Home కథలు ఒక ఊరి కథ

ఒక ఊరి కథ

by Pratyusha

పేరుకి పుట్టింది, చదివింది హైదరాబాదులోనే అయినా నాకు సంబంధించినంతవరకు నా బాల్యపు జ్ఞాపకాలు అన్నీ మా ఊరివే. ఇక్కడ ఉంటే ఇల్లు దాటితే బడి, బడి దాటితే ఇల్లు. అంతే. అందుకే ప్రతి సెలవుల్లో ఎండాకాలం, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, అన్నీ మా ఊళ్లోనే. అక్కడే ఎన్నెన్నో ఆటలు. వా(మ)న గుంటలు, అచ్చన్నలు/కచ్చకాయలు, ఉప్పు గేరలు, తొక్కుడు బిళ్ళలు. తాటాకు బొమ్మలు. నేను మొదట అక్షరాలు దిద్దింది కూడా మా ఊళ్ళో మా ఇంటి ముందు అరుగు మీదనే.

ఇన్ని ఇచ్చిన మా ఊరు తెలంగాణలో మరో పల్లె. అన్నిటి లాగానే ఎవరికి పట్టని ఒక కుగ్రామం. అదీ వెనుకబడిన పాలమూరు ప్రాంతంలో. నల్లోరిపెల్లి.

వెయ్యి గడపలు ఉన్నది అని చెప్పుకునే పెద్ద ఊరు కాదు.

రోడ్డు ఉన్నదా అంటే ఉన్నది. రోజుకి ఒక బస్సు తెల్లారుఝామున రావడానికి.

రైలు దరిదాపులో ఎక్కడా లేదు. అసలది ఉంటుందని ఊళ్ళో ఎవరికీ తెలియదు.

ఏరు, నది, వాగు ఇవేవీ లేవు. ఉన్నదల్లా చిన్న చిన్న కుంటలు. వ్యవసాయానికి.

పాత కోవెల, ఆధునిక బంగాళా, చరిత్ర అసలే లేవు. ఒక్క రాతి హనుమాన్ల గుడి, పాత ఎల్లమ్మ గుడి.

దగ్గర్లో చెప్పుకోదగ్గ అడవి కూడా లేదు. పొలాల్ని అడిమి అంటారు కానీ.

వందల ఏళ్ల చరిత్ర కూడా లేదు. మా ముత్తాతగారి నాన్నగారి కాలంలో ఊరికి ముగ్గు పోశారు అట.

సినిమాల్లో చూపే ప్రకృతి అందాలు అసలే లేవు. మనసుతో చూస్తే ప్రతి చేను చెలక అందంగానే ఉంటాయి.

ఉన్నదల్లా వంద కుటుంబాలు. వందల ఎకరాల పంట పొలాలు, బావులు, చెలకలు. చుట్టూ గుట్టలు.

తుమ్మ చెట్లు. తాటి చెట్లు. చింత చెట్లు. ఇవీ మా ఊరి వృక్ష సంపద.

కానీ అక్కడే రూపుదిద్దుకున్న తమదైన సంస్కృతి మా ఊరి సొంతం.

అలాంటి ఊళ్ళో కాస్త ఆర్థికంగా సామాజికంగా కూడా కలిసివచ్చిన కుటుంబం. అటు వ్యవసాయం. ఆవులు బర్రెల సహవాసం. దాదాపు ప్రతి కులం వాళ్ళవి పది పరక కుటుంబాలు ఉండేవి. దసరా బతుకమ్మ వచ్చిందంటే మా ఊరి ఆడవాళ్లు ఒక్కచోట చేరి సిగలలో బంతిపూలతో మా వాకిట్లో బతుకమ్మ ఆడుతుంటే, విరబూసిన బంతి తోట నడిచి వచ్చి నాట్యమాడుతూ ఉన్నట్టే ఉండేది.. ఆ బతుకమ్మ ఆటలకు ఏ గుడిలోనో జరగాల్సిన తిరునాళ్ళు మా వాకిట్లో జరుగుతున్నట్టు సంబరంగా ఉండేది.. బుట్టల నిండా తంగేడు పూలు తెచ్చి, గుత్తులు గుత్తులుగా చేసి ఈత చాప చుట్టూ పేర్చి ఒక్కో గుత్తి అందిస్తూ, అందంగా బతుకమ్మను చేస్తున్న నానమ్మ చిట్టి చేతులు కళ్ళింత చేసుకుని చూసేవాళ్ళం.

దసరా రోజు పొద్దున్నే యేట కూరను కోసి పోగులేసి నలుగురు తాతయ్యలు పంచుకుని మళ్ళీ ఒక్కో పూట ఒక్కో తాతయ్య ఇంటిలో బంతి భోజనాలు చేసి సాయంత్రం బాయికాడకి నడుచుకొని పోయి జమ్మి ఆకు చెట్టు మీదనే తెంపుకుని, దారిలో పాలపిట్ట దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి ఇల్లంతా సందడే సందడి. వాకిట్లో మళ్ళీ కోలాటాలు, బతుకమ్మ ఆటలు. ఈసారి భక్తితో కాదు. సరదాకోసం.

నూనూగు మీసాల యువకుల వీధి కోలాటంలో ఉన్న ఉత్సాహం ఇంకో ఎత్తు. మద్దెల దరువుకు పోటీ పడి కంచు స్వరంలో నిమ్మాఆ చెట్టుకు నిచ్చన్లేసి అని పాడుతూ గాల్లో ఎగిరినప్పుడు కోలాటం కట్టెలు తలపడితే ఆకాశం ఉరిమిందా అనిపించేది.

చీకటి అయితే తాగిన మైకంలో మళ్ళీ మళ్ళీ కాళ్ళకు దండాలు పడి పడి పెట్టే సరదా రాయుళ్లు. ఇంటి వెనకాల చాటుగా ఒక చోట చేరి తాగే అమ్మలక్కలు.

ఎలాంటి ప్రకృతి వింతలు కాలువలు లేకుండా కూడా వరి బాగా పండే భూములు మా ఊరి సొంతం. వర్షాలు, పెద్ద పెద్ద మోట బావులు, ఆ తరువాత మామూలు మోటారుతో నీళ్ళు తోడే బావులు. అయినా రకరకాల పంటలు.

ఎండాకాలం వచ్చిందంటే అందరూ ఎవరి వాకిట్లో వాళ్ళు పడుకోవడం ఇప్పటికీ గుర్తు. మెల్లి మెల్లిగా అన్నల భయం ఎక్కువై ఆ అలవాట్లు పోయాయి. ఇంట్లో ఫ్యానులు వచ్చాయి. కానీ కరెంటు అలా ఒకేసారి కొనలేముకదా.

చుట్టూ కొండలు కదా. సీతాఫలాలు విరివిగా దొరికేవి. కొండెంగలు ఎలా వెంటపడి తరిమినవీ కథలు చెప్తూ పళ్ళు తెచ్చి ఇంట్లో పోసే వాళ్ళు. ఎక్కువ ఉంటే దోరగా ఉన్న సితపోల కాయల కట్టెలతో మంట వేసి కాల్చి తినేవాళ్ళు.

ఇది మా పొలం పక్కన ఉన్న రోకలి గుట్ట.

ఎండాకాలం అయితే మామిడి పళ్లు. తాటి కల్లు. తాటి ముంజలు. తీపి జ్ఞాపకాలు. తాటి ముంజలు తాటికాయలో మూడు కళ్ళు కనిపిస్తూ ఉంటే వేలితో గుచ్చి ముందు అందులోని తియ్యటి రసం తాగి, తరువాత బొటన వేలితో బయటికి తీసి తినడం భలే సరదా.

పాల మోటర్ ఒకరోజు రాకపోతే. ఆరోజు లీటర్ల కొద్దీ పాలు కోవా చేసి పెద్ద స్తాంబాలంలో పోసి ఆరబెట్టి దేవునింట్లో దాచి పెట్టేటోల్లు అమ్మ నానమ్మ. చెల్లి చాటుగా వెళ్ళి పావుకిలో అమాంతం లాగించేసి బయట పడేది.

కంది గుగ్గిల్లు. కల్లులోకి తాగే వాళ్ళ కోసం చేసినా పేరు వాళ్ళది సరదా మాది. మేమే ఎక్కువ తినే వాళ్ళం. మిగిలిన అన్నం ఆరబెట్టి వేపుడు బియ్యం చేసి, వేపిన చిట్టి ఉలవలు కలిపి డబ్బాలో పోస్తే రోజు పిడికెడు తిని అవి అరక్క రోజంతా ఆడుకోవడం తప్పేది కాదు. జొన్న, సజ్జ, మక్క చేలల్లో కంకులు తెచ్చి పొద్దున్నే వంట అయ్యేలోపు నిప్పుల మీద కాల్చుకుని తింటే. లోపల పాలుగారుతూ ఎంత రుచిగా ఉండేవో. చేలో నడుస్తూ లటుకున్న ఒక దోసకాయ తెంపి, అక్కడే ఒక మడి నుండి ఇంకో మడికి పారే తేట నీళ్లలో కడిగి కొరికి తినేస్తే. కడుపులో చల్లగా ఉండేది ఇంటికి పోయే దాకా. ఇంటికి పోయి నానమ్మ పక్కన అరుగు మీద కూచుని సాసర్ లో పోసిచ్చిన చాయ తాగుతూ ఉంటే, నానమ్మ “ఏం తల్లి” అని అలా దగ్గర తీసుకునేది.

ఎన్నని చెప్పను.

అయినా ఊరంటే మనుషులు. మట్టి కాదు. ఆ మనుషులు కొందరు లేరు. మిగతా వాళ్ళు ఇప్పుడు దగ్గరే ఉన్నారు హైదరాబాద్లో. కాబట్టి అందరం కలిస్తే అప్పటి ఆప్యాయతలు అలాగే ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ ఎన్ని ఉన్నా మా ఊరంటే దసరా పండగ. దసరా అంటే మా ఊరు. అది మాత్రం ఇప్పుడు లేదు.

చూడడానికి ఏముంది అనిపించినా, అందరినీ అక్కున చేర్చుకుంటూ, వలస పోయినవాళ్ళు తిరిగి వస్తారా అని ఆశతో ఎదురు చూస్తూ క్రమంగా వయసైపోతున్న గ్రామం. బావులు ఎండి, చెట్లు నేలకొరిగి జవసత్వాలుడుగుతున్నాయి. ఊళ్ళో ఉండిపోయి అలాగే మిగిలిపోయిన వాళ్లను చూసి ఇంకా ఎందుకు పట్నం పోలేదు అనిపిస్తుంది. బహుశా జీవితం, లక్ష్యాలు అంటూ సాగిపోయే నా లాంటి వాళ్ళు చూడలేనిదేదో చూసే ఆత్మజ్ఞానం అయినా వాళ్లకు ఉండి ఉండాలి లేదా పట్నంలో దొరికే అవకాశాలు పట్టని అజ్ఞానం అయినా. ఈ వలసలు కూడా ఏదో ఒక కోరిక, బలం, అవసరం ఉన్నవాళ్లకు మాత్రమే మెరుగైన జీవితం ఇచ్చే జీవితపు నాటకం ఏమో.

You may also like

Leave a Comment