Home అనువాద సాహిత్యం ఒక శీతకాలపు సాయంత్రం

తుఫాను గాలికి కొట్టుకుపోతున్న కారు మేఘాలు,

వడిగాలుల్లో సుడులు తిరుగుతున్న మంచుతునకలు…

విను, తోడేళ్ల భీషణమైన ఊళ వినిపిస్తోంది

విను, ఇప్పుడది పిల్లవాడి ఏడ్పులా ఉంది

గుడిసె కప్పు మీద గలగలమనే

ఎండుగడ్డి లోంచి దూసూకుపోతూ

కాంక్రీటు గోడల మీద దడదడ శబ్దం చేస్తూ

అలసిన దేశద్రిమ్మరి తలుపు మీద బాదినట్టు ఆ శబ్దం

 

వంటగదిలో భయంకరమైన చీకటి,

ఎలమి లేక ఏకాంతంగా మన వెనకడుగు…

ప్రియమైన, మనోజ్ఞమైన అమ్మా!

మాట నుడివి మౌనాన్ని ఛేదించు

తుఫాను రోదన నీ కనురెప్పల్ని

భారంగా మూసేసిందా?

రాట్నపు మృవైన రొద

నీకోసం జోలపాట పాడిందా?

 

నా యౌవన వసంతపు ప్రియురాలా!

నా ప్రియమైన, అచ్చమైన ఆత్మసహచరీ!

మన దుఃఖం పోయేలా మధువును సేవిద్దాం

మద్యం మనలో మోదాన్ని నింపుతుంది

దవ్వులలోని గువ్వలలాగా స్వేచ్ఛగా

అన్నీ మరచి గానం చెయ్

వేకువన వెలదులు తేటనీటి నదీతీరంలో

ఆలపించే పాటను పాడవా?

 

తుఫాను గాలికి కొట్టుకుపోతున్న నల్లని మేఘాలు,

వడిగాలుల్లో సుళ్ళు తిరుగుతున్న మంచుతునకలు…

విను, తోడేళ్ల భీకరమైన ఊళ వినిపిస్తోంది

విను, ఇప్పుడది పసివాడి ఏడుపులా ఉంది

నా యౌవన వసంతపు ప్రియురాలా!

నా ప్రియమైన, అచ్చమైన ఆత్మసహచరీ!

మన దుఃఖం పోయేలా మధువును సేవిద్దాం

మద్యం మనలో మోదాన్ని నింపుతుంది

 

రష్యన్ మూలం: అలెగ్జాండర్ పుష్కిన్

ఆంగ్లం: మార్తా డికిన్సన్ బియాంచి

తెలుగు సేత: ఎలనాగ

 

***

 

 

You may also like

Leave a Comment