Home కవితలు ఒద్దిక

ఒద్దిక

by Devanapalli Veenavani

మన నుంచి దేన్నో తీసుకెళ్లి పోతారు
బహుశా నమ్మకం కావచ్చు..
ఇంకెప్పుడు ఎవరిపట్లా కుదరనంతగా
పెకిలించి వేయబడేది
నమ్మకమనే చిన్న వేరు కావచ్చు

సంఖ్యలు కనబడవు..
దృష్టి దోషం కాదది
దిమ్మతిరిగిన తలలో తిరుగుతున్న భూమి
ఏటవాలు కళ్ళకింద నది ఊట

తెల్ల వారుతున్నపప్పుడో
పొద్దుమలుగుతున్నప్పుడో
రేకలు రేకలుగా విచ్చుకునే ఊహల చిత్తుప్రతి
చెత్త బుట్టలో ముడుచుకుపోవడం
మాటల కత్తెరలతోనే కదా

వారి ప్రపంచం చాలా చిన్నదని
తెలుసుకున్నాక
వాదించడం మానేయడమే విరుగుడు

పలక మీద తనను తాను అరగదీసుకున్న బలపంలా
మనకిచ్చిన గడువు తీరుతున్నది
తుడిపేసి రాసినప్పుడల్లా నేర్చుకోవాల్సింది
ఒద్దికగా నిలబడడమే

You may also like

1 comment

Venu March 20, 2024 - 6:26 am

Good Reading!!!

Reply

Leave a Comment