Home అనువాద సాహిత్యం ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

నీ భుజంమీద నువ్వు పెట్టుకున్న తుపాకీకి

కళ్లు లేవు, కాళ్లూ లేవు

నా అడుగుల్ని గమనించేందుకు

అది నీ కళ్లను దొంగిలిస్తుంది

నా అడుగుల జాడల కోసం,

నా ఛాతీని ఛిద్రం చేయడం కోసం

నా చావుకేకను నీ వీనులతో వినడం కోసం

అది నీ పాదాలను తస్కరిస్తుంది

 

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

నీ భుజం మీద నువ్వు మోసే ఆ తుపాకీ

అవిటిదా చెవిటిదా గుడ్డిదా?

నీ కళ్లను చెవులను పాదాలను తగిలించుకునేందుకు

అది తన కళ్లను చెవులను పాదాలను రాల్చుకుందా?

 

నీకేమీ తెలియకపోవచ్చు ఆ తుపాకీ గురించి

కానీ మనం మన అన్నదమ్ములను అంతమొందించేలా

మన దవడలను ఒకరినొకరం దారుణంగా విరగ్గొట్టేలా

తను మాత్రం దొరకకుండా క్షేమంగా ఉండేలా

మనిద్దరి శత్రువు ఒక దూరప్రాంతంలో

పథకాన్ని రచిస్తున్నాడు

తన రక్తం చిందకుండా

మన రక్తం మాత్రం మట్టిలో కలవాలని అతని కోరిక

తన శరీరాన్ని షర్టులాగా ఇంటిదగ్గర వదిలి

తుపాకీ రూపంలో రావాలన్నది అతని పన్నాగం

 

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

కాళ్లుచేతులు లేని మన దుష్టశత్రువు

ఒంటరిగా రాడు, మనకన్న పెద్దసంఖ్యలో

గుంపులుగుంపులుగా వస్తాడు

ప్రతి తుపాకి విచ్చలవిడిగా తిరుగుతూ

ఎడతెగకుండా పేలుతుంటుంది

తన ఎముకలు విరగకుండా, తన చర్మం కాలకుండా

తన రక్తనాళాలు నెత్తురోడకుండా

తుపాకీ అంగాలన్నీ ఇంటిదగ్గర క్షేమంగా ఉంటై

అది మన అవయవాల్ని ఉపయోగిస్తుందిక్కడ

ఒక తుపాకీ నీ పాదాలతో నన్ను వెంటాడుతుంటే

మరొకటి నా కన్నుతో నిన్ను గురి చూస్తుంది

మూడోది నీ భుజం మీద ఉన్నట్టుగానే

ఇంకొకరి భుజం మీద ఉంటుంది

దాని అంగాలన్నిటినీ ఇంటిదగ్గర వదిలేసి

అది కేవలం నోరుతోనే వచ్చిందిక్కడికి

భుజం నీది కానీ నోరు మాత్రం దానిదే

దంతాలు లేని ఆ నోరు తూటాలను

పదాలుగా మార్చి మాట్లాడుతుంది

కానీ ఒక తూటా మనవాడిని చీల్చినప్పుడు

అతడు దంతాలు లేని తుపాకీ నోరును చూడడు,

నీ భుజాన్ని, నీ చేయిని చూస్తాడు

నిన్ను శత్రువుగా భావిస్తాడు, గన్నును కాదు!

నీ నుండి ప్రతీకారాన్ని కోరుతాడు

 

ఓ నా పవిత్ర దేశపు సైనికుడా!

నీ భుజం మీది తుపాకీ మన నేలమీద

ఎంత రక్తాన్ని చిందించింది?

అయినా సంజాయిషీ ఇవ్వలేదెందుకు?

ఈ రక్తపాతానికి నువ్వే నిందింపబడుతావు

నీనుండే ప్రతీకారం ఆశింపబడుతుంది

వాళ్లేమో మరో తుపాకీని భుజం మీద పెట్టి

దాని నోట్లోంచి వచ్చే తూటాను నీ గుండెకు గురి చూస్తారు

 

రాజ్యాధికారం కోసం అర్రులు చాస్తున్నవాడా!

ఏదో ఒకరోజు తూటా నీ గుండెను చీలుస్తుంది

నువ్వు సింహాసనం కంటె శవపేటికకు

ఎక్కువగా దగ్గరవుతున్నావు జాగ్రత్త

నీ శత్రువు నిన్ను సమాధిలోకి విసరకముందే

నువ్వు యోచించి జాగ్రత్త పడు

ఈ విషాదకర విధిరాత నుండి రక్షించుకునేందుకు

నీ చావుకోసం పథకం వేసేవాణ్ని గుర్తించాలి నువ్వు

నేను నీ సోదరుణ్ని. మనిద్దరి శత్రువైన తుపాకి

అవిటిదానిగా, చెవిటిదానిగా,

గుడ్డిదానిగా ఉంది నీ భుజం మీద

అది నా అడుగులను నీ కళ్లతో గమనిస్తోంది

నా గుండెలోంచి దూసుకుపోయేందుకు,

నా చావుకేకల్ని నీ చెవుల్తో వినేందుకు

నన్ను వెంటాడుతోంది నీ పాదాలతో

పష్తో మూలం: దర్వేష్ దురాని

                                                  ఆంగ్లం: దావూద్ ఆజమి

                                                  తెలుగు సేత: ఎలనాగ

***

       

You may also like

Leave a Comment