.

కొత్తగా వెలసిన ఆ పెద్ద షాపు ఆశ్చర్యంగా అనిపించింది అరుంధతికి. అందులో తానులు తానులుగా ఉన్న వివిధ డిజైన్లను చూసి వాటిని చీరలుగా తీసుకుంటే ఎలా ఉంటుందని స్నేహితురాళ్ళు ముగ్గురూ అనుకున్నారు.

అది విని సేల్స్‌ గర్ల్‌ అవే తానులతో కుట్టిన డిజైనర్‌ డ్రస్సులను తీసి చూపించింది. దాంతో లంగా వోణీలు, చీరలు, చుడీదార్లు కూడా డిజైన్‌ చేసుకోవచ్చు అనే అంశం ఆ ముగ్గురికీ చాలా నచ్చింది.

వెంటనే సావిత్రి తనకోసం చీరకి సరిపడినంత కొలిపించి తీసుకుంది. అరుంధతి తమ ఊరులో ఉన్న చెల్లెలికి లంగా వోణీకోసం కత్తిరింపించి తన చెల్లెలు కూడా తనంత పొడుగు ఉంటుందని చెప్పి అక్కడే ఉన్న టైలరుకి కొలతలు ఇచ్చింది. ఆ రంగు డిజైను నచ్చిన ఫాతీమా తనకికూడా అదే తానునుండి పంజాబీ డ్రస్సుకి సరిపడా ఇవ్వమని కొని అదే టైలరుకి కుట్టించటానికి యిచ్చింది.

అందరం ఒక తాను నుండే విభిన్న దుస్తులుగా రూపొందించటానికై అనుకోకుండా తీసుకోవడం గమనించి ప్రాంతాలు, భాషలు, యాసలు వేరైనా అందరం ఒక తాను ముక్కలమే అనుకుంది అరుంధతి. ఈ ఏకతా సూత్రాన్ని విద్యార్థులకు నేర్పవలసిన వారమూ మేమే అని మనసారా తలంచుకొంది.

ఆ అనుభూతిని దాచుకోలేక స్నేహితురాళ్ళ ముందు బయటపెట్టింది అరుంధతి. ‘అవును నేనూ అదే అనుకున్నాను’ అని ఫాతీమా, సావిత్రీ అనేసరికి ఆత్మీయంగా ఒకరి చేతులు ఒకరు కలుపుకుని నిండుగా నవ్వుకున్నారు.

(తెలుగు విద్యార్థి సౌజన్యంతో)

You may also like

Leave a Comment